అది దేవతల విమానం లాంటి దానిలి తాలుకూ వెలుగు! నీ దగ్గర్నుంచీ నన్ను ఎత్తుకుపోయి వాళ్ళ దగ్గర వెట్టి చేయించుకున్నాడు అన్నాడు ఎర్రోడు.
"ఏమిట్రా నువ్వు చెప్పేది ?" అన్నాడు దొర.
అంతా పూస గుచ్చినట్లు చెప్పాడు ఎర్రోడు.
దొర కళ్ళు ఆగ్రహంతో ఎర్రబడ్డాయి.
"వాళ్ళెవర్రా వాళ్ళు? నీతో నేను వెట్టి చేయించుకోవాల -- కాకుంటే ,మా కులపోళ్ళు వెట్టి చేయించుకోవాల -- లేదా మనిషి అనే వాడెవడైనా సరే చాకిరీ చేయించుకోవాల. మనిషి చేత వెట్టి చేయించుకుంటామనే మొగుళ్ళు ఈల్లేవరురా.....ఆ మాట కొస్తే నువ్వు ఎవరికి మాత్రం ఎందుకు వెట్టి చేయాల .....మనందరం మనుషులం .....మనలో మనం కొట్టుకు చస్తాం గానీ మనల్ని వీళ్ళెవరో చంపుతామంటే ఊరుకుంటామాటరా.........మనిషంటే మజాకానా....పదరా వీళ్ళ పని పడదాం ......" అంటున్నాడు దొర. ఏదో అజ్ఞాతశక్తి తన చేత ఆ మాటలు పలికిస్తున్నట్లుగా.
అక్కడ .........రాజు ధ్యానం మరింత తీవ్రమయింది.
దొర ఎదుర్రొమ్ము మీద కాలు తీశాడు ఎర్రోడు.
"నీ చెయ్యి సాయం అందివ్వరా ఎర్రోడా ...... అనబోయి ఆగి "తమ్ముడా !' అన్నాడు దొర.
చెయ్యి అందించాడు ఎర్రోడు. ఒక్క ఉదుటున లేచి నిలబడి సెల్ ఫోన్ తీశాడు దొర.
ఎమ్మెల్యే నెంబరు నొక్కాడు.
"అన్నా ......నేనేనే.......ఎట్లున్నావే?" అని మాటవరసకు కుశల ప్రశ్నలు వేసి, తక్షణం అన్నాడు దొర.
"అన్నా.....జరూర్ గా చీఫ్ మినిస్టరుకి ఒక మెసేజి పంపాల....మనుషులందరినీ చంపటానికి ఇంకేదో గ్రహం నుంచి దేవతలం అని చెప్పుకుంటున్న వాళ్ళు దిగబడ్డారుట.
మెసేజ్ అందుకున్న ఎమ్మెల్యే చీఫ్ మినిస్టరు కి దాన్ని ట్రాన్స్ మిట్ చేశాడు.
చీఫ్ మినిస్టరు ప్రైమ్ మినిస్టరు కి చెప్పాడు.
ప్రైమ్ మినిస్టరు అమెరికా అధ్యక్షుడికి చెప్పాడు.
అమెరికా అధ్యక్షుడు ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడికి చెప్పాడు.
ఐక్యరాజ్యసమితి తాలూకు సెక్యూరిటీ కౌన్సిలు మీటయి ఈ విషమ పరిష్టితిని ఎలా ఎదుర్కోవాలో చర్చించడం మొదలెట్టింది.
రాజు ధ్యానం సాగుతూనే వుంది.
ఇండియా ప్రధాని ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. బ్రిటన్ ప్రధానితో మాట్లాడి పెట్టేయగానే ఫోన్ మోగింది.
అది హాట్ లైన్.
ఫోన్ ఎత్తి , "హలో " అన్నాడు ప్రధానమంత్రి.
"అన్నా!" అన్నాడు అవతలి మనిషి ఎంతో ఆర్ద్రంగా.
"ఎవరూ?"
చిన్నగా నవ్వి తనెవరో చెప్పాడు లైన్ లో అవతల వేపు ఉన్న వ్యక్తీ !
పాకిస్తాన్ పాలకుడు.
"అన్నా! " అన్నాడు మళ్ళీ అభిమానంగా.
"తమ్ముడూ!" అన్నాడు ఇండియా ప్రధాని.
"విమానం రెడీగా ఉంది -- నేను అరగంటలో డిల్లీలో ఉంటా! అన్నాడు పాకీస్తానీ డిక్టేటరు.
ఫోన్ మళ్ళీ రిగయింది.
బంగ్లాదేశ్ ప్రధాని.
"ఎయిర్ పోర్టు నుంచి అన్నా -- డిల్లీ వస్తున్నా .......విషయం తెలిసింది . డిల్లీనే మన హెడ్ క్వార్టర్స్ -- అక్కణ్నుంచే అన్నీ సాల్వ్ చేద్దాం" అందామె. "వచ్చేయ్ చెల్లెమ్మా!" అన్నాడు. ఆ తర్వాత ఎందరో దేశాదినేతలు -- రాజులు-- రాణుల ప్రోటోకాల్ ని పట్టించుకోవడం లేదు వాళ్ళు.
"సంభోదనలలో యువర్ ఎగ్జల్టేడ్ హైనెస్ లు లేవు. యువర్ ఎక్స్లేన్సీలు లేవు....మాట మతలబులు లేవు. దుబాసీలు లేరు. తర్జుమాలు లేవు. భాషల భేదాలు లేవు. మాటలకు వేరు వేరు అర్ధాలు లేవు.
మనమందరం మనుషులం -
"మనమంతా ఒక్కటి ..." అన్న భావం తప్ప.
"మరో గ్రహం నుంచి వచ్చిన వాళ్ళ తంత్రాలని తిప్పి కొడదాం ......."
"నువ్వు వర్రీ కాకు తమ్ముడూ!"
"మేమెంతా నీ వెనకే ఉంటాం అన్నయ్యా!"
"చెల్లీ! నీ సైన్యాన్ని అలర్టుగా వుంచు !"
"మనందరిదీ ఒకేమాట! ఒకే బాట!
మనిషిపుట్టి దాదాపు రెండు లక్షల సంవత్సరాలు అవుతుంది.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవజాతి అంతా ఆఫ్రికాలో దాదాపు ఒక లక్షా ఎనబై ఏడు వేల సంవత్సరాల క్రితం జీవించి ఉండిన ఒక నీగ్రో వనిత తాలుకూ సంతతే అని ఇప్పుడు జేనిటిక్స్ ద్వారా సైన్సు చెబుతోంది కదా-
ఆమె సంతతి వృద్ది పొంది తరాలు గడిచిన తరువాత ఒక యాభై మంది ఆఫ్రికా నుంచి బయటకు వచ్చి యూరప్ వైపు వెళ్ళారు. ఇంకొంతమంది ఆసియా వైపు నడిచారు.
వేల సంవత్సరాలు గడిచాయి.
వందలమంది వేల మంది అయ్యారు.
వేలు లక్షలూ, లక్షలూ కోట్లూ అయ్యాయి. పరిసరాల ప్రభావం వల్ల మనుషుల్లో జాతులు ఏర్పడ్డాయి. తెల్లవాళ్ళనే యూరోపియన్ జాతులు, నల్లవాళ్ళనే నీగ్రోలు పచ్చవాళ్ళనే మంగోలియన్ జాతులు , గోధుమ రంగు ఛాయల్లో ఉండే ఇండియన్లు వగైరాలు -- ఆర్యులు -- ద్రావిడులు , దండయాత్రలు, నాగరికతలు, మతాలు మారణహోమాలు, భాషలూ, కులాలూ, కార్పణ్యాలూ , కలహాలు, కుమ్ములాటలు కుతంత్రాలు .
ఇప్పుడు మనిషి పుట్టాక తొలిసారిగా .......
మనందరం ఒకటి.
కులాలు , మతాలు , బాషలూ , బేధాలు, ప్రాంతాలు , దేశాలు ... అన్నా మనం తెచ్చి పెట్టుకున్నవే!
"కనబడని ఈ గోడలని కూల్చివేద్దాం !" అన్న భావన.
విశ్వ మానవ సౌభ్రాతృత్వం!
మానవ కల్యాణం!
వసుదైక కుటుంబం ! అన్న ఫీలింగు.
వారిలో .......వీరిలో ......అందరిలో !
రాజు ధ్యానం సాగుతూనే వుంది.


