Previous Page Next Page 

ది సెల్ పేజి 3


                                       అత్త వారింట్లో
    
    "ఏమే శారూ, ఎక్కడ చచ్చావే" ఉదయం నిద్ర లేవటంతోనే వాసు కేకలు.
    ఆ కేకలు శారదకి వినబడ్డాయో లేదో గాని ఇంట్లో వాళ్ళందరికి కర్ణకఠోరంగా ఉన్నాయి.
    శారద ఆడపడుచుకి జడ వేస్తోంది. ఆరోజు శనివారం. ఇంట్లో అంతా హడావిడి. ఆడపడుచు లక్ష్మి ఎనిమిది గంటల కల్లా కాలేజీకి వెళ్ళాలి. ఆఫీసు దూరం గనుక మామగారికి, మరిదికి, తొమ్మిది గంటలకే వండి వడ్డించాలి. ఇక అత్తగారి పూజకి అన్ని ఏర్పాట్లు చేయాలి.
    "శారదా. అక్కడ మీ ఆయన రంకె వేస్తుంటే నువ్విక్కడ లక్ష్మికి జడ వేస్తూ కూర్చున్నావా?" వాసు తల్లి కోడలితో" అంది.
    "వదినా నేనెలాగో  జడ వేసుకుంటా గాని ముందు అన్నయ్య పని చూడు. లేవటంతోనే దీవెనలు మొదలు పెట్టాడు." లక్ష్మి అనటంతో భర్త గదిలోకి పరుగుతీసింది శారద.
    "శారూ. స్నానానికి నీళ్ళు తోడు - డ్రెస్ ఇస్త్రీ చెయ్యి"
    సరే అని వెళ్ళిపోయింది శారద.
    మళ్ళీ కేకలు -
    ఓ శారూ! ఎక్కడ కూలబడ్డావే' మళ్ళీ భర్తపిలుపు.
    బాత్ రూమ్ దగ్గరికి వెళ్ళింది, చేస్తున్న పని మధ్యలోనే ఆపి శారద.
    ".....మధ్యాహ్నం చెప్పటం మర్చిపోతానేమో సాయంత్రం ఆరు గంటలకల్లా తయారయి తగలడు"
    "ఈ మాత్రానికే ఇంత హడావిడా? వెళ్ళేప్పుడు చెప్పొచ్చుగా?" అనుకుంటూ కంగారుగా లోపలికి పరుగెత్తింది శారద.
    షర్టు ఇస్త్రీ చేస్తున్న శారద భర్త కేకకి అయిరన్ బాక్స్ దుప్పటి మీద పెట్టి వెళ్ళిందేమో ఆమె తిరిగి వచ్చేసరికి సన్నటి పొగ బయలుదేరింది. దుప్పటి కొంత నల్లబడి పోయింది. వెంటనే ప్లగ్ తీసి బాక్సు పక్కన పెట్టింది.
    స్నానం చేసి వస్తున్న వాసు "పని మీద ధ్యాస అసలుండటం లేదు.....అంత పరాకు పనికిరాదు" అనేసి బట్టలు వేసుకోవటానికి వెళ్ళాడు.
    దాంతో శారదకి కళ్ళనీళ్ళు తిరిగాయి. అత్తగారి వోదార్పు మాటలేమి ఆమెకి వినిపించలేదు.
    భర్త వచ్చి డ్రస్ తీసుకున్నది ఆమె గమనించలేదు. స్కూటర్ స్టార్ట్ అయిన చప్పుడు ఆమె అంతరంగాన్ని కల్లోలం చేసింది. ఎదుట కనిపిస్తున్న పెళ్ళి ఫోటో ఉడికిస్తున్నట్లుగా ఉంది. అది ఆమె వ్యక్తిత్వాన్నే సవాలుచేస్తున్నట్లు కనిపించింది.
    
                               * * *
    
    రైల్వే స్టేషన్ లో అంతా హడావిడిగా ఉండి ట్రయిన్ కదలటానికి ఇంకా పదిహేను నిమిషాలు ఉంది. పదిహేను యుగాలుగా అనిపించింది శారదకి.
    రైలు కదిలింది.
    "హే భగవాన్ ఎప్పుడు పుట్టిల్లు చేరతాను" శారద హృదయం ఆక్రోశిస్తోంది.
    "తను తప్పు చేయటం లేదు కదా! భర్త ఇంటలేని సమయంలో వంటరిగా వచ్చేస్తే లోకులు తనకేం చేయగలిగారు?" ఆమె ఆలోచనలో పడింది.
    శారదకి పెళ్ళయ్యి అప్పటికి ఆరునెలలు అవుతుంది. ఇంటి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగిందామె. పెళ్ళి అయిన మూడోనెలలో అత్తారింటికి కాపరానికి వచ్చింది. అప్పటి నుంచి వాసు చిర్రుబుర్రు లాడుతున్నాడు.
    ".....తన భర్త చదువుకున్నవాడు, సంస్కారవంతుడు విద్యాబుద్ధులు చెప్పే లెక్చరర్, మరి తనపట్ల అంత దురుసుగా ప్రవర్తిస్తాడేం?
    తనూ ఒక ప్రాణేనని, తనకీ వ్యక్తిత్వం ఉంటుందని అతను భావించడేం? ఓర్పుకి కూడా ఓ పరిమితి  అంటూ వుంటుందిగా? పూర్తిగా బానిసలానే ఉంది తన బ్రతుకు. సంసారజీవితం గడపకుండా తను ఉండలేదా? బానిస బ్రతుకు ఈడుస్తూ శారీరక సుఖంకోసం తపన తన కెందుకు? తన పుట్టింటికిపోతే తన వాళ్ళు ఆదరించకపోతారా? తన పరిస్థితి తెలిస్తే వాళ్ళు మాత్రం సహిస్తారా? ఇన్నాలలు తను చూపిన వోపికకీ, వోరిమికి వాళ్ళ హృదయం మాత్రం ద్రవించదా? తప్పకుండా తనని ఆదరిస్తారు" ఆమె ఆలోచనలు రైలు వేగంతో పోటీపడుతున్నాయి.
    
                               * * *
    
    రైలు వాల్తేరు స్టేషన్ చేరేసరికి రాత్రి ఎనిమిది గంటలు దాటింది.
    ఊరు పాతదే అయినా రాత్రిపూట వంటరిగా స్టేషన్ దాటటానికి భయం వేసింది. ఎలాగైతేనేం పుట్టింటికీ రిక్షాలో చేరింది శారద.
    నిండుపున్నమి. వెన్నెలలో డాబా పైభాగం అందంగా వుంది. వంటరిగా ప్రశాంతంగా గడపాలని డాబా పైకి చేరింది శారద.
    ఊహించని దృశ్యం చూసి నివ్వెరపోయింది. శేషపాన్పుపై విష్ణుమూర్తిలా తన రాక కోసమే నిరీక్షిస్తున్నాడు వాసు. చెవ్వున వెనుదిరిగి వెళ్ళబోయింది.
    'శారూ! ప్లీజ్ ఒక్కమాట' అభ్యర్ధించాడు వాసు. ఆమె మేను పులకరించింది. అయినా అడుగులు ముందుకు పడ్డాయామెకు.
    వాసు ఒక్క ఉదుటున లేచి, 'క్షమించు శారూ! నీ మనసు కష్టపెట్టాను' అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు.
    అందుకామె నిస్చేష్టురాలయింది. ఛ ఛ! భర్త నెంత బాధ పెట్టింది తను. చివరికి ఏ భార్య భర్త నుంచి కోరని 'క్షమార్పణ కూడా చెప్పించుకుంది' ఆమె కోపం చల్లారిపోయింది.
    'మీరెలా వచ్చారు?' ఆశ్చర్యంగా అడిగిందామె.
    ఆఫీసు నుంచి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాను. టీపాయ్ మీద నీ వుత్తరం చూసి చదివాను. వెంటనే స్టేషనుకు వచ్చి నీకు తెలియకుండా రైలెక్కి నీ వెనుకే ఇక్కడికి వచ్చాను.
    'మహా గొప్ప పని చేశారులెండి' అంది శారద.
    శారదను దగ్గిరికి తీసుకున్నాడు వాసు___"శారూ! మై స్వీట్ హార్ట్!' వినిపించుకోనట్టు తల పక్కకి తిప్పుకుందామె.
    '..... నీ లెటర్ చదివాక నా ప్రవర్తన వల్ల నువ్వెంత మనోవేదన పడ్డావో నా కర్ధమయింది. నా ఆంతర్యం నీకు ముందుగా తెలుపకపోవడంతో ఇన్ని తిప్పలొచ్చాయి.
    ఇంట్లో నిన్ను అగౌరవంగా చూసిన మాట నిజమే. కాని నీ మీద ప్రేమతోనే అలా చేశాను. ఉమ్మడి కుటుంబాలలో అత్తలు కోడళ్ళని రాచిరంపాన పెట్టడం, ఆడబడుచులు దెప్పుళ్ళు దెప్పటం, మరదళ్ళు చులకనగా చూడటం-ఇవన్నీ నీకు తెలిసినవే. ఆలాంటప్పుడు భర్త భార్యని ప్రేమగా చూస్తూన్నా, ఆప్యాయంగా పలకరిస్తున్నా, ఈర్ష్య పడుతూ భర్తని భార్య వలలో వేసుకొని కొంగున కట్టుకుందన్న బిరుదులు తగిలిస్తారు, వేధిస్తారు. ఆ పరిస్థితి నీకు కలగకూడదని నిన్ను చులకనగా చూస్తున్నట్టు నటించాను దాంతో భర్త ఆదరణ లేదని నిన్ను మాఇంట్లో సానుభూతితో చూస్తారనీ ఆదరిస్తారనీ' అలా ప్రవర్తించాను.
    'కాని ఇల్లాలికి కావలసింది భర్త ఆదరణే ననీ, నీ మనసు ఇంతగా నొప్పిస్తున్నాననీ ఊహించలేకపోయేను"
    శారద భర్త ప్రేమకి పులకరించినా అతని అమాయకత్వానికి నవ్వాపుకోలేక పోయింది.
    'అందరి అత్తవారిల్లు లాంటిది కాదండి నాది' అంటూ భర్త కౌగిలిలో ఇమిడిపోయింది శారద.
    
                                                           * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS