Previous Page Next Page 

కాలానికి నిలిచిన కథ పేజి 4


    మేమలా సంతోషంలో మునిగివున్న సమయంలో దూరం నుండి ఆర్భాటమైన హాం ఫట్. హూం ఫట్ అనే శబ్దాలు వినిపించసాగాయి. అదిరిపోయాం.

                                              2

    ఆ ఆర్భాటానికి కవి మిత్రుడు బిత్తరపోయాడు. మీ ముష్టి వాయిద్యాలు లోక భీకరంగా మ్రోగుతున్నాయి. పెద్ద పెద్ద మీసాలతో ఉన్న వ్యక్తి ఒకడు "గండ కత్తెర" వేసుకుని వీరావేశంతో సుడిగాలిలా వచ్చి ఆంజనేయస్వామి ముందు మ్రోకరిల్లాడు. దొంగల దేముడు మౌనంగా చూస్తున్నాడు. వాయిద్యాలు తారాస్థాయినందుకున్నాయి.
    రమణ విస్తుపోతూ నాకేసి చూచాడు. నేను చిరునవ్వుతో అతనిని మరేమీ కంగారులేదని వారించాను. ఓ మూల నక్కి చూస్తున్నాడు కవి.
    గండ కత్తెరతో సహా ప్రాణాచారం పడిపోయిన ఆ లోక భీకరుడు లేచి నిలబడ్డాడు. కవి మిత్రుడు ఇదంతా భయం భయంగా కన్నార్పకుండా చూస్తున్నాడు. సన్నగా వొణుకుతున్నాడు.
    ఆ వ్యక్తి లేచి వాయిద్యాలకు అనుగుణంగా చిందులేస్తూ ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు పూర్తిచేశాడు. అవి కూడా పూర్తయ్యాక మరోసారి దొంగల దైవానికి మోకరిల్లి లేచాడు.
    అతను మాలో ఒక్కొక్కర్ని నిశితంగా పరిశీలించి చూడటం ప్రారంభించాడు. కవి మిత్రుడు గుండెల్లో గాలం పడిందని అతని ముఖమే చెపుతూ వుంది. లోక భీకరుడు అలా కొంతసేపు పరిశీలనగా చూచి ధ్యాన సమాధిలో పడ్డాడు. వీరముష్టి వాయిద్యాలు మ్రోగటం ఆగిపోయి ప్రశాంతత నెలకొంది.
    లోక భీకరునివలె కన్పించే ఆ వ్యక్తిని దాదాపు పది సంవత్సరాలనుండి నేనెరుగుదును. కొండవీడుకి ఒక శివారు గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక ముతరాసు కుటుంబంలో జన్మించాడతను. చిన్నతనంలో ప్రక్కలెగరవేస్తూ ఆయాసపడుతూ వుంటే పాల ఉబ్బసం లెమ్మని సర్దుకున్నారు. పెద్దయ్యాక కూడా అది తగ్గలేదు. ఎందరో వైద్యుల దగ్గరకూ, హాస్పిటల్స్ కీ త్రిప్పారు. ఫలితం శూన్యమే.
    అతని పేరు ఓబులు. లోకజ్ఞాన శూన్యులైన ఆ తల్లిదండ్రులు కన్న పదహారుమంది సంతానంలో అందరికన్న కడపటివాడు. ఆ వూళ్ళోనే నాటువైద్యం జంఝామారుతంగా వెలిగిస్తున్న మా కజిన్ కి అతను ఆల్ టైం పేషెంటుగా మారాడు.
    అందువల్ల అతను నాకు చాలాకాలం నుండి తెలుసు. ఎన్ని వైద్యాలు చేసినా ఫలితం కనిపించకపోవటంతో అతను విసిగిపోయాడు. పాతిక సంవత్సరాల వయసు వచ్చినప్పటినుంచీ ఊళ్ళ వెంట తిరగటం సాగించాడు. యోగులు అనుకుని నాటు సన్యాసులతో తిరుగుతుండేవాడు. వాళ్ళెవరైనా అతనికి రోగ చికిత్సకు చిట్కా అందిస్తారని అతని ఆశ.
    అనుకున్నట్లుగా ఒక సన్యాసి గట్టిగా లాగి వదలిన గంజాయి పొగలో స్వర్గాన్ని ఊహిస్తూ ఓ ఉచిత సలహా పారేశాడు.
    ఓబులు పంట పండింది. ఆ సన్యాసి చెప్పిన సలహా చాలా విచిత్రమైనది. పూర్తిగా పిచ్చిపట్టిన వాళ్ళు తప్ప మరెవరూ చేయటానికి సాహసించలేనిది. సన్యాసులు చెప్పే చిట్కాలు అన్నీ ఇలానే ఉంటాయి.
    "ఒరే, ఓబులూ! నువ్వెక్కడ పుట్టావురా?" అన్నాడు సన్యాసి ఓబులు చెప్పిన సమస్య విన్నాడు.
    కొండవీడమ్మ తల్లి ఒడిలో పుట్టి పెరుగుతూండా గురువా! చావెప్పుడో తెలియక ఊగులాడుతున్నా గురువా! నువ్వేదారి చూపాల అన్నాడు ఓబులు. అప్పుడప్పుడే ఒంట పడుతున్న గురు సాంగత్యాన్ని నెమరువేస్తూ.
    "ఓబులా! నేను బోధ గురువునా?" బాధ గురువునా?" గంజాయి పొగలో చుట్టలు తేలిపోతూ ప్రశ్నించాడు ఆ సన్నాసి.
    "అమ్మమ్మ! మీరు బోధ గురువులే గురువా!" అన్నాడు లెంపలేసుకుంటూ ఓబులు.
    "అయితే ఒక పన్జెయ్యి. కొండవీటి కోనల్లో శతాకోటి (సన్యాసుల భాష!) వనమూలికలున్నై. అవన్నీ నిండు పూర్ణిమనాడు రాత్రి జీవ రసాన్ని ఓషధుల దైవమైన చంద్రుడికి నివేదనగా వెలిగ్రక్కుతయి. అప్పుడెళ్ళి ఆ మూలికలు తింటివా నీ రోగం కట్టు. "ఏ మూలిక తినాలో తెలియకుండా నేనేమి చెయ్యాలి గురువా? అది ఫలానా అని చెబితివా నాకు ప్రాణం పోసినట్టే" అంటూ అర్థించాడు ఓబులు.
    "ఆ మూలిక ఏదో నాకు తెలియదు" అన్నాడు సన్యాసి. ఓబులు నీరుకారి పోయాడు. ఆశ చిగురించి ఎండిపోయింది. గుడ్ల నీరు క్రుక్కున్నాడు. వాడి దీనావస్థ చూచిన సన్యాసి కరుణించాడు.
    "ఒరే ఓబులూ! సన్యాసి రహస్యం దేవరహస్యంతో సమానం. మరెవరికీ చెప్పనంటే నేనొక రహస్యం చెప్తాను. అలా చెయ్యి" అన్నాడు సన్యాసి. ఓబులు మహోత్సాహంతో తలాడించాడు. ఓబులు జూలు పట్టుకుని ముందుకు వంగదీసి చెవిలో ఆ రహస్యం ఊదాడు సన్యాసి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS