Previous Page Next Page 

కాంతి రేఖలు పేజి 3

    "ఒరేయ్ సిద్దార్ధా! సాయంత్రం వస్తా!  నీ గౌతమ బుద్దుడి పోజు వదిలెయ్యి. కాస్త హుషారుగా ఉండు" అని వెళ్ళిపోయారు.

    "రాధికా!" సిద్దార్ధ ఆమెను పిలిచాడు.

    "అన్నయ్యా! .....ఇక్కడ కాదు....." అన్నది. ఆమె కళ్ళనిండుగా నీరు నిండింది.

    "అంతా నేను చూస్తాను కద." హామీ ఇచ్చాడు ఇద్దరూ అతని గదివైపు దారి తీస్తారు.

    "సిద్దు వచ్చాడట కదూ........"

    ఆ గొంతు విని ఇద్దరూ ముఖాలు చూచుకున్నారు. చప్పున రాధిక లోపలికి వెళ్ళింది.

    "బావున్నావా అన్నయ్యా?" సిద్దార్ధ బయటికి వచ్చాడు.

    "ఒరిబాగు కాదురా డబుల్ బాగున్నాను. నాల్గురోజులు మీ వదిన చేతి వంట తిను. నువ్వూ అంతే." అన్నాడు మధుమూర్తి.

    అతను పురుషోత్తమరావు మొదటి భార్య సంతానం. విడిగా ప్రక్కన ఇల్లు కట్టుకుని ఉంటున్నాడు అతను 'లా' చదివాడు కాని, న్యాయం అంటే తెలియదు. న్యాయశాస్త్రం అంటే గౌరవంలేదు.

    "బేబి. బబ్లు బావున్నారా!"

    "ఆహా! నువ్వె చూడు బాబాయ్......" ఇద్దరు పిల్లలూ వచ్చారు.

    "బేబీ! అమ్మో! నీ ఆరోగ్యం చూస్తే కుళ్ళుగా ఉందే తల్లీ., ఏం బియ్యం తింటున్నావు?" అన్నాడు - ఆ పిల్లల నెత్తుకుని ముద్దులు కురిపించాడు. ఇద్దరూ ముద్దుగా, బొద్దుగా, అందంగా ఉన్నారు.

    "మీ అమ్మ ఏం చేస్తోంది!"

    "మమ్మీ రీడ్ చేస్తోంది" అన్నది బేబి.

    "వదినగారేం మారలేదన్నమాట." అన్నాడు.

    "మారవలసిన అవసరం ఏముందిరా...." అన్నాడు మధుమూర్తి.

    "అయితే పద నేనేవచ్చి మీ ఆవిడను పలుకరించి వస్తాను"

    "సాయంత్రం వెళ్ళవచ్చులే అన్నయ్యా," అన్నది రాధిక.

    "వాడికి వదినపై అంత దిగులయితే వెళ్ళనీ....." అన్నాడు పురుషోత్తమరావు.

    "అబ్బే దిగులుకాదు నాన్నా" అన్నాడు తడబాటుగా.

    "ఇందాక అర్జున్ అన్నావిడని కాదురా. ఏమిటంత డల్ గా  ఉన్నావు?"

    "బావుందండీ! నిన్న మొన్నటి వరకూ పరీక్షలు వ్రాసిన కుర్రాడు. అలసి పోడేమిటి!" అన్నది యశోద.
 
    సిద్దార్ధకు ఒక్క నిమిషం రాధికతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం దొరకలేదు!

    ప్రక్క వీధిలో ఉంటున్న యశోద చిన్నమ్మ కొడుకు వచ్చాడు.

    "అల్లుడు వస్తున్నాడని చెప్పలేదేమిట్రా యశోదా! ఏమోయ్ అల్లుడూ! మా అమ్మాయినిచ్చినా, మీ నాన్నగారు కోరిన కట్నం ఇవ్వలేము. మేనల్లుడుగా నీతో మాట్లాడే హక్కులేదా!"

    "ఆబ్బే మాట్లాడే హక్కు, పోట్లాడే హక్కు రెండున్నాయి కాని, ఏం కావాలో చెప్పు  మామయ్యా" అన్నది రాధిక.

    "నిన్ను ఏం అనలేదే తల్లీ. సిద్దార్దా దీనికి నాపొడ గిట్టదురా."

    ఫిర్యాదు చేసాడు.

    అతను కాసేపు ప్రజంట్ సినిమాలపై పాలిటిక్స్ పై మాట్లాడాడు.

    "మామయ్యా! నీ పేరు సోమయ్య అని పెట్టారుగాని సోదయ్య అంటే బావుండేది"  అన్నది కోపంగా రాధిక.

    "ఇదీ వరస! పిల్లలకు పెద్దలన్న గౌరవం, భక్తి ఏ కోశాన లేవు."

    "పెద్దలకు పిల్లలన్న అభిమానం ఉండాలి.-" అని ఒక ప్లేటు నిండా ఉప్మా, పెద్దగ్లాసుతో కాఫీ ఇచ్చింది.

    అతని ముఖం వికసించింది.

    "ఏదో మీ అత్తయ్య ఇంటిదగ్గర చేసింది. వద్దంటే నువ్వు బాధపడతావే అమ్మాయ్ -" అంటూ అతను టిఫిన్ తీసుకున్నాడు, కాఫీ తాగి తేన్చేడు.

    "ఇక వస్తానే -" వెళ్ళిపోయాడు.

    "అమ్మయ్య -" మరెవరన్నా వస్తే అన్న బయటికి వెళ్తాడని, అతన్ని లాక్కుని బయటికి వచ్చింది. అన్నతో తన సమస్య చెప్పాలి!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS