Previous Page Next Page 

మల్లమ్మదేవి ఉసురు పేజి 3


    ఇదంతా నా పూర్వరంగం.
    ప్రస్తుతం మిస్ మార్లిన్ ఆ భవనంలోకి వస్తున్న సమయానికి నేను గదిలో కూర్చునే వున్నాను. ద్వంద్వావధానం చేస్తున్నాను.
    చరిత్ర మదిలో మెదులుతోంది. యెల్లుండి బొబ్బిలిలో పొంగళ్ళు పెట్టే పండుగ. అది ప్రధానంగా రాజకుటుంబానికి సంబంధించిన పండుగ. ప్రజలందరూ పాల్గొంటారు. పొంగళ్ళు చేస్తారు. కోళ్ళు బలి యిస్తారు. వీరంగం వేస్తారు. మృతవీరులకు 1757 జవనరి 24న చనిపోయిన బొబ్బిలి యుద్దవీరులకు నైవేద్యం చెల్లిస్తారు. అదే బోనాల పండుగ. ఆ పండుగ యేటా చేస్తారు.
    కోళ్ళను బలి యివ్వటాన్ని నేను వ్యతిరేకిస్తాను చనిపోయినవారికి అందునా రెండువందల పైగా సంవత్సరాలనాడు చనిపోయిన వారికి పొంగళ్ళు యివ్వటాన్ని గురించి నవ్వుకుంటూ ఆలోచిస్తారు. కాని వుద్యోగధర్మంగా నేను ఆ వుత్సవాలలో పాల్గొనక తప్పదు. ఆ పండుగ అనగానే నా మనసు రెండువందల పాతిక సంవత్సరాల గతంలోకి పోతుంది.
    ఇప్పుడు ఆ ఆలోచనలోనే వున్నాను.
    విశాఖజిల్లా కై ఫీయతులోనూ, 'ఆంధ్ర సంస్థానముల సాహిత్య పోషణ'లోనూ, బొబ్బిలియుద్ధం జరిగిననాటికి ఫ్రెంచి అధికారిగా వున్న డూప్లే దగ్గర వుద్యోగం చేసిన రంగరాయపిళ్ళే డైరీలలోనూ, 'ది మద్రాస్ డిస్పాచెస్'లోనూ, (1754-55) 'స్కాటిష్ ప్రెస్' (మద్రాసు) వారిదగ్గర ప్రచురణ పొందిన 'కూక్ సన్ అండ్ కో' వారి శ్రీకృష్ణవిజయంలోనూ చదివిన సంగతులన్నీ మనసులో మెదులుతాయి. కేవలం అయిదు వందల సైన్యం యెనభై వేల బుస్సీదొర సైన్యాన్ని ప్రాణాలను పూచికపుల్లలుగా, స్వాతంత్ర్యం ద్రవిడజాతి ప్రతిష్టగా భావించి యెదిరించటం జ్ఞాపకం వచ్చి వళ్ళంతా జలదరిస్తుంది. వైశ్యకాంతల వీరకృత్యాలు మనసును ఆర్ద్రం చేసివేసి కలిచేస్తాయి. పద్మనాయిక ప్రభువుల (వెలమల) ద్రవిడరక్తం బుందేల్ఖండ్ నించి వలస వచ్చిన బొందిలీలు మాధవవర్మ యిత్యాదిగా వచ్చిన రాజ పరంపర ఆనాటి విజయరామరాజు వరకు పరిపాలించిన కళింగరాజ్యాన్ని యెదిరించటం జ్ఞాపకానికి వస్తుంది. కన్నులు చెమరించుతాయి.
    ఇది ఆర్య అనార్య యుద్ధం. రాజ్యకాంక్షతో గంగవెర్రులు యెత్తి వున్న ఆర్యులకూ, స్వాతంత్ర్య ఆపేక్షతో వీరకిశోరాలై వర్ధిల్లిన అనార్యులకూ జరిగిన యుద్ధం.
    ఔత్తరాసులకూ, దక్షిణాత్యులకూ స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం జరిగిన అద్భుత యుద్ధం తాలూకు నిజమయిన కథ.
    ప్రతిష్టలకోసం జరిగిన యీ యుద్దాలమంటలకు బలి అయిపోయిన మల్లమదేవిలాంటి ఆడవారి ఆర్తనాదాలు చెవుల్లో గింగురుమంటాయి. మనసును యెవరో మెలివేసి, ముద్దచేసి, గాయం చేసినంత బాధ కలుగుతుంది. చరిత్ర ప్రారంభించిన ఆడవారికి జరిగిన అన్యాయం, వారి శరీరాలు, మనసులు, బ్రతుకులు కోర్కెలు, ఆంతర్యాలు, ఆత్మలు అణచివేయబడటం తలుచుకుంటే ఏడుపొస్తుంది.
    "వీరవనితలైన వైశ్యకాంతల కున్నపాటి పరాక్రమం వెలమరాణులకు లేకపోయిందా? యుద్ద రంగానికి కానుకగా యివ్వవలసిన వెలమ కాంతల ప్రాణాలు కేవలం తాటాకు మంటలకు బలిచేస్తారా? ఆడతనాన్ని భర్తలే అగౌరవపరచి మూక వుమ్మడిగా నల్లుల్ని కాల్చి చంపినట్లు చంపుతారా? యిదేనా మానవత్వం? యిదేనా మగవారు స్త్రీజాతికి యిచ్చే గౌరవం? ఆడదానికి యీ సృష్టిలో వున్న విలువ యింతేనా? యిది బొబ్బిలి రాజ్యమా, లేక యమకూపమా? కాక యమలోకమా?" అని వెలమవీరుల్ని, మగజాతిని, మానవజాతిని, రొమ్ముమీద చేయివేసి, నిలవ దీసి అడుగుతున్న మల్లమ్మదేవి మనసులోకి వస్తుంది. యీ ప్రశ్నలకు సమాధానం యివ్వగలిగిన మగధీరుడు మళ్ళీ సృష్టిలో పుట్టాడా? అన్న అనుమానం కలుగుతుంది.
    కాగితాలు చదవటానికి వీలుకాకుండా కన్నీటి తెరలు పొరలు కమ్మినాయి. పనికి భంగం అయింది. తలెత్తాను ఎదురుగా మార్లిన్ ఆశ్చర్యపోయాను.
    దొరసానుల్ని చూడటం యిది నాకు ప్రధమం కాదు. హైద్రాబాద్ లో 'బహాయి మిత్రమండలి'లో పారిస్ యువతుల ముఖాల్లో కన్పించే అందాల్ని చూచాను. హైద్రాబాద్ లోనే అమెరికా బ్రాహ్మల్ని చూచాను.
    తమిళనాడు ఎక్స్ ప్రెస్ లో మద్రాసునించి వస్తూ యెందరో విదేశీ యువతుల్ని చూచాను. చివరిసారి విజయనగరం రైలులో వస్తూ (యీస్ట్ కోస్ట్) గుంటూరులో క్రిష్టియన్ సభలకు హాజరు అయి తిరిగిపోతున్న డజన్లకొద్దీ యూరోపియన్ యువతుల్ని చూచాను.
    నాకు సరదా పుట్టింది. ఒక యువతి తనకు సెండాఫ్ యివ్వటానికి వచ్చినవారికి పెన్నీ చూపుతోంది. నవ్వుతూ యేదో చెప్తోంది. నేను రైలులో కిటికీ ప్రక్కన తిష్టవేశాను. వాళ్ళు ఫ్లాట్ ఫారంమీద నా కిటికీకి అరగజంకూడా లేని దూరంలో నిలబడి మాట్లాడుతున్నారు.
    సెన్నీ రాగిపైసా అంత వుంది. అయితే లావు రెండు యింతలుంటుంది చెప్పానుగా నాకు సరదా పుట్టింది.
    "కెన్ యు గివ్ ఒన్ సెన్నీ టు మి" అని నాకు వచ్చిన అంతంత మాత్రపు యింగ్లీషు పాండిత్యంలో అడిగాను.
    ఆమె ముందుకి వంగింది ముద్దుపెట్టుకోవటానికి కాదు. రెప్పలు తిరుపతిలో కోతులు యెగరవేసినట్లు పైకి యెగురవేసి "వాట్ ఫర్" అని అడిగింది నవ్వుతూ ఆమె స్నేహశీలి అనిపించింది.
    ఆమెకు పదహారేళ్ళుంటాయి. నాకు భలే ఆనందమయింది. ఇంగ్లీషు దొరసానితో మాట్లాడుతున్నాను కదా అని.
    "బికాజ్ అయామ్ పెన్నీ లెస్" అన్నాను. యిండియన్స్ దగ్గర పెన్నీలు యెందుకుంటాయి? ఆమె నవ్వింది. నేను అన్న రెండర్ధాలను గ్రహించింది.
    "ఐ వాంట్ టు బి ఏ మాన్ విత్ పెన్నీ" అన్నాను. ఆమె మళ్ళీ నవ్వింది.
    చేతిలో వున్న పెన్నీని నాకు సమర్పించుకుని బహుశా మనసులోనే దండం పెట్టుకుంది. దానిమీది యింగ్లీషు అక్షరాలు చదివి భద్రంగా జేబిలో దాచుకున్నాను- బెటర్ లక్ అనుకుంటూ.

 Previous Page Next Page