Previous Page Next Page 

అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 2


    అనితకి చాలా సంతోషం వేసింది. కిరణ్ వుత్త మొండి మనిషి. తొందర, కోపం, అన్నీ జాస్తీయే. మొదట ప్రేమించినపుడు అంతే. ప్రేమించావా, లేదా నన్ను చెప్పమని మొండిగా కూర్చున్నాడు. ఆ తరువాత తన పనులు కావాలని మొండితనం. ఇప్పుడుకూడా ఈ వార్త చెపితే మొండిగా తిరస్కరిస్తాడేమో అనుకుంది. కానీ వెంటనే ముందుగా తండ్రితో ఈ విషయం చెప్పి తనను పెళ్ళి చేసుకుంటానని అన్నాడు. కిరణ్ లోకి ఈ మొండితనం, ఆవేశం, పట్టుదలే తనకు ఎంతో వచ్చినది.
    "ఏంటి అనితా ఆలోచిస్తున్నావ్?" కిరణ్ అడిగాడు.
    "నీ గురించే" చిలిపిగా అంది అనిత.
    మరో పది నిముషాల తరువాత ఇరువురు వెళ్ళటానికి లేచారు.
    "మళ్ళీ మనం కలుసుకోవటం వారం తరువాతే కదూ?" అంది అనిత.
    "ఎక్కడ కలుసుకోవాల్సింది నేను చెబుతాను" అన్నాడు కిరణ్.
    ఇరువురు వారి వారి దోవలు పట్టారు.
    
    
                                     2
    
    "హోటల్ మయూరి."
    సమయం.
    గం. 6-10ని.
    వచ్చే పోయే జనంతో మయూరి చాలా హడావుడిగా వుంది.
    ఆ సమయంలో కిరణ్ గోధుమరంగు సఫారి సూట్ ధరించి కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని, చేతిలో చిన్న బ్రీఫ్ కేస్ తో హోటల్ మయూరిలోకి అడుగుపెట్టాడు.
    కిషోరి లాల్ అనే మారుపేరుతో రెండురోజులవరకు డబుల్ రూమ్ బుక్ చేసుకున్నాడు. హోటల్ రిజిష్టర్ లో తను బిజినెస్ వ్యవహారంమీద వచ్చినట్టు రాశాడు.
    "3వ ఫ్లోర్, రూమ్ నం. 44" చెప్పాడు రిసెప్షనిస్ట్, బాయ్ తో.
    కిరణ్ లిస్ట్ లొ తన రూమ్ కి బాయ్ దారి చూపగా వెళ్ళాడు. కాఫీకి ఆర్డర్ ఇచ్చాడు.
    బాయ్ వెళ్ళిపోయాడు "ఎస్ సర్" అంటూ.
    రూమ్ తలుపు వేసి అనితకు ఫోన్ చేశాడు.
    "అరగంటనుంచి నీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను" అంది అనిత చిరుకోపంతో.
    "సారీ డియర్, కొంచెం లేట్" మృదువుగా పలికాడు కిరణ్.
    సారీ చెప్పటంలో చాలా గొప్పవాడివిలే, ఇంతకీ కాయా - పండా?"
    "ఇంకెక్కడ ఇంకా మొగ్గలోనే వుంటే!"
    "ఇలా మాటలు దాటేస్తే నాకు ఒళ్ళుమండిపోతుంది. కాయా - పండా?"
    "చెప్పేకన్నా, చూస్తేపోతుంది కదా!"
    "అలా సిల్లీగా మాట్లాడేవంటే, ఫోన్ పెట్టేస్తాను," అని అనిత చిలిపిగా బెదిరించింది.
    "అయితే పెట్టేయ్ తల్లీ" నవ్వుతూ అన్నాడు కిరణ్.
    "నాకు వళ్ళు మండిపోతున్నది."
    "బాగా మండిపోతున్నదా?"
    "ఆ!"
    "వంటిమీద చెయ్యిచేసి చూద్దామంటే దగ్గరలేనే, సరే ఒకపని చెయ్ ఆ వేడిమీదనే రయిన పరిగెత్తుకుంటూ హోటల్ మయూరి 3వ ఫ్లోర్, రూమ్ నెం. 44కి వచ్చెయ్యి."
    "అదేంటి వున్న వూళ్ళో హోటల్ రూమ్ తీసుకున్నావా?" ఆశ్చర్యంగా అంది అనిత.
    "నీకో ముఖ్యవిషయం ముద్దుగా చెప్పటానికి."
    "రియల్లీ."
    "ఎస్, మేడమ్" తమాషాగా అన్నాడు కిరణ్.
    "వెంటనే వచ్చేస్తున్నాను"
    "వెంటనే రా, కాని....?"
    "ఊ, కాని ఏమిటి తొందరగా చెప్పు అదేమిటో!"
    "నువ్వు రూమ్ కి వచ్చేటపుడు ఎవరైనా నిన్ను ఏ రూమ్ కి అని అడిగితే రూమ్ నం. 44 కిషోర్ లాల్ అని చెప్పు. నువ్వు ఇక్కడకు వచ్చాక అంతా వివరంగా చెప్తాను."
    "నీవరస చూస్తుంటే ఏదో క్రైమ్ పిక్చర్ చూపెట్టే టట్టున్నావ్!"
    "కాదు, మరొకటి."
    "మరేమిటి."
    "బ్లూ ఫిలిం."
    "యూ నాటీ" ముద్దుగా అంది అనిత.
    "వుత్త నాటీనే కాదు, స్వీట్ బాయ్ ని కూడా.
    "వచ్చేస్తున్నా, ఫోన్ పెట్టేస్తున్నా."
    "ఫోన్ పెట్టకుండానే రా" నవ్వుతూ అంటూ కిరణ్ రిసీవర్ క్రెడిల్ మీద వుంచి వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగిన కిరణ్ వులిక్కిపడ్డాడు. బాయ్ చేతులు కట్టుకుని నిలబడ్డాడు.
    "ఏమిటి?" తడబాటును కప్పిపుచ్చుకుంటూ అడిగాడు కిరణ్.
    "కాఫీ తెచ్చాను సర్" వినయంగా చెప్పాడు బాయ్.
    "ఇంకా ఏమన్నా కావాలా సర్?" అడిగాడు బాయ్ వినయంగా.
    తట్టెడు మల్లెపూలు, పుట్టెడు లడ్లు అని మనస్సులో కోపంగా అనుకోని పైకి మామూలుగా "ఇంకేం అక్కరలేదు నువ్వు వెళ్ళొచ్చు" అన్నాడు కిరణ్.
    "ఎస్ సర్" అంటూ బాయ్ వెళ్ళిపోయాడు.
    కాఫీ సిప్ చేస్తూ తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు కిరణ్.
    
                               3
    
    "మే ఐ కమిన్."
    "కిరణ్ తలెత్తి చూశాడు.
    కళ్ళ ఎదుట దేవత ప్రత్యక్షమయినట్లయింది. కళ్ళు విప్పార్చుకుని అలా చూస్తూ వుండిపోయాడు.
    అనిత తెల్లచీర, తెల్ల జాకెట్టు, మల్లెపూలుతో వెలుగులో మెరిసిపోతూ వయ్యారంగా నిలబడివుంది. వైట్ డైయిల్ వున్న వాచ్, మెడలో ముత్యాలహారం అన్నీ ముత్యాలతో చేసిన గాజులు మొదలైనవి ధరించింది అనిత. వెన్నెల్లో విహరించటానికి గంధర్వకన్య అందంగా తయారయి దివికి దిగివచ్చినట్లుగా, అనిత ప్రత్యేకంగా అలంకరించుకుని వచ్చింది.
    కిరణ్ ఆశ్చర్యంలో నుండి తేరుకునేవరకూ అనిత అలా నవ్వుతూ వయ్యారంగా నిలబడి వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS