నేటి కాలపు మేటి కథకులు
(పరిచయ వ్యాసాలు)
నాలుగవ సంపుటి
డి. కామేశ్వరి కథల్లో స్త్రీల సంవేదనలు
- డా. నెల్లుట్ల రమాదేవి
అరవయ్యవ దశకంలో మొదలుపెట్టి ఇప్పటివరకూ విస్తృతంగా రచనలు చేస్తూ పాఠకుల అభిమానాన్ని విశేషంగా చూరగొన్న తెలుగు రచయిత్రులలో ముందు వరుసలో ఉండే రచయిత్రి డి.కామేశ్వరి గారు.
ఒక విధంగా అరవైల నుండి ఎనభైల దాకా ఆ ముఫ్ఫై ఏళ్ల కాలాన్ని రచయిత్రుల యుగంగా చెప్పవచ్చు. ఆడపిల్లల చదువులూ, ఉద్యోగాలలో వచ్చిన గణనీయమైన ప్రగతి వల్లనూ, బయటి ప్రపంచం పట్లా, చుట్టూ ఉన్న సమాజం పట్లా వాళ్ళకు ఏర్పడిన అవగహన వల్లనూ, సాహిత్య పఠన వల్లనూ స్త్రీలు ఈ కాలంలో ఎక్కువగా సాహిత్య సృజనకు ఉపక్రమించారు.
1962 సంవత్సరంలో తన తొలి రచనను ప్ర్రారంభించి, కాలానుగుణంగా సరికొత్త కథాంశాలతో, సరళమై కథనంతో రచనలు చేసారు డి. కామేశ్వరి వీరి తొలి రచన 'వనితలు-వస్త్రాలు' అన్న వ్యాసం. తొలి కథ 'ఆనందరావు-ఆకాకర కాయలు'. తొలి నవల 1968 లో వచ్చిన 'కొత్త నీరు'.
ఒకసారి నవలలు వ్రాయడం మొదలుపెట్టాక....రచయితలకు ఏ థీమ్ దొరికినా దానిని కథగా రాయడం కంటే నలలుగా ఎలా మలచాలా అని చూస్తారు. నలభై ఏళ్ల క్రితం నవలలకు ఉన్న ఆదరణా, ప్రాచుర్యం అలాంటివి. తన సమకాలిలందరూ పుంఖానుపుంఖాలుగా నవలలు రచించినా....తాను మాత్రం అటు నవలలూ, ఇటు కథలూ రాస్తూ, ఒకింత కథలపైనే మొగ్గు చూపిన రచయిత్రి ఆమె.
ఇప్పటికి పన్నెండు కథా సంపుటాలు, ఇరవై ఒక్క నవలలు, ఒక యాత్రా రచన, ఒక కవితా సంపుటి వెలువరించిన ఈ రచయిత్రికి కథలంటేనే ఎక్కువ మక్కున అని తెలుస్తోంది. ఆమె మూడు వందలకు పైగా కథలు రాసినా...నాకు లభించిన ఆరు కథాసంపుటాలు, ఒక యాత్రాదర్శిని లోని అయిదు అనుబంధ కథలు, వార్తాపత్రికల్లోని ప్రత్యేక సంచికల్లో, ఆయా సందర్భాల్లో వెలువడ్డ ప్రత్యేక సంకలనాల్లోని కథలూ కలిపి సుమారు నూట యాభై దాకా కథలను నేను చదివాను. రచించబడ్డ కాలాన్ని ఆధారంగా తీసుకుంటే 1960-80 మధ్య మొదటి దశ, 1980- 2000 వరకు రెండవ దశ, 2000-2020 వరకు మూడవ దశగా విభజిస్తే....కథాంశాల పరంగానూ, రచనా సంవిధానంలోనూ, శైలీ, శిల్పం వంటి లక్షణాలలోనూ కామేశ్వరి గారి రచనల్లో వచ్చిన మార్పును అధ్యయనం చేయడానికి వీలయింది.
తొలి నాళ్లలో అందరిలాగానే కథ రాయాలన్న ఆతృత, అన్ని అంశాలూ ఒకే కథలో చెప్పేయాలన్న ఆరాటమూ ఉన్నప్పటికీ చాలా తొందరగానే కథారచన మూలసూత్రాలను ఒంటబట్టించుకున్న కామేశ్వరి గారు తరువాతి రోజుల్లో ఎన్నో గొప్ప కథలను రాశారు. కాలానుగుణంగా పై అన్ని అంశాలలోనూ ఎంతో పరిణతి పొందిన రచయిత్రి కలం నుండి వచ్చిన కథలివి.
కుటుంబ నేపథ్యం
కామేశ్వరి గారు 1935 ఆగష్టు 22 న కాకినాడలో పుట్టారు. చదువుకున్నది కాకినాడ, రామచంద్రాపురం, శుద్ధ శ్రోత్రియులైన ప్రభల రఘురామయ్య, మాణిక్యాంబ వీరి తల్లిదండ్రులు.
1952లో దుర్వాసుల వి.నరసింహం గారితో వివాహం జరిగాక భర్త ఉద్యోగ రీత్యా ఒరిస్సాలో అడుగు పెట్టిన కామేశ్వరి, 1984 దాకా ముఫ్ఫై రెండేళ్ళ పాటు భువనేశ్వర్ లోనే ఉన్నారు. ఎలక్ట్రికల్ డిపార్టు మెంట్ లో చీఫ్ ఇంజనీర్ గా భర్త రిటైర్ అయ్యాక హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి, కుటుంబపరంగా చీకూ చింతా లేని పరిపూర్ణ జీవితం ఆమెది.
పరిశీలనాత్మక రచనలు
సాహిత్యం సృజనాత్మకమైనది. ఎవరో ఒకరి మదిలో రూపుదిద్దుకుని అక్షర రూపంలో వెలువడుతుంది. రచన అనేదే కల్పన అయినప్పటికీ వాస్తవిక సాహిత్యం, కాల్పనిక సాహిత్యం అనే రెండు విభాలుగా రచనలను పేర్కొనడం అలవాటుగా ఉంది. సహజత్వానికి దగ్గరగా, మన చుట్టూ ఉన్న మనుష్యుల గురించో, జరిగిన సంఘటనల ఆధారంగానో చేసిన రచనలను వాస్తవిక జీవిత చిత్రణలుగా బావించడం జరుగుతుంది. అందుకు విరుద్ధంగా, సత్యదూరంగా చేసిన రచనలు కాల్పనిక సాహిత్యంగా పిలవబడ్డాయి.
ఈ రెండు రకాల సాహిత్య సృష్టిలో రచయితలు, రచయిత్రులు అనే తేడా లేకపోయినా పురుషులకు ఉన్న ఎక్స్ పోజర్ కారణంగా వారు కొంచెం వైవిధ్యభరితమైన రచనలు చేయడానికి అవకాశం ఏర్పడింది. అదే సమయంలో స్త్రీలకు కుటుంబ పరమైన, సంఘపరమైన ఆంక్షలూ, పరిమితులూ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా కుటుంబ సంబంధాలను దాటి సమస్త మానవ సంబంధాల గురించీ, వారికి తెలియని కోణాల గురించీ రాయడంలో కాస్త వెనుకబడ్డారేమో అనిపిస్తుంది. కామేశ్వరి గారు కూడా అందుకు మినహాయింపు కాకపోయినా తనకు తెలిసిన, తాను చూసిన ప్రపంచాన్ని, కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా సమస్యల పట్ల లోతైన పరిశీలనతో, వ్యక్తిత్వ వైరుధ్యాల పట్ల స్పష్టమైన అవగాహనతో రచనలు చేసారు.
డి. కామేశ్వరి రచనలు చేస్తున్న కాలంలో మహిళలు రచనా రంగంలో దూసుకుపోతున్నారు. కావిలిపాటి విజయలక్ష్మి, ద్వివేదుల విశాలాక్షి లాంటివారు అప్పటికే నవలా రచనలో పేరు తెచ్చుకోగా, మాలతీచందూర్, కె. రామలక్ష్మి, లత, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి వంటి వారు ఎంతో ప్రసిద్ధి పొందారు. కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనారాణి......వీరిద్దరూ నవలా రచనలో ఒకప్రభంజనం సృష్టించారు. వీరి నవలలు ఎన్నో పత్రికల్లో సీరియల్స్ గా రావడమే కాక, సినిమా కథలకు ముడి సరుకుగానూ, ప్రచురణకర్తలకు కొంగుబంగారంగానూ మారాయి. మహిళల రచనలే ప్రచురణకర్తలకు ఆదాయమార్గాలుగా తయారయ్యాయి. మగవాళ్ళు కూడా ఆడపేర్లు పెట్టుకుని రాస్తే తప్ప పాఠకులు చదవరని భావించే పరిస్థితి ఏర్పడింది.
వాస్తవిక దృక్పథంతో రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి వంటి రచయిత్రుల రచనలు ఒక ప్రక్క.......సరికొత్త కలల ప్రపంచాన్ని పరిచయం చేస్తూ, 'ఇలా జరిగితే ఎంత బాగుండు' అనిపించేలా ఆరడుగుల అందమైన, ఐశ్వర్యవంతుడైన, ఆదర్శవంతుడైన కథానాయకుడు ఒక పేదింటి అమ్మాయిని కేవలం మంచితనం చూసి పెళ్ళిచేసుకోవడం అనే పాయింట్ తో వచ్చిన పాపులర్ రచనలు మరో ప్రక్క వర్ధిల్లుతోన్న కాలంలోనే రచనా రంగంలోకి ప్రవేశించారు కామేశ్వరి. కాల్పనిక, వాస్తవిక రచనలకు మధ్య ఉండే సన్నటి విభజన రేఖను పట్టుకుని దాన్ని అనుకుని రచనాయాత్ర సాగించారు కామేశ్వరి. అందువల్లనే ఆమె రచనల్లో కథాంశాలు ఎక్కువ శాతం కుటుంబాల చుట్టూ తిరిగినా వాస్తవిక దృక్పథం కనిపిస్తుంది. ఇందుకు ఆమె సునిశితమైన పరిశీలన కారణం అని చెప్పవచ్చు. స్థూలంగా చెప్పాలంటే సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, సాంఘిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని రచనలు చేసిన అరుదైన రచయిత్రుల్లో కామేశ్వరి ఒకరు.