Next Page 

బెస్ట్ జోక్స్ పేజి 1

                        బెస్ట్ జోక్స్

                                                         ----యర్రంశెట్టి శాయి

 

                   

 

    "ఒరే శ్రీనూ! నువ్ రోజూ ఇన్ని తప్పులు ఎలా చేస్తున్నావో నాకర్ధం కావటం లేదు. మిగతా వాళ్ళను చూడు- చాలా తక్కువ తప్పులు చేస్తున్నారు-"
    "నేను మిగతా వాళ్ళ కంటే ఒక గంట పెందలాడే నిద్రలేస్తాను టీచర్- అందుకే.."

    డ్రాయింగ్ టీచర్ సడెన్ గా టెస్ట్ పెట్టింది పిల్లలకు-
    "మీకు ఒక గంట టైమిస్తున్నాను. ఎవరికిష్టమయిన బొమ్మ వాళ్ళు వేసుకురండి - బొమ్మ అందరికంటే ముందు వేసిన వారికి మంచి బహుమతి ఇస్తా!" అందామె.
    అందరూ హడావుడిగా బొమ్మలు వేయటం మొదలు పెట్టారు. అయితే చిన్ని అయిదు నిమిషాల్లోనే తను వేసిన బొమ్మ తీసుకెళ్ళి టీచర్ కిచ్చేసింది. టీచర్ ఆశ్చర్యపోయింది.
    "అదేంటి? అప్పుడే వేసేశావా?"
    "అవును టీచర్-"
    ఆ కాగితం ఓపెన్ చేసి దానిమీద అసలు బొమ్మేలేకపోవటం చూసి టీచర్ షాకయింది.
    "దీనిమీద బొమ్మే లేదుగా?"
    "ఉంది టీచర్ -"
    "ఏదీ- కానబడటంలేదుగా- అసలు ఎం బొమ్మవేశావ్ నువ్వు?"
    "ఆవుగడ్డి తినే బొమ్మవేశాను-"
    "ఏదీ గడ్డి ఎక్కడ?"
    "ఆవు తినేసింది కదా- ఇంకెలా కనబడుతుంది టీచర్?"
    "ఓ- అయితే మరి అవేదీ?"
    "గడ్డి తినేశాక ఇంకా అక్కడెందుకుంటుంది టీచర్- వాళ్ళింటికెళ్ళిపోయింది-"
    "ఓరే కిట్టూ- నీకో పొడుపు కథ చెప్తాను- ఆన్సర్ చెప్పు చూద్దాం"
    "అడగండి టీచర్!"
    "ఎప్పుడూ వస్తావస్తా అంటుంది గానీ రాదు- ఏంటది?"
    "రేపు ఉదయం-"

    "డాక్టరు గారూ! రోజూ- పొద్దున్నే లేవగానే ఓ గంటసేపు డల్ గా ఉంటుంది- దీనికి మందేమయినా ఇస్తారా?"
    "ఒకపని చేయండి-రేపట్నుంచీ గంట ఆలస్యంగా నిద్రలేవండి-"
    "ఏంటయ్యా? యాపుల్ ఒక్కటీ పాతిక రూపాయలా? రోడ్ కి అవతలి వేపు షాప్ లో ఎంతో తెలుసా? ఇరవై రూపాయలే-"
    "అయితే మరి అక్కడే తీసుకోపోయారా?"
    "తీసుకునేవాడినే- కానీ స్టాక్ లేదంట-"
    "నా దగ్గరకూడా స్టాక్ లేకపోతే పదికే ఇచ్చేవాడిని-"

    "సార్- నామాట విని మా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి! ఇంతవరకూ తొమ్మిదిమందికి పాలసీ అమ్మాను- అందులో ఎనిమిదిమందికి నెల తిరక్కుండానే పదిలక్షలు పాలసీ మొత్తం వచ్చేసింది-"
    "ఎలా వచ్చింది?"
    "అందరూ స్కూటర్ యాక్సిడెంట్స్ లో ఎగిరిపోయారు"
    "కానీ నాకు స్కూటర్ లేదుగా?"
    "రోడ్ మీద వెళ్ళే వాళ్ళల్లో చాలామందికుంటుంది కదా- డోంట్ వర్రీ"

    "మా మనవరాలు ఎంత ఇంటెలిజెంటో తెలుసా? ఇంకెవ్వరికీ అంత తెలివి లేదంటే నమ్మండి-"
    "అలాగా? ఏం చేసింది?"
    "తన పేరుని క్షణంలో తిరగేసి  కరెక్ట్ గా రాసింది-"
    "అలాగా! మీ మనవరాలి పేరేంటి?"
    "జలజ"

    "ఒరేయ్! నువ్ చేసేవన్నీ వెధవ పనులేగానీ, చాలా నిజాయితీగా ఉన్నవాడిలాగా ఫోజు కొడుతూంటావ్- నేనో కొశ్చెన్ వేస్తా! స్ట్రెయిట్ గా ఆన్సరివ్వు-"
    "ఓకే- అడుగు-"
    "సపోజ్ నీకు ఎయిర్ పోర్ట్ లో కోతి రూపాయలున్న బ్రీఫ్ కేస్ దొరికిందనుకో - ఏం చేస్తావ్?"
    "ఆ బ్రీఫ్ కేస్ ఎవరో ఒక కటిక బీదవాడిదయితే - వెంటనే వాడిని వెతికి ఇచ్చేస్తా"

    "ఒరేయ్ రాజూ- మీ మమ్మీ డాక్టర్ కదా! మీ మమ్మీకి విపరీతమయిన తలనొప్పి వచ్చిందనుకో- ఏం చేస్తుంది?"
    "నన్ను పక్కింట్లో కెళ్ళి సాయంత్రం వరకూ ఆడుకోమని పంపించి వేస్తుంది-"

    "నీతో అదే తలనొప్పి రా! ఎప్పుడూ అధిలేదు  ఇదిలేదు అని లేనిదాన్ని గురించి ఏడుస్తూంటావ్-" చిరాగ్గా అంది తల్లి.
    "ఉన్న వాటి గురించి ఎందుకేడుస్తాను"-

    "ఒరే శీనూ! మీ మమ్మీ నీకో పది రూపాయలిచ్చింది. ఆ తర్వాత మీ డాడీ పది రూపాయలిచ్చాడు. అప్పుడు మొత్తం నీ దగ్గర ఎంత డబ్బున్నట్లు?"
    "జీరో"
    "అదేంటి? నీకు లెక్కలు తెలీదా?"
    "నాకు లెక్కలు తెలుసు టీచర్- కానీ మీకు మామమ్మీ, డాడీ సంగతి తెలీదు-"
    "సునితా! ఎందుకు రోజూ స్కూలుకి లేటుగా వస్తున్నావ్ నువ్వు?
    "దారిలో ఒక బోర్డ్ ఉంది టీచర్- దానివల్ల లేటవుతోంది-"
    "బోర్డా?"
    "అవును టీచర్-"
    "ఏం బోర్డది?ఎక్కడుంది?"
    "అదే టీచర్- రోడ్ పక్కనే ఉంది- దాని మీద నెమ్మదిగా వెళ్ళండి- పక్కనే స్కూలు ఉంది" అని రాసి ఉంది-"

    ఒకావిడ ఒక సూపర్ మార్కెట్ కి హడావుడిగా వచ్చింది.
    "ఇదిగో చూడు! నా జుట్టు రాలకుండా ఆపేదేమయినా ఉందా మీ షాప్ లో?"
    "ఉంది మేడమ్! ఈ పెద్ద చెత్త బుట్టకొనుక్కెళ్ళి ఎప్పుడూ మీ వెనుకే పెట్టుకోండి-"

    "ఒర్ రాజూ- ఇవాళ పొద్దున్న నువ్వేంటిఫిన్ తిన్నావో కరెక్ట్ గా చెప్పనా?"
    "చెప్పండి టీచర్-"
    "ఉప్మా"
    "రాంగ్ టీచర్- ఉప్మా అని ఎలా చెప్పగలిగారు?"
    "నీ మూతికి ఇంకా ఉప్మా ఉంది కదా మరి-"
    "ఉప్మా మొన్న తిన్న టిఫిన్ టీచర్- ఇవాళ ఇడ్లీ తిన్నా-"

    అమెరికాలో ఇద్దరు చిన్న పిల్లలు మాట్లాడుకుంటున్నారు.
    "ఏమోయ్- మీ ఇంటికి కొత్తడాడీ వచ్చారన్నావ్ కదా! నాకు చూపిస్తావా?"
    "అడుగో గార్డెన్ లో చెట్లకు నీళ్ళు పోస్తున్నారు కదా! ఆయనే! పద! ఇంట్రడ్యూస్ చేస్తాను-"
    "ఆయనయితే నాకు తెలుసులే- రెండేళ్ళ క్రితం మా డాడీగా కొన్నాళ్ళు ఉంచుకున్నాం మా యింట్లో-"

Next Page