Previous Page Next Page 

చీకటి తొలగిన రాత్రి పేజి 2


    "అబ్బబ్బ.. వెధవలు వెధవమానర్సులు వీళ్ళూ.. ప్రతిదానికి కెన్ వుయ్ షల్ వుయ్ అంటూ చంపుతారు హాయిగా తీసుకుతినకుండా." విసుగుతో హాస్యం మేళవించి అంది మీనాక్షి.
    "అంత బుద్ధిమంతులన్నమాట మీ పిల్లలు. సంతోషించాల్సింది పోయి అలా అంటావేమిటి?" అన్నాను.
    "ఆవిడ - అంతేలెండి. వాళ్ళు బుద్ధిగా వుంటే బుద్ధిగా వున్నారని విసుక్కుంటుంది. అల్లరిచేస్తే అల్లరి చేశారని తిడ్తుంది.. ఆవిడ సంగతి వదిలేయండి."
    "డాడీ. కెన్ వుయ్ గో అండ్ ప్లెయిన్ ద గార్డెన్.." పిల్లలు తండ్రినడిగారు.
    "అఫ్ కోర్స్.. గో.. అండ్ ఎంజాయ్" పిల్లలు ఎగురుకుంటూ వెళ్ళిపోయారు..
    "చూశావా, హాయిగా తోటలోకి పోయి ఆడుకోడానికి పర్మిషన్ ఎందుకో చెప్పు.. వాళ్ళు పుట్టిన ఇన్నాళ్ళకి ఇంటిముందు వాళ్ళకి ఆడుకోడానికి జాగావుంటే ఆడుకోకూడదూ.. నేనయితేనా..."
    "ఆ నీవు ఇండియాలో... అందులో ఆంధ్రలో పుట్టావు.. వాళ్లు అమెరికాలో పుట్టారు.. వాళ్ళూ నీవూ ఒకటెలా అవుతారు!" పెళ్ళాన్ని టీజ్ చేశాడు రామావతారం.
    "ఆ, చూశాంలెండి అమెరికాని..." వుడుక్కుంది మీనాక్షి. "ఎంత డబ్బిస్తేమాత్రం ఏం లాభం? రెండు గదుల కాపురం. ఏమో బావా మొదట్లో అన్నీ చూసేవరకు నాకూ చాలా ఉత్సాహంగానే వుండేది. ఓ రెండేళ్ళు మూడేళ్ళు బావుంది. తర్వాత ఇండియా ఎప్పుడొస్తానా అనిపించేదనుకో. మనదేశం ఆదేశం ముందు అన్నివిధాలా తీసికట్టే అనుకో, ఎంతయినా మాతృదేశం మాతృదేశమే. ఏమంటావు బావ!" నావైపు తిరిగి అంది.
    "నేనేఁ అంటాను. నేనేఁ అమెరికా వెళ్ళలేదుగా.." నవ్వాను.
    "ఏమోనండీ బోలెడు జీతం చీకూచింతాలేని బ్రతుకు. హాయిగా లైఫ్ వుండేది. నాకయితే అసలు రావడం ఇష్టంలేదు. ఈవిడ పోరు పడలేక వచ్చాను." రామావతారం బూట్లు విప్పి సావకాశంగా కుర్చీలో జారగిలబడి అమెరికా కబుర్లు మొదలుపెట్టాడు.
    మీనాక్షి బట్టలు మార్చుకోడానికి లోపలికి వెళ్ళింది పిల్లల్ని తీసుకుని. రామావతారం చెప్పే కబుర్లు వింటున్నానా మనసింకెక్కడికో వెనక్కే పరిగెడుతూంది? ఇందాక మీనాక్షి అన్నమాటలు వినగానే పాత సంగతులు గుర్తుకురాక మానడంలేదు.
    అవును ఆనాడు యింట్లో వుండి చదువుకునే ఈ ఊరు బి.యస్సీ డిగ్రీ మనల్లుడు మామయ్యకి పనికిరాలేదు. అందుకే ఇంజనీరింగ్ డిగ్రీ వున్న అల్లుడిని వెతికితెచ్చి కూతురికి పెళ్ళిచేశాడు. పాపం మామయ్య తప్పేముంది. ఆ దమ్మిడి ఆస్తిలేని ఉత్త బి.యస్సీ అయిన మేనల్లుడు ఐ.ఎ.యస్. అవుతాడని. ఈనాడు పెద్ద హోదాలో వుంటాడని భవిష్యత్తు తెలుసుకోడానికి మామయ్యేం దేవుడా? పెళ్ళిచేసి, అల్లుడితో అమెరికా వెళ్ళింది. ఆ వెళ్ళడం వెళ్ళడం పదేళ్ళుండి పోయారు, మీనాక్షివాళ్ళూ. ఆర్నెల్ల క్రితమే ఇండియా వచ్చారు. రాగానే రామావతారానికి కలకత్తాలో ఓ విదేశీ కంపెనీలో పెద్దజీతం మీద ఉద్యోగం దొరికింది. ఉద్యోగం చూసుకునే వచ్చాడు అని చెప్పాలి...
    .. అబ్బబ్బ.. మీ అమెరికా కబుర్లు ఆపండి బాబూ. విని విని బోరెత్తుతున్నాను. మీనాక్షెప్పుడు వచ్చిందో చూడనేలేదు నేను.
    "ఆ.. బావా, ఈ కబుర్లకేంగాని... మీ సంగతులు చెప్పు.. ఈ వూళ్ళో ఏమేం చూడాలో అన్నీ చెప్పు" సిగవిప్పి జడ అల్లుకుంటూ అంది మీనాక్షి.
    ఈ వూళ్ళో పెద్దగా ఏమున్నాయి చూడటానికీ, మ్యూజియం ఒకటుంది అంతే.. ప్రక్కన ఖండగిరి, ఉదయగిరి కేవ్స్ వున్నాయి. ఓ నలభై మైళ్ళ దూరాన వూరి కోణార్క వున్నాయి. ఓ పద్నాలుగు మైళ్ళ దూరాన "నందన్ కానన్" అనే జ్యూలాజికల్ పార్క్ వుంది.. నూట యాభై మైళ్ళలో గోపాల్ వూరు... చిలకావుంది... అటుప్రక్క హీరాకుడ్ వుంది, ఇటుప్రక్క రౌర్ కెలావుంది.. యివీ మా ఒరిస్సాలో చూడాల్సినవి. ఇంక నీ యిష్టం చెప్పు.. ఏమేం చూస్తావో. రేపటినించి అన్నీ తిప్పేస్తాను..." నవ్వుతో గుక్కతిప్పుకోకుండా అప్పగించాను, ఒరిస్సాలో చూడాల్సినవి.
    "ఏమో బావా, నీ యిష్టం నీ ఓపిక! పదిహేను రోజులు శెలవు పెట్టేసి వచ్చా... నీ గెస్టులం. మమ్మల్ని ఎంటర్ టైన్ ఎలా చేస్తావో చూస్తాను.. నీ ఉత్తరం రావడం తడువు వచ్చేశాను."
    "ఓ సరే, చెప్పావుగా..వద్దు బాబూ ఇంక చాలు అనేవరకు త్రిప్పేస్తాను.. నాకూ వుంది బోలెడు శెలవు. రేపటినించే తిరగడం ఆరంబిద్దాం. ఇవాళ్టికి రెస్టు తీసుకోండి.... ఓకే..."
    "ఏం కష్టపడ్డామని రెస్టు తీసుకోడానికి ఓ గంట ప్లేను ప్రయాణమేగా చేశాం..."
    "పోనీ సరదాగా ఇవాళంతా కబుర్లు చెప్పుకుందాం..." అన్నాను...
    భోజనాలకి ఓ గంటలో పిలుపు వచ్చేవరకు ఏవేవో కబుర్లు చెప్పుకున్నా....
    డైనింగ్ టేబిల్ దగ్గిర అన్ని దగ్గిరుండి వడ్డిస్తూంది శాంతి.
    "మీరూ రండి, అందరం కూర్చుందాం, ఒకసారే" రామావతారం శాంతిని కూడా కూర్చోమన్నాడు. "ఫర్వాలేదులెండీ మీరు కానీండి..." నెమ్మదిగా అంది శాంతి.
    "రావమ్మా.. మనలో మనకు మర్యాదలెందుకు, అన్నీ మధ్యనున్నాయిగా వడ్డించడానికేముంది" చనువుగా చేయిపట్టుకులాగి కూలేసింది మీనాక్షి.
    "మీ వంట వాడెవడు. బాగా చేశాడే అన్నీ... తెలుగువంటవాడిలాగే వండాడు.. మా ఇంట్లో ఓ నాయరున్నాడు. అన్నీ చప్పగా వండి తగలేస్తాడు.. నిజంగా అమెరికా నించి వచ్చాక ఓ నెల్లాళ్ళు అమ్మ దగ్గిరుండి కరువుదీరా మన భోజనం తిన్నాను... మళ్ళీ కలకత్తా వచ్చాక నోరు చచ్చిపోయింది. మళ్ళీ ఇన్నేళ్ళకి ఇవాళ తింటున్నాను.." గోంగూర పచ్చడి కలుపుతూ అంది మీనాక్షి.
    "మా వాడికి శాంతి ఎన్నాళ్లు దగ్గరుండి, ట్రైనింగ్ ఇస్తే ఇప్పటికి నేర్చుకున్నాడు. ఇప్పటికీ పచ్చళ్ళు, పులుసులు అలాంటివి శాంతి స్వయంగా చేస్తుంది..."
    "ఏమో బాబూ. నాకా వంటింట్లోకి వెళ్ళడం అంటేనే బోర్, ఎలాగో అమెరికాలో తప్పక చచ్చినట్లు ఏదో చేసేదాన్ని.. అయినా నా మొహం నాకేం వంటవచ్చు.. పెళ్ళయ్యేవరకు కాఫీ పెట్టుకోడం కూడా రాదు.. అక్కడికెళ్ళాక కొన్నాళ్ళు నానా పాట్లు పడి ఎలాగో కొన్ని తయారుచేయడం నేర్చుకున్నాను..."
    "ఎవడయినా మనం చెప్పి చేయించుకోడంలో వుంటుంది. కొన్నాళ్ళు చెప్పకపోతే మన వంటలెలా చేస్తారు.. నీవేమో మరి అసలు వంటింటి చాయలకే వెళ్ళవు.. అలాంటప్పుడు వాడేది పెడితే అది తినాలి..." రామావతారం భార్యవంక చూస్తూ అన్నాడు.
    "ఆ... వాడి వెనకాలబడి నే చేయడానికి వాడిని పెట్టుకున్నది...." సాగదీసింది మీనాక్షి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS