Previous Page Next Page 

ఆదివిష్ణు కథలు పేజి 2


    పవర్ గాళ్ళు విన్నారంటే తన్ని తగలేస్తారు. నువ్వెక్కడుండాలో అక్కడే ఉండాలి. ఉండంతే! ఇవతల నీ స్థాయీ, హోదాలు పెంచేందుకు ఏలికలు ఆలోచనలు చేస్తున్నారు. ప్రపంచయాత్రలు చేస్తున్నారు. నీ అశాంతిని తొలగించేందుకు మీటింగులు పెట్టుకుంటున్నారు. బల్లలు పగలిపోయేంతగా వాదించుకొని అలసిపోతున్నారు. నువ్వూ మనిషివేనని వాళ్ళు గుర్తించారు. నువ్వు క్షేమంగా బ్రతకాలనే వాళ్ళు కోరుకుంటున్నారు. నీ కనీస కోర్కెలు ఫలవంతం కావాలనే దృఢ సంకల్పంతో వాళ్ళు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.
    అయ్యిందా, అయితే వచ్చిన చిక్కల్లా ఎక్కడంటే-ఎక్కడో నాకూ తెలిసేడవడం లేదు.
    నా బతుకు దినదినగండం ఎందుకవుతుందో అనుక్షణం నువ్వు రెచ్చి పోయేలా పరిస్థితులెందుకు ఏర్పడుతున్నాయో నేను చెప్పలేను. క్షమించు తమ్ముడూ, దేవుడ్నయినా వెతికి పట్టుకోగలంగానీ, ఈ అశాంతిక్కారణాలు వెతకడం నీ నా తరం కాదు.
    అందుకే అంటున్నాను-దేశాన్ని బడాబాబులకి వదిలి అడవికి వెళ్ళిపొమ్మని, అక్కడ జపం చేయమని. ఇది తపోధనులు ధారాళంగా నివసించే పవిత్ర దేశమనే బోర్డు కట్టుకునే అవకాశమివ్వమని -ఇవీ చెన్నయ్య ఆలోచనలు! ఆవేశమూ అదే స్థాయిలో ఉండటం గమనించతగ్గ విషయం. అతనెంత కారెక్కి తిరిగే మనిషైనా ఆ కారు అతని సొంతం కానప్పుడు... అతనుంటున్న మేడలో గది కూడా అతనిది కానప్పుడు... అతనూ సామాన్యుడే గదా! కారు డ్రైవరు సామాన్యుడు కాదా?
    తన యజమాని రంగనాథరావుగార్ని చూసినప్పుడల్లా చెన్నయ్య పిడికిళ్ళు బిగిసిపోవడం మామూలు.  పళ్ళు పటపట నూరడం మామూలు. మనిషి నిలువునా కోపంతో ఊగిపోవడం మామూలు.
    యజమానికున్న మేడా, కార్లూ, నగరంలో ఆయన వ్యాపారం, ఆ వ్యాపారంలో అన్యాయం, అక్రమాలు తద్వారా పెరిగే ధనార్జనా, ఆ పైన ఆయన హోదా-ఇవన్నీ చెన్నయ్యకు కోపకారణాలే! ఒక్కొక్క కోపం, మనిషిని నమిలి మింగేసేంత కోపం.
    రంగనాథరావు కారెక్కి కూచున్నప్పుడు, ఆయన వ్యాపారం తాలూకు ఆర్జనయొక్క లెక్కలు తనిఖీ చేస్తున్నప్పుడు, బ్యాంకులో డబ్బు జమవేసినప్పుడు (తీసుకుంటున్నప్పుడు) భార్య వెంటరాగా కారెక్కి తన జాతి ఖరీదైన స్నేహితుల ఇళ్ళకి వెళ్ళినప్పుడూ -
    తిరిగి భర్తతో మేడదగ్గిర కారు దిగి మేడలోకి వెడుతున్నప్పుడూ, ఆ మేడకి తన స్నేహితులు వచ్చినప్పుడూ వాళ్ళందరితో కూచుని తాగి తింటున్నప్పుడూ, క్లబ్బులో రంగనాథరావు ఉపన్యాసం ఇచ్చినప్పుడూ, (ఉపన్యాసం ఇవ్వకుండా వింటున్నప్పుడు) పేకాటలో డబ్బుగెలిచినప్పుడూ (డబ్బు పోగొట్టుకున్నప్పుడూ గూడా) ఈ వగైరా కార్యక్రమాల్లో చెన్నయ్య కుతకుత ఉడికిపోతాడు.
    
                                          * * *
    
    ... వేసవికాలం ఆ కాలంలోనే ఎండలో, దేశం నుండి పోతున్న కాలంలోనే చిరంజీవి ఉపేంద్ర అమెరికా నుంచి వచ్చాడు. పూచికపుల్లలా సన్నగా ఉన్నా, తెల్లగా ఆరోగ్యంగా ఉంటాడు ఉపేంద్ర.
    ఎరోడ్రమ్ దగ్గిర ఉపేంద్ర కారెక్కినప్పుడు ఉపేంద్రని చూసి చెన్నయ్యకి గుండెల్లో భగ్గున మంట మండలేదు. అది తన చూపుదోషమో లేక ఉపేంద్ర రూపు దోషమో చెన్నయ్య తేల్చుకోలేకపోయాడు.
    రంగనాథరావుకి ఏకైక పుత్రుడు ఉపేంద్ర. అమెరికాలో తన మేనత్త ఇంట్లో ఉండి అక్కడ చదివి ప్రయోజకుడనే సర్టిఫికెట్ తో మాతృదేశానికి - తల్లిదండ్రుల్ని చూసిపోవడానికి వచ్చిన ఖరీధైన కుర్రాడు ఉపేంద్ర. జాతి కుర్రాడు. నిజానికి ఆ రంగూ, రుచీ, వాసనలు గల మనుషుల్నీ చూస్తే చెన్నయ్యకి మంటలో చిందులు తొక్కినట్టుండేది. కాని తొక్కినట్టు లేదు.
    అసలు మంటే లేదు. పైగా వెన్నెల్లో చందమామని చూసినంత చల్లగా, సాయంత్రం పూట కాలవ్వొడ్డున కూచున్నంత హాయిగా వుంది. "ఏమిటి మాయ" అనుకున్నాడు. చెన్నయ్య - మేడకి కారు తోలుతూ, ఉపేంద్ర మేడలోకి మాయమవుతున్నప్పుడు చెన్నయ్య హృదయంలో తీపి బాధొకటి కలుక్కుమంది.
    ఉపేంద్ర తన కళ్ళముందు అస్తమానం కనిపించాలనే కోరిక అకస్మాత్తుగా కలిగింది. తనకి తెలీకుండానే ఉపేంద్రను మంచివాడుగా చెన్నయ్య ఊహిస్తున్నాడు. తనకి తెలీకుండానే ఉపేంద్ర స్నేహాన్నీ, ఆత్మీయతను చెన్నయ్య వాంఛిస్తున్నాడు.
    తనకి తెలీకుండానే ఉపేంద్రకూ తనకూ మధ్యగల వర్గపోరాటాన్ని చెన్నయ్య మరిచిపోతున్నాడు.
    నేను పడిపోతున్నాను. ఎందుకిలా పడిపోతున్నానో తెలీదుగాని ఉపేంద్ర రూపం నన్ను వెధవని చేస్తోంది. ఉపేంద్ర పులిపిల్ల! కానీ, నాకెందుకో ఆవుదూడలాగా కనిపిస్తున్నాడు. ఆ రూపుతో నన్ను పడగొట్టేస్తున్నాడు. అవున్నాకు అర్ధమైపోతోంది! రూపుని చూసిన నేను మోసపోకూడదు. మోసపోను" అని రకరకాలుగా చెన్నయ్య మనసులో చెప్పుకున్నాడు.
    ఉపేంద్ర ఆ మేడకి వచ్చిన్నాటినుంచి చెన్నయ్య స్థిమితంగా లేడు. రాత్రిళ్ళు మామూలుగానే ఆలోచనలు వస్తున్నాయిగాని మునుపటిలా ఆలోచనల్లో వేడి మాత్రం లేదు. అయితే మాత్రం? ఆలోచనలు - ఆలోచనకే- నిద్ర ఎలా పడుతుంది.
    ఉపేంద్ర వచ్చి పక్షం రోజులు దాటినా అతను మేడ దాటి బయటకు రాకపోవడం చెన్నయ్యకి ఆశ్చర్యం కలిగించింది. ఆ కుమారరత్నాన్ని చూసేందుకు నగరంలోని ప్రముఖులంతా మేడని వస్తున్నారే గాని, రత్నం గడప దాటలేదు. దాంతో చెన్నయ్య కలతపడ్డాడు.
    తన ఆత్మీయుల్నెవర్నో ఖైదు చేసినట్లు బాధపడ్డాడు. తన గుండెనెవరో దొంగిలించి అటకమీద జాగ్రత్తచేసి నట్లు అల్లాడిపోయాడు. ఉపేంద్ర తనతో - తాను ఉపేంద్రతో మనసు విప్పి మాట్లాడుకోవాలి -
    "మీ నాన్నగార్లాంటి జాతి మనుషుల కుట్రలివి బాబూ! అని తాను ఉపేంద్రతో చెప్పి, ఉప్రేంద్రను తన వేపు తిప్పుకుని రంగనాథరావు పైన దండెత్తాలి.
    ఈ దండయాత్రలో ఉపేంద్ర ముఖ్యమైన పాత్ర వహించాలి? ఒక గొప్ప వాడికి, ఇంకో గొప్పవాడితో బుద్ధులు నేర్చాలి. తాను అసాధ్యమనుకుంటున్న ఈ ప్రక్షాళనా కార్యక్రమానికి ఉపేంద్ర సాయం చేయాలి. పేదవాడి కష్టాలు ఈ ఉపేంద్ర తొలగించాలి. త్వరపడాలి. ముందు ఉపేంద్రను కలుసుకోవాలి.
    ఒకరోజు - చెన్నయ్య సాహసం చేసి మేడమీదికి వెళ్ళాడు. ఉపేంద్ర ఉన్న గది దాపులకు రాగానే అతనికి గదిలోంచి మాటలు వినిపించాయి. మాటాడుతున్నది రంగనాథరావు, వింటున్నది ఉపేంద్ర.
    'ఊరు మంచిదికాదు, ఊరే కాదు, ఉపేంద్రా! దేశవూఁ! అంతే! డబ్బు సంపాదించడం నేరం ఇక్కడ. నాకున్నవి రెండు కళ్ళే! నీ చుట్టంతా లక్షలు. కోట్లు కళ్ళు నిన్ను కసిగా చూస్తుంటాయి.

 Previous Page Next Page