ఇలా తల్లి ఉన్నన్ని రోజులు తన జీవితంలో అన్నీ పొరపాట్లే చేసిందని వేలెత్తి చూపిస్తూ నమ్మించాలని తాపత్రయపడేది. తన తరువాత కూతురు ఒంటరిదవుతుంది. ఆమె కంటూ ఓ సంసారం, భర్త, పిల్లలు ఏమీ లేకుండా ఒంటరిగా బతుకేలా ఈడుస్తుందన్న దిగులుతో ఏవేవో మాట్లాడేది సందు దొరికినప్పుడల్లా.
ఇప్పుడు తల్లిపోయాక నెత్తిన ముప్పై ఏడేళ్ళు వచ్చాక , తన ఆలోచనల్లో మార్పు వస్తుందని తనకే అనిపించే వేళ తల్లి మాటల్లో కాదనలేని నిజాలు కొన్ని ఉన్నాయనిపించసాగింది. నిజంగా తను జీవితంలో అన్నీ పొరపాట్లే చేసిందా, వెనక్కి చూసుకుంటే నిజమేనని ఒప్పుకోక తప్పని నిజాలు.
మొదటిసారీ పెళ్ళి స్వయంకృతాపరాధమే ! రాహుల్ ని ప్రేమించాననుకుని అతను లేనిదే బతకలేననుకుని, చదవన్నా పూర్తీ కాకుండా , నిండా ఇరవై ఏళ్ళన్నా లేకుండా తొందరపడి ఇంట్లో చెప్పకుండా చెయ్యకుండా పెళ్లి చేసేసుకుంది. అతని అందం, స్మార్ట్ నెస్ , అతను పాడే రొమాంటిక్ సాంగ్స్, చెప్పే ప్రేమ కబుర్లు, తెలిసీ తెలియని టీనేజ్ వయసు, మేచ్యురీటీ లేని ఆలోచనలు అన్నీ కలిసి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం తప్పేనని అతికొద్ది రోజులలోనే అర్ధమైంది . ప్రేమ కబుర్లు, ప్రేమ పాటలు తిండి పెట్టడానికి పనికిరావని, ఇల్లు- సంసారం గడపడానికి డబ్బు కావాలని, అది సంపాదించడానికి ఇద్దరికీ క్వాలిఫికేషన్స్ సరిపోవని ఏడాది లోగానే అర్ధమై , ప్రేమ, మొహం అంతరించి పోయి సంసార ఇతిబాధలు మిగిలాయి. నీవల్లే నీవల్లే అనుకుంటూ, ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ, దెబ్బలాడుకుంటూ భుక్తి గడవడానికి తను కొన్ని ట్యూషన్లు, అతను ఎవరో దూరపు బంధువు ఆఫీసులో చిన్న ఉద్యోగం చేస్తూ ఓ ఏడాది గడిపారు. తను చేసిన పనికి ఓఏడాది తన మొహాన్ని చూడని తల్లి- తండ్రి కూతురు- పడుతున్న ఇబ్బందులు చూసి కరిగి రాకపోక మొదలెట్టి, ఆర్ధికంగా అపుడపుడు సాయం చేస్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదు, చదువుకోమని తన కాళ్ళ మీద తను నిలబడేందుకు ఏదన్నా కోర్సులు చేయమని పోరు పెట్టి కంప్యూటర్ కోర్సులు చేయించడం మొదలుపెట్టారు. ఇంట్లో రాహుల్ దినదినగండంగా కాపురం తయారయి , ఒక్కక్షణం ఇద్దరికీ పడక కాట్లకుక్కల్లా దెబ్బలాడుకుంటూ ఆఖరికి ఇద్దరికిద్ద్దరూ మ్యూచువల్ సేపరేషన్ కి కోర్టుని ఆశ్రయించి డైవోర్స్ తీసుకున్నారు. మూడేళ్ళ ఆ పెళ్ళి ముచ్చట అలా ముగిసింది. దేవుడి దయ వల్ల పిల్లలు కలగకుండా జాగ్రత్త పడడంతో ఇద్దరూ తేలిగ్గా విడిపోయారు.
మొదటి అనుభవం చేదు అనుభవంగా మిగిలాకయినా రెండోసారన్నా జాగ్రత్త పడాలన్న జ్ఞానం లేక, పెద్దల మాట రెండో సారయినా వినకుండా మళ్ళీ తప్పటడుగు వేసింది. తల్లి దండ్రి ఏంతో చెప్పారు. రెండో పెళ్ళయినా ఫరవాలేదు. ఎవరో ఒకరు ,మంచివాళ్ళని చూసి చేస్తాం - డైవోర్స్ లు ఇప్పుడు మామూలే పిల్లల్లేరు కనుక పెళ్లి కష్టం కాదు, ముందు నీ కాళ్ళ మీద నీవు నిలబడాలి అని ఎన్నోవిదాలుగా చెప్పారు. కంప్యూటర్ కోర్సులు పూర్తికాకుండానే, కంప్యూటర్ కంపెనీ డైరెక్టర్ తన వెంటపడడం , డబ్బు, ఇల్లు, కారు , హోదా , స్మార్ట్ నెస్ అన్నీ వున్న అతని ఎన్నిక ఈసారి సరయినదే అని భావించి అతన్ని వదులుకోడం తెలివితక్కువ తనం అనిపించింది. రెండో పెళ్లిదాన్ని అయినా తను కావాలని, తన వెంటపడిన అతన్ని కాదనడం వచ్చిన సువర్ణావకాశం వదులుకోవడమేనని అనుకుంది. ఎటొచ్చి ఈసారి అతన్ని తీసుకుని వెళ్ళి తల్లి తండ్రికి పరిచయం చేసింది. చదువు, డబ్బు, హోదాతో పాటు రెండో పెళ్ళి అయినా అభ్యంతరం లేదన్న అతని సంస్కారాన్ని , మంచితనాన్ని కాదనడానికి ఏమీ కనపడక తల్లి తండ్రి అంగీకారం తెలిపి వాళ్ళ పెద్దవాళ్ళతో వెళ్ళి మాట్లాడారు. రెండో పెళ్ళి అమ్మాయి అని వాళ్ళు ముందు ఇష్టపడకపోయినా కొడుకు పట్టుదల చూసి తలడించారు.
తన జాతకంలో మొగుడు, సంసారం ఆచ్చి రాలేదేమో - ఎన్నో ఆశలతో , కోర్కెలతో కాపురం మొదలు పెట్టిన తన వైవాహిక జీవితం మూన్నాళ్ళ ముచ్చటే అయిందీ సారీ . అంతలా తన వెంటపడి నెలరోజులు సుఖంగా గడిచాయేమో - తరువాత నెమ్మదిగా అతని నిజస్వరూపం బయటపడసాగింది. 'ముందు, "నీకెందుకు ఇంకా ఈ చదువులు, కోర్సులు, నేను కష్టపడుతున్నది చాలు నీవు కష్టపడనక్కరలేదు. హాయిగా ఇంటిపట్టున వుండి నన్ను, ఇంటిని చూసుకో' అంటూ తెలివిగా ఇంట్లో కూర్చోపెట్టాడు. అంతవరకు డబ్బుతో వచ్చే సుఖాలు అనుభవంలోకి రాని తను టి.వి లు చూస్తూ కారేసుకుని షాపింగ్ లు చేస్తూ , ఇల్లు అలంకరించి , తను అలంకరించుకుని , ఏసి రూములో పుస్తకాలు చదువుకుంటూ వుండడం బాగానే వుందనిపించింది.
కొన్నాళ్ళకి ఆ అనుభవం పాతపద్దాక ఇంటిపట్టున ఉండని భర్త, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఒంటరిగా వెళ్ళాల్సి రావడం, డబ్బు సంపాదన తప్ప భార్యతో సరస సల్లాపాలు రోమాన్స్ కి టైం లేనట్లుండి పట్టించుకోని రమేష్ తో జీవితం అనుకున్నంత ఆనందంగా అనిపించలేదు. అంత ప్రేమ ఒలకబోసిన రమేష్ కి పెళ్ళయ్యాక ఆ మోజు కొద్ది రోజుల్లోనే తీరిపోయిందని అలిగేది, సాధించేది. "నీకేం లోటు , హాయిగా తిని కూర్చుని సాధిస్తావెం రోజంతా నీ కొంగు పట్టుకుని కూర్చోవడానికి నాకేం ఉద్యోగం సద్యోగం లేదా. పెళ్ళికి ముందు తిరిగినట్టు ఎప్పుడూ ఎవరూ తిరగరు. ఇంటి కొచ్చేసరికి దెబ్బలాట పెట్టుకోకు' అంటూ విసుక్కునేవాడు. 'నాకేం తోచడం లేదు. నేనూ ఆఫీసుకి వస్తాను' అంటూ మొదలుపెట్టింది తను. ' అక్కరలేదు, నీవు ఉద్యోగం చేయడం నాకిష్టం లేదు. నేను సంపాదిస్తున్నది చాలు' అన్నాడు ఖచ్చితంగా . తనని కట్టడి చేసి ఇంట్లో కట్టిపడేషడన్న భావన తనలో అహాన్ని లేపింది. ఆడదంటే ఇంట్లో పడుండాలి అన్న ఉద్దేశం వెలిబుచ్చినందుకు కోపం ముంచుకు వచ్చి అతనికి చెప్పకుండా కొన్ని ఉద్యోగాలకు అప్లయ్ చేసింది. పంతంగా రెండు మూడు ఇంటర్వ్యూలకు వెళ్లి వచ్చింది. ఆ సంగతి రమేష్ కి తెలిసి చాలా తీవ్రంగా హార్ట్ అయి పెద్ద గొడవ చేశాడు 'అన్నీ నీకు చెప్పి చెయ్యక్కరలేదు. నాకు ఇంట్లో బోర్ కొడ్తోంది. ఉద్యోగం చెయ్యాలని వుంది. నన్నీ విషయంలో కట్టడి చేయకు' స్పష్టంగా చెప్పేసింది.
ఆరునెలల కాపురానికీ ఇద్దరికిద్దరూ ఎడమొహం పెడమొహంగా తయారయ్యారు. తనతో మాట్లాడకుండా సాధించసాగాడు. తను అంతకన్నా పంతం వచ్చి పట్టనట్టు వూరుకునేది. అడిగినంత డబ్బు ఇవ్వడం మానేశాడు. "నీవు సంపాదించుకుంటున్నావుగా , ఖర్చు పెట్టుకో, నీకు తిండి పెట్టడమే నా బాధ్యత నీ విలాసాలకివ్వాల్సిన పనిలేదు' అన్నాడు కావాలని రెచ్చగొడుతూ . అది చాలనట్టు మొదటి పెళ్ళి , భర్త గురించి హేళనగా మాట్లాడడం మొదలుపెట్టాడు. 'నీలాంటి దాన్ని భరించలేకే వదిలేశాడు అతను . ప్రేమనుకుని నాలాగే అతనూ బురదలోకి దిగాడు పాపం. నిన్నెవడు భరించగలడు. అందగత్తెనని గర్వం, పొగరు. నీ అందం చూసి మగాళ్ళు నీ వెంట పడతారని నమ్మకం. మగాడు ముందు అందానికి వలలో పడ్డా , పెళ్ళయ్యాక అందం చూడడు. అణుకువైన భార్య కావాలనుకుంటాడు. భార్యకు వుండాల్సిన లక్షణం ఒక్కటి అయినా వుందానీకు . అదృష్టం బాగుండి నీ బారి నుంచి తప్పించుకున్నాడు' అంటూ వీలయినప్పుడల్లా ఎత్తిపోడవడం, హేళనగా , వ్యంగ్యంగా బాణాలు వదులుతూ శాడిస్టుగా తయారయ్యాడు. అంతేకాదు, ప్రతి చిన్న విషయం తల్లిదండ్రులతో తన మీద కంప్లయింట్ చెయ్యడం, వాళ్ళేమో తప్పంతా తనదేనన్నట్లు చివాట్లు పెట్టడం. ' ఈసారైనా కాపురం సవ్యంగా చేసుకో, నీ దురుసుతనం తగ్గించుకో , ఏ మొగుడూ భార్య తిరగబడితే సహించడు. కాస్త దూకుడు తగ్గించి సవ్యంగా కాపురం చేసుకో . ఇది నీ రెండో పెళ్లి అని మర్చిపోకు. ఈ పెళ్ళయినా నిలుపుకోకపోతే జీవితంలో ఒంటరి అయిపోతావు . సర్దుకోవాలి , సర్దుకోడం నేర్చుకో. ప్రతిదానికీ వాదన పెంచి, నీవెంత అంటే నీవెంత అంటే ఏ మొగుడూ వూరుకోడని తెలుసుకో" అంటూ నచ్చజేప్తూ , మందలిస్తూ నీతులు చెప్పేవారు. తనమీద తల్లితండ్రికి కంప్లయింట్ చేస్తున్నాడని తను నిలదీస్తే - 'అవును , వాళ్ళకి కూతురు ఎలాంటిదో తెలియద్డా. లేకపోతే నేనేదో బాధలు పెడ్తున్నానని అనుకోరూ, పాపం , వాళ్ళు ఈసారన్నా కూతురు బుద్దిగా కాపురం చేసుకోవాలని కోరుకుంటారు గదా, అన్ని సంగతులు వాళ్ళకి తెలియాలిగా వ్యంగ్యంగా నేవ్వేవాడు. 'యూ.. యూ....' అంటూ ఆవేశంగా తిడ్తూ చిందులు తొక్కేది. తల్లి తండ్రి దగ్గర ఎంతో అభిమానంగా గౌరవంగా మాట్లాడేవాడు. ఊర్లో అందరి దగ్గరా చక్కగా వుండేవాడు. చూసే వారందరూ ఎంత మంచివాడు , సరదా అయినవాడు ఎంత చక్కని జంట అనుకునేట్టు ప్రవర్తించేవాడు నలుగురిలో. ఒంటరిగా ఉన్నప్పుడు తన మొహం చూస్తె అతనికి, అతని మొహం చూస్తె తనకి ఇద్దరికిద్దరికీ తిక్కలు వచ్చేవి.


