Previous Page Next Page 

రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 2


    ఆ రీజన్ వల్లే మెంటల్ డాక్టర్ పేషెంట్లు వేల కొద్ది పెరిగిపోతున్నారు. అందుకని వాళ్ళంతా మా అపార్ట్ మెంట్ ని మెంటల్ అపార్ట్ మెంట్స్ అని పిలుస్తుంటారు.
    సిటీలో మా ఏరియా అడ్రస్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఎవరయినా సరే ఫలానా ఏరియాకెళ్ళి మెంటల్ అపార్ట్ మెంట్స్ అని అడగండి! చూపిస్తారు. వాటికెదురుగ్గా సందులోనే మా ఇల్లు అని చెప్తూండటం మేము చాలాసార్లు విని కోపంతో, పౌరుషంతో ఉడికిపోయాంగానీ చేసేదేమీ లేక ఊరుకున్నాం. ఇదీ టూకీగా మా రామ్ భరోసా అపార్ట్ మెంట్స్ మేటర్.
    ఆ రోజు మేము పొద్దున్న నిద్రలేవక ముందునుంచే మా అపార్ట్ మెంట్స్ లో హడావుడిగా అందరూ పరుగులు, అరుపులతో గొడవ గొడవగా ఉంటే నేనూ, రెడ్డీ, హమీద్ మియా కిందకు దిగాం.
    గేటు దగ్గర మా వాళ్ళంతా లేడీస్ తో సహా గుమికూడి ఉన్నారు. 'ఏంటి సంగతీ' అంటూ అడిగాం అవధానిని.
    'ఏంటి? ఇంకా తెల్వదా! రాత్రి మన ఆపోజిట్ స్ట్రీట్ లో ఉన్న సినిమా హాల్లో బాంబ్ బ్లాస్టయింది! పధ్నాలుగురుపోయారు- నూటడెబ్బయ్ మంది పోడానికి సిద్దంగా ఉన్నారు. వందమంది ఫస్ట్ ఎయిడ్ కేసులు' అంటూ టీవీ జర్నలిస్ట్ ఫోజులో గడగడ చదివేశాడు.
    అన్నట్లు మీకు తెలీదనుకుంటా అవధాని ఒక డెయిలీ పేపర్ కి జర్నలిస్ట్. అందుకని ఎప్పుడూ ఓ చిన్న కెమెరా, ఒక నోట్ బుక్ మైకు మెడలో వేసుకుని తిరుగుతుంటాడు.
    అందరం స్టన్నయ్యాం.
    ఎప్పుడూ సిటీలో బాంబ్ బ్లాస్ట్స్ జరిగినట్లు టీవీలో చూడటమేగానీ మా ఏరియాలోనే మాకింత దగ్గరగా జరిగిందనేసరికి కొంచెం భయం వేసింది. కాసేపు పెరిగిపోతున్న టెర్రరిజం గురించి మాట్లాడుకున్నాక ఎవరిదారిన వాళ్ళు ఇళ్ళల్లో కొచ్చేశాం.
    లేడీస్ మాత్రం ఇంకా సెంటి మెంట్ కి సంబంధించిన బాంబ్ బ్లాస్ట్ వార్తలు విశ్లేషించుకుంటున్నారు.
    "పాపం! బ్లాస్ట్ లో తల్లి పోయిందంట! పిల్లకు మూడేళ్ళు- అమ్మా, అమ్మా అంటూ ఒకటే ఏడుపు" అంటూ ఒకావిడ వర్ణిస్తోంటే అంతా కన్నీళ్ళు తుడుచుకున్నారు.
    "పాపం ఆ పిల్లకు తండ్రి ఇదివరకే చనిపోయాడంట- ఇప్పుడు ఆ పిల్ల అనాథ అయిపోయిందని పోలీసులు చెప్తున్నారు"
    ఆ మాట వినేసరికి ఒకరిద్దరు లేడీస్ కన్నీళ్ళ స్టేజ్ దాటేసి భోరున ఏడ్చేశారు. వాళ్ళను చూస్తున్న మా అసోసియేషన్ ప్రెసిడెంట్ నెమ్మదిగా వాళ్ళ దగ్గరకొచ్చి ఓ సలహా ఇచ్చాడు.
    "ఆ పాపను మీలో ఎవరయినా జాలిపడి పెంచుకోడానికి ఒప్పుకుంటే ఎంతో సాయం చేసిన వారవుతారు"
    ఆ మాట ఇంక పూర్తయినా కాలేదు. లేడీస్ అంతా క్షణాల్లో మాయమయిపోయారు.
    ఆ రోజంతా ప్రధానమంత్రి, లోకల్ మంత్రులూ టీవీలో కనబడుతూనే ఉన్నారు.
    "ఇది పిరికిపందల చర్య" అంటూ గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకూ బ్లాస్ట్ లు జరిగినప్పుడల్లా ఇచ్చే చౌకబారు స్టేట్ మెంట్ ని వాళ్ళు కూడా రొటీన్ గా ఇచ్చేశారు.
    మా రెడ్డికి కోపం వచ్చింది.
    "ఈళ్లకేమయినా దమాకుందా? టెర్రరిస్ట్ లు పోలీస్ స్టేషన్లు, ఆర్మీ పోస్ట్ ల మీదే ఎటాక్ చేసి ధైర్యంగా బాంబ్ బ్లాస్ట్ లు చేస్తూంటే పిరికిపందలంటాడేంది?"
    అది ఎప్పటి నుంచి అందరం ఫీలవుతుంటే కాబట్టి ఎవ్వరం రియాక్టవలేదు. ఆ విషయమే డిస్కస్ చేసుకుంటూ అందరం మా సొసైటీ సెంటర్లో కూర్చుని టీవీ చూస్తున్నాం!
    మరి కాసేపట్లో పోలీస్ కమీషనర్ ఫోన్- ఇన్ ప్రోగ్రాం స్టార్టయింది. టీవీలో నగర ప్రజలందరూ ఈ విషమ పరిస్థితుల్లో భయంలేకుండా ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను. ఉగ్రవాదులు, ఇతర బాంబ్ వాదులు- వారెంత ప్రమాదకరమయినా వారయినా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా పట్టుకుని శిక్షించటం జరుగుతుంది"
    ఆ స్టేట్ మెంట్ వినగానే మా సొసైటీ ప్రెసిడెంట్ ఫోన్ డయల్ చేశాడు.
    "సార్- నేను మెంటల్ అపార్ట్ మెంట్స్ ప్రెసిడెంట్ ని మాట్లాడుతున్నాను"
    "మీ పేరేంటి మెంటల్ గారూ?"
    "హమీద్ మియా"
    "చెప్పండి హమీద్ గారూ? ఏమిటి మీరు చెప్ప దల్చుకుంది?"
    "సార్ ఎప్పుడు ఏ బాంబ్ బ్లాస్ట్ జరిగి నా మీరిలాగే నేరస్తులను ఒదిలి పెట్టే ప్రసక్తేలేదంటూ ఏ స్టేట్ మెంట్స్ ఇస్తూంటారు-"
    "అవును హమీద్ గారూ! వాళ్ళని జీవితాంతం జైల్లోనే మగ్గేలా చర్యలు తీసుకుంటాం! వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు"
    "అసలు ముందు వాళ్ళను పట్టుకుంటే కద్సార్- వదిలిపెట్టే విషయం గురించి మాట్లాడాలి!"
    కమీషనర్ కొంచెం గాభరాపడ్డాడు.
    వెంటనే అతని పక్కనే కూర్చున్న హోమ్ మినిష్టర్ కలుగజేసుకున్నాడు.
    "నేరస్తులెవరయినా- ఎక్కడున్నా వాళ్ళని మన పోలీసులు పట్టుకుని శిక్షిస్తూనే ఉన్నారు హమీద్ గారూ! అలా పట్టుకున్న వాళ్ళ లిస్ట్ చాలా పెద్దది ఉంది మా దగ్గర!" అంటూ కమీషనర్ ని సపోర్ట్ చేశాడు.
    "కానీ మీరు ఇంతవరకూ పట్టుకోలేకపోయిన క్రిమినల్స్ లిస్ట్- మీ లిస్ట్ కంటే ఇంకా చాలా పెద్దది మా దగ్గరుంది సార్" అన్నాడు మొహిందర్ సింగ్ కలుగజేసుకుంటూ.
    ఇప్పుడు హోమ్ మినిష్టరు కంగారుపడ్డాడు.
    అందుకని కమీషనర్ కలుగజేసుకున్నాడు.
    "మీ అభిప్రాయం కరెక్ట్ కాదండీ హమీద్ గారూ- మీ లిస్ట్ లో ఒక్క పేరు చెప్పండి చూద్దాం!"
    "దావూద్ ఇబ్రహీమ్" కమీషనర్ నోటమాటరాలేదు-
    మినిష్టర్ ఇంకా డౌనయిపోయాడు.
    "అదీ..... అది కాదండ హమీద్ గారూ- అది ఇంటర్నేషనల్ హెడేక్- అదొది లేసేయండి"
    "సరేసార్ అది వదిలేద్దాం- వాజ్ పేయ్ టైమ్ లో మన విమానాల్ని ఆఫ్ఘనిస్తాన్ లో హైజాక్ చేసిన వాళ్ళను మనం పట్టుకోలేదు సరికదా వాళ్ళు వదిలేయమని అడిగిన మిగతా టెర్రరిస్ట్ లను కూడా జైలు నుంచి విడిపించి, తీసుకెళ్ళి వాళ్ళకు అప్పజెప్పారు-"
    "అలాంటివి కొన్ని సందర్భాల్లో తప్పదు" ముఖానికి పట్టిన చెమటని కర్చీఫ్ తో తుడుచుకుంటూ అన్నాడు.
    "సరే సార్ అది కూడా వదిలేద్దాం! మన రాష్ట్రంలో ఒక ఎస్.ఫై.ని కాల్చిచంపిన టెర్రరిస్ట్ ని ఇప్పుడున్న మీ ప్రభుత్వం లంచాలు తిని వదిలేసింది కదా- దాని సంగతేంటి?"
    హోమ్ మినిష్టర్ లేచి నిలబడ్డాడు.
    "నాకు అర్జంటు మీటింగుంది- అందుకని వెళ్ళిపోతున్నాను. మీ కమీషనర్ గారు సందేహాలు తీరుస్తారు-"
    "చూడండి, హమీద్ గారూ! కేవలం మీ ఒక్కరితోనే మాట్లాడుతూంటే ఇంకెంతో మంది ఫాన్స్ లో వెయిట్ చేస్తుంటారు-" అంటూ డిస్కనెక్ట్ చేశాడు కమీషనర్.
    "కనుక ప్రజలందరినీ నేను కోరేదేంటంటే- మాకు ఢిల్లీ నుంచి ఖచ్చితమయిన ఇన్ ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే- టెర్రరిస్ట్ లు హైదరాబాద్ నగరంలో కొత్త పంథాల్లో బాంబ్ బ్లాస్ట్ లు చేయడానికి నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఎక్కువమంది జనం ఉంటున్న అపార్ట్ మెంట్స్ నే టార్గెట్ చేయాలనీ వాళ్ళు ప్లాన్ చేశారు- ఆ విధంగా ఎక్కువ జననష్టం కలిగించవచ్చని వాళ్ళ ప్లాన్! కనుక అపార్ట్ మెంట్స్ లో ఉంటున్న వాళ్ళు- ముఖ్యంగా ఎక్కువ ఫ్యామిలీస్ ఉండే మెగా అపార్ట్ మెంట్స్ కి ప్రమాదం పొంచి ఉంది. మీరు ప్రతి వస్తువునీ అనుమానించండి- ప్రతి వ్యక్తినీ అనుమానించండి! టెర్రరిస్ట్ ల తాలూకు స్లీపర్ సెల్స్ ఎక్కడో లేవు! మన అపార్ట్ మెంట్స్ లో మన మధ్యే ఉన్నాయ్" ప్రకటించాడు కమీషనర్.
    ఆ మాటతో మా అందరి గుండెలు ఝల్లుమన్నయ్. ఒకరి మొఖాలొకరం చూసుకున్నాం.
    ఎందుకంటే మా అపార్ట్ మెంట్స్ లో ఆరు బ్లాకులున్నయ్. ఒక్కొక్క బ్లాకులో సుమారు వంద ఫ్యామిలీస్-
    కనుక ఆ టెర్రరిస్ట్ ల దృష్టిలో ఎక్స్ పెరిమెంట్ చేయడానికి మాదే నెంబర్ వన్ అపార్ట్ మెంట్స్ అయితీర్తుంది.
    "ఈ లెక్కలో మనమంతా చాలా కేర్ ఫుల్ గా ఉండాలి!" అన్నాడు హమీద్ భయంగా.
    "అవును! కమీషనర్ చెప్పినట్లు మనలో ఎవరయినా ఆ స్లీపింగ్ సెల్స్ ఉన్నారేమో అబ్జర్వ్ చేయాలి-" అన్నాడు మొహిందర్ సింగ్.
    "అంతేకాదు. ఎవడయినా అనుమానాస్పదంగా బాగ్స్ తో తిరుగుతూ ఉంటే కనిపెట్టి ఉండాలి!" అన్నాడు క్రిస్టోఫర్.
    వెంటనే ఆ విషయాలన్నీ ఓ పేపర్ మీద రాసి, జిరాక్స్ తీసి అపార్ట్ మెంట్స్ లో వాళ్ళందరికీ పంచిపెట్టాం-
    ఎవరికే అనుమానం కలిగినా వెంటనే సొసైటీ కమిటీకి గానీ లేదా పోలీస్ కి గానీ తెలియజేయాలని అందులో రాశాడు రెడ్డి.

 

                        

 Previous Page Next Page