Previous Page Next Page 

జనపదం పేజి 2

 

    హాలు నిండా దుమ్ము పెరి ఉంది. గోడల నిండా మసి, పగిలిన కుండ పెంకులు చెల్లాచెదురుగా పడి వున్నాయి. అడుగు పెడ్తే గుర్తులు పడ్తున్నాయి. ముఖానికి సాలెగూళ్ళు తాకుతున్నాయి. కర్రతో వాటినన్నిటినీ తీసేస్తూ గదిలో అడుగు పెట్టాడు. అడుగు పెట్టగానే ఘుర్రుమంది. చూశాడు మూలకు పిల్లి - పిల్లలు పెట్టింది. తనవైపే చూస్తోంది. గుర్రుమంటుంది. పులి కళ్ళలా ఉన్నాయి దాని కళ్ళు. పిల్లి! పిల్లికి జంకుతాడా తను! కర్రతో అదిలించాడు. రెండడుగులు ముందుకు వేశాడు. గుర్రుమని ఉరికి వచ్చింది. పిల్లి ఎగిరింది. యుద్ధం ప్రకటించింది. రక్కుతుంది. పారిపోతుంది. మళ్ళీ వస్తుంది. కర్రతో బాది చూస్తున్నాడు. బలరామయ్య. తప్పుకుంటుంది. మళ్ళీ మీద పడుతుంది. అతని ఎత్తు ఎగిరింది. నొసట రక్కింది. కేక పెట్టాడు బలరామయ్య, పోలీసులు బూట్ల చప్పుడైంది. వచ్చేశారు . ఏమీ లేదు పిల్లి! కాని భయంకరంగా ఉంది. గర్జిస్తుంది. మెరిసే కళ్ళతో అందరిమీదా యుద్ధం ప్రకటిస్తుంది. తుపాకులేత్తారు పోలీసులు కాని పిల్లిని చంపరాదు. అంతా కలిసి సతమతం అయినారు. అది అక్కడ్నుంఛీ కదల్లేదు. పిల్లల్ను వదల్లేదు. అంతా విసిగిపోయి బయటికి వచ్చారు. బలరామయ్య వచ్చేశాడు. - ఓడిపోయి!
    అది అతని పడకగది. నున్నటి , తెల్లటి గోడలు, కప్పుకు వ్రేలాడుతూ వుండిన గాజు బుగ్గలు , గోడలకు జపాను బొమ్మలు , ఎత్తైన పందిరిమంచం ఉండాల్సిన చోట పిల్లి కాపురం పెట్టింది. ఆ గది బలరామయ్యకు అనేక మరుతపు గడియమను గుర్తుకు తెచ్చింది. ఎందరు సొగసు కత్తేలు , ఆ గదిలోకి వచ్చినా అసలు దొరసాని ఊర్మిళమ్మే . నిజంగా ఆమెలో అందం ఉంది. వయ్యారం వుంది. సొగసుంది. అన్నిటికీ మించిన ఠీవి వున్నది. కాని ఆమె ఏది? ఇక్కడ్నుంచి వెళ్ళేప్పుడు బాగానే వుంది. బెజవాడలో వ్యాధి పట్టుకుంది. డబ్బు గుమ్మరించాడు బలరామయ్య. అయినా దక్కలేదు. కృష్ణ ఒడ్డుకు చేరుకుంది. జంటగా వెళ్ళి ఒంటరిగా వచ్చాడు బలరామయ్య. అది తల్చుకుంటే అతని కన్నీరు టపటప రాలింది. తల పట్టుకున్నాడు. కూలబడాలనుకున్నాడు. అంతటా దుమ్ము. ఒక కుర్చీ లేదు. కూర్చోలేదు. సాగాడు. ఒకటి రెండు మూడు విశాలములైన గదులు అన్నీ పాడుబడి ఉన్నాయి. దేనికీ తలుపులు లేవు. ద్వారబంధాలు లేవు. గునపాలతో తవ్విన గుర్తులున్నాయి. అక్కడక్కడా సున్నం కూలి పడి వుంది. సున్నంలాగే బలరామయ్య గుండెలు పెచ్చేలు లేస్తుంది.
    వంట ఇంటి మెట్లు దిగాడు బలరామయ్య. దొడ్లో దూరంగా ప్రహరీని అంటుకొని గుడిసె కనిపించింది. అందులో ఏదో ప్రాణి ఉన్న జాడ కనిపించింది. ప్రాణి! ఏదో దగ్గరి సంబంధం పురికొల్పింది. ఏదో ఆత్మీయత గోచరించింది. ఏదో ఆకర్షణ లాగింది. చరచరా నడిచాడు బలరామయ్య. జర్రున జారిపోతున్న పాము కనిపించింది. ఉలిక్కిపడి నుంచున్నాడు. అది గడీలో చాలా కాలంగా ఉంటుంది. ఆ విషయం తెలుసు. తన తాత  చూశాడు. తన తండ్రి చూశాడు. తనూ చూశాడు. అదే పాము తెల్లగా, బారుగా పాము సాగిపోయింది. కలుగులో దూరింది. తోక సైతం లోనికి పోయేదాకా చూశాడు. సాగాడు - గుడిసెలో దూరాడు. గుడిసెలో కుక్కిమంచం . మంచంలో అతివ - కళ్ళలో ప్రాణాలున్నాయి . మంచం పక్కన నుంచొని పరీక్షగా చూశాడు. గుర్తించాడు. అతని గుండె చెరువైంది - "అమృతవాణీ " పిలిచాడు.
    అమృతవాణి - ఒకనాటి అందాలారాణి సౌందర్యరాశి - దొర బాహుబంధంలో నలిగినా పాదాల వద్ద పడి వుండిన కుసుమం. నేడు నలిగిపోయింది. వాడిపోయింది. ఎండి రాలిపోనున్నది. అమృతవాణి ఎక్కడ్నుంఛి వచ్చిందో ఎవరికీ తెలీదు. కాని తెచ్చింది ఊర్వశి - ఆ వూరి వేశ్య . నేటి కాఫీ హోటళ్ళలా నాడు వేశ్యా గృహాలు పల్లెలకు తప్పనిసరి. వేశ్యలు గ్రామ జీవితంలో ముఖ్యాంశంగానే పరిగణించబడేవారు.
    ఆనాడు దీపావళి, తెల్లావారు జామున లేచి స్నానాలు చేసి, మంగళ హారతులు పట్టుకొని బయలుదేరారు అమృతవాణి , ఊర్వశి ఇంటింటికి వెళ్ళి చలిలో మంగళ హారతులు పాడి డబ్బు తెచ్చుకుంటారు. ముందు గడికి వెళ్ళాలి. వెళ్ళారు. బలరామయ్య అప్పుడు ఉరుకులు పెడుతున్న వయసులో ఉన్నాడు. వయసు సొగసులు తీర్చుకున్న అమృతవాణిని చూశాడు. అతనిలో ఏదో చెప్పరాని ఉద్రేకంపొంగింది. అమృత వాణి చేయి పట్టుకున్నాడు కాదంటుందా? కాదనగలదా? వృత్తిలో దించవద్దన్నాడు. గడీలోనే వుండి పొమ్మన్నాడు. తన భాగ్యం పండిందనుకుంది ఊర్వశి. వాస్తవంగానే పండించాడు బలరామయ్య.  అమృతవాణి అతనికి ప్రాణం అయింది కొంతకాలం. తరువాత పురుగులా దులిపేశాడు బలరామయ్య. అయినా అతణ్ణి తప్ప మరోకడ్ని కోరలేదామే- దాసీగా - ఆడబాపగా - జీవితం వెళ్ళబుచ్చింది. ఒక బిడ్డను కన్నది. అతడు రాముడు. ఊరు వదిలి పోయేటప్పుడు ఆవిడను తీసికెళ్ళాలనిపించలేదు దొరకు. ఇక్కడే వదిలి పోయాడు ఈనాటికి ఈ దశకు వచ్చింది.
    అమృతవాణి కళ్ళు తెరిచింది. బలరామయ్య కనిపించాడు. ఒక దేవత కనిపించినట్లయింది. "దొరా!" అని లేచింది. లేవలేక లేచింది. దొర వారిస్తున్నా లేచింది. మంచం దిగింది. ఎముకుల గూడు నేలమీద కూలబడింది. దొరను మంచం మీద కుర్చోమంది.
    "దొరా! దొర్సాని వచ్చినాది!" ధ్వని నీరసంగా ఉంది. అయినా ఏదో ఆశ గోచరించింది.
    "ఇంకాడి దొర్సానే? పోయింది" దుఖం పొంగింది దొరకు. గొంతు పూడిపోయింది.
    "ఏంది! దొర్సాని పోయినాది?" ఊపిరితో వచ్చిన ప్రశ్న అది. "పోయినాది దొర్సాని" అని పెద్దగా ఏడ్పు సాగించింది - ఉన్న బలాన్నంతా పుంజుకొని.
    ఆ ఏడుపు చూసి బలరామయ్యకూ ఏడుపు వచ్చింది, తహతూ, అధికారం, సంపద అన్నీ మరిచి అమృతవాణి మీద పడి భోరుమన్నాడు. "వాణీ పోయిందే దొర్సానీ పోయింది " - "పోయింది దొరా పోయింది" ఇద్దరూ ఏడ్చారు. ఎంతోసేపు ఏడ్చారు. తుదకు బలరామయ్యే అమృతవాణి కన్నీరు తుడిచి ఒదార్చాల్సి వచ్చింది.
    వాణి పొంగిపోయింది.
    ఆ క్షణం కోసమే బ్రతికుందా అన్నట్లు చూసింది.

 Previous Page Next Page