Previous Page Next Page 

మధురమైన ఓటమి పేజి 4


    
    "నేను ఇవ్వగలిగింది ఏదైనాసరే" ఆమె ఆ విషయంలో డబ్బు గురించే ఆలోచించి అలా అంది.
    
    "సరే...! నువ్వు ఓడిపోయినప్పుడే, నువ్వు ఇవ్వగలిగింది నేను అడుగుతాను. ఒకవేళ నేను...." ఆయన ఆ మాట పూర్తిచేయలేనట్లు కాస్సేపు ఆగి "నా ఆస్తి మొత్తం నీకు రాసి యిచ్చేస్తాను...." అని పూర్తి చేశాడు.
    
    మిన్ను విరిగి మీద పడినంత ఆశ్చర్యంగా చూసిందామె. ఈ ముసలాయనకి మతిస్థిమితంగా వుందా? లేదా? అన్న అనుమానం కూడా కలిగింది.
    
    "ఈ క్షణంనుండే మన పోటీ ప్రారంభం అయిందనుకో! రేపే వచ్చి నీ కుటుంబ సభ్యులేమన్నారో నాతో చెప్పు" అంటూ ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నట్లు చూశాడు.
    
    ధృతి లేచి నమస్కరించి వెనుతిరిగింది.
    
    "నా ఆస్తి, ఐశ్వర్యం గురించి తెలుసుకుని కలలు కనకు.....! ఈ ధర్మానందరావుకి ఓటమి అంటే ఏమిటో తెలియదు" అని గర్వంగా వినిపించింది.
    
    ఆమె సన్నగా నవ్వుకుంటూ బైటకి నడిచింది.
    
                                                                * * *
    
    "కొంప ముంచేశావ్! ధర్మానందరావుగారి గురించి అసలు తెలుసా నీకు?" అన్నాడు నవీన్.
    
    "ఇప్పుడే తెలిసింది" అంది ధృతి నెమ్మదిగా.
    
    "నీ మొహం తెలిసింది ఆయనకి ఎంత పవర్ వుందో ఏమిటో తెలుసుకోకుండానే పొట్టేలు కొండని ఢీకొన్నట్లు ఆయనతో పోటీపెట్టుకున్నావా? ఆయన చాలా గొప్పవాడు. కొన్ని కోట్లకు యజమాని...." అన్నాడు చిరాగ్గా నవీన్.
    
    "ఆయనే నన్ను రెచ్చగొట్టాడు. నీకు తెలుసుకదా నేను అనవసరంగా ఒకరి జోలికి వెళ్ళననీ" అని తాపీగా అతన్ని చూసి నవ్వేసింది.
    
    జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకుని నిర్లక్ష్యంగా పెంచిన గడ్డంతో మోటుగా కనిపిస్తాడు నవీన్. కాని అతని మనసు నవనీతం.
    
    "ఏమిటా ఆలోచన?" అడిగాడు నవీన్.
    
    "నీ గురించే."
    
    "ఏమని?"
    
    "ధర్మానందరావుగారు అన్ని రకాల బంధాలనీ విశ్లేషించారు కానీ 'స్నేహం' గురించి ఏ అభిప్రాయం వ్యక్తం చెయ్యలేదు. ఎందుకని?"
    
    "అటువంటి స్నేహమే ఆయనకి దొరికివుంటే గనుక అసలిలాంటి పిచ్చిపిచ్చి ఆలోచనలతో టైంవేస్ట్ చేసేవారు కాదు....." ధృతిని అపురూపంగా చూసుకుంటూ అన్నాడు నవీన్.
    
    గట్టిగా జడ అల్లుకున్నా ముంగురులు చిలిపిగా ఆమెని అల్లరిపెడుతూనే వున్నాయి. కనుబొమల మధ్య పెట్టుకున్న చిన్న బొట్టు తప్ప ఆమె ముఖంలో మరే ఇతర అలంకరణా వుండదు. ఆమెని అలా చూస్తుంటే ఎవరికైనా ఒకే భావం వస్తుందేమో! ఎవరో రాజకుమార్తె మారువేషంలో సాదా సీదా బట్టలతో మామూలుగా తిరుగుతున్న్తలు ఆ కళ్ళల్లో, పెదవి విరుపులో అంతటి రాజసం!
    
    "నవీన్....." నిశ్శబ్ధాన్ని భంగం చేస్తూ ఆమె మంద్రంగా పిలిచింది.
    
    యూనివర్శిటీ రోడ్డు పగలంతా అల్లరిచేసి, చేసి అలసినట్లు ప్రశాంతంగా వుంది. అక్కడక్కడ జంటలు తప్ప పెద్దగా రద్దీలేదు.
    
    నవీన్ తలతిప్పి ఆమెవైపు చూశాడు.
    
    "అమ్మకెలా వుందీ?" బాధ ఆమె గొంతులో ధ్వనిస్తోంది.
    
    అతను నిర్లిప్తంగా "ఆపరేషన్ అవసరం లేకుండా మందులు వాడమన్నారు. చూద్దాం ఏమౌతుందో" అన్నాడు.
    
    ఆ తరువాత ఇద్దరూ మౌనంగా నడవసాగారు. చాలా జంటలు చిలిపిగా మాట్లాడుకుంటూ, గట్టిగా నవ్వుకుంటూ వాళ్ళకి ఎదురొచ్చారు.
    
    సమస్యలు ఎప్పుడూ మనిషిని వయసుకి మించి ఎదిగేటట్లు చేస్తాయి.
    
    ధృతిని ఇంటిదాకా వచ్చి దింపాడు నవీన్.
    
    "రేపు కలుస్తావా?" అడిగింది ధృతి.
    
    "రేపు అమ్మని చర్చికి తీసుకెళ్ళాలి. సాయంత్రం కలుస్తాను" చెప్పాడు నవీన్.
    
    "ఓ....ఆదివారంకదూ?" అప్పుడే గుర్తుకొచ్చినట్లు అందామె.
    
    ధృతి చెల్లెలు కృతి పుస్తకాలు చేతిలో పట్టుకుని వస్తున్నదల్లా అక్కని చూసి "అమ్మా! అక్క వచ్చింది" అంటూ ఆ వార్తని చెప్పడానికి మళ్ళీ లోపలికి వెళ్ళింది.
    
    ఈ మాటవిని లోపలి నుంచి వచ్చిన ధృతి తండ్రి సీతారామయ్య "అమ్మా! ఇంటర్వ్యూ బాగా చేశావా...? అరే...నవీన్! లోపలికి రాకుండా నిలబడిపోయావేం?" అంటూ ప్రశ్నలు వేశాడు.
    
    "గుడీవినింగ్ అంకుల్" అంటూ నవీన్ వరండా మెట్లెక్కి "మీ అమ్మాయి ఇంటర్వ్యూలో అదరగొట్టేసిందట" అన్నాడు నవ్వుతూ.
    
    ధృతి ఏం చెప్పవద్దన్నట్లు కళ్ళతో సైగ చేసింది.
    
    కృతి గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చి ఇద్దరికీ అందించింది.
    
    "థాంక్యూ" అంటూ అందుకుని ట్యూషన్ కి వెళుతున్నావా?" అడిగాడు నవీన్.
    
    "అవును అక్కా! ట్యూషన్ ఫీజు..." అంది కృతి వెంటనే.
    
    ధృతి చెల్లెలు భుజంమీద చెయ్యివేసి "రేపు ఇచ్చేద్దాంలే ఇంకా ఆ డాక్టర్ గారి పిల్లలకి ట్యూషన్ చెప్పిన తాలూకు డబ్బు నాకు ఇవ్వలేదు. అంది.
        
    నవీన్ అప్పటికే జేబులోంచి డబ్బు తీసి "ఈ రోజు ఫీజు ఇచ్చేసేయ్ మీ అక్క దగ్గర తరువాత నేను వసూలు చేసుకుంటానులే" అంటూ కృతి చేతిలో పెట్టాడు.
    
    "ఎందుకు బాబూ! అలా మాటిమాటికీ మమ్మల్ని రుణపడేట్లు చేస్తున్నావ్?" అన్నాడు సీతారామయ్య.
    
    నవీన్ తేలిగ్గా "అందులో రుణపడే ప్రసక్తేలేదు. ధృతికి ఉద్యోగం రాగానే మొత్తం ముక్కుపిండి వసూలు చేస్తాను" అన్నాడు.
    
    "ధృతీ!" అని ఆమె తల్లి లోపల్నుంచి పిలిచింది.
    
    "నే వెళ్ళొస్తాను ధృతీ!" అంటూ నవీన్ వెళ్ళిపోయాడు.
    
    ధృతి లోపలికి వెళ్ళగానే "అతను కూడా ఇంటర్వ్యూకి వచ్చాడా?" ఆరాగా అడిగింది సుభద్ర.
    
    "లేదమ్మా! నన్ను తీసుకురావడానికి వచ్చాడు" అంది ధృతి కాళ్ళు కడుక్కుంటూ.

 Previous Page Next Page