Previous Page Next Page 

మధురమైన ఓటమి పేజి 2


    అనుకోకుండా 'ధర్మా ఎలక్ట్రానిక్స్' నుండి ప్రిలిమినరీ ఇంటర్వ్యూలో సెలక్టయినట్లూ, ఫైనల్ ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ రావడంతో ఇంట్లో అందరికీ కాస్త ఆశ కలిగింది- ధృతికి తప్ప! ఎన్ని చూడలేదు కనుకా... అనిపిస్తోంది.
    
    "ధృతీ ! ధృతీ !"
    
    తన పేరు గట్టిగా వినిపించడంతో లేచి నిలబడింది.
    
    ఫ్యూన్ లోపలికి వెళ్ళమని సంజ్ఞ చేశాడు.
    
    లోపలికి వెళ్ళి "నమస్తే" అని చేతులు జోడిస్తూనే ఆమె మ్రాన్పడిపోయింది. కారణం... అక్కడ కూర్చున్న వ్యక్తి ఇందాక కారులోంచి దిగిన వ్యక్తి కావడమే!
    
    ఆయన కూడా కొద్దిపాటి ఆశ్చర్యంతో ఆమెని చూసి, అంతలోనే సర్దుకుని "ప్లీజ్! సిట్ డౌన్" అన్నాడు.
    
    ఆమె "థాంక్స్" చెప్పి ఎదురుగా కుర్చీలో కూర్చుంది.
    
    ఆయన గొంతు సవరించుకున్నాడు.
    
    ఆమె వూపిరి బిగబట్టి యిందాక స్మఘటన గురించి ఏమైనా అంటాడేమో అని ఎదురుచూడసాగింది.
    
    ఇంతలో ఆయన గొంతు ఖంగుమని మ్రోగుతూ వినిపించింది......"నీకో చిన్న పరీక్ష పెడుతున్నాను. నా పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగం అంటే చాలా చురుకుగా వుండేవాళ్ళు మాత్రమే చేయతగ్గది కాబట్టి నువ్వు వెంటనే పేపర్, పెన్ తీసుకుని నీ ఎదురుగుండా కనిపిస్తున్న వస్తువుల గురించి నువ్వు గమనించినది ఆగకుండా రెండు నిముషాలపాటు వ్రాయాలి. సరిగ్గా రెండు నిముషాలు అవగానే ఆపేయాలి. నేను స్టాప్ అంటాను"
    
    ధృతి వెంటనే పేపర్, పెన్ అందుకుని వ్రాయడం ప్రారంభించింది.
    
    ఆయన ఆలోచించటానికి కూడా ఆగకుండా ఎంతో చకచకా వ్రాయసాగింది.    
    
    "స్టాప్" అని వినిపించగానే ఆపేసింది.
    
    ఆయన ఆమె చేతిలోంచి పేపర్ అందుకుని చదవసాగాడు.
    
    ఆయన చదువుతుంటే ధృతి పెదవులు చిన్న చిరునవ్వుతో విచ్చుకున్నాయి.
    
    అందులో ఇలా వ్రాసింది.    
    
    "ఈయన నాకు ఉద్యోగమిస్తాడో, ఇవ్వడో ఆ దేవుడికే తెలియాలి. చాలా లోతయిన మనిషని కళ్ళు చూస్తే తెలిసిపోతోంది. మనిషి మాత్రం కుర్చీలో నిండుగా, హుందాగా, నీడపట్టున కూర్చోడంవల్ల వచ్చినరంగుతో బాగున్నాడు. చూడగానే ఇటువంటి మామగారో, తాతగారో వుంటే బావుండును అనిపించేట్లుగా వున్నాడు. బహుశా అలా అనిపించడానికి కారణం ఆయన చెవులలోంచి బయటికి కనపడుతున్న వెంట్రుకలేనేమో! అసలు ఈయన నవ్వు అనే మాటని మరిచిపోయాడేమో పాపం! నాకు కనుక ఉద్యోగమిస్తే తప్పకుండా ఈయనికి నవ్వడం నేర్పిస్తాను. ఈయన నన్ను గుచ్చి గుచ్చి చూస్తుంటే ఈయన చాలా తెలివయినవాడనీ..... వయసులో వున్నప్పుడు బహుశా ఈయన చాలా...." అని ఆపేసింది.    

    అది చదువుతున్నప్పుడు కూడా ఆయన మొహంలో ఏ భావం కనిపించలేదు. పేపర్ మడిచి పెట్టేస్తూ "నేను వస్తువుల గురించి అడిగితే నువ్వు నా గురించి వ్రాశావేంటీ?" అని అడిగాడు.
    
    ధృతి చిన్నగా నవ్వుతూ "నిజం చెప్పాలంటే నా ఎదురుగుండా ముభావంగా కూర్చున్న మిమ్మల్ని చూస్తుంటే నాకూ...." అంటూ పూర్తి చేయకుండా నవ్వేసి అంతలోనే "సారీ" అంటూ ఆపేసింది.
    
    "నేను నీకు వస్తువులా కనిపించానంటావు - అంతే" అభావంగా అడిగాడు ఆయన.
    
    ఆమె నవ్వు బిగబట్టి తలూపింది.
    
    "చూడమ్మా! మనకి అర్జెంటుగా అందవలసిన గూడ్స్ ఎందుచేతనో అందలేదు. అవి వెంటనే కావాలన్న తీవ్రత ధ్వనింపచేస్తూ ఒకే వాక్యంలో ఫోనులో చెప్పాలి. ఏం చెప్తావూ?" అడిగాడు గంభీరంగా.
    
    "మాకు ఆ గూడ్స్ 'నిన్న కావాలి అంటాను" అంది ఇంగ్లీషులో.
    
    ఆయన మెచ్చుకోలుగా తలపంకించి "నీ జీవితం ఎలా వుంటే బాగుంటుందని నువ్వనుకుంటున్నావు?" అని అడిగాడు.
    
    ఆమె సీరియస్ గా చెప్పింది. "నా వాళ్ళందరూ సంతృప్తిగా, ఆర్ధికంగా లోటు లేకుండా, హాయిగా కాలం వెళ్ళబుచ్చగలిగేటట్లు నేను చేయగలిగితే అదే చాలనుకుంటున్నాను."
    
    "ఆర్ధిక ఇబ్బందులు తప్ప మరే ఇతర యిబ్బందులూ లేవా నీకు?"
    
    "లేవు నేను చాలా అదృష్టవంతురాలిని నేనంటే ప్ర్రాణం పెట్టే కుటుంబ సభ్యులతో కూడిన ప్రేమపూరితమయిన గృహ వాతావరణం నాకు వుంది. డబ్బు నా కుటుంబ అవసరాలు తీర్చగలిగేటంత దొరికితే చాలు."
    
    "నీ కుటుంబ అవసరాలు తీర్చగలిగేటంత డబ్బు నీకు దొరికే పక్షంలో నీ కుటుంబానికి దూరంగా వుంటావా?"
    
    ఆమె ఆయన మాటలు అర్ధంకానట్లు చూసింది.
    
    ఆయన కంఠంలో స్థిరత్వం తప్ప తీవ్రత లేదు. "నీ వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం నీ వాళ్ళ సమక్షాన్ని నువ్వు త్యాగం చేయగలవా?" అన్నాడు.
    
    ఆమె వెంటనే అందుకుంటూ "అందుకు వాళ్ళు కూడా ఒప్పుకోవాలిగా? డబ్బుకోసం నాకు దూరంగా వుండడానికి వాళ్ళు వొప్పుకోరు" అంది.
    
    ఆయన నెమ్మదిగా అయినా ఒత్తిపలుకుతూ "నేను అడుగుతున్నది నువ్వు సిద్దమేనా? అని" అన్నాడు.    

    "నా వాళ్ళ శ్రేయస్సు తప్ప నాకు ఏదీ ఆనందాన్నివ్వదు. వాళ్ళు బాధపడకుండా ఒప్పుకునేటట్లయితే నేనందుకు సిద్దమే. కానీ వాళ్ళు నన్ను వదిలి వుండడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు" అంది అదోలాంటి గర్వంతో.
    
    "పూర్తిగా వదిలిపెట్టేయ్యక్కరలేదు. వారానికి ఒక్కసారి ఇంటికి వెళ్ళి రావచ్చు" అన్నాడాయన తాపీగా.
    
    ధృతి కొద్దిగా కనుబొమలు చిట్లించి "నా ఉద్యోగానికీ, కుటుంబం నుండి విడిగా వుండడానికీ సంబంధం ఏమిటీ?"
    
    ఆయన ఈసారి కాస్త తీవ్రంగా "నీకు నీ కుటుంబ వ్యక్తులమీద ఉన్న ప్రేమా, మమతానురాగాలూ వాళ్ళకు నీ పట్ల వున్నాయో లేక నీవు సంపాదించే డబ్బుమీద మాత్రమే వున్నాయో నీకు తెలియచేయడానికి..." అన్నాడు.
    
    ధృతికి ఆవేశం ముంచుకొచ్చింది. "మీకేం తెలుసని ఈ విధంగా నా కుటుంబ వ్యక్తుల్ని విమర్శిస్తున్నారూ? డబ్బు లేకపోయినా మాకు ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ వుంది. ఆ ఆప్యాయతానుబంధాల వలనే ఒకరిని విడిచి ఒకరం వుండలేము" అంది.

 Previous Page Next Page