Previous Page Next Page 

చదువు పేజి 3

   

      "ఇన్నాళ్ళూ, పాపం, అడిగేవాళ్ళు లేకుండా హాయిగా తిరిగాడు" అన్న దొకావిడ.

    "చదువు సరిగా చదువుకోలేకపోతివా పంతులు చిరతవేస్తాడు జాగ్రత్త" అని మరెవరో అన్నారు.

    వాళ్ళీ ధోరణిలో మాట్లాడటం సీతమ్మకెంత బాధకలిగించిందో సుందరానికి అంత అసహ్యం కలిగించింది. వాళ్ళంతా తనను అపార్ధం చేసుకుంటున్నారనీ, తాను ఎటువంటి వాడయిందీ ముందు ముందు తెలుసుకుంటారనీ సుందరం అనుకున్నాడు.

    సీతమ్మ ఇటువంటి సంభాషణ అయినా సహించగలిగింది, గాని మరో రకం సంభాషణ బొత్తిగా సహించలేక పోయింది.

    "అయ్యో, అదేమిటర్రా? ఇంత పసివెధవను ఇప్పుడే బళ్ళోవేస్తారుటర్రా? ఇంకా రెండేళ్ళు పోనీరాదూ ?"

    వాళ్ళంతా అతిధులు కాబట్టే సరిపోయింది. గాని, సీతమ్మ కు వాళ్ళను నాలుగూ పెట్ట బుద్దయింది. అప్పటికీ ఆవిడ సమయోచితంగా, "వాడికి చదువుకోటమంటే ఇష్టమే," అని "ఇప్పుడు బడికిపోతే ఇంకో రెండేళ్ళకు  అసలు వెళ్ళడేమో," అనీ సమాధానాలు చెబుతూవచ్చింది. నిజానికి, సుందరం చదువు కుంటాడా, లేదా, వాడికి చదువు వస్తుందా, రాదా అన్న విషయాలను గురించి వచ్చిన చుట్టాలలో ఎవరికీ విచారంలేదు. ఎవళ్ళ సంస్కారాన్ని బట్టి వారు అనవలసినమాట  అని అంతటితో ఊరుకున్నారు.

                                            *    *    *
   
    సుందరానికి శాస్త్రోక్తంగా పుట్టు వెంట్రుకలు తీసి అక్షరాభ్యాసం చేయించారు. రాఘవయ్య పంతులు వచ్చి సుందరం వేలు పట్టుకుని బియ్యంలో 'ఓ న మః శి వ యః' అని రాయించాడు. ఓ న మహా, శీ వా యహా' అని నోటితో అనిపించాడు.

    వచ్చిన బంధువుల్లో ఒక విమర్శ కాగ్రేసరు డున్నాడు___ ప్రతి బంధువర్గంలోనూ అటువంటి వాడంటూ ఉంటాడు. నలుగురూచేరిన చోటనల్లా తానెంత తెలివిగలవాడో, ఎవరికీ తెలీని విషయాలు తనకెంత బాగా తెలుసునో, ప్రదర్శించటమే అయన పని.

    "మన చదువులిందుకే ఇట్లా తగలబడుతున్నాయ్," అన్నా డాయన ఒక వంక అక్షరాభ్యాసం జరుగుతుండగా.

    పక్కనున్నవాళ్ళు ప్రశ్నార్ధకంగా చూశారు___

    "అడుగులోనే హంసపాదూ. ఓ నా మహా ఏమిటి? శీ వా యహా ఏమిటి? అసలు మాట ఓం నమశ్శివాయః."

    తాను కనిపెట్టిన ఈ పరమసత్యానికి అందరూ ఆశ్చర్య చకితులైనారో లేదో తెలుసుకోవటానికని ఆయనచుట్టా కలయజూశాడు.

    "అట్లా అవటానికి వీల్లేదులే." అన్నాడింకొక పెద్దమనిషి. "ఓం నమశ్శివాయ అయితే ఎవడిక్కావాలి? ఓం నమోనారాయణాయ అయితే ఎవడిక్కావాలి? ఓ నా మహా శివాయహా అనకపోతే అది అక్షరాభ్యాసమే కాదు."

    దీనికి చాలామంది ఒప్పుకున్నారు.
 
    శ్రీ మన్నారాయణ రాఘవయ్య పంతులుకు ధోవతులచాపూ, తాంబూలంలో దక్షిణా ఇచ్చాడు. రాఘవయ్య పంతుల బడిపిల్లలందరికీ పప్పు బెల్లాలు ముట్టినై.

    చంకన పలకా చేతిలో బలపమూ పట్టుకుని సుందరం ఆడుకోవటానికి వెళ్ళేవాడల్లె మిగిలిన పిల్లల వెంట బడికి బయలుదేరాడు.

    వాడెందుకు వెక్కి వెక్కి ఏడవటంలేదో చాలామందికి అర్ధంకాలేదు.  కొంతమంది వాణ్ణి మెచ్చుకున్నారు. మరికొందరన్నారు, "పిల్ల కాక్కేం తెలుసు ఉండేలుదెబ్బా?" అన్నారు. ఈ రోజు కోసం సుందరం ఎంత కాలంనుంచి ఎదురుచూస్తూన్నదీ ఎవరికీ తెలియదు.
   
                                          *    *    *    *   

    పిల్లలంతా పప్పుబెల్లాలు తిని ఆట విడుపు ధోరణిలో ఉన్నారు. రాఘవయ్య పంతులు ఒక్క సారిగా ఉరిమినట్టు, "ఎవరి పాఠాలు వాళ్ళు చదువుకోండి," అనేసరికి పిల్లలు సద్దు మణిగారు.

    పంతులు సుందరం కొత్త పలకమీద "అ ఆ" అనే రెండు అక్షరాలు దిద్దబెట్టి అట్లాగే దిద్దుతూ  ఉండమన్నాడు.

    మిగిలిన పిల్లలను గదమాయించినట్టు పంతులు తనను గదమాయించక పోవటం చూసి పంతులుకు తనమీద ఇష్టమనుకున్నాడు సుందరం, పంతులు రాసిన అక్షరాలు వాడి కళ్ళకు చాలా అందంగా తోచినై. చదువు మీది అభిమానం కొద్దీ వాడు తనకు ఎంత స్వల్ప విషయాలు బాగా కనిపించినా  వాటితో సంతృప్తి చెందటానికి సిద్ధంగా ఉన్నాడు.

    బలపం పట్టుకోవటం సుందరానికి సరిగా చాతకాలేదు. అది పలకమీద దాని ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది గాని అక్షరం మీదుగా నడవదు. బలపం పట్టుకోవటంతోనూ, దాన్ని అక్షరం మీదిగా నడిపించటంతోనూ, సుందరం  వేళ్ళు చెప్ప శక్యం కాకుండా నొప్పి పెట్టసాగినై. కాని సుందరం ఈ బాధను పాటించకుండా పళ్ళ బిగువున దిద్దసాగాడు.

    "ఒ రే గుండూ!"

    పంతులుతననే పిలిచాడని సుందరం చప్పున గ్రహించలేదు. గ్రహించిన తరువాత వాడికెంతో అభిమానం కలిగింది. తలఎత్తి పంతులుకేసి పిచ్చిచూపు చూశాడు__ పంతులు  తనను నలుగురిలోనూ ఎందుకవమానపరిచిందీ అర్దం కాక.

    "నీకు నోరు లేదుట్రా అక్షరం దిద్దేటప్పుడు పైకి అనలేవూ."

    పంతులేమడుగుతున్నదీ ఇంకా సుందరానికి అర్ధంకాలేదు. పంతులు చెయ్యి సుందరం ఎడమ చెవిమీదికిపోయింది.  లేత చెవి చుర్రుమన్నది.

    "ఇదేమిటి?" అన్నాడు పంతులు.

    "అ " అన్నాడు  సుందరం దుఃఖం పొంగివస్తూ.

    "ఇది."

    "ఆ."

    "ఇంకేం, పైకి అనూ."

    చెవికి విమోచనం కలిగిందిగాని బాధపోలేదు. దిద్దే అక్షరాన్ని పైకి ఉచ్చరిస్తూ సుందరం దిద్దసాగాడు. కాని ఇది చాలా నిరర్ధకమైన పనిగా కనిపించింది. ఇది చదువులో ఒక భాగంగా వాడికి తోచలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS