Previous Page Next Page 

అర్ధ మానవుడు పేజి 2


    
    మనం ప్రారంభించిన మహత్తర మయిన సాహసో పేతమయిన కార్య కార్యక్రమంలో తుది క్షణం వరకూ నిలువగలిగిన ఓరిమి కావాలి. ఇవన్నీ నీకున్నాయనే నేను నమ్ముతున్నాను.
    ఒక్కొక్క రాత్రిని విడిగా లెక్కించి ధైర్యాన్ని దిగజార్చుకునేంత దుర్భలుడవు నీవు కావని నా విశ్వాసం" అన్నదామె. సిన్హా తల నేలను తాకుతోంది.
    అందరికి పెదవుల చాటున చిరునవ్వులు మెరిసి మరుక్షణంలో మాయమయినాయి. సున్నితమయిన ధోరణిలో ఆమె చేసిన హెచ్చరిక అందరికీ స్ఫూర్తినిచ్చింది. వాస్తవానికి చెప్పింది సిన్హాని ఉద్దేశించి అయినా బృందంలోని అందరికీ అన్వయించుతాయి.
    టీ త్రాగటం పూర్తి అయ్యే సమయానికి పరిసరాలన్నీ చీకటి గుంపుల పరిష్యంగంలో చిక్కుపడినాయి.
    ముఖర్జీ, గోయేల్, రామారావ్, కుట్టి మొదలయిన వాళ్ళంతా "కిట్" కు వెన్ను ఆనించి కాళ్ళు బారచాపేశారు. రెప్పలు అర్ధనిమిలితంగా మార్చి విశ్రాంతి యోగంలోకి దిగిపోతున్నారు. కాని ఫిజో మాత్రం రవంత అయినా వెన్ను వంచలేదు. అతడు అస్సామీ! వయసు నలభై రెండు సంవత్సరాలుంటాయి. అలసట అంటే ఏమిటో అతనికి తెలియదు. ముఖ్యముద్రలో పరాక్రమం తొంగి చూస్తూ వుంటుంది.
    పర్వతారోహకునికి ఎలాంటి పరాక్రమ పట్టుదల ఉండాలో వివరించిన మాలతివంక అతడు ఆరాధనా భావంతో చూడసాగాడు. మాలతి వయసు తన వయసులో సగమే అయినా ఆమె అతడికి గురువు.
    అలసట లేకుండా అనూహ్యమయిన దారుల వెంట పురోగమించడంలో అతడు ఆమెకు మార్గదర్శి! ఫిజో చాలాకాలం అస్సాం అడవులలో అధికారులకు క్రూరజంతువుల్ని పట్టి యివ్వటంలో సాయం చేశాడు.
    ఆ అనుభవమేకాక ఎదుటి వారికి అర్ధం చేసుకోగల మంచి మనసూ, కష్టాలను ఓర్చుకోగల ధీశక్తి అతని కున్నాయి.
    అతడొకసారి అందరి వంకా చూచి వారంతా విశ్రాంతి కోసం తహ తహ లాడిపోతున్నారని అర్ధం చేసుకున్నాడు.
    "ఇంక విందు ప్రారంభించవచ్చు" అన్నాడు మాలతి వంక చూస్తూ. అందుకామె అంగీకార సూచనగా తల ఊగించింది. అందరూ ఒకేసారి రొట్టె ముక్కల్ని చేతుల్లో పట్టుకున్నాడు. కళ్ళుమూసుకుని దైవ ప్రార్ధన చేశారు.
    అర నిముషం తరువాత కళ్ళు తెరచిన మాలతి అందనీరి ఒకసారి పరిశీలనగా చూచింది. ఆమె చేతిలోని రొట్టెముక్క నోటికిచేరనే లేదు. కనుబొమ్మలు ప్రశ్నార్ధకంగా ముడి పడినాయి!
    "సిన్హా ఏమయ్యాడు" అంది కంగారుగా: అందరూ ఒక్కసారి నివ్వెరపోయారు. మాలతి విరిచిన రొట్టెముక్కను అలాగే వొదిలేసి లేచి నిలబడింది.
    "బహుశా యిందుకు పోయి వుండొచ్చు" అంటూ వ్రేళ్ళన్నీ ముడిచి చిటికిన వ్రేలు తెరచి చూపించాడు గోయెల్.
    "ఒంటరిగా పోయేంత ధైర్యమా మన వాడికి?" అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చాడు ముఖర్జీ.
    ఫిజో పేరుపెట్టి పెద్దగా పిలిచాడు రెండు మూడు సార్లు. మళ్ళీ పిలిచాడు. తిరుగు సమాధానం రాకపోవటంతో ఎవరికీ ముఖంలో కత్తిగాటుకు నెత్తురుచుక్కలేకుండా అయి పోయింది, భయంకరమయిన నిశ్శబ్దంతో గుడారం నిండిపోయింది కొద్ది క్షణాలు.
    ఫిజో అమిత సాహసి కావడంనించి అలాగే లేచిపోయి బయటకు పరుగుతీశాడు. అటువంటి ఆపత్సమయాలలో వెంట తీసుకుపోవలసిన టార్చి. త్రాడు చురిక లాంటి వస్తువులు తీసుకుని అతనిని యాభై అడుగుల దూరంలో అనుసరించింది మాలతి.
    మిగిలిన వారంతా గుడారంలో భయాన్ని మింగుతూ ఉండిపోయినాడు. వెలుపలకు వచ్చిన మాలతి ఫిజోని టార్చి ద్వారా గుర్తించింది. అమితమయిన వేగంతో ఆ వంకకు పరుగు తీయసాగింది!
    బూట్ల క్రింద నలుగుతున్న మంచు ముక్కలు కరకరమని శబ్దంచేస్తున్నాయి. కాళ్ళు జారుతున్నాయి. ఆ వేగానికి చిన్న చిన్న రాళ్ళు విసురుగా అవతల పడుతున్నాయి.
    నూరు మీటర్లపోయే సమయానికి ఫిజోని కలియ వచ్చింది. మాలతి అతని రెక్క పట్టుకుని ఆపివేసింది.
    "ఫిజో ఎటు పోతున్నావు?" అని అడిగింది. ఫిజో గించుకోవాలని  ప్రయత్నించినకొద్దీ ఆమె పట్టు మరింత బిగించింది.
    "కెప్టెన్! సిన్హాను ఏదో జంతువు లాక్కుపోతోంది. అతని మూలుగు వినండి" అన్నాడు ఫిజో ఆ వంకకు పరుగుతీయాలని ఉద్యమిస్తూ!
    "ఫిజో రవంత ఆలోచించు. అదే యదార్ధమయితే ఆయుధం లేకుండా యిలా ఒంటరిగా పోయి ఏమి చేయగలుగుతావూ?" అని అడిగింది మాలతి.
    అతడు పోవాల్సిన ప్రయత్నం విరమించి నిలిచిపోయినాడు. మాలతి చెవులు ఓరగించి వినసాగింది.
    "హెల్ప్! హెల్ప్!" అని అరుస్తున్నాడు సిన్హా ఆ దయనీయమయిన కంఠ స్వరాన్ని వింటుంటే అతడు ఎంత ఆపదలో చిక్కుకున్నాడో అర్ధంమవుతోంది. ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడో తెలుస్తోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS