Previous Page Next Page 

స్వర్గంలో ఖైదీలు పేజి 2


    వచ్చీరాని వయసులో వర్షకి అర్ధం అయింది ఒక్కటే.......అమ్మని ఎవరో తీవ్రంగా మోసం చేసారు! అమ్మకితనూ.....తనకి అమ్మా తప్ప ఈ లోకంలో ఎవరూ తమకి లేరు!
    అప్పటినుండీ వర్ష ప్రతి విషయం తల్లితోనే పంచుకోవడం మొదలెట్టింది. డ్రెస్ డిజైనింగ్ లో డిప్లొమా తీసుకున్న విద్య తన బిజినెస్ అవర్స్ లో తప్ప మిగతా సమయం అంతా కూతురితోనే గడిపేది.
    ఆదివారాలు ఇద్దరూ పిక్ నిక్ కి వెళ్ళేవారు. షాపింగ్ అంటూ మోయలేనన్ని బొమ్మలూ వర్షకోసం పుస్తకాలూ కొనుక్కొచ్చేవారు. విద్య ఏ కొత్త డ్రెస్ డిజైన్ చేసినా చిన్నారి వర్షకి మొదటిగా తొడిగి ఆనందించేది. ఇంటినిండా వర్ష ఫోటోలు లేమినేట్ చేయించి నిలువెత్తుగా పెట్టేది.
    ఆ ఇల్లు ఒక రమ్య హర్మ్యం. ఇతరులు చేధించవీలుకాని దుర్భేద్యమైనకోట! ఆ తల్లీ కూతుళ్ళ ప్యారడైజ్!
    వర్ష పరీక్షలకి చదువుకుంటూవుంటే విద్య ఏదో పని చేస్తూ కూతురితోబాటు మేలుకొనేది. ప్రొద్దుటే వర్ష తల్లికోసం బెడ్ కాఫీ తీసుకొస్తే దగ్గరికి తీసుకుని "యూ ఆర్ మై  ఎవ్రీథింగ్!" అని ముద్దుపెట్టుకునేది.
    వర్ష తల్లిని ప్రతి విషయంలోనూ అనుకరించేది. విద్యవాడే సోపు.... మాట్లాడే విధానం....నడిచే విధానం.....అన్నీ ఆమెకు తెలీకుండానే పట్టుబడ్డాయి. అనుకరణ నిష్కపటమైన ముఖస్తుతి కదా!
    అమ్మచీరకుచ్చెళ్ళలో ముఖం దాచుకున్నప్పుడు అందులోంచి వీచే పెర్ ఫ్యూమ్ సుగంధం అద్భుతంగా వుండేది. అమ్మ చెక్కిలికి తన చెక్కిలి ఆనించిపడుకున్నప్పుడు.....పచ్చికమీద పాకే ఆరుదృల్ని స్పృశించినట్లుగా తోచేది.
    విద్య ఒంటిరంగు వర్షకి రాలేదు. విద్యది పొలాల్లో కుంకుమ కలిపిన రంగు. వర్శది చామనఛాయ. ఈ భేదం తప్ప మిగతా పోలికలన్నీ తల్లివే.
    అద్దం ముందు కూర్చుని తల్లివెంట్రుకల్ని ముడిచేపద్దతి, చీర కట్టే విధానం అన్నీ వర్ష గొప్ప ఆసక్తితో గమనించేది. వర్షకి వయసొచ్చాక ఇద్దరూ చేతిలో చెయ్యి వేసుకుని నడుస్తుంటే చూసిన వారంతా స్నేహితులనుకునేవారు. కానీ తల్లీ కూతుళ్ళు అనుకునేవారుకాదు! వారిమధ్య భేదం పద్దెనిమిది సంవత్సరాలు! కానీ విద్య అలా కనిపించేదికాదు.
    లోకంతో పనిలేనట్లు ఆ ఇద్దరూ నవ్వుతూ, కబుర్లు చెప్పుకుంటూ కనిపించేవాళ్ళు. జెయింట్ వీల్ లో రోలర్ కోస్ట్ లో నోగట్టిగా కేకలు పెడ్తూ అందరి కళ్ళల్లోపడేవాళ్ళు.
    వెండివీ, పింగాణీవీ, గాజువీ రకరకాల టీ సెట్లు సేకరించడం విద్య హాబీ! వర్షకి పింగాణీ సామాన్లమీద పెయింటింగ్స్ వేయడం ఆ విధంగానే పట్టుబడింది. కూతురి కళని గుర్తించి విద్య ఆమెని పెయింటింగ్ స్కూల్ కి పంపించింది. వర్ష మొదటిగా వేసిన చిత్రం విద్యది. వర్షం కురుస్తుండగా తలమీద నుంచి ముసుగు వేసుకుని, చేతిలోని క్యాండిల్ ఆరిపోకుండా పట్టుకున్న తల్లి చిత్రం!
    "ఆ క్యాండిల్.....తనే అని వర్ష భావన! విద్య బిజినెస్ బాగా డెవలప్ అయింది. ఆమె కంపెనీ ప్రోడక్ట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో గిరాకీ పెరిగింది. లేసులు అల్లిన టేబుల్ క్లాత్ లూ, క్రోషా పనితనంచేసిన సోఫా కవర్లూ, జనపనారతో తయారయిన మేట్స్......చీరలమీద చేతిఅద్దకం, పూసలూ, అద్దాలతో చేసిన హేండ్ ఎంబ్రాయిడరీ పనులకి విదేశాల్లో ఆదరణ పెరిగింది.
    ఇండియా అనగానే చాలామంది ఫారినర్స్ కి నెత్తిమీద కుండలు పెట్టుకుని ఎడారిలో రంగురంగుల దుస్తులతో తిరిగే రాజస్థానీ వాళ్ళో, లేక పెద్ద మోటబావిలోలోంచి గాలిమర తిప్పుతూ నీళ్ళు బైటికి తీసే పంజాబీ పడతలో గుర్తొస్తారు. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం విద్యకివెన్నతో పెట్టిన విద్య.
    వర్షనికూడా తన బిజినెస్ లోనే పెట్టుకోవాలని ఆమెయోచన. హాలిడేస్ లో కూతురికి ఎకౌంట్స్ నేర్పించడం, బిజినెస్ గురించి బోధించడం చేస్తుంటుంది. చిన్నప్పటినుండీ చూస్తున్న ఆ వ్యవహారాలు వర్షకి కరతలామలకం అయిపోయాయి.
    వర్ష డిగ్రీ ఫైనల్ ఇయర్ కి వచ్చింది. ఆ వేసవి ఊటీ వెళ్ళాలా, కొడైకెనాల్ వెళ్ళాలా అని వాళ్ళిద్దరూ ఆలోచిస్తూండగా విద్యకి మెడ్రాస్ లోని ఓ పెద్ద ఎక్స్ పోర్ట్ కంపెనీ నుండి సప్లైకి ఆర్డర్ వచ్చింది.
    "ఈ సమ్మర్ ఎక్కడికీ వెళ్ళకుండా ఇలా బోర్ గా పనిలో గడిచిపోతుందేమో!" అని బాధపడింది విద్య.
    వర్షమాత్రం ఉత్సాహంగా సిరామిక్ పెయింట్స్, సిరామిక్ ఫ్యాబ్రిక్స్ తనుచూసుకుంటానంది. రోజులు ఉత్సాహంగా గడిచిపోతున్నాయి.
    ఒకరోజు వర్ష బయటికి వెళ్ళి, తనకి కావాల్సినకుంచెలూ, రంగులూ మొదలయినవన్నీ కొనుక్కుని కాస్త ఆలస్యంగా నే ఇంటికి వచ్చింది.
    ఇంటివాతావరణంలో మాత్రం ఏదో అనూహ్యమైన మార్పు ఆమెకి కనపడింది. వెన్నెలపూతతో వేసవిగాడ్పు చేసిన గాయాల్ని ప్రకృతి కాంత మాన్పు కుంటోంది. కృత్రిమ వెళుతురిని మించి తెల్లని రంగులో వసారాలో గచ్చుమెరుస్తోంది. ఇంటిలోపల్నుండి గిటార్ వాద్యంతో బాటు జలతరంగిణీ వినిపిస్తోంది.
    వర్షవరండా మెట్లు ఎక్కుతూ ఆగి ఆ మోత అమ్మ నవ్వుగా గుర్తించింది.
    అమ్మ అలా తనతో తప్ప ఎవరితో కలిసి నవ్వడం ఆమెకి అనుభవంలోకి రాలేదు. గొప్ప ఆసక్తి తో డోర్ బెల్ ప్రెస్ చేసింది.
    విద్య తలుపు తెరుస్తూనే కూతురి భుజంమీద చెయ్యివేసి"ఇంత ఆలస్యం అయిందేం తల్లీ?" అని అడిగింది.
    తల్లి చెంపలు రోజూకన్నా ఎక్కువగా మెరుస్తూ వుండడం ఆమె పెదవులు అతిఖరీదైన లిప్ స్టిక్ తో కాక తాంబూలంతో ఎర్రబారివుండటం వర్ష గమనించింది.
    "కావల్సిన కాంబినేషన్స్ దొరకలేదు" అంటూ వర్ష అక్కడ కనిపించిన కొత్త వ్యక్తిని చూసి ఆగిపోయింది.
    గొంతువరకూ కోటు బటన్స్ పెట్టుకున్న అతని చెంపల దగ్గర జుట్టు కొద్దిగా నెరసివుంది. కళ్ళులోతుగా చూస్తూ ఎంతో స్వచ్చంగా నవ్వుతున్నాయి. అతని ఒడిలో గిటార్ వుంది. అతని ఎదురుగా వున్న టీపాయ్ మీద అమ్మకి అత్యంత ప్రియమైన జపాన్ టీ సెట్టూ, పక్కనే వెండి పాన్ దాస్ వున్నాయి.
    ఆ టీసెట్టు తల్లి వాడడంవల్ల అతనెంత విలువైన అతిధో వర్షకి అర్ధమైంది.
    "వర్షనా కూతురు యుష్....." అతనికి గర్వంగా చూపించి చెప్పింది విద్య.
    "గ్లాడ్ టు మీట్ యూ యంగ్ గర్ల్!" అతను దగ్గరకొచ్చి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. వర్షకి అలవాటులేని ఆ పురుష స్పర్శ ఒకింత గగుర్పాటు కలిగించింది.
    "మరినన్ను పరిచయం చెయ్యవా?" అతను తల్లిని ఏకవచన సంబోధన చేస్తూ అడగడం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది.
    విద్య నవ్వి "యశ్వంత్...చిన్నప్పుడు మా పక్కింట్లో వుండేవాడు. మా అన్నయ్యకి ప్రాణమిత్రుడు. మంచి పాప్ సింగర్. బేంగ్లూర్ లో స్థిరపడ్డాడుట.....అన్నట్లు నీకు పిల్ల లెంతమందియష్?" అని అడిగింది.
    యశ్వంత్ గిటార్ తీగలు మీటి "పెళ్ళే కాని బ్రహ్మచారిని నీ ప్రశ్నకి ఏం జవాబు చెప్పను?" అన్నాడు.

 Previous Page Next Page