Previous Page Next Page 

మల్లమ్మదేవి ఉసురు పేజి 2


    భార్యా, కొడుకూ  మంటలమధ్య చిక్కుకుని మాడి మసైపోతూ వుంటే కనీసం వాళ్ళకోసం కన్నీరు విడిచే తీరికకూడా లేని గోపాల కృష్ణ రంగారావు.......యివన్నీ గుర్తు వచ్చినాయి.
    రైలు చక్రాలు దిగ్ దిగు దిగ్........ మంటున్నాయి. ఒక్కసారి దిగ్గున లేచి ఆ స్టేషన్ లో దిగిపోయింది మార్లిన్.
    అదే బొబ్బిలి! బొబ్బిలి స్టేషను మల్లమ్మదేవి ఆంతర్యం అగ్నిలా మండి కాల్చి మసిచేయగా మిగిలిన బూడిద యినాటి యీ బొబ్బిలి.
    అవును యిదే బొబ్బిలి. అందరూ అనుకుంటున్న వీరబొబ్బిలి.
    మిస్ మార్లిన్ కి తను యేం చేస్తున్నదీ తెలియదు. నడుచుకుంటూ పోతోంది.
    ఆమె ఆకారంలోనూ, వేషంలోనూ వున్న అంతరాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారు అందరూ. మల్లమ్మదేవి ముందుకు పోతోంది. కాదు మార్లిన్ ముందుకు పోతోంది. మార్లిన్ మల్లమ్మదేవిలా నడుస్తోంది.
    దారి పొడవునా జనం విపరీతంగా చూస్తున్నారు తమకు తెలియని లోకాలనించి దిగివచ్చిన దేవతని చూచినట్లుగా చూస్తున్నారు మార్లిన్ ఓ బాగ్ భుజానికి తగిలించుకుని ఠీవిగా నడుస్తోంది. మార్లిన్ మనసులో నువ్వే మల్లమ్మ నువ్వే మల్లమ్మ అని యెవరో గొంతు చించుకుని అరుస్తున్నారు. ఆ కేకలు మార్లిన్ చెవుల్ని గింగుర్లు యెత్తిస్తున్నాయి. ఆ భావం ఒళ్ళంతా వ్యాపించింది.
    ఆమె ఆ భావానికి పూర్తిగా లొంగిపోయింది. ఆ గ్రామంలో కొన్ని దశాబ్దాలనించీ వుంటున్నదానిలా, అన్ని వీధులూ యెగిరి వున్న దానిలా చక చకా నడుస్తోంది.
    మధ్య మధ్య తనలో తాను గొణుక్కుంటోంది పైకే అంటోంది.
    "అవును నేనే మల్లమ్మదేవిని. నేనే మల్లమ్మదేవిని" అని.
    నేరుగా నడుచుకుంటూ వచ్చి- కరిగిపోయిన కల మిగిల్చిపోయిన ముఖముద్రలా మిగిలి వున్న యీనాటి బొబ్బిలికోటలో కాలు పెట్టిందామె. అప్పటికి రవ్వంత చీకటి పడింది.
    నేను టవర్ గదిలో కూర్చుని యేదో వ్రాసుకుంటున్నాను. నేను అష్టావధానం చెయ్యలేను కాని, నాకు తెలియకుండానే ద్వంద్వావధానం చేస్తూ వుంటాను. జానెడు పొట్టని, యెంత పెట్టినా, యెంత పోసినా యెన్నటికీ నిండని కేవలం జానెడు పొట్టని నింపుకుంటానికి యేదో వుద్యోగం చేసుకోవాలి అది చేస్తూ వుంటాను ఆ పనులు చేస్తూనే నాకు ప్రాణప్రదమయిన చరిత్ర విషయాలు ఆలోచిస్తూ వుంటాను. చరిత్ర తత్త్వశాస్త్రం నాకు ప్రాణప్రదమయినవి.
    టవర్ గదిలో సింహాసనంలాంటి యెత్తయిన ఒక కుర్చీ, వెనుకటి కాలంలో జమీందారులు వాడే ఒక టేబిలూ వున్నాయి టేబిలుమీద కాగితాలున్నాయి. కుర్చీలో నేనున్నాను. అంత ఖరీదయిన కుర్చీ టేబిలూ- కోస్తా జిల్లాల్లోని మా స్వగ్రామంలో వుండగా నాకు కలలోకూడా వచ్చేవి కావు.
    కాని, నిరుద్యోగం నన్ను తన్ని దేశంమీదికి నన్ను పరుగెత్తించితే వచ్చి రంగారావుగారి దగ్గర వుండి సంవత్సరాదాయాలూ, ఖర్చులూ, లెక్కలూ చూచేందుకు కుదిరాను ప్రభుత్వ వుద్యోగం కాకపోయినా బలే పసందయిన వుద్యోగం పని తక్కువ. జీతం చాలినంత, రాజమాత నన్ను మనుమడిని చూచినట్లు చూచుకుంటుంది.
    ఆ కుటుంబానికి యిప్పుడు రాజరికం లేకుండా పోయినా ఆ వృద్దురాలిని రాజమాత అనాలనిపిస్తుంది. రాజమాతలకు వుండవలసిన ఠీవి, ఉదాత్తత ఆమెలో నాకు కన్పించినాయి బాప్ రే ఫ్యూడలిజం.
    నాకు ఏ వేళకు కావలసినవి ఆవేళకు అందేలా యింటిపని వాళ్ళకు పురమాయించి చేయిస్తుంది. వుదయం లేచి సంధ్యావందనంలాంటి నా ఛాదస్తాలన్నీముగించుకుని వుద్యోగి బాధ్యతతో ఆ గదిలో కాలుపెట్టేవేళకు గది శుభ్రంగా పూడ్చి కుర్చీ టేబిలూ తుడిచి వుంటాయి. నా స్వయం కృషితో, నాకున్న కొద్దిపాటి తెలివితో పరిష్కరించుకోలేని సమస్యలు ఎదురు అయినప్పుడు రెండుచేతులూ యెత్తి దండం పెట్టుకుంటానికి ఒక దేవుడిని ఫ్రేములో బిగించి నా కుర్చీ యెదురుగా తగిలించుకున్నాను గోడకి. ఆ ఫోటోకు వూదొత్తులు వెలిగించి వుంటాయి. టేబిల్ మీద కాగితాలు నీట్ గా సర్ది వుంటాయి యివన్నీ రాజమాత పనివాళ్ళకు పురమాయించి చేయిస్తుంది.
    గదిలోకి వెళ్ళగానే నాకు, ఆమె గుర్తుకు వచ్చేస్తారు. నేను పని వుండి అనేకమార్లు ఆమెను కలుసుకుని మాట్లాడినా రోజు మొత్తంలో ఒకమారు ఆమె నా గదికి వచ్చి నన్ను పరామర్శించి వెళ్తారు. అది రాజ లాంఛనం! మరణించిన రాజరికపు వ్యవస్థకు మిగిలివున్న జీవచిహ్నం ఆమె ఆమెను నేను యెంతో గౌరవిస్తాను. ఆమె అణువు అణువునా సంతరించుకుని వున్న దయకు, మానవతకు జోహారు చేస్తాను.
    ఎప్పుడైనా నోరు విడిచి నా వ్యక్తిగత సమస్యలు ఆమెతో చెప్పుకుంటే ఆమె వాటికి స్పందిస్తారు. అప్పుడప్పుడు ఆమె మనోగతాల్ని యెంతో గంభీరమయిన శైలిలో నాకు వివరిస్తారు. ఆమె అంతర్యాన్ని నాముందు పరచి నన్ను గొప్పవాడిని చేస్తారు.
    ఆమె ఔన్నత్యం ముందు నేను పసిపిల్లాడిని అయిపోతాను.
    అందువల్ల ఆమె యజమాని అయినా, నేను పొట్ట నింపుకుందుకు వుద్యోగం చేసుకుంటున్న వాడిని అయినా, అంతకన్నా యెక్కువ అనుబంధం మామధ్య స్థిరపడింది. నేను గుంటూరు తాలూకాలోని ఓ కుగ్రామంలో పుట్టాను. ఆ కుగ్రామం కొండవీడు శివార్లలో వుంది. బొత్తిగా బ్రాహ్మణపిండాన్ని కావటంనించి నాకు కొన్ని చాదస్తాలున్నాయి.
    నా ఛాదస్తాలకు ఆ రాజకుటుంబంలో ఆదరణ వుంది. నాకు యెదురు చెప్పటం వాళ్ళ లక్ష్యం కాదు. నేను వుద్యోగిగా పనిచేస్తున్నా అంతకన్నా యెక్కువ అనుబంధంతో వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తాను వాళ్ళ పనులు వాళ్ళు చూచుకోలేకపోవటం అటువంటి కుటుంబాల బలహీనత. సమస్యలు వచ్చినప్పుడు యెదుటివారిని నమ్మి వారిమీద ఆధారపడతారు. అందువల్ల ఆ యింటిలో నా బరువు బాధ్యతలు అధికం అయినాయి. ఒక భాషలో చెప్పాలంటే విశ్వాసం కలిగిన కుక్కలు వాళ్ళు కావాలి. నా భాషలో చెప్పాలంటే మానవత్వం మూర్తీభవించిన యభిమానులు నాకు కావాలి. అదీ సంగతి.

 Previous Page Next Page