Previous Page Next Page 

పన్నీటి కెరటాలు పేజి 3


    సింహాచలం అలా పరుగెత్తటంవల్ల ఇద్దరు ముగ్గురు బిచ్చగాళ్ళు నిద్రలేచి కూర్చున్నారు.
    పరుగున కొండదిగిన సింహాచలం అక్కడేఉన్న కొట్ల (షాపులు) మధ్యలో కెళ్ళి "దొంగలు దొంగలు" అనరిచాడు.
    వక్కసారిగా -
    అందరూలేచి పరుగున ఇవతలికి వచ్చారు.
    సింహాచలాన్ని చుట్టుముట్టారు. "ఎక్కడ ఎక్కడ! ఏమి టేమి టంటూ" అందరూ కలగాపులగంగా అడిగారు.
    సింహాచలం చేయిచాచి గుడివేపు  చూపించాడు.
    
                           2
    
    "ఏం జరిగింది అన్నా?" గుంపులో ఎవరో అడిగారు.
    "గుడిలో దొంగలు దూరారు" సింహాచలం ఆయాసపడుతూ చెప్పాడు.
    "ఓర్నాయినో దొంగలే!"
    "ఓరమ్మో దొంగలే, ఎంతమంది?"
    "అసలేం జరిగింది"
    "దొంగల్ని నీవు చూశావా?"
    జరిగిందేమిటో తెలియదు. అందరికీ కంగారుగా ఉంది. ఎవరికీ తోచిన ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు.
    "నేను చూడలా, గుడిలోపలనుంచి టక్ టక్ మని ఎవరో తవ్వుతున్నట్టు చప్పుడు అయితేను ఇలా పరుగెత్తుకువచ్చాను. ముందు కలేమో అనుకున్నాను, ఆ తర్వాత నాది అనుమానంలే అనుకున్నాను. ఆ తర్వాత దొంగలు గుడిని తవ్వుతున్నారని అనుమానం వచ్చింది...."
    సింహాచలం చెపుతుంటే మధ్యలో ఎవరో అడ్డుతగిలి "శివుడు గుమ్మందగ్గర కాపలా ఉంటాడుకదా?" అన్నారు.
    "అక్కడ ఎవరూ లేరు!" సింహాచలం చెప్పాడు,
    "నువ్వు సరీగా చూశావా?"
    "శివుడెవరో నాకు తెలియదుగాని అక్కడమాత్రం ఎవరూలేరు. నేను అటూయిటూ చూసి మరీవచ్చాను."
    సింహాచలం చుట్టూ మూగి వాళ్ళు ఏదేదో అడగటం, వాళ్ళకి సింహాచలం సమాధానం చెప్పటం జరుగుతుండగానే వాళ్ళ గోలకి లేచి వచ్చిన పువ్వుల మాలక్షమ్మ విషయం తెలుసుకుని నెమ్మదిగా అక్కడినుంచి తప్పుకుని తన ఇంట్లోకి వెళ్ళిపోయింది.
    శివుడిని తట్టిలేపుతూ "లేలే. అవతల కొంప మునిగింది" అంది మాలక్ష్మమ్మ!
    "ఎవరి కొంప?" సగం నిద్రమత్తులో అడిగాడు శివుడు.
    "ఎవరి కొంపో మునిగితే నాకెందుకు! నీ కొంపే లేలే" అంటూ శివుడ్ని ఓ గుంజుగుంజి లేపి కూర్చోపెట్టింది.
    "ఓర్నాయనో నా కొంపే, మళ్ళీ మా ఆవిడ కేమొచ్చింది" శివుడు కంగారుగాలేస్తూ అడిగాడు.
    "గుడిలో దొంగలు దూరారుట అంతాకలసి వాడెవడోవచ్చి చెపితే అడుగుతున్నారు. నువ్వక్కడ లేవన్న సంగతికూడా తెలిసిపోయింది."
    "నిజంగా నా కొంప ఇప్పుడు మునిగింది నాయనోయ్" అన్నాడు శివుడు లేచి చొక్కా తగిలించుకుంటూ.
    "నే ఉండంగా నీ కొంపేమీ మునగదు. ఇటుపక్కనుంచి వెళ్ళి కొండ ఎక్కు. జనం కొండమీదకి వస్తుండగా నీవు వాళ్ళకు కనపడేలా సగంమెట్ల మీదనుంచి కిందకి పరుగెత్తుకొస్తు 'దొంగలు దొంగలు' అని అరువు సరిపోతుంది. ఇంకా అనలస్యం చేశావంటే జనం మెట్లెక్కుతారు ముందు నీ పనిపడతారు. పద పద, తెలివిగా మెలుగు" అంటూ వెనక తోవన బైటికినెట్టింది శివుడిని. ఆ తర్వాత ఏమీ యెరగనట్టు బయటికెళ్ళి వాళ్ళమధ్య చేరింది. పువ్వుల మాలక్షమ్మ.
    "ఏం జరిగిందంటే ఎవరూ సరీగా చెప్పరేంటి, గుడిలో దొంగలు పడి ఏమేమి ఎత్తుకెళ్ళారుట?" కొద్దిసేపు ఆగి వాళ్ళ మాటలు అర్ధంకానట్లు మలక్షమ్మ అడిగింది.
    "గుడిలోపల ఎవరో ఏదో తవ్వుతున్న శబ్దం అయిందిట యింకా ఎవరూ వెళ్ళి చూడలేదు." ఎవరో చెప్పారు.
    "గుడిలో దొంగలు దూరి తవ్వుకుంటే అర్ధమేమిటి అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకెళ్ళాలనేకదా! ఇంతమందిమి వున్నాము అందరం కలసి వెళితే ఏం చేయగలరు. పదండి పదండి తలో కర్రా తీసుకుని పదండి."
    పువ్వుల మాలక్ష్మమ్మ పెద్ద గొంతుకతో అరిచేసరికి అక్కడున్న వాళ్ళలో చైతన్యం కలిగింది. చేతి కందింది తలొకటీ తీసుకుని పరుగున గుడిమెట్ల వేపు అరుస్తూ కదిలారు.
    అంతాకలిసి ఇరవై ముఫ్ఫైమంది కూడా లేరు, వాళ్ళు చాలు దొంగలని బెదరకొట్టటానికి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS