Previous Page Next Page 

శ్రీమద్భగవద్గీత పేజి 4

   
    'ఇదే నా రత్నము. ఇదే నా ధనము. ఇదే నా సర్వస్వము. ఇదే నా జీవితము. దీనిని నేను విడువను' అనెను.
    మహర్షి సౌమ్యముగా వినడని గ్రహించిన విశ్వామిత్రుడు దానిని బలవంతంగా లాగుకొని పోయెను. శబళ వందలకొలది భటులను కూల్చివాయువేగమువచ్చి మహర్షి పాదముల పైబడి "స్వామీ! నేను భక్తితో తమను సేవించితినే నన్ను ఆ రాజుకేల అప్పగించితిరి" అని అడిగి వలవల ఏడ్చెను.
    
                'సహితుల్యం బలం మహ్యం రాజాత్వద్య విశేషతః
                 బలీ రాజా క్షత్రియశ్చ పృథివ్యా పతిరేవచ'    

    'నాకు అతనితో తులతూగగల బలము లేదు. పైగా అతడు రాజు బలవంతుడు క్షత్రియుడు. పృథ్వీపతి. అతనిని నేనెట్లు వారించగలను' అనెను.
    అంతట శబళ "సబలం క్షత్రియస్యా హుర్ర్భాహ్మణో బలవత్తర (క్షత్రియుని బలము అల్పబలము బ్రాహ్మణుడే బలవత్తరుడు)" అని హుంబాయని అరచెను. అంత మ్లేచ్చులు, పల్లవులు అను జాతికి చెందిన సైనికులు కొల్లలుగా జన్మించి విశ్వామిత్రుని సైనికుల నెదిరించిరి. విశ్వామిత్రుడు వారినందరను నాశనము చేసెను. శబళ మరల అనేకమంది శకులను, యవనులను సృష్టించెను. వారు విశ్వామిత్రుని బలమును నాశనము చేసిరి. విశ్వామిత్రుడు వారిని నాశనము చేసెను. శబళ మరల హుంబాయని అరచెను. ఈ తడవ కాంభోజులు పుట్టిరి. వారు విశ్వామిత్రుని నూరుగురు కొడుకులను నాశనముచేసిరి. విశ్వామిత్రుడు వారిని నాశనము చేసెను. చరుతంగబలము నాశనమై, పుత్రులు నశించుటవల్ల విశ్వామిత్రుడు మిగుల సిగ్గుపడెను.
    
                 'సముద్ర ఇవ నిర్వేగో భగ్నదంష్ట్ర ఇవోరగః
                 ఉపరక్త ఇవాదిత్య స్సద్యో నిష్ప్రభతాంగతః  
 
    "అప్పుడు విశ్వామిత్రుడు వేగములేని సముద్రము వలెను, కోరికలు తీయబడిన పామువలెను. రాహుగ్రస్తుడైన భానునివలెను తేజోహీనుడైపోయెను".
    అట్లు వంచితుడైన విశ్వామిత్రుడు మిగిలిపోయిన ఒక్క కొడుకును రాజ్య మేలుటకుగాను పట్నమునకు పంపి ఈశ్వరానుగ్రహము కోరి తపస్సు చేయుటకు గాను హిమవత్పర్వతమునకు వెళ్ళెను.
    ఇక్కడ మనమొక విషయమును గ్రహించవలయును. నాడు సహితము పాలకులు తమ పశుబలమును చూసి విర్రవీగేవారు. గోవు సాధుస్వరూపము అయినను సముద్రము నందు బడబానలమువలె సాధుత్వమున ప్రళయాగ్ని యుండును. పశుబలము చూచుటకు గొప్పగా నుండును కాని ధర్మబలమున మహోగ్ర జ్వాలలుండును. భౌతికబలముతో తాత్కాలిక విజయము గాంచిన గాంచవచ్చును. కాని ఎల్లప్పుడు 'ధర్మమేవ జయతే'. విశ్వామిత్రుడు పశుబలము చూచి విర్రవీగెను. కూలెను. ఇంకొక విషయము నాడు బ్రాహ్మణ క్షత్రియులలో పరస్పర కలహములన్నట్లు విదిత మగుచున్నది.
    మరొక విషయమేమన, పశు బలమును పశు బలముతోనే ఎదిరించ వలెను. అందుకే శబళ విశ్వామిత్రుని ఎదిరించుటకు మ్లేచ్చయ వనాది సైనికులను సృష్టించెను. ఆ పేర్లన్నియు మన దేశమునకు విదేశము నుండి దండెత్తిన వారివి. మనవారు బహుశః వారందరిని నీచులుగా చూచువారు. మ్లేచ్చ యవనులు తప్ప మిగిలినవారందరు తదనంతరము క్షత్రియులై మనదేశము నేలిరి.
    
    బ్రహ్మదండము:   
    విశ్వామిత్రుడు కొంతకాలము తపస్సు చేసెను. అతని తపస్సునకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యెను. ధనుర్వేదము సాంగోపాంగముగా దయచేయవలసినదని విశ్వామిత్రుడు శివుని కోరెను. శివుడది ఇచ్చి అంతర్ధానుడయ్యెను.
    అంత విశ్వామిత్రుడు గర్వపు రెక్కలు తొడుగుకొని వశిష్ఠుని ఆశ్రమమునకు చేరెను. అస్త్ర ప్రయోగము చేసి వశిష్ఠాశ్రమమును నేలమట్టము చేసెను. ఆశ్రమవాసులెల్లరు ఆ ధాటికి తాళజాలక పారిపోయింది. "చిరకాలమునుంచి పెంచి పెద్ద చేసిన ఆశ్రమమును పొట్టబెట్టుకొనెదవా? నీవు బ్రతుకవు" అని వశిష్ఠుడు యమదండము వంటి బ్రహ్మదండము పట్టుకొని నిలుచుండెను. విశ్వామిత్రుడు అనేక అస్త్రములు ప్రయోగించెను. వానినన్నింటిని బ్రహ్మదండము మ్రింగివేసెను. చివరకు విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రము ప్రయోగిరాసెను. బ్రహ్మదండము దానిని కూడా మ్రింగెను. కాని వశిష్ఠుడు జాజ్వల్యమానమైన అగ్నివలె వెలిగిపోయెను. అతడు కోపమున మండిపోయెను. అతని రౌద్రముచూచి శాంతించవలసిందిగా దేవతలు వశిష్ఠుని ప్రార్దించిరి.
    వశిష్ఠుడు శాంతించెను. కాని విశ్వామిత్రుడు పరాభూతుడయ్యెను.
    
                     'దిగ్భలం క్షత్రియబలం బ్రహ్మతేజో బలం బలం
                      ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణీ హతాని మే'  
 
    'క్షత్రియబల మేమి బలము? బ్రహ్మబలమే బలము, ఒక్క బ్రహ్మదండము నా అస్త్రములన్నింటిని మ్రింగివేసినది'.
    'తదే తత్సమ వేక్ష్యాహం ప్రసన్నేంద్రియ మాననః తపో మహత్సమాస్థాస్యే యద్వై బ్రహ్మత్వకారణమ్'.
    'ఈ విషయము తెలిసికొన్న నేను ఇక శాంతించి ప్రసన్నేంద్రియుడనై బ్రహ్మత్వము సిద్ధించునట్లు గొప్ప తపము చేయుదనును'.
    అని నిశ్చయించుకొని భార్యాసమేతుడై శరావతీ నదికి దక్షిణముగా వెళ్ళి మహత్తరమైన తపస్సు ప్రారంభించెను. అట్లు వేయి సంవత్సరములు గడచిన పిదప బ్రహ్మప్రత్యక్షమై "నీవు నీ తపస్సు వల్ల రాజర్నులందరిని జయించినా'వని అంతర్ధానుడయ్యెను. విశ్వామిత్రునకు సంతృప్తి కలుగలేదు. అతడు దుఃఖించెను. కోపించెను. దేవతలు తనను రాజర్షిగనే నిర్ణయించినందుకు మిక్కిలి దుఃఖించెను. మరల తపస్సు ప్ర్రారంభించెను.
    విశ్వామిత్రుడానాటి విప్లవవాదిగా కనిపించుచున్నాడు. అనాదిగా వచ్చుచున్న ఒక వ్యవస్థను ఎదిరించి కొత్త వ్యవస్థను ఏర్పర్చజూచువాడు విప్లవవాది. చరిత్రను ఒకసారి చూచిన విప్లవ వాదులందరిని సనాతనులు ఎదిరించినట్లు చూతుము. బుద్ధుడు, క్రీస్తు మహమ్మదు మున్నగు ప్రవక్తల జీవితములందే కాక సోక్రటీస్ వంటి మేధావులు కూడా నాటి సనాతనులను ఎదుర్కొనవలసి వచ్చినది. సంఘము సాధరణముగా సనాతనులనే అనుసరించును. ప్రగతివాదము సహితము జీర్ణమైదాని రూపురేఖలు మారిన తదుపరి సనాతనుల సొత్తుగా మారిపోవును. ఒకనాటి ప్రగతివాదము సనాతనమై పోయినప్పుడు తిరిగివచ్చు ఇంకొక విప్లవవాదమును ఎదుర్కొనవలసి యుండును. విశ్వామిత్రుడు ముందు పశుబలముతో వశిష్ఠుని ఎదిరించిన మాట వాస్తవము. కాని అతనికి తగిలిన దెబ్బవల్ల అతడు ఆనాటి సాంఘిక వ్యవస్థనే మార్చుటకు ప్రయత్నించినట్లు మనకు కనిపించును. ఇంద్రాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు ఆ విప్లవ ఝంజామారుతమును ఆపుటకు ప్రయత్నించినట్లును కనిపించును. అయినను జయము ఎల్లప్పుడు విప్లవమునకే కలుగునని చరిత్ర మనకు చెప్పుచున్నది. విశ్వామిత్రుని సహితము విజయము వరించినదనియే చెప్పవచ్చును. విశ్వామిత్రుడట్లు రాజర్షియై బ్రహ్మర్షిగా మారు మధ్యకాలమున రెండు ప్రముఖ కార్యములను సాధించెను. ఒకటి త్రిశంకు స్వర్గము రెండవది శునశ్శేవుని విముక్తి', ఈ రెండును ఆనాటి ఆచారములకు విరుద్దముగ జరిగినవే.
    
    త్రిశంకుడు:   
    ఇక్ష్వాకు వంశమున త్రిశంకుడను రాజుండెను. అతడు అధర్మాత్ముడు. అనేక యజ్ఞములు చేసినవాడు. అతడు సశీరీరముగ స్వర్గమునకు పోవలెనని సంకల్పించెను. వశిష్ఠుడు అతని పురోహితుడు. త్రిశంకుడు అతని దగ్గరకు వెళ్లి తన కోర్కెను వెల్లడించెను. సశరీరమున స్వర్గమునకు వెళ్ళుట సాధ్యపడదని వశిష్ఠుడు కచ్చితముగ చెప్పివేసెను. కాని త్రిశంకుడు నిరుత్సాహపడలేదు. వశిష్ఠునకు నూర్గురు పుత్రులు. అతడు వారిదగ్గరకు వెళ్ళెను. వశిష్ఠుడు చెప్పిన మాటలను సహితము వారితోచెప్పి తన కోర్కె తీర్చవలసినదని ప్రార్దించెను. సత్యవాదియైన తండ్రితో కానిపని తమతో కాదని వారు చెప్పిరి. అంత త్రిశంకుడు "అన్యాంగతిం గమిష్యామి స్వస్తిహోస్తు తపోధనాః" (మీకు శుభమగు గాక నేను మరొక పురోహితుని ఎన్నుకొనెదను) అనెను.    
                    "ఋషి పుత్రాస్తు తచ్చృత్వా వాక్యం ఘోరాభి సంహితమ్
                     శేపు పరమ సంక్రుద్దా శ్చందాలత్వం గమిష్యసి"    

    "ఘోరాభిప్రాయ యుక్తములైన ఆ మాటలు విని ఋషి పుత్రులు చందాలు డపగుదువుగాక' యని యాతనిని శపించిరి. అంతటితో త్రిశంకుడు చండాలుడైపోయెను. మంత్రులును, అనుచరులను అతనిని వీడి వెళ్ళిరి. రాజు వంచితుడై విశ్వామిత్రుని శరణు జొచ్చెను. విశ్వామిత్రునకు సహితము బ్రాహ్మణుల వలన తలవంపులైనది. త్రిశంకుడు సహితము క్షత్రియుడు. బ్రాహ్మణులచే అవమానము పొందినవాడు ఘోరముగా శపించబడినవాడు. ఏ విధమునైనను వశిష్ఠుని ఓడించవలెననుకున్నాడు విశ్వామిత్రుడు. త్రిశంకునితో యజ్ఞము చేయించెదనన్నాడు. ఋత్విజులను, బ్రాహ్మణులను పిలిపించినాడు. ఎల్లరును వచ్చిరి. కాని మహోదయ మహర్షియు, వశిష్ఠు పుత్రులును రాలేదు.

                             

 Previous Page Next Page