Previous Page Next Page 

స్వర్గంలో ఖైదీలు పేజి 3


    నవ్వుతున్న విద్య మొహం వెలుగు తగ్గిపోయింది. గంభీరంగా మారి "పెళ్ళికాకుండా నేను తల్లిని కాలేదూ! అవునులే.....స్త్రీల కే ఆ అవకాశం వుంది" అంది.
    యశ్వంత్ కి తను చేసిన తప్పు అర్ధమైనట్లువుంది. బాధపడ్తున్నట్లుగా "సారీ విద్యా....అనుకోకుండా వచ్చినమాట. ఉద్దేశపూర్వకంగా అన్నమాట కాదు!" అన్నాడు.
    విద్య తేలిగ్గా "ఓ.కే......లీవిట్......వర్షా......నువ్వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా, డిన్నర్ చేద్దాం!" అంది.
    వర్ష అక్కడి నుండి తప్పుకుంది.
    "ఎందుకిలా ఫూలిష్ గా లైఫ్ వేస్ట్ చేసుకున్నావు? అన్ వెడ్ మదర్ గా వుండటం గొప్ప అనుకున్నావా? అతనుకాకపోతే ఇంక వేరే పురుషుడే దొరకలేదా? రేపు నీ కూతురి భవిష్యత్తు సంగతేమిటి?" యశ్వంత్ తల్లిని మందలించడం ఆమెకి వినిపిస్తూనే వుంది.
    "ఇంకో పురుషుడు నా జీవితంలో అక్కర్లేదనుకున్నాను యష్...ఐ యామ్ హేపీ నా కూతురి భవిష్యత్తు గురించి నాకు వర్రీ లేదు. నా తదనంతరం నా బిజినెస్ చేసుకొంటుంది. తనని కోరుకున్నవాడు తనని పెళ్ళి చేసుకొంటాడు. ఎనీమోర్ క్వశ్చన్స్?" విద్య మెత్తగా నైనా దృఢంగా చెప్పింది.
    "వర్ష సంగతి సరే......మరి నీ జీవితం గురించి ఏం ఆలోచించావు? ముఫ్ఫై ఐదుకే అన్నీ వదిలి విరాగిగా బ్రతకాలనుకొంటున్నావా? ఎవరో చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించడం ఎందుకు? ఎంత జీవితం అడవిగాచిన వెన్నెలైపోతుందో ఆలోచించావా?" ఆవేశంగా అడిగాడు.
    "నా సంగతి సరే.......నాకంటే పెద్దవాడివి, మరి నువ్వెందుకు పెళ్ళిచేసుకోలేదూ?" అడిగింది.
    "నా సంగతి వేరు నేనుమగాడ్ని!" అన్నాడు.
    "నీకు అక్కర్లేని పెళ్ళి నాకుమాత్రం చాలా అవసరమా?" వెటకారంగా అడిగింది.
    "నువ్వు స్త్రీవి. సామాజికంగా నీకు రక్షణ కావాలి. నైతికంగా నీకు అపవాదు వస్తుంది. అది నీ జీవితాన్ని, నీ కూతురి జీవితాన్ని నీడలా వెంటాడ్తుంది'. అతను నచ్చచెప్పబోయాడు.
    కానీ విద్య పెద్దగా నవ్వింది. "ఒక మగాడు తాళికట్టి ఏం ఇస్తున్నాడు స్త్రీకి? పోషణా, రక్షణా ఇవేనా? ఇవన్నీ నేనూ చూసుకోగలను. నామీద ఆధిపత్యం చెలాయించడానికి అతనెందుకు? ఐ యామ్ సెల్ఫ్ సఫీషియంట్!" దర్పంగా అంది.
    "తిండీ, బట్టా, వుండటానికో గూడూ, ఇవేనా జీవితం విద్యా? బతకడానికీ, జీవించడానికీ నీకు తేడా తెలీదా...." అతని గొంతు స్వల్పంగా వణికింది. "ఏ రాత్రి వేళో... ఏకాంత సమయంలోనో పురుషుడి అవసరం నీకు గుర్తుకురాదా? ఈ అందమైన అవయవాలు కోర్కెతో ఎదురుతిరగవా? ఎంత సంపాదించినా ఏముంది ఈ ఓటి జీవితంలో అనిపించదా?" ఆశ్చర్యంగా అడిగాడు.
    ఆమె మౌనంగా మారింది.
    "చెప్పు......అనిపించదా?" అతను రెట్టించాడు.
    "అ...ని....పి....స్తుం...ది!" ఆమె చాలా మెల్లగా ఆగి ఆగి ఉచ్చరించింది.
    "మరి....మరి....ఆ అవసరాలు ఎవరు తీరుస్తున్నారు?" అతను ఆపుకోలేనట్లు అడిగాడు.
    "తీరవు. నేను నిగ్రహించుకొంటాను. క్షణికమైన కోర్కెలకోసం ఇంకో మగాడికి నేనుతావీయదలుచుకోలేదు. వేలూనడానికి చోటిస్తే మొత్తం ఆక్రమిస్తారీ మగాళ్ళు! సారీ..... నీ ముందే మీ జాతిని విమర్శిస్తున్నాను." అంది.
    "విద్యా....నీ కింకా వయసుంది. ముందుముందు బోలెడు జీవితం వుంది. ఒకసారి ఆలోచించు.....కోరికల్ని జోకొట్టి, ఆత్మనిక్షోభ పెడ్తూ బ్రతకడంలో ఆనందం ఏమిటి? నువ్వుకోరుకుంటే లభ్యమవనిసుఖాలు లేవు. ఒక స్నేహితుడినిగానీ జీవితంలోకి నాకు ప్రవేశం కల్పించు......నీ స్వంత విషయాల్లో అసలు కలగజేసుకోనని నేను ప్రమాణం చేస్తాను" అతను విద్య చేతినిపట్టుకుని అన్నాడు.
    "యష్.....నీకు మతిపోయిందా? వయసొచ్చిన కూతుర్ని పెట్టుకుని నేను ఇప్పుడు....."
    "నువ్వు వర్షకి చేయబోయే అన్యాయం ఏం వుండదు. ఎటొచ్చీ నీకు కూడా కొంతన్యాయం చేసుకున్నదానివి అవుతావు. అపోజిట్ సెక్స్ తో మాట్లాడటం, సమయం గడపడం, కలిసి పనిచెయ్యడంలో వున్న రిలాక్సేషన్ నీకు తెలీనిదికాదుగా! సృష్టిలో ఉన్నదే అది. జీవించాలంటే ఒక స్పందన కావాలి. ఆ ఇన్ స్పిరేషన్ లేకపోతే రసహీనమైన చెరకు పిప్పిలాంటి జీవితం మిగుల్తుంది. ఇప్పుడే ఏమోషనల్ ఫీలయి ఏం చెప్పకు. నేను మూడురోజులు వుంటాను. తీరిగ్గా ఆలోచించుకొని నీ జవాబు చెప్పు...... బట్ వన్ థింగ్! నీ అందం సామాన్యమైనదికాదు విద్యా! అది నన్ను పిచ్చివాడ్ని చేస్తోంది. ఆ అందాన్ని అలా నిరర్ధకంగా పాడైపోనీకు....వర్ష వస్తున్నట్లుంది. మామూలుగా వుండు!" అతను ఆమెకి దూరంగా జరిగాడు.
    బట్టలు మార్చుకొంటున్న వర్షకి తల్లి ఏం చెప్తుందోనన్న కుతూహలం, దిగులూ కలిసికట్టుగా కలిగాయి.
    "వర్షా.......వర్షా...." తల్లి మృదుమధురమైన స్వరం, పదధ్వనీ కలసిసప్తస్వర సమ్మేళనంలా వుంది.
    చుక్కల్లోంచి జారిపడిన మెరుపు ముక్కలా విద్య జిగేలుమని మెరుస్తోంది.
    "రా తల్లీ...... అన్నీ చల్లారిపోతున్నాయి" అంది.
    నైటీ హుక్ అందక అవస్థపడ్తుంటే, వెనకనుండి వచ్చి విద్య హుక్ పెట్టింది.
    ఇద్దరూ డైనింగ్ రూంలోకి వచ్చారు.
    "కమాన్ వర్షా.....నిన్ను చూస్తుంటే మా విద్య చిన్నతనం గుర్తొస్తోంది!" అన్నాడు యశ్వంత్.
    'మా' అన్న శబ్దం అతను ఉచ్చరిస్తుంటే ఏదోగా అనిపించి వర్ష తల్లిచేతిని గట్టిగా పట్టుకుంది.
    డిన్నర్ లో రెండు మూడు స్పెషల్ ఐటెమ్స్ కనిపించాయి.
    "సేమ్యా పాయసం నీకిష్టం కదా యష్! దానికోసం అన్నయ్యతో దెబ్బలాడి అంతా నాకే కావాలనే వాడివి" నవ్వుతూ విద్య గుర్తుచేస్తోంది.
    "ఔను.....వర్షా.....మీ అమ్మ చిన్నప్పుడు చాలా అల్లరిపిల్ల నేను ఎవరికీ తెలీకుండా ఏ పెరట్లోనో నక్కి సిగరెట్లుకాలుస్తుంటే వచ్చి ఇంట్లో చెప్తానని బెదిరించేది. చెప్పకుండా వుండాలంటే మా సైకిల్ ఒకరోజు మొత్తం తనకి వదిలి పెట్టాలని బ్లాక్ మెయిల్ చేసేది" అని పెద్దగా నవ్వాడు.
    వాళ్ళిద్దరూ అలా బాల్యంలోని మధురిమలు ఆస్వాదిస్తూ ఆ లోకంలో పయనిస్తుంటే వర్ష అపరిచితురాల్లా అన్నం కెలుకుతూ కూర్చుంది.
    "నువ్వు ఎప్పుడూ పాడే ఆ జయదేవుని అష్టపది పాడు యష్...." భోజనంతరం అడిగింది విద్య.
    "యారమితావనమాలినా? మరి నువ్వు అప్పటిలా నాట్యం చేస్తావా?" అడిగాడు.
    "నేనా?" అమ్మ కిలకిలా నవ్వుతోంది.
    యశ్వంత్ పాడ్తున్నాడు. ఆమె పరవశంతో వింటోంది. వర్ష నెమ్మదిగా అక్కడినుండి తప్పుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది.
    ఆమెకి తల్లి కొత్తగా, వింతగా తోస్తోంది. ఎన్నడూ లేని విలాసం, జుట్టు అమరికలో, చీర పొందికలో ప్రతికదలికలో గొప్పలావణ్యం, నవ్వినప్పుడు ఆ ముఖంలో వెలిగేవెలుగు!
    అన్నింటినీ మించి ఇందాకా తను వినడంలేదనుకుని యశ్వంత్ మాట్లాడిన మాటలు!

 Previous Page Next Page