Previous Page Next Page 

మిస్టర్ 'యూ' పేజి 3

 

    "హే ! జస్ట్ ఏ మినిట్!" అని రోబోని వెనక్కి పిలిచాడు రాజు.
    "ఎస్?" అంది రోబో ప్రశ్నార్ధకంగా.
    'లేటెస్ట్ న్యూస్ ? అన్నడు రాజు.
    వెంటనే , రోబో ఎదుర్రోమ్ము టీవీ స్క్రీన్ లా కనబడటం మొదలెట్టింది.
    దాని బెల్టుకి ఉన్న మీటలు నొక్కి ట్యూన్ చేశాడు రాజు.
    ఆంధ్రప్రదేశ్ వార్తలు కనబడటం మొదలుపెట్టాయి.
    చదువుతున్నాడు రాజు.
    1. రాజధానిలో నీళ్ళ కట కట.
    2. ఆకలితో వృద్దుడి మరణం.
    3. జిల్లాలో నూరు ఆకలి చావులు.
    4.శాసనసభ్యుల జీత భత్యాలు నాలుగు రెట్లు పెంపు.
    5. మత్రివర్గంలో ఇంకో ముప్పయ్ మందికి.
    6. అభివృద్ధి పనుల కోసం పన్నులు రెట్టింపు చేయక తప్పదనీ , ప్రజలు త్యాగాలకు సిద్దంగా వుండాలనీ ఆర్ధిక మంత్రి హితవు.
    7. మంత్రుల జీత భత్యాలు పెంచే బిల్లు.
    8. కుల రక్కసిని రూపు మాపాలని శాస్త్రిగారు , రెడ్డి గారు. చౌదిరి గారు, నాయుడు గారు, శెట్టి గారు, చారి గారు ప్రభ్రుతుల ఉవాచ.
    9. పొడుపు చర్యలలో భాగంగా , అవినీతి విచారణ కేసులన్నీ ఎత్తివేయాలనీ, నిర్ణయం !
    10. ఇంకా యాభై ఏళ్ళలో అందరికి కూడు , గుడ్డా , గుడిసె కనీస ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని , ముఖ్యమంత్రి ఉవాచ."
    'ఈ మిధ్యా జగత్తులో మనం చేసిన పుణ్య కార్యాలు మాత్రమే మన వెంట వస్తాయనీ, అంచేత , తను ఆశ్రమంలో చేయు వజ్రోత్సవాలలో భక్త జనులందరూ పాల్గొని, ధనకనక వస్తురూపేణా విరాళాలు విరివిగా ఒసంగవలయునని ఫలాని స్వామీజీ వారి అనుగ్రహ భాషణ."
    చిన్నగా నవ్వుకుంటూ, చదువుతున్నాడు రాజు. అంతలో ఒక శీర్షిక అతన్ని ఆకర్షించింది.
    "రాకాసి కొనలో నిజం రాక్షసుడు !!"
    గబగబ చదివాడు రాజు.
    భద్రాచలానికి కొంత దూరంలోని దండకారణ్యం అడవిలో రాకాసి కోన అని అక్కడి గిరిజనులు పిలిచే ఒక ప్రాంతం ఉంది. అక్కడ పురాణకాలంలో రాక్షసులు సంచరిస్తూ వుండేవారన్న ప్రతీతి వుంది. భద్రాచలం ప్రాంతంలోనే సీతారామలక్ష్మణులు పర్ణశాల కట్టుకుని వనవాసం చేస్తూ వుండగా, మారీచుడనే రాక్షసుడు మాయలేడి రూపంతో రావటం, సీతమ్మ ఆ లేడిని చూసి ముచ్చట పడి దాన్ని తెచ్చి ఇమ్మని రాముడిని అడగడం , రాముడు అయిష్టంగానే వెళుతూ సీతకి లక్ష్మనుడిని కాపలాగా ఉంచడం, రాముడి బాణానికి నేలకూలిన మారీచుడు "హా! లక్ష్మణా! ' అని రాముడి గొంతుని అనుకరిస్తూ కేక పెట్టడం, పర్ణశాల చుట్టూ లక్షణరేఖను గీసి , దాన్ని దాటి వెళ్ళవద్దని వదిన సీతమ్మకు చెప్పి లక్ష్మణుడు అన్నగారిని వెదుక్కుంటూ వెళ్ళడం, మాయ సన్యాసి రూపంలో రావణాసురుడు వచ్చి సీతమ్మ లక్ష్మణరేఖ దాటి వస్తే తప్ప బిక్ష స్వీకరించనని చెప్పి, ఆమె గీత దాటి బయటికి రాగానే నిజరూపంతో ఆమెను అపహరించుకు వెళ్ళడం -- ఈ కధంతా రామాయణ గాధగా అందరికీ తెలిసిందే.
    పొతే -- రాక్షసులు నిజంగా ఉన్నారా ? వుండేవారా?
    రాక్షసులున్నారని నమ్మడం మనకు కష్టమే !
    అయితే - రాకాసి కోన ప్రాంతంలో ఒక రాక్షసుడు ఇప్పటికే చాలామందిని పొట్టన బెట్టుకున్నట్లూ విశ్వసనీయమైన వర్గాల ద్వారా వార్తలు వస్తున్నాయి.
    రాక్షసుడి బారినపడి , తప్పించుకు వచ్చినా , గాయాలు సెప్టిక్ అయి మరణించిన డుముకు అనే గిరజనుడి శవాన్ని పోర్ట్ మార్టం కి పంపారు.
    బాగా పొడవైన గోళ్ళూ, కోరలూ ఉన్న జంతువూ ఏదో అతన్ని గాయపరచి వుండాలని, గాయాలకు అంటి వున్న నల్లటి వెంట్రుకలని బట్టి అది ఎలుగుబంటి అయి వుండవచ్చుననీ కొందరు వూహిస్తున్నారు. వెంట్రుకలని అనాలసిస్ కి పంపారు.
    చదువుతున్న రాజు కి వళ్ళు మండింది.
    సెన్సేషన్! సెన్సేషన్!
    ప్రతివాళ్ళూ సెన్సేషన్ న్యూస్ వెయ్యాలి !
    సెన్సేషన్ న్యూస్ ఏదీ దొరక్కపోతే వీళ్ళే ఏదైనా క్రియేట్ చెయ్యాలి !
    ఎంతటి బాధ్యతారాహిత్యం? 'రాకాసికొనలో రాక్షసుడు ' అని ఒక మసాలా టైటిలు పెట్టగానే సరిపోయిందా?
    జవాబుదారీ తనం అక్కరలేదూ?
    ప్రజల భయాలనీ, బలహీనతలనీ ఎవడికి వాడుగా క్యాష్ చేసుకుని విజయాలు సాధించడం !
    మనసు పాడయి పోయినట్లుగా అయిపొయింది రాజుకి. కాసేపు రిలాక్స్ అవుతే గానీ మళ్ళీ మనుషుల్లో పడేటట్లుగా అనిపించలేదు.
    అతను న్యూస్ చదవడం అయిపోగానే , బుద్దిగా అక్కణ్ణుంచి కదిలింది రోబో.
    "హే! యూ!" అన్నాడు రాజు మళ్ళీ.
    రోబో ఆగింది.
    పక్కనున్న నీగ్రో కుర్రాడు తెల్లటి పళ్ళు బయటపెట్టి నవ్వుతూ రాజుని చూస్తున్నాడు.
    "కాంపిటిషన్ లో మనల్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతారు కదా ! కాసేపు దీనితో ప్రాక్టీస్ చేద్దామా?" అన్నాడు రాజు ఆ నీగ్రో కుర్రాడితో.
    భుజ బలమే తప్ప బుద్ధిబలం అంతగా లేని ఆ కుర్రాడు అయోమయంగా చూశాడు.
    "వాట్స్ యువర్ నేమ్?" అన్నాడు రాజు , రోబోని.
    "సర్వో" అంది రోబో మెటాలిక్ వాయిస్ తో.
    "కొన్ని ప్రశ్నలు అడుగుతా -- జవాబులు చెబుతావా?"
    "ఐ యామ్ గేమ్!"
    "ఆడవాళ్ళ కోసం విజిల్ వేసేది ఎవరు ?"
    "అల్లరి మనుషులు "
    "కాదు -- ఆడవాళ్ళ కోసం విజిలు వేసేది ప్రెజర్ కుక్కర్ " పోనీ ఇంకోటి చెప్పు. నీళ్ళలో ఈత కొట్టలేని చేపలు ఏవి?
    "ఊ....ఊ....."
    "సింపుల్! చచ్చిన చేపలు! చచ్చిన చేపలు నీళ్ళలో ఈత కొత్తలేవు కదా - ఇంకొకటి - మన పెన్ను కనబడకుండా పోతుంది. చాలా సేపు వెదుకుతాం. చివరికి కనబడుతుంది. వెదుకుతున్న పెన్ను కనబడగానే మనం ఏం చేస్తాం ?"
    "ఊ.......ఊ..........ఊ...."
    "వెదుకుతున్న పెన్ను కనబడగానే మనం వెదకడం మానేస్తాం. అవునా ? బావిలో ....." అతను ఇంకా ఏదో అడగబోతూ ఉండగానే పిలుపు వచ్చింది. ముందుగా అమెరికన్, ఆ తర్వాత ఇంగ్లీషు యువకుడూ, ఆ తర్వాత నీగ్రో కుర్రాడు వెళ్లారు.
    జడ్జీలు కూర్చుని వున్నారు.
    చివరగా రాజు టర్న్ వచ్చింది.

 Previous Page Next Page