Previous Page Next Page 

చీకటి తొలగిన రాత్రి పేజి 3


    "మరి ఇంక అలాంటప్పుడు వాడిని తిట్టడం మానేయాలి..." రామావతారం శాంతి వంటని మెచ్చుకుంటూ సుష్ఠుగా తిన్నాడు. మీనాక్షి అన్నం ఎక్కువ తినకపోయినా నాలుగు రకాలు కలిపింది. ఎటొచ్చి పాపం ఏం తినందీ వాళ్ళ పిల్లలే! ఈ పప్పులు, పులుసులు తినడం. ఈ కారాలు అలవాటులేనట్టుంది. అతి కష్టంమీద ఏదో తిని ఇంక పెరుగు తిన్నారు. భోజనం చేస్తున్నంతసేపూ ఆగకుండా మాట్లాడింది మీనాక్షి.
    ఆ కొద్దిసేపట్లోనే, ఆ రెండు గంటల కాలంలోనే నేను కనిపెట్టింది ఏమిటంటే రామావతారం అంత మాటకారి కాదని. అవసరానికి మాత్రం మాట్లాడతాడని అర్థం అయింది. అది గర్వంకాదు అతని స్వభావం చూస్తుంటే మీనాక్షి అతన్ని డామినేట్ చేసినట్టే కనిపిస్తుంది. అతని మాట చోరపడనీయదు. చెపుతూంటే వినిపించుకోదు. తనగోల తనదేకాని. అసలే మెత్తనివాడు. మీనాక్షీ దాటికి ఆగలేక ఇంటి సంగతేకాక వీధి సంగతీ మీనాక్షి చేతుల్లో పెట్టేసి ఓ నమస్కారం పెట్టేసినట్లు మాటల వల్ల తెలుస్తూంది. మీనాక్షి స్వభావం చిన్నప్పటినుంచి తెల్సిన నాకు రామావతారం అలా మారిపోకుండా వుండడంలో ఆశ్చర్యంగా వుందిగాని మారిపోవడంలో ఆశ్చర్యం ఏం కనిపించలేదు.
    మీనాక్షి కోపం, పంతం, దురభిమానం అన్నీ ఓ పాలు హెచ్చేనని అనుభవపూర్వకంగా తెల్సు నాకు. మెట్రిక్ దగ్గర నుంచి బి.యస్సీ. వరకు వాళ్ళింట్లో చదువుకున్న నాకు మీనాక్షి సంగతి తెలియకపోవడం ఏమిటి? ఆ పంతం, కోపం అది గారాల ఏకైక కుమార్తె అవడంనించే వచ్చాయి. స్వతహాగా మీనాక్షి కొంటెదిగాని చెడ్డదిగాదు! అందరినీ ఏడిపించడం ఓ హాబీ! ఎవరిని కేర్ చెయ్యకపోవడమేకాక అందరూ తనని కేర్ చెయ్యాలని తన అడుగులకి మడుగులొత్తాలన్న స్వభావం అవన్నీ ఇంట్లో చేసిన ముద్దువల్లే వచ్చేయని నాకు తెల్సు.
    ఆ రోజుల్లో మీనాక్షికి నేనంటే ఎలాంటి అభిప్రాయం వుండేదో ఇప్పుడడిగితే నే చెప్పలేను. ఆ రోజుల్లో దీన్ని గురించి ఆలోచించాల్సిన అవసరమూ నాకు లేకపోయింది. ఎంచేత అంటే మీనాక్షి ఎంత "మరదలయినా" వావి వరసలన్నీ కుదిరినా మీనాక్షి ప్రక్కన నిలబడే అర్హతలు నాకు, మా కుటుంబానికి ఆనాడు లేకపోవడం చేత కేవలం వాళ్ళింట్లో అవసరార్థానికి వుండి బుద్ధిగా చదువుకోవడం వరకే తప్ప ఇతరత్రా ఆలోచనలు ఆనాడు నాలో యెన్నడూ రాలేదు. నాతో చనువుగా మాట్లాడేది. అవసరమయినప్పుడు ఆధార్టీ చేసి పనులు చేయించుకునేది. ఏనాడన్నా తను చెప్పింది కాదన్నా, చెయ్యనన్నా దెబ్బలాడి మాటలు మానేసేది.
    ఒక్కోనాడు మూడ్ నావైపు తిరిగితే ఏ సినిమాకో లాక్కెళ్ళేది. లేకపోతే వారమేసి రోజులు నా చాయలకే వచ్చేదికాదు. మీనాక్షి స్వభావం అంతే అనుకునేవాడినితప్ప కించపడేవాడిని కాను నేను. నేనంటే అభిమానం వుండేదని నాకు తెల్సు కాని, అది నిదర్శనంగా ఏ సాక్ష్యాలు చూపాలో నాకు తెలియచెప్పే మాటలు తెలీవు!....
    "ఏమిటి బావా! ఆ ఆలోచన? ..... "డ్రాయింగు రూములో వక్కపొడి వేసుకుని కూర్చున్నాక మీనాక్షి వైపే చూస్తూ ఆలోచిస్తున్న నన్ను పిలిచింది.
    "ఆ... ఆ.. నీ గురించే" నిజమే చెప్పేశాను నవ్వుతూ.
    "నా గురించా?"
    "ఊ.. చిన్నప్పటి మీనాక్షికి ఇప్పుడు మీనాక్షికి తేడా వుందా అని చూస్తున్నాను."
    "ఊ.. ఊ.. చెప్పు. మారానంటావా" కుతూహలంగా అడిగింది.
    "శారీరకంగా పదేళ్ళలో వచ్చే మార్పులు తప్ప.. నీలో పెద్ద మార్పే కనపడడం లేదు.. ఆ మాటలు అవీ అలాగే వున్నాయి. రామావతారంగారూ చిన్నప్పుడు మీనాక్షికి ఎంత పంతం వుండేదో తెల్సా, తన మాట నెగ్గేవరకు నిద్రపోయేదికాదు..."
    "యిప్పుడు మాత్రం అలా లేదంటారేమిటీ" చిన్నగా నవ్వి అన్నాడు రామావతారం.
    "అయితే మీనాక్షి మారలేదంటారన్నమాట."
    "ఆవిడ మారుతుందా, తనతో చావలేక ఓ నమస్కారం పెట్టేసి నేనే మారి వూరుకున్నాను."
    "ఆ.. ఆ... మీ కబుర్లు మా బావ నమ్మడులెండి!..."
    "నమ్మకపోవడం ఏమిటి నీ సంగతి తెలియకపోవడానికి నేనేం క్రొత్తవాడినా.. ఏమో నేను మా అన్నగారి పక్షమే సుమా!" మీనాక్షిని ఏడిపించటానికి అన్నాడు.
    "ఏమిటమ్మా అక్కా! అక్కవా, చెల్లెలివా. అన్నదమ్ములిద్దరూ ఏకమైపోతే నన్ను సపోర్టు అన్నా చేయవేం?" శాంతితో దబాయింపుగా అంది మీనాక్షి.
    శాంతి తన మామూలు చిరునవ్వు నవ్వి వూరుకుంది. నాకు కాస్త వళ్ళు మండింది. మాట్లాడితే నోట ముత్యాలు రాలుతాయన్నట్లు ఒక మాటయినా మాట్లాడదు శాంతి. ఇంత సరదాగా అందరం కలుసుకున్నాం. నలుగురూ సరదాగా కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడయినా నాలుగు మాటలు మాట్లాడకూడదూ! ఓ చిరునవ్వు ఒలకపోయకపోతే.. యెంతో గేమూడ్ లో వున్న నాకు శాంతి మామూలు మౌనం చూస్తే యెప్పటిలా తన స్వభావం అని సరిపెట్టుకోలేకపోయాను. అందులో నవ్వుతో గలగల మాట్లాడుతూ హాస్యాలతో, నవ్వులతో ఇల్లంతా సందడిగా తిరిగే మీనాక్షిని చూస్తుంటే శాంతి ఇలా యెందుకుండకూడదు! ఏదో పోగొట్టుకున్నట్లు ఏదో కొంప మునిగినట్లు మొహం పెట్టుకుని మాట్లాడకుండా ఓ మూల కూర్చోపోతే తనూ నవ్వుతూ, తుళ్ళుతూ రోజూ ఎందుకుండకూడదనిపించింది! ఇంట్లో శాంతి మాట చాలా అరుదుగా వినిపిస్తుంది! అడిగినదానికి జవాబు చెప్పడం ఏదన్నా కావలిస్తే ముక్తసరిగా అవసరం వున్నంతసేపూ మాట్లాడడం మినహా శాంతి ఎక్కువ మాట్లాడడం నేనూ పెళ్ళయిన తొమ్మిదేళ్ళలో చూడలేదు. ఇంట్లో వంటపని చూసుకోవడం, పిల్లలకి చదువు చెప్పుకోడం, ఏదో ఒక పని పెట్టుకోడం అంతగా ఖాళీ దొరికితే ఓ పుస్తకం పట్టుకు కూర్చోడం తప్ప ఓ స్నేహితులు, కబుర్లు, షికార్లు, సినిమాలు, క్లబ్బులు, అవి అంతగా అక్కరలేదు శాంతికి. ఎప్పుడయినా వచ్చిందంటే నా పోరు పడలేక, అరడజనుసార్లు అదిగాక విధిలేక బయలుదేరుతుంది శాంతి శాంతికి పూర్తి వ్యతిరేకం అయిన నేను శాంతి స్వభావానికి సరిపెట్టుకుపోవడం అలవాటు చేసుకుంటున్నాను.
    ఎంత స్వభావం అని ఇన్నాళ్ళు సరిపెట్టుకున్నా యీరోజు ఎంచేతో మీనాక్షిని చూస్తూంటే శాంతీ అలా వుంటే మా ఇల్లు ఇంకెంత అందంగా వుండేదో, ఇంకెంత స్వర్గంగా మారేదో అన్న ఊహ రాక తప్పలేదు. హోదా, పెద్ద ఉద్యోగం, పరువు, ప్రతిష్ఠ, డబ్బు, చక్కని చదువుకున్న భార్య, ముత్యాల్లాంటి పిల్లలు.. అన్నీవున్నా శాంతి స్వభావంచేత నాలో కొన్ని ఉత్సాహాలు, సరదాలు చంపుకోవలసి వస్తూంది... అదే మీనాక్షిలాంటి భార్య దొరికితే..?! ఆ రోజు పేకాటతో కబుర్లతో ఎంత సరదాగా కాలం గడిపేస్తున్నా... ప్రతి కదలికలో మీనాక్షిని, శాంతిని పోల్చుకుంటున్న నాకు అసంతృప్తే కలిగింది శాంతి పట్ల. శాంతి పట్ల అసంతృప్తి మీనాక్షి చలాకీతనం, చిలిపితనం భూతద్దంలో చూపినట్టు మరింతగా మనసుని ఆకట్టుకుంది!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS