Previous Page Next Page 

కాంతి రేఖలు పేజి 2

    అప్పుడే మహారాణిలా, మెల్లగా వస్తున్న రైలుబండి కనిపించింది స్టేషన్ ఒక్కసారి చైతన్యవంతం అయింది.

    అందరూ తమతమ సామాన్లతో హడావుడిపడుతున్నారు. అందరికీ తెలుసు, ఆ బండి అదే స్టేషన్లో ఇంజన్ మార్చుకుని వెళ్తుందనీ, కనీసం ఓ ఇరవై నిమిషాలు ఆగుతుందనీ, అయినా హడావుడే.

    "మీ బడి లేదా!" ప్రక్కన నిలబడిన ఓఅమ్మాయిని అడిగాడు రాజేష్.

    "మా బడి అక్కడే ఉందే" అందా గడుగ్గాయి.

    అక్కడున్నవారు నవ్వారు.

    "బండి వచ్చిందిగాని లేకపోతే నీ పని పట్టేవాడిని." అన్నాడు రాజీవ్ పళ్ళు కొరుకుతూ.

    ఆ చిన్నారి కిలకిల నవ్వింది.

    "హల్లో రాజేష్....." దూరం నుండి చెయ్యూపాడు సిద్దార్ధ.

    "హాయ్....." చేతికి ఉన్న బంగారుగొలుసు సవరించుకుంటూ వెళ్ళాడు రాజేష్.

    సిద్దార్ధ దిగి రెండు పెట్టెలు దింపుకున్నాడు. పురుషోత్తమరావు వెంట ఉన్న సాయిలు పరుగున వెళ్ళి పెట్టెలు పట్టుకున్నాడు.

    "లష్కరొస్తే ఈ తిప్పలుండవు కద" అన్నాడు.

    "బాగున్నావా నాన్నా!" సిద్దార్ధ తండ్రి దగ్గరకి వచ్చి, ఆప్యాయంగా పలుకరించాడు.

    "బావున్నాను గాని అలా చిక్కిపోయావేమిట్రా......" అన్నాడు ఆప్యాయంగా భుజంతట్టి.

    "సాంబారు, రసం తని, తిని విసుగెత్తి ఉంటాడు." అన్నాడు రాజేష్.

    "ఏమిట్రా ఏం చేస్తున్నావ్!"

    కనిపించడంలేదూ నిన్ను చూస్తున్నాను" అన్నాడు.

    "చాల్లే నీ జోక్కు నువ్వే నవ్వుకోవాలి." అన్నాడు సిద్దార్ధ. ముగ్గురు బయటికి వచ్చేసరికి బిల, బిలమంటూ బాలరాజు. అర్డున్ గౌడ్, రాంబాబు వచ్చారు.

    "ఏరా ప్లయిన్ లో రావద్దా" అని ఒకరు.

    "మద్రాసుకు జీపు పంపితే ఏమయింది! అని మరొకరు?" ప్రశ్నించారు.
 
    "ఇప్పుడేమయింది!"

    "అంకుల్! వీడింత డల్ గా తయారయ్యాడేం?" బాలరాజు అడిగాడు.

    "ఏం చేస్తున్నావురా బాలూ!" సిద్దార్ధ ప్రశ్నించాడు.

    "మా నాన్న సంపాదించింది ఖర్చు చేస్తున్నాను"

    "ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాడు." అన్నాడు అర్జున్.
 
    "నువ్వేం చేస్తున్నావురా!"
 
    "ఆడపిల్లలను ఏడ్పిస్తున్నాను" అన్నాడు. అందరూ గొల్లున నవ్వారు. సిద్దార్ధ నవ్వలేక పోయాడు. తన తండ్రి పురుషోత్తమరావు పెద్దవాడున్నాడు. ఆ విషయం మరిచిపోతే యెలా!

    "అంకుల్! వీడు మారిపోయాడు......"

    "మద్రాసెలా ఉందిరా......."

    "బావుంది." అన్నాడు.

    వాళ్ళు ఆశ్చర్యంగా చూచారు. ప్రయాణం బడలిక అనుకున్నారు. మరో అయిదు నిమిషాలలో జీపు వెళ్ళి 'యశోద' ముందు ఆగింది. అందరూ దిగారు. లోపలికి వెళ్లారు.

    "బావున్నావా సిద్దూ!"

    "అమ్మా......." వెళ్ళి యశోద చేతులు పట్టుకున్నాడు.

    ఆమె కళ్ళు చమర్చాయి.

    సిద్దార్ధ తల్లిని దీక్షగా, పరీక్షగా చూచాడు. అంత అయిశ్వర్యమున్నా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. తమ దగ్గర లేకపోవటమే దీనికి కారణమా? ఇంకేదయినా ఉందా! ఉంది దానికి జనాభాయి కారణం -

    "అన్నయ్యా!" సుడిగాలిలా వచ్చి అన్నను వాటేసుకుంది రాధిక.

    "రాధికా......" తల్లిని వదిలి, చెల్లిని దగ్గరగా తీసుకున్నాడు.

    "అబ్బ! అచ్చు సినిమాలోలా ఉందిరా......" అంటూ చప్పట్లు కొట్టాడు అర్జున్.

    "మా వాడు అమ్మకూచి" నవ్వారు పురుషోత్తమరావు.

    ఆ ఊర్లో ఆయన మకుటం లేని మహారాజు. వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఏ నిమిషానికి ఏ అవసరం వస్తుందోనని. అందరూ అతనికి తలలోని నాలుకలా ఉంటారు.

    అదికాక, ఆ ఊల్ళో దాదాపు సగంమంది , అతని భూములు కౌలుకు చేస్తారు.

    రాధిక వెళ్ళి అందరికీ ఫలహారం పట్టించుకు వచ్చింది. నవ్వుతూ త్రుళ్ళుతూ, కేరింతలు కొడుతూ తిండి ముగించారు.

    పురుషోత్తమరావుగారికి ఎంతో హాయిగా, పరిసరాలు ప్రాణం పోసుకున్నట్టు అనిపించింది.
 

 Previous Page Next Page