Previous Page Next Page 

పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 2


    "మరి శవం బ్రదర్స్  అని రాసి ఉందేమిటి బోర్డు?"
    "శివం' అనే రాశారుగానీ పెయింటర్ 'శి' కొంచెం చెడగొట్టాడండీ!"
    "ఎవర పెయింటర్?"
    "తంగవేలు అనే కుచన్ పచేరీ లెండి"
    "కుచన్ పచేరీయా?"
    "అవునండీ!"
    "అంటే?
    "అంటే- ఏమోనండీ! నాకూ సరిగ్గా తెలీదు. ఆ పేరు గలవాళ్ళు సికింద్రాబాద్ లో ఉంటారండీ చాలా ఫేమస్. అతనికి తెలుగు రాదు కదండీ! అందుకని. ఇంతకూ రూమ్ ఎక్కడన్నారు?"
    "శవం బ్రదర్స్ బ్రాందీషాపు కెదురుగ్గా సందులో వందమీటర్లు నడుస్తే ఆకుపచ్చ ఇల్లు వస్తుంది"
    "ఆకుపచ్చ ఇల్లా?" ఆశ్చర్యంగా అడిగాడు మేనేజర్.
    "అవును!"
    "అందులోకేనా మారింది?"
    "ఏం? అందులో ఏమయినా దెయ్యాలు గట్రా వున్నాయా?" అనుమానంగా అడిగాడు సింహాద్రి.
    "అబ్బెబ్బే అదేం కాదండి! ఆ గదిలో ఇంతకుముందు ప్రఖ్యాత రచయిత ధనుంజయగారుండేవారు"
    "ధనుంజయా?"
    "ఆ ఆయనేనండీ! థరూ జెంటిల్మన్. ఓసారి మన హోటల్లో భోజనం చేసి భోజనం అద్భుతంగా వుందని రాత్రి మూడింటివరకూ పొగుడుతూ ఇక్కడే కూర్చున్నాడు. వస్తానండి! పాపం మీ చేయి ఎండిపోయినట్లుంది. భోజనం కానీండి" అనేసి కాష్ కౌంటర్ దగ్గర కెళ్ళిపోయాడతను. ఈలోగా రామనాథం మరోసారి అతనికి ధైర్యం చెప్దామని దగ్గర కొచ్చాడు.
    "భోజనం చేయండి సార్! బాధపడకండి! కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్! అన్నట్లు మీరు రామానుజం ఎవరని అడిగారు కదూ? శ్రీకృష్ణా కాఫీ విలాస్ లో సీనియర్ సర్వర్ లెండి. బాల్డ్ హెడ్! ఈ సారి వెళ్తే కలుసుకోండి. ఎంత మంచాడంటే ఆరుసార్లు తడవకు ఇరవై ఆరూ రూపాయల చొప్పున నాకు అప్పిచ్చాడు. మళ్ళీ నేనిచ్చే వరకూ అడగలేదండి! నేనూ ఇంకా ఇవ్వలేదనుకోండి! అంత గొప్ప మనిషి! అసలు అతని ఖర్మ అలా కాలిందిగానీ వాళ్ళంతా వంశం ఏమిటనుకున్నారు? జమీందారుల ఫామిలీ! అరె! ఎలా వెళ్ళిపోతున్నారేమిటి? భోజనం పూర్తి కాలేదుగా?"
    "ఆ! భోజనమా?" అర్ధం కానట్లు అడిగాడు సింహాద్రి.
    సింహాద్రి వెనక్కు వచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు.
    "తమరేదో చాలా చికాకులో ఉన్నట్లున్నారండీ!" జాలిగా అన్నాడు రామనాథం.
    "అవునోయ్" ఒప్పుకున్నాడు సింహాద్రి.
    ఆ సమయంలో రామనాథం కంటే ఆత్మీయులెవరూ లేరనిపించిందతనికి. రామనాథం విస్తట్లో భోజనం వడ్డించాడు.
    "చికాకులనేవి ఎప్పుడూ ఉంటాయండీ! "కావడి  కొయ్యేనోయ్ కుండల మన్నేనోయ్" అని ఊరికే అన్లేదు. అయినా మనం పట్టించుకోకూడదు. నా సంగతే తీసుకోండి. నా ఇంటి చిరాకులేవో నాకున్నాయ్! అయినాగాని ఇక్కడికి భోజనాని కొచ్చేవాళ్ళ చిరాకులు హోటల్ ప్రొప్రయిటర్ చిరాకులు, ఇవన్నీ కూడా కలిసి పిచ్చెక్కిపోతుందొకోసారి. అయినా నేను ఆ చిరాకులన్నీ పట్టించుకోను. పక్కకు నెట్టేసి...."
    "నాకు చిరాకులేమీ మీద పడలేదోయ్!" అన్నాడు సింహాద్రి.
    "అలాగాండీ!" మరోసారి దెబ్బతిన్నందుకు అసంతృప్తి కలిగింది రామనాథానికి. సింహాద్రి పడుతున్న ఆవేదనను, తన గొప్ప అనుభవపూర్వకమయిన మాటలతో తొలగించాలనుకున్నా ఆ కోరిక నెరవేరడం లేదు.
    "అయ్యో! అదేంటండీ అన్నంలోమంచినీళ్ళు కలుపుతున్నారు?" సింహాద్రి చేస్తున్న పని చూసి కంగారుగా అడిగాడు రామనాథం.
    సింహాద్రి ఉలిక్కిపడి తేరుకుని విస్తట్లోకి చూశాడు.
    అవును. తాను అన్నంలో నీళ్ళు పోసి కలుపుతున్నాడు.
    "ఊహు! లాభం లేదోయ్ -ఇవాళ భోజనం చేయలేను"
    "ఎందుకండీ? ఏం జరిగింది?" ఇంక లాభం లేదని డైరెక్టుగా అడిగేశాడు రామనాథం. సింహాద్రి చేయికడుక్కుని వచ్చాడు.
    "ఇప్పుడు కాదోయ్-మరోసారి చెప్తాను" అనేసి సీరియస్ గా వెళ్ళిపోయాడతను. రామనాధానికి ఆశ్చర్యంతో పాటు జాలి కలిగింది. సింహాద్రిని అలా మార్చేసినది కష్టాలూ కాదు. చికకులూ కాదు- మరేమయి ఉంటుంది? హఠాత్తుగా అతనికో ఆలోచన కరెంట్ లాగా బుర్రలో పాకింది.
    'హా! అవును! గురూగారూ ప్రేమలో పడ్డారు" అనుకున్నాడు హుషారుగా.
    
                         * * * * * *
    
    సింహాద్రి స్టేట్ బాంక్ దగ్గర బస్ దిగి అబిడ్స్ రోడ్ మీద నడవసాగాడు. రొడ్డంతా జనంతోనూ వాహనాలతోనూ క్రిక్కిరిసిపోయి వుంది.
    దూరంగా మైక్ లో ఓ తెలుగు సినిమాలోని బూతుపాట అందంగా, వివరంగా వినబడుతోంది.
    సింహాద్రి మనసు మాత్రం ఆ పాటనూ, జనాన్నీ పట్టించుకోవడం లేదు. ఎక్కడో, ఏవేవో ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నాడు.
    ఉండుండి శ్రీదేవి ఫోటో కళ్ళముందు కనబడి అతని పరిస్థితిని మరింత దిగజార్చేస్తోంది.
    "అంత అందమయిన అమ్మాయిలు నిజంగా ఉంటారా? ఉండే ఉంటారు. లేకపోతే ఆ ఫోటో తనకెలా కనబడుతుంది? ఒరిజినల్ ఉంటేనే గదా- ఫోటో అంటూ వచ్చేది?
    అవును! ఆ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికో ఇల్లు కూడా ఉంది. ఆ ఇంటి అడ్రసూ  ఉంది. శ్రీదేవి, బాంబ్ నిలయం, రెడ్ ఫీల్డ్, విశాఖపట్నం, అంతా బాగానే ఉంది గానీ "బాంబ్ నిలయం" అన్న పేరే తనకర్ధం కావటం లేదు.
    బాంబ్ నిలయం అంటే బాంబులకు నిలయం అన్నమాట. అంటే ఇంట్లో బాంబ్ లుంటాయా?
    సింహాద్రికి ఆ మాట నచ్చలేదు అంత అందమైన అమ్మాయి నివసించేచోట బాంబులు కూడా నివసిస్తాయా?
    నోనో - నెవర్!
    ఆ అమ్మాయి ఉన్నచోట నెమళ్ళూ, పావురాళ్ళూ, కుందేళ్ళూ, లేళ్ళూ, జింకలూ- అలాంటి అందమయిన జంతువులూ, పక్షులూ తప్పితే బాంబులుండడానికి వీల్లేదు.
    హఠాత్తుగా సింహాద్రి భుజం విరిగిపోయినట్లనిపించింది. సింహాద్రి తూలి పక్కకు పడబోయి ఆగాడు.. మరుక్షణం అతని భుజాన్ని అతని నుంచీ వేరు చేయడానికి ప్రయత్నించిన పెద్ద మనిషి సైకిల్ తో సహా అతనిని దూసుకెళ్ళి ముందు నడుస్తున్న మరో ఇద్దరినీ కూడా పక్కకు తోశాక, ఆ తరువాత ఇంకా ముందు చేయి చేయిపట్టుకుని నడుస్తున్న మరో ఓ సర్దార్జీనీ, అతని భార్యనూ సైకిల్ తో విడదీయబోయి కుదరక మధ్యలో దబ్బున పడిపోయాడు. అతని మీద సైకిల్ పడింది. సైకిల్  ఫ్రంట్ వీల్ మీద సర్దార్జీ, బాక్ వీల్ మీద అతని భార్య కూలబడిపోయారు. మరుక్షణం ఆ సైకిల్ బాధితులంతా చుట్టూ మూగిపోయారు. ముందు సర్దార్జీనీ లేపారేవో సర్దార్జీ లేచి తన భార్యను లేపాడు. ఆ తరువాత అయిదారుగురు కలసి సైకిల్ పైకి తీశారు. అప్పుడు అడుగునున్న వ్యక్తి లేచి నిలబడ్డాడు.

 Previous Page Next Page