Previous Page Next Page 

నీరజ పేజి 2


    "లేదు!"
    "అక్కడినుండి ఎలా తప్పించుకోగలిగారు?"
    "నేను తప్పించుకోలేదు!"
    "క్షమించండి? మీరు వివరంగా చెప్పాలి?"
    "వాళ్ళలో ఒకతను నన్ను విడిపించి స్టేషన్ దగ్గిర దింపాడు..."
    మురళి కళ్ళు మరింత నిశితంగా చూసాయి...
    "ఎవరతను?"
    "నాకు తెలియదు!"
    "మీరెవరో తెలియని అతనికి మీమీద అంత అభిమానం ఎలా వచ్చింది?"
    "తెలియదు!"
    "వాళ్ళవల్ల మీ కేవిధమయిన హానీ జరగలేదు?"
    "లేదు!"
    "మిమ్మల్ని విడిపించిన వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పగలరా?"
    "చామనఛాయ -పొడుగనే చెప్పాలి!"
    "ఇలాటివాళ్ళు చాలామంది ఉంటారు -"
    "ఇంతకంటే ప్రత్యేకించి ఎలా వర్ణించాలో నాకు తెలియటంలేదు -చూస్తే గుర్తుపట్టగలను!"
    "పట్టపగలు నడిబజారులోఉన్న మిమ్మల్ని ఎత్తుకుపోవటం సామాన్యమైన విషయంకాదు - వాళ్ళు ఇంత సాహసంచేసింది కేవలం సరదాకా? దీని వెనుక ఏ ఉద్దేశమూ లేదా?"
    "నా...నాకు తెలీదు-"
    "మేడమ్! మీరు మా దగ్గిర అన్ని విషయాలూ చెప్పటమే మంచిది!"
    "నే నేదీ దాచటంలేదు?"
    మురళి నవ్వాడు -ఆ నవ్వులో అతడు తన మాటలు నమ్మటంలేదని అర్ధమయింది నీరజకు -
    "ఆల్ రైట్ ! మీ రొక్కసారి మా ఆఫీస్ కు రావలసి ఉంటుంది. మా డాక్టర్ మిమ్మల్ని పరీక్షచేస్తాడు!"
    నీరజ ముఖం పాలిపోయింది - మరొక్కసారి నవ్వి మురళి వెళ్ళిపోయాడు...
    పోలీసులు వెళ్ళిపోయారని తెలియగానే మళ్ళీ జనప్రవాహం మొదలయింది...
    నీరజ నవ్వుతోంది...అందరికీ సమాధానాలు చెపుతోంది...కానీ నీరజ కళ్ళు ఒకే ఒక వ్యక్తికోసం ఆరాటంగా ఎదురుచూస్తున్నాయి-
    కొరకరాని కొయ్యలాంటి నీరజ తమ కుతూహలం సరిగా తీర్చనందుకు నిరుత్సాహంతో అందరూ వెళ్ళిపోయారు -
    అప్పుడు వచ్చాడు ప్రభు...
    అంతవరకు కూడదీసుకున్న నీరజ ఓపిక ప్రభును చూడగానే చెదిరిపోయింది...
    దీనంగా వడిలిపోయిఉన్న నీరజను చూస్తూ ఒక్కమాట మాట్లాడకుండా ఆప్యాయంగా చేతులు చాచాడు ప్రభు - ఆ చేతుల్లో వాలిపోయి వెక్కివెక్కి ఏడ్చింది నీరజ...
    "ప్రభూ! నిజం! నేను...నేను..."
    "హుష్! ఏంమాట్లాడకు ; మళ్ళీ నిన్ను చూడగలిగాను - నా దగ్గిరకు వచ్చావు - అది చాలు నాకు! ఏ దెలా జరిగినా నువ్వు దూరంకాకుండా ఉంటే చాలు!"
    ప్రభు చేతులు మరింత ఆప్యాయంగా నీరజను చుట్టుకున్నాయి...
    తనను చుట్టుముట్టి పీడిస్తున్న సమస్తశక్తులనుండీ కాపాడుతున్నట్లు తనను అదుముకున్న ఆ చేతులలో ఒదిగిపోయి తేలికగా నిట్టూర్చింది నీరజ.
    
                                  *    *    *
    
    "నువ్వా? ఎందుకొచ్చావ్?"
    లక్ష్మీదేవి అడిగిన ఆ ప్రశ్నకు బిత్తరపోయింది నీరజ -నీరజకు లక్ష్మీదేవి కొత్తకాదు - ఆ ఇల్లు కొత్తకాదు...
    నీరజకు పదేళ్ళ వయసున్నప్పుడు ... నీరజ తల్లి ఆత్మహత్యచేసుకున్నప్పుడు...చేతులుచాపి నీరజను గుండెలలోకి తీసుకున్నది లక్ష్మీదేవే! ఆనాటి నుండీ తనకు దూరమయిన మాతృప్రేమను లక్ష్మీదేవిదగ్గిరే పొందగలిగింది నీరజ -
    నీరజకు జ్ఞానంవచ్చాక తన తల్లి దుఃఖగాథ లక్ష్మీదేవి నోటినుండీ వింది ఎన్నోసార్లు...
    "మీ నాయనమ్మ, మీ అత్తయ్యలు, మనుష్యులు కాదమ్మా! రాక్షసులు...ఏదో ఒక వంకతో మీ అమ్మను సతాయించటంతప్ప వాళ్ళకు వేరేపని ఉండేది కాదు - మీ నాన్న మీ అమ్మతో మాట్లాడితే మండిపడేది మీ నాయనమ్మ...మీ నాన్న ఒట్టి గంగిగోవు. దేనికీ సమాధానం చెప్పగలిగేవాడు కాదు... మీ నాన్నా మీ అమ్మాకలిసి సరదాగా సినిమాకు వెళ్ళటానికి లేదు -కబుర్లు చెప్పుకోవటానికి లేదు -చివరకు  కాపురంచెయ్యటానికి కూడా లేదు -మీ అత్తయ్యలందరికీ పెళ్ళిళ్ళయ్యాయి -కానీ ఒక్కళ్ళూ అత్తవారిళ్ళకు వెళ్ళేవారు కారు - వాళ్ళ మొగుళ్ళే వాళ్ళదగ్గరకు వచ్చేవారు. మీ అత్తయ్యలకీ, వాళ్ళ మొగుళ్ళకీ, వాళ్ళ పిల్లలకీ చాకిరీచెయ్యటమే మీ అమ్మ అనుభవించిన సంసారసుఖం... మీ అత్తయ్యలు మీ అమ్మ కళ్ళెదురుగానే పట్టుచీరలు కట్టుకునేవారు - పువ్వులు సింగారించుకునేవారు. మీ అమ్మ కేమీ ఇచ్చేవారుకారు -ఏమీ పెట్టుకోకపోయినా, ఏ అలంకారమూ లేకపోయినా మీ అమ్మ చాలా అందంగా ఉండేది. అది చూసి కళ్ళలో నిప్పులుపోసుకున్న మీ అత్తయ్యలు లేనిపోని అపనిందలు మోపటం కూడా మొదలుపెట్టారు-అది భరించలేక మీ అమ్మ ఆత్మహత్య చేసుకుంది..."

                           
    ఇంతవరకూ చెప్పి కళ్ళుతుడుచుకునేది లక్ష్మీదేవి -వర్ధని ప్రసక్తి రాగానే ఆవిడ ధోరణి మారిపోయేది.
    "ఈ వర్ధని వచ్చాక అందరి రోగాలూ కుదిరిపోయాయి-మీ అత్తయ్యలందరూ అత్తారిళ్ళకు వెళ్ళిపోయారు-రమ్మంటే కూడా ఇప్పుడు ఇక్కడికి రారు. తల్లి కొంగుపట్టుకు తిరిగే మీ నాన్న పెళ్ళాం కొంగుపట్టుకుని తల్లిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు-భలే ఆడది...చండిక..."
    "మంచిదేగా అత్తయ్యా! అలా ఉండబట్టికదా సుఖంగా ఉంది?"
    అమాయకంగా అడిగేది నీరజ-
    లక్ష్మీదేవికి ఇది నచ్చేదికాదు - అసహనంతో "మంచిదా? ఆడదంటే అలా ఉంటుందా? ఛీ! ఛీ! తలుచుకుంటే కంపరమెత్తుతుంది-" అనేది.
    తన తల్లి అష్టకష్టాలూపడి ఆత్మహత్యచేసుకుంటే సానుభూతితో కన్నీళ్ళు కార్చగలిగిన లక్ష్మీదేవి, వర్ధని ఎదురుతిరిగి సుఖపడుతోంటే సహించలేక పోతోంది-లక్ష్మీదేవిలో ఈ ప్రవృత్తి ఎప్పుడూ వింతగానే ఉంటుంది నీరజకి.
    వర్ధనికి నీరజమీద ఏకోశానా అభిమానంలేదు...నీరజకు వయసువస్తున్న కొద్దీ....పరిస్థితులను అర్ధంచేసుకోగలుగుతున్నకొద్దీ....వర్ధనిమీద కోపంకంటే సానుభూతే ఎక్కువగా కలగసాగింది.
    వర్ధని అందమైనది....కొద్దిగా చదువుకున్నది-కానీ బీదకుటుంబంలో పుట్టింది. అందుకే కామయ్యకు రెండో భార్యగా రావలసివచ్చింది - వస్తూనే అత్తవారింటి పరిస్థితిని ఆకళింపు చేసుకుంది-కామయ్యణు ఎవరో ఒకరు ఆడించవలసిందేననీ, అలా ఆడించే సమర్ధత ఎవరికుంటే అతను వాళ్ళచేతుల్లో కీలుబొమ్మ అయిపోతాడనీ అర్ధంచేసుకుంది. క్షణాలలో అతన్ని తన చేతులలోనే కీలుబొమ్మను చేసుకుంది-కామయ్యకు ఆస్తిపాస్తులున్నాయిగాని చదువులేదు-ఆ ఆస్తిచూచే వర్ధనిని ఇచ్చారు-కానీ, ఆడపడుచులు కుటుంబాలతోసహా సంవత్సరాలతరబడి తిష్టవేసి జల్సాఖర్చులు చెయ్యటంతో ... అత్తగారి పుణ్యకార్యాలతో, సమరాధనలతో ఆ ఆస్తి చాలావరకూ హరించుకుపోయింది-వర్ధని చేతిలోకి వచ్చింది. అప్రయోజకుడైన భర్త...అతికష్టంమీద తిండిగడిచే కొద్దిపాటి ఆస్తి...ఎదుగుతోన్న సవతి కూతురు...
    నీరజకు జ్ఞానంవచ్చిన దగ్గరనుంచీ తన సవతితల్లి పరిస్థితులతో ఎలా ఎదిరించిపోతున్నదీ గమనిస్తోనే ఉంది - తనను ప్రేమించలేని వర్ధనిమీద నీరజకు కూడా పెద్దగా ప్రేమలేదు... కానీ వర్ధని దగ్గిరనుండి నీరజ ధైర్యం, మొండితనం...పరిస్థితులతో తలపడే పట్టుదల, నేర్చుకుంది.
    ఎప్పుడూ ఏ సందర్భంలోనూ వర్ధనిముందు ఏడవలేదు నీరజ ...లక్ష్మీదేవి దగ్గిరకువచ్చి కూచునేది. అప్పుడు ఏడిచేదికాదు-కానీ నీరజ ముఖం చూస్తూనే లక్ష్మీదేవి సంగతి గ్రహించేది-నీరజణు బుజ్జగించి దగ్గిరుండి అన్నం తినిపించి ఆ తరువాతనే ఇంటికి పంపించేది - ఆ లక్ష్మీదేవి ఈనాడు అడుగుతోంది 'ఎందుకు వచ్చావు?' అని...
    లక్ష్మీదేవి అలా అడిగిందంటే ఇక నీరజ అక్కడినుండి వెళ్ళిపోవలసిందే! కానీ వెళ్ళలేదు. వెళ్ళదలచుకోలేదు-లోకంలో దేనినుండై నా సరే తనకు రక్షణ ఇస్తున్నట్లు తనను చుట్టుకొన్న ప్రభు చేతులు తనకు ఎక్కడలేని బలాన్ని సమకూరుస్తున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS