Previous Page Next Page 

మొగుడు ఇంకో పెళ్ళాం వజ్రాలు పేజి 3


    గాబరాగా సీత రియాక్షన్ ఏమిటా అని చూశాడు.
    సీత షాక్ తిన్నట్లు చూస్తోంది.
    ఆమె నమ్మలేకపోతోంది. ఇంకెవరో అమ్మాయి 'హాయ్ గోపాల్రావ్' అంటూ అరవటం.
    చప్పున సీత దగ్గరకు చేరుకుని కూల్ డ్రింక్ తీసుకున్నాడు.
    "సీతా! నీకో సంగతి చెప్పానా? జాన్సన్, నికొల్సన్, విల్సన్_ అని ముగ్గురు బ్రదర్స్ వుండేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే మేము కాలేజీ చదివే రోజుల్లో. ఓసారేమయిందనుకున్నావ్? జాన్సన్, విల్సన్ కలిసి నికొల్సన్ అపోజిషన్ గ్రూపులో వున్న కిషన్, మోహన్, భూషణ్ ని ఎటాక్ చేశారు. అప్పుడు రాజేష్, గిరీష్, శిరీష్ లు నికొల్సన్ ని కిడ్నాప్ చేసి_ జాన్సన్, విల్సన్ ని భూషణ్, మోహన్ రూమ్ లో పెట్టారు. ఈ సంగతి తెలిసి జాల్సన్, విల్సన్ లు_ రాజేష్, శిరీష్ లను కిడ్నాప్ చేసుకెళ్ళి భీమేష్, ఉమేష్, రమేష్ రూమ్ లో వుంచారు. కానీ రాజేష్, శిరీష్ ల అన్నయ్య మహేష్ తన గ్రూప్ జగన్, మదన్ లను తీసుకొచ్చి....."
    అలా ఎంతవరకూ చెప్పేవాడోగానీ రజని ఆనందంగా వాళ్ళిద్దరిమధ్య కొచ్చేసింది.
    "హాయ్! ఏమైపోయావ్ ఇన్నాళ్లూ?" అంది ఉత్సాహంగా గోపాల్రావ్ షర్టు తాలూకూ బొత్తాం నిమురుతూ.
    గోపాల్రావ్ కి కొద్ది క్షణాలు మాట రాలేదు. చెమటలు పట్టేసినయ్.
    ఆమె చేతిని గొంగళి పురుగుని తీసిపరేసినట్టు విదిలించికొట్టాడు.
    సీత మొహంలో ఎక్స్ ప్రెషన్ క్షణక్షణానికీ భయంకరంగా మారిపోతున్నాయి.
    "ఎక్స్ క్యూజ్ మీ_ హూ ఆర్ యూ?" అన్నాడు రజనీని జీవితంలో అదే మొదటిసారి చూస్తున్న ఎక్స్ ప్రెషన్ తో.
    ఆపదల్లో ఇరుక్కున్న సమయాల్లో భారత ప్రజలు ఇంగ్లీషులో మాట్లాడితే ఆ ప్రమాదాల నుండి తప్పించుకుని బయటపడే అవకాశాలు ఎక్కువగా వుంటాయని గోపాల్రావ్ కి దీప్ కుమార్ ఓసారి ఇంగ్లీష్ లో లెక్చర్ ఇస్తున్నప్పుడు చెప్పాడు.
    ఆ తర్వాత ఒకటి రెండుసార్లు ఆ సూత్రాన్ని అమలు చేసి అది నూటికి నూరుపాళ్ళు నిజమని ఋజువు చేసుకున్నాడు గోపాల్రావ్. అందుకే ఇప్పుడు ఇంగ్లీషులోకి వచ్చేశాడు.
    "వ్వాట్? హూ ఆర్ యూ? ఒక్క నెల రోజులు కలుసుకోక పోయేసరికి వ్యవహారం అంత దూరం వచ్చేసిందా?" ఆశ్చర్యపోతూ అందా పిల్ల.
    సీతకు ఆ దృశ్యం చాలా ఆసక్తికరంగా కనబడుతోంది.
    తనింతకు ముందు చూసిన డిటెక్టివ్ సినిమాలకంటే కూడా చాలా బావున్నట్లనిపిస్తోంది.
    "అయామ్ సారీ! మీరు వేరెవర్నో చూసి ఇంకెవరో అని నన్ను అనుకుని... ఊహు... అలాక్కాదు. నేనెవరో అనుకుని ఇంకెవర్నో చూసి నేననుకుని వేరేవరినో ఇంకెవరో అనుకుని నన్ను.. ఊహు... ఇలా కూడా కాదు. నన్ను చూసి ఇంకెవరో అనుకుని మాట్లాడుతున్నారు_ దేరీజ్ సమ్ కన్ ఫ్యూజన్" అన్నాడు సీత తన మాటలు నమ్ముతుందో లేదో క్రీగంట చూస్తూ.
    "ఓహో! అయితే నేనెవరో తెలీదన్న మాట?"
    "ఒక్క ఇంచ్ కూడా తెలీదు."
    "మనిద్దరం ఇంతకుముందెప్పుడూ కలుసుకోలేదన్నమాట?"
    "నెవ్వర్! ఒకవేళ కలుసుకున్నా నన్ను పోలిన వ్యక్తిని కలుసుకుని వుండవచ్చు."
    "ఐసీ! అయితే నేను చాలాసార్లు కలుసుకున్న వ్యక్తి అచ్చంమీలా వుండి వుంటాడని మీరంటారు."
    "షూర్! మనుషుల్ని పోలిన మనుషులంటారని మీరు పేపర్లో చదవలేదా?"
    "లేదు"
    "చదవండి. ఈ మధ్యనే వచ్చిందా ఆర్టికల్. చాలా ఇంటరెస్టింగ్ ఆర్టికల్. ప్రపంచంలో మొత్తం పదమూడు తరహాల మొహాలే వుంటాయట. మొత్తం జనాభా అంతా ఆ పదమూడుమందిలో ఎవరొకరిని పోలి వుంటారట."
    రజనీకి వళ్ళు మండిపోతోంది.
    తనకంటే అందమయిన పిల్ల దొరికినంతమాత్రాన తనను మరీ అంత చీప్ గా ఇన్సల్ట్ చేస్తాడా? ఇలాంటి వాళ్ళను వదిలేస్తే లాభంలేదు. చాలా కఠినంగా బుద్ధి చెప్పాలి. కొత్తగా ఇతగాడి వల్లో పడిన ఆ పిల్లకయినా ఇతగాడి పాడు గుణం టెలికాస్ట్ చేయాలి.
    "ఓ_ఐసీ! మొత్తం జనాభా అంతా పదమూడుమందిని పోలి వుంటారన్నమాట."
    "అవును! కావాలంటే ఈ నెల 24వ తారీఖు ఇండియన్ ఎక్స్ ప్రెస్ చూడండి."
    "తప్పకుండా చూస్తాను. ముఖాలు పదమూడే వుండవచ్చుగానీ పేర్లు కూడా పదమూడే వుండాల్సిన అవసరం లేదనుకుంటాను."
    గోపాల్రావ్ ముఖం పాలిపోయింది.
    రజని తనని మరో చావుదెబ్బ ఎలా కొట్టబోతుందో అర్ధమయ్యేసరికి ముందే నీరసం ఆవహించేసింది.
    "నో నో నో ... నెవర్! పేర్లు కూడా పోలి వుండాల్సిన అవసరం లేదు. అయినా ఒకోసారి పేర్లు కూడా పోలి వున్న సంఘటనలున్నాయి కూడా.." అన్నాడు ఎందుకయినా మంచిదని.
    అనేసి కూల్ డ్రింక్ గడగడా తాగేసి బాటిల్ కౌంటర్ మీద పెట్టి ఇరవై నోటు వాడి మీదకు విసిరేసి_
    "పద సీతా! వెళ్దాం" అన్నాడు హడావుడిగా.
    కాని సీత అక్కడి నుంచి హడావుడిగా వచ్చేయడానికి ఏమాత్రం ఉత్సాహపడలేదు.
    ఈలోగా రజని నెక్ట్స్ డైలాగ్ కొట్టనే కొట్టేసింది_
    "అచ్చం మీలాగా వుండిన మా ఫ్రెండ్ పేరు గోపాల్రావ్! మీ పేరు అది కాదనుకుంటా?" అంది టీజింగ్ గా చూస్తూ.
    గోపాల్రావ్ మీద పిడుగు పడినట్లయింది.
    భయంగా సీత వైపు చూశాడు.
    సీతలో ఆవేశం ఉప్పెనలా వస్తోంది.
    లోపల దాక్కున్న కాళికావతారం నెమ్మదిగా బయటికొస్తోంది.
    ఆమె చేతిలోని కూల్ డ్రింక్ బాటిల్ విసిరికొట్టింది.
    చరచరా అక్కడి నుంచి బయటకు నడవసాగింది.
    గోపాల్రావ్ ఆమె వెంట పరుగెత్తాడు.
    "సీతా... సీతా! వన్ మినిట్."
    "ఛీ! సిగ్గులేకపోతేసరి."
    "ఆ! ఏమన్నావు?"
    "సిగ్గులేకపోతేసరి అన్నాను."
    "ఓ_అదేనా? ఇంకేదో అనుకున్నాను."
    "కాదు_అదే."
    "కానీ నేనిప్పుడు సిగ్గులేనంత పనేం చేశాను?"
    "ఆ మాటడగడానికి సిగ్గులేకపోతేసరి."
    "యూ ఆర్ మిస్టేకెన్ సీతా! ఆ పిల్ల ఎవరో అనుకుని నన్ను చూసి ఇంకెవర్నో పోలి వున్నానని వేరెవరో అనుకుని..."
    "షటప్! మా డాడీకి ఫోన్ చేస్తా. నీలాంటి వాడితో ఇంకొక్క క్షణం కూడా కాపురం చేయటం నావల్ల కాదు."
    "సీతా... ప్లీజ్! నేను చెప్పేది విను."
    "వినను... వినను... వినను... అంటూ సెల్ రింగ్ చేసింది.
    "సీత ప్లీజ్! వద్దు. మీ డాడీకి అసలే కోపం ఎక్కువ."

 Previous Page Next Page