Previous Page Next Page 

అదివిష్ణు నవలు -2 పేజి 4

 

    (ఇది జీవితంరా బాబూ! నాటకంలో అంజనోళ్ళకీ చీమూ నెత్తురూ ఉండవచ్చు గాక ఉండవచ్చు. జీవితంలో వాటి కసలర్ధమే లేదు తెలుసా? గో మేన్ గో! నా పని పాడుచేయకు . వెళ్ళిపో.)
    అతను చెక్కులు పూర్తీ చేసి సంతకాల కోసం కదలబోతుండగా, లింగం అండ్ మణ్యం లో మణ్యం ఆఫీసు లో ప్రత్యక్షమైనప్పుడు - శ్రీనివాసరావు ఒంటిమీద తేళ్ళూ , జేర్రులూ పాకినట్లనిపించింది. మణ్యన్ని చూచి కూడా తలవంచుకున్నాడు శ్రీనివాసరావు.
    మణ్యం శ్రీనివాసరావుని వదిలి పెట్టలేదు ."
    "నమస్కారం శ్రీనివాసరావుగారు! మా పని...."
    "పూర్తయిందండి ."
    "థేంక్స్ అండి బాబూ! రక్షించారు. అవతల మావాడు ముసుగెట్టి తొంగున్నాడు. చెక్కు చేతిలో పడ్డ తరవాతనే మేడ్రాసంటున్నాడు. రండి, రండి తొరగా , ఆఫీసరు గారు లోనే ఉన్నట్టున్నారు."
    మణ్యం గబగబా మాటాడేసి ఆఫీసరు గదిలోకి వెళ్ళిపోయాడు. అదే సమయానికి ఏడుకొండలక్కడికి వచ్చి,చేతిలో వున్న కాఫీ గ్లాసు అడ్డు రావడంతో తచ్చాడిపోయేడు.
    సరిగ్గా అప్పుడే అన్నాడు ఆంజనేయులు -
    "కాఫీ నేలపాలు కాలేదు. కొండలూ, లాభం లేదోయ్ అనక కనిపించు."
    మణ్యం అటు ఆఫీసరు గది ప్రవేశం చేసేడో లేదో యిటు శ్రీనివాసరావుని చెక్కులు తీసుకు రావలసిందిగా కబురు వచ్చింది. దాంతో శ్రీనివాసరావుకి కోపమూ వచ్చింది.
    (ప్రస్టేజ్ లేదు. మనిషి యిక్కడ చెలామణి అవడం కష్టం. ఇక్కడికి వచ్చిపడే రాబందులకి కూడా నేను గుమస్తా వెధవనే. ఆప్టరాల్ చెక్కులు రాసే మేషిన్నేను. మణ్యం నీకు జై! నీ పార్టనర్ కి జై! నీ సొసైటికి, నీ బిజినెస్ కి, నీ ఇంట్లో పెరిగే పిల్లికి , కుక్కకి అందరికి జై! వస్తున్నా సార్.)
    "రావోయ్ కొండలూ! ఈ పాపాల బరువుని అంత వరకు మోయి. మోసుకుంటూ నా వెంట రా. క్విక్. నిమిషం లేటయితే మనకీ ఆఫీసులో చోటుండదు."
    శ్రీనివాసరావు ఆఫీసరు గదిలోకి వెళ్ళి నుంచున్నాడు. అతని వెనకే కొండలూ చెక్కులు పట్టుకువచ్చి వాటిని బల్ల మీద జాగ్రత్తగా ఉంచి, మణ్యం వేపు ఆశగా చూచి వినయంగా నిష్క్రమించాడు.
    మణ్యం ఆఫీసులో ఉపన్యాసం ప్రారంభించేడు.
    "మీ ముందు అనకూడదు కాని నరసింహంగారూ! మన బీవన్ లాటి మెరికల్ని నేను నా అనుభవంలో చూళ్ళేదనుకోండి. ఎంత పని! ఎంత పని! కొండంతపనిని - ఎవడండి వాడు - ఆ... కృష్ణపరమాత్మ గోవర్ధనాన్ని అమాంతంగా ఎత్తుకున్నట్టు అవలీలగా నిమిషంలో నీటుగా చేసి అవతల పారేయగల దిట్ట. అంతపనిలోనూ చీమ తలంత తప్పు చూపించండి మరి. ఉండదండి బాబూ! కాగడా పెట్టుకు వెతికినా బీవన్ గారి పన్లో తప్పు కనిపించనే కనిపించదు. ఏమిటో పాపం -- అయిదేళ్ళ నుంచీ చూస్తున్నానా, ఎదుగూ బొదుగూ లేకుండా గుమాస్తాగానే ఉన్నాడు.
    సరిగ్గా లింగం అండ్ మణ్యం చేక్కులోనే తప్పు దొర్లింది. చెక్కులో పధ్నాలుగు వేల రొండొందలు మాత్రమే , మాత్రమే, మాత్రమే అని మూడు సార్లు 'ఓన్లీ' లు తగిలించేడు శ్రీనివాసరావు.
    ఆఫీసరు శ్రీనివాసరావును తీక్షణంగా చూచి అన్నాడు.
    "అవునండీ! ఈ ఓన్లీలతోనే చెక్కు రాసేయకపోయారా, పీడా పోయేది. మూడుసార్లు ఒన్లీలు తగిలించందే మణ్యం గారిని నమ్మలేరా మీరు?"
    "సారీ సార్" అన్నాడు శ్రీనివాసరావు.
    "ఓరి మీ అఘాయిత్యం గూల! అంత జాగ్రత్తేమిటండి బాబూ! అన్నాడు మణ్యం తట్టుకోలేక.
    చివరి రెండు ఓన్లీలు కొట్టి పారేసి పైన సంతకం పెట్టేడు ఆఫీసరు సంతకం పెడుతూ అన్నాడు.
    " దిస్ స్పీక్సఫ్ యువర్ ఎబ్సింట్ మైండేడ్ నెస్!"
    "సారీ సార్!' మళ్ళా అన్నాడు శ్రీనివాసరావు.
    "నెల చివరి రోజులు గదండీ! మనసు....."
    మణ్యం మాట దూరే అవకాశాన్ని శ్రీనివాసరావు ఇవ్వలేదు. వేరే చెక్కు సంతకం కోసం ఆఫీసరు ముందుంచేడు.
    చూస్తుండగానే మణ్యం అందించిన రెండు సిగరెట్లు కాల్చి పారేశాడు ఆఫీసరు. వాటి ఖరీదు తెలిసిన శ్రీనివాసరావు నొచ్చుకున్నాడు. ఈ గదిలోకి వచ్చిన తరవాత తప్పనిసరిగా కొన్ని నిబంధనలకి బద్దుడై మెలగాలనే నీతి సూత్రాన్ని అతనెప్పుడో అమోదించేడు. అందుచేత మణ్యం లాంటి వాళ్ళ వాకులనీ వాళ్ళ ముందు తనకు జరిగే అవమానాన్నీ అతను భరించడం నేర్చుకున్నాడు.
    మణ్యం చెక్కు పుచ్చుకుంటూ ఆఫీసరు గారికి థేంక్స్ చెప్పేడు. శ్రీనివాసరావు బయటికి వచ్చేస్తూ మణ్యం బల్ల మీదికి బాగా ఒరిగి మెల్లిగా 'చల్లటి మాట' ఏదో యజమానికి చెప్పే ప్రయత్నం గమనించి , విసురుగా తలుపు వేసేడు.
    శ్రీనివాసరావు గది నుంచి బయటికి రావడం చూచిన కొండలు , విశ్వాసం గల కుక్కపిల్లలా అతన్ని వెంబడించబోయేడు. సరిగ్గా అదే సమయానికి కొండలు మీద బాణం వేసేడు బీవన్.
    "ఓరీ పీనుగా! బీవన్ నిప్పురా! ఆయన్నేందుకు వెంబడిస్టావ్? లోపలే కూచుంది గని! దాన్నో కంట కనిపెట్టు."
    శ్రీనివాసరావు సీవన్ వేపు కృతజ్ఞతపూర్వకంగా చూచి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు.
    ఆ మధ్యాహ్నం మూడింటికి గాని అతనికి పనిలో రద్దీ తగ్గింది కాదు. ఇంటి దగ్గర్నించి తెచ్చుకున్న టీని ప్లాస్కు నుంచి గ్లాసులో వంచుకున్నాడు. తాగబోతుండగా శాంతాదేవి కనిపించింది. మరో గ్లాసులో కొంచెం తీ పోసి ఆమె కిచ్చేడు.
    "ఇవాళ వద్దులెండి. నా వంట్లో బాగోలేదు" అన్నది శాంతాదేవి.
    "ఫర్వాలేదు పుచ్చుకోండి. కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. పైగా మీకు చెప్పానో లేదో మా ఆవిడ దేన్లోనైనా వెనకంజ వేసి ఉండొచ్చుగానీండి - పాకశాస్త్రం యావత్తూ క్షుణ్ణంగా తెలిసిన మనిషి. టీ, కాఫీలు చేయడంలో ఆవిడ బెస్టు. పుచ్చుకోండి తొరగా. చల్లారితే రుచి చెడిపోగలదు " అన్నాడతను.
    శాంత నవ్వింది. నవ్వి టీ తాగి అన్నది -
    "అదృష్టవంతురాలెమే!"
    "ఎందుకట?"
    "అలా అనిపిస్తుంది నాకు."
    "అతను నీరసంగా నవ్వబోయి , ఆ నవ్వుని శాంతాదేవి భరించ'లేదని తెలిసి నవ్వలేదు.
    శాంత టీ తాగడం ముగించి థాంక్స్ చెప్పింది.
    "అన్నట్టు శాంతగారూ, వుదయం ఆంజనేయులు మీ టైపింగ్ కేదో వంక పెట్టినట్టున్నాడు."
    "అవునండి. రిఫరెన్స్ తప్పు టైప్ చేసెను. ఇవాళ మనసెందుకో చికాగ్గా వుంది."
    "వండర్! ఆర్నెల్లుగా మిమ్మల్ని చూస్తున్నానా? ఇదిగో ఇవాళే వింటున్నాను - తప్పు టైప్ చేయడం గురించి , మీ మనసు బాగులేకపోవడం గురించిను."
    "అదేమిటండీ మరీ చిత్రంగా అనేస్తున్నారే? నేను మాత్రం మనిషిని కాదూ" అన్నదామె కఠినంగా.
    దానికతను నొచ్చుకున్నాడు.

 Previous Page Next Page