Previous Page Next Page 

రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 3

             


    ఆ రోజు సాయంత్రం నేను ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి కొంచెం లేటయింది.
    మామూలుగానే మా అపార్ట్ మెంట్స్ తాలూకూ లోపలి రోడ్స్ మీద స్ట్రీట్ లైట్స్ సగమే  వెలుగుతున్నాయ్.
    నేను లిఫ్ట్ దగ్గరకెళ్తుంటే చేతిలో ఒక పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్ తో అవధాని మెట్లెక్కుతూ కనిపించాడు.
    అతనుండేది నాలుగో ఫ్లోర్ లో అని నాకు తెలుసు. అలాంటప్పుడు లిఫ్ట్ లో కాకుండా స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళటం కొంచెం అనుమానం కలిగించింది. దానికితోడు అతని చేతిలో చాలా పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్.
    వెంటనే మొహిందర్ కి సెల్ కొట్టి విషయమంతా చెప్పాను- మొహిందర్ మరో నలుగుర్ని వేసుకుని వచ్చాడు హడావుడిగా అందరం కలసి మరోసారి డిస్కస్ చేసుకున్నాక అవధానిని క్రాస్ ఎగ్జామిన్ చేయాలని డిసైడ్ చేశాం.
    ఇంటికి వెళ్ళి డోర్ బెల్ మోగించేసరికి- ఒక్కసారిగా ఇంట్లో హడావుడిగా అటూ, ఇటూ పరుగెడుతున్న శబ్దాలూ, ఏవో వస్తువులు కిందపడిన శబ్దాలూ వినిపించేసరికి మా అనుమానం పెరిగిపోయింది.
    మళ్ళీ డోర్ బెల్ మోగిస్తూ బిగ్గరగా "అవధానీ! అర్జంటుగా తలుపు తియ్" అంటూ అరిచాడు మొహిందర్ సింగ్.
    మరో నిముషం తర్వాత డోర్ తెరిచాడు అవధాని.
    అతని భార్య, ఇద్దరు పిల్లలూ భయంగా డోర్ కి అడ్డంగా నిలబడి మా వంక చూస్తున్నారు. అందర్నీ తోసుకుంటూ లోపలికెళ్ళాం-
    "ఏంటి? తలుపు తీయడానికింతసేపు పట్టింది?" అడిగాడు రెడ్డి.
    "భోజనం చేయబోతున్నాం - ఇంతలో మీరొచ్చారు. సంగతేమిటి? ఎక్కడికయినా ధర్నాకెళ్ళాలా?" అడిగాడు కుతూహలంగా.
    అతనికి ధర్నాల్లో పార్టిసిపేట్ చేయటమంటే చాలా ఇష్టం! ధర్నాలు జరిపేటప్పుడు అవసరమయిన  నినాదాలు తయారుచేయటంలో అతను ఎక్స్ ఫర్ట్.
    "ధర్నాలేదు, ఏమీలేదు గానీ-నువ్ ఇందాక సీక్రెట్ గా ఒక ప్లాస్టిక్ బ్యాగ్ మోసుకుంటూ లిఫ్ట్ ఎక్కకుండా, మెట్లెక్కి మీ ఇంటి కెళ్ళావేంటి కథ? ఆ బ్యాగ్ లో ఏముంది?" అడిగాడు హమీద్ మియా.
    ఆ కొశ్చెన్ తో అవధాని షాకయ్యాడు-
    "అహహ అదీ. అది...ఆ డాక్టర్ మా హెల్త్ బాగుండాలంటే రోజుకి నాలుగు సార్లు మన అపార్ట్ మెంట్ మెట్లెక్కి దిగమని చెప్పాడు.
    "ప్లాస్టిక్ బ్యాగ్ తో ఎక్కమన్నాడా?"
    "అహహ... అది నా చేతిలో ఉన్నప్పుడు తప్పదు గదా! ఇంతకూ ఎందుకిదంతా అడుగుతున్నారు?"
    "ఎందుకేంటి? మన అపార్ట్ మెంట్స్ ని ఎ క్షణాన్నయినా కూల్చెయ్యడానికి బిన్ లాడెన్ ఆర్డర్స్ ఇచ్చాడంట. అందుకని మన అపార్ట్ మెంట్స్ లో ఉన్నవాళ్ళందరినీ మనమే అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మనలోనే బిన్ లాడెన్ మనుషులున్నారని హోమ్ మినిష్టర్, పోలీస్ కమీషనర్ అందరూ చెప్తున్నారు"
    అవధానికి కోపం ముంచుకొచ్చింది.
    "అంటే నేను టెర్రరిస్ట్ అని మీరనుమానిస్తున్నారా?"
    "అందర్నీ అనుమానించాలి. నిన్నొక్కడినే కాదు, ఇంతకీ ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ఏంటో ఒకసారి చూపిస్తే నీ సొమ్మేంపోదుకదా కదా?"
    అవధాని భార్యాపిల్లల వేపు చూశాడు. వాళ్ళు వద్దన్నట్లు తలూపారు.
    "నేను చూపించకపోతే ఏం చేస్తారు?"
    "బలవంతంగా చెక్ చేసేందుకు మాకు అధికారం ఉంది!" అన్నాడు మొహిందర్ అనుమానంగా.
    "ఏదీ ఆ అధికారం మీకున్నట్లు గవర్నమెంట్ లెటరేమయినా ఇచ్చిందా?"
    మాకేం చెప్పాలో తెలీలేదు.
    "లెటరేం లేదు" అన్నాడు రెడ్డి.
    "ఫోన్ లో ఓరల్ గా అధికారం ఇచ్చారు"
    "నువ్ కోపరేట్ చేయలేదనుకో! పోలీస్ ని పిలవాల్సివస్తుంది" అన్నాడు హమీద్ సెల్ ఫోన్ తీస్తూ.
    అవధాని 'పోలీస్' అన్నమాట వింటూనే కొంచెం తగ్గాడు. పోలీసులతో వ్యవహారం ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు.
    ఒకసారి మా అపార్ట్ మెంట్స్ లోపల రోడ్ మీద చైన్ స్నాచింగ్స్ విషయంలో మా ఏరియా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసినప్పుడు అవధానిని ప్రత్యేకంగా లోపలికి తీసుకెళ్ళి నాలుగు ఉతికి బయటకు పంపించారు.
    అదే ఛాన్సని మేము ఇల్లంతా ఆ ప్లాస్టిక్ బ్యాగ్ కోసం వెతుకుతుంటే చివరికది డైనింగ్ టేబుల్ మీద కనిపించింది. అందరం అమాంతం వెళ్ళి- ఓపెన్ చేసి చూశాం.
    అందరూ ఒక్కసరిగా షాకయ్యారు.
    "ఆ! నువ్వు నాన్ వెజిటేరియన్ తింటావా?"
    అవధాని సిగ్గుపడ్డాడు. "అందుకే మీకా బ్యాగ్ చూపించనని చెప్పాను" కొంచెం కోపంగా అన్నాడు.
    "సీక్రెట్ గా అందరం తినబోతూంటే మీరొచ్చి నానా గొడవ చేశారు"
    ఇంక చేసేదేం లేక అందరం వెనక్కు తిరిగాం.
    అదే రోజు సాయంత్రం మూడో బ్లాక్ దగ్గర చాలామంది గుమిగూడి ఉండటం కనిపించింది మాకు.
    వాళ్ళ మధ్యలో మా కమిటీ మెంబర్ బాబూమోహన్ నిలబడి బిగ్గరగా అరుస్తున్నాడు.
    మేమంతా అతని దగ్గరకెళ్ళాం.
    "ఏంటి సంగతి?" అడిగాడు హమీద్ మియా.
    "ఇదిగో! ఈ స్కూటర్ చూడండి- ఇవాళ ఉదయం నుంచీ ఇక్కడే పార్కుచేసి ఉందది- దీన్ని ఇంతకు ముందెప్పుడూ మన అపార్ట్ మెంట్స్ లో చూళ్ళేదు. ఇదే ఫస్ట్ టైమ్ దీన్నిక్కడ చూడడం. ఎవర్నడిగినా మాది కాదంటున్నారు".

 Previous Page Next Page