Previous Page Next Page 

మహావృక్షం పేజి 3

ఆమెని సరిగా పడుకోబెట్టి, దుప్పటికప్పి, లైటార్పి, బెడ్ లైటువేసి, తలుపువేసి తన బెడ్ రూంవైపు వెళ్ళింది.
పావుగంటలో ఫ్రెషన్ అయి డైనింగ్ టేబుల్ దగ్గరికి నడుస్తూ, గోడగడియారం వైపు చూసింది.
పదకొండున్నర అయింది.
పదకొండులోపల డిన్నర్ చేసి ఎంతకాలమైంది? ఇంకో అరగంట దాటితే రోజూ గడిచినట్లే. డైనింగ్ టేబిల్ మీద డిష్ లు మూతలుతీసి చూసింది.
చపాతీలు, ఆకుకూరతో కూర, పెరుగుపచ్చడి వున్నాయి. బాగా ఆకలిగా వుంది, ఒక్క చపాతీ తిని, మళ్ళీ అన్నిటిమీదా మూతలుపెట్టి లైటార్పి, తన గదిలోకి వెళ్ళిపోయింది.
పెళ్ళికాని తల్లి... డెలివరీ అయి బహుశా ఇరవై నాలుగ్గంటలన్నా అయిందోలేదో అనిపిస్తోంది వాలకం చూస్తోంటే... పిల్లని పొదల్లో వదిలేస్తే ఎవరన్నా తీసుకెడతారనుకుందా?
ఆ పొదల్లోంచి ఏ పామో, విషజంతువో వచ్చి వుంటే...? ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జలదరించింది. ఎంత ధైర్యం ఈ అమ్మాయికి, పిల్లని వదిలేసి, పక్కన నుంచుని ఏం జరుగుతుందో గమనిస్తున్నట్లుంది. ఆ బిడ్డని తను ఎత్తుకోగానే వెళ్ళిపోవడానికి ప్రయత్నించి పట్టుబడింది. వెళ్ళి ఏం చేయాలనుకుంది?
చచ్చిపోదమనుకుందా....?
ధైర్యం లేనివాళ్ళు తప్పుడు పనులెందుకు చేస్తారు? ఈమె ఒక్కతే వచ్చిందా? ఈమెకి సంబంధించిన వాళ్ళెవరన్నా కూడా అక్కడికి వచ్చి వుంటారా?
వచ్చి ఉంటే తను వీళ్ళిద్దరినీ తీసుకొస్తుంటే ఊరుకుంటారా! తెల్లవారాక వీళ్ళని ఏం చేయాలి?
ఆమె కదిలే స్థితిలోలేదు. అసలు కదిలించకూడదు. ఆమె తెగింపు ఇక్కడిదాకా తీసుకొచ్చింది కానీ, డెలివరీ అయి రెండురోజులు కూడా కాకుండా ఇలా నడవడం, పరిగెత్తడం_చలిలో....
బాప్ రే.... దీని పర్యవసానం ఏమిటో తెల్లవారితే తనముందు చాలా కాలానికి మరో సమస్య.అనూష ఆలోచిస్తూ పడుకుండిపోయింది. చాలా సేపటికిగానీ నిద్రపట్టలేదు.
ఫోన్ గణగణ మోగుతోంటే, మెలకువ వచ్చింది అనూషకి అప్పటికి ఆరుగంటలైంది.
బలవంతంగా లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ ఎత్తి, "హలో అనూష హియర్" అంది బద్దకంగా.
"హలో అనూ! నేను మణిని" అవతలినుంచి మణి స్వరం కంగారుగా వినిపించింది.
అనూష బద్ధకం వదిలిపోయింది. "హలో మణీ! ఏమిటి? ఈవేళప్పుడు. అప్పుడే తెల్లారిందా?"
"తెల్లారటం కాదు. కొంపలంటుకున్నాయి" ఆందోళనగా అంది మణి.
"ఏం జరిగింది?"
"నువ్వివాళ పేపర్ చూడలేదా?"
"ఏం పేపర్?"
"న్యూస్ పేపరు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రినుంచి ఓ తల్లి శిశువుతో సహా పరారీ" మణి హెడ్డింగ్ చదివి వినిపించింది.
"ఎప్పుడు?" అనూష సాలోచనగా అడిగింది.
"ఎప్పుడేంటీ నా తలకాయ... నిన్న సాయంత్రం.... ఎప్పుడు పారిపోయిందో, ఆ హాస్పటల్ మాదే. నా ఖర్మగాలి ఆ పేషంట్ నా పేషంటే. డెలివరీ అయి నలభై గంటలు ఇప్పటికి. నా ఉద్యోగం ఇంతటితో సరి... మా చీఫ్ నాకు ప్రత్యేకంగా అంటగట్టిన కేసది. నాకు భయంగా వుంది అనూ. ఇంకాసేపట్లో మా చీఫ్ ఫోన్ చేస్తాడు. నా మొహం వాచేలా చివాట్లు పెడతాడు. నా ఉద్యోగం పీకేస్తాడు. బుద్దితక్కువై, నిన్న సంజయ్ వాళ్ళ మ్యారేజ్ డే అని పార్టీ ఇస్తే వెళ్ళాను.
"మణీ! కంగారుపడకు. విషయం కొంచెం వివరంగా చెప్పు. పేషంట్ ఎవరు? ఆమె తాలూకు మనుషులెవరూ లేరా? ఐ మీన్ ఆమె తల్లి, భర్త."
"భర్తా, పాడా? కాలుజారిన బాపతు. తల్లి కూడా లేదు. ఎవరో ఇద్దరు మగవాళ్ళు తీసుకొచ్చి అడ్మిట్ చేశారు రెండురోజులక్రితం, వాళ్ళు ఎవరో బాగా కలిగినవాళ్ళనుకుంటా. రాజకీయవర్గంలో మంచి పలుకుబడి ఉన్నవాళ్ళలా కూడా వున్నారు. డైరెక్టుగా మా చీఫ్ ని కలిసి 'పేషంటు జాగ్రత్త .... మేం తిరిగి వచ్చేదాకా డిశ్చార్జ్ చేయద్దు. ఆమెని మీ కస్టడీలో వదిలేసి వెళుతున్నాం" అని చెప్పారు. ఆయన వాళ్ళ ఎదురుగానే నన్ను పిలిచి ఆ పిల్లను నాకు అప్పగించి జాగ్రత్త, జాగ్రత్త' అంటూ పాటపాడాడు. ఇంకో విషయం తెలుసా?" స్వరం తగ్గించి మణి.
"పుట్టిన పిల్ల ఎవరైనాసరే అనాధశరణాలయంలో ఇచ్చేయమన్నాట్ట ఆ ప్రయత్నాలేవో వాళ్ళే చేసుకుంటారులే అని వూరుకున్నాం. తీరా ఇదిగో ఇలా పారిపోయింది."
"ఆ అమ్మాయి ఎలా ఉంటుంది?" అడిగింది అనూష.
సన్నగా, తెల్లగా, కొంచెం పొట్టిగా, వయసు ఇరవైలోనే వుండవచ్చు. పెద్దకళ్ళు."
"పుట్టింది సాసా? బాబా?"
"బాబే"
"పేరేంటి?"
"నీరజ"
"నువ్వేం కంగారుపడకు. నీ పేషంటు నా దగ్గరే వుంది."
"వాట్?" గట్టిగా కేకపెట్టింది మణి. "నీ దగ్గర వుందా? ఎలా వచ్చింది?" అనడిగింది.
"అంతా వివరంగా చెపుతాను. నువ్వు వెంటనే మన ఆశ్రమానికి వచ్చేయ్. నేను కూడా ఆమెని తీసుకుని అక్కడికే బయలుదేరతాను."
"ఆశ్రమానికి ఎందుకు? నాకప్పగించెయ్. వాళ్ళవాళ్ళు ఇవాళో రేపో వచ్చేస్తారు."
"వాళ్ళు ఆమెకి ఏమవుతారో తెలుసా?"

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS