Previous Page Next Page 

కార్నర్ సీట్ పేజి 3


    ఆమె నవ్వింది సుతారంగా.
    "నో...అలా కాదు. మొదటిసారి మనం హోటల్ కి రావటం..."
    "అయితే మీ ఇష్టం."
    యిద్దరూ నవ్వుకున్నారు.
    వాళ్ళను చూస్తూంటే సావిత్రికి కూడా నవ్వొచ్చింది.
    బేరర్ మళ్ళీ వచ్చాడు వాళ్ళ దగ్గరకు.
    "రెండు ఐస్ క్రీమ్స్!" చెప్పాడతను.
    "నేను ఐస్ క్రీమ్ తింటే లావయిపోతానని చెప్పాడు మా డాక్టర్."
    "కొంచెం లావయితే ఫర్లేదు__ఇంకా అందంగా ఉంటారు."
    "ఊ!"
    ఇద్దరూ నవ్వుకున్నారు మళ్ళీ.
    సావిత్రి మనసులో అలజడి మొదలయింది.
    అప్పుడప్పుడూ కలుగుతుంటూందలా ఒంటరిగా ఉన్నప్పుడు. ఆనందాలు కళ్ళెదురుగా కనబడుతున్నప్పుడు_ తనిల్లు, తనవాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు...
    "ఆ కాసేపూ మనసు అదోలా అయిపోతుంది.
    అశాంతి, అనీజీనెస్ కొద్దినిముషాలు ఆ డిప్రెషన్ లో నుంచి బయటపడలేదు.
    "రేపు కూడా కలుస్తారా?" ఆ యువకుడు ఆమెనడుగుతున్నాడు.
    "ఎందుకు?"
    అతను నవ్వాడు.
    "ఎందుకంటే ఏం చెప్పను?" నాకే తెలీదు.
    ఆమె నవ్వింది.
    "ఇవాళ కలుసుకున్నాంగా..."
    "ఒక్కరోజు చాలదు నాకు..."
    "మరి__"
    "జీవితాంతం ఇలాగే కలసి__అప్పటిక్కూడా సంతృప్తి కలుగుతుందో లేదో__"
    ఇద్దరూ మళ్ళీ నవ్వుకున్నారు.
    "అంతా అబద్ధం..."
    "నా చేయి పట్టుకుని చూడండి."
    "ఏం తెలుస్తుంది?"
    "నాడి కొట్టుకోవటం జాగ్రత్తగా వింటే అందులో నుంచి మీ పేరు వినబడుతుంది."
    మళ్ళీ నవ్వులు...
    "నిన్న ఏం జరిగిందో తెలుసా?" అడిగిందామె.
    "ఏమయింది?"
    "మీరు ఫోన్ చేసినప్పుడు మా సిస్టర్ అక్కడే ఉంది__"
    "ఉంటేనేం?"
    "ఫ్రీగా మాట్లాడటం కుదరదు కదా!"
    బిల్ తీసుకుని కౌంటర్ దగ్గరకు నడిచిందామె... కౌంటర్ దగ్గరున్న ముసలతను చిరునవ్వుతో పలుకరించాడు. "నిన్న రాలేదేం మేడమ్?"
    "మా ఆఫీసుకి సెలవు."
    "ఓ! ఐసీ..."
    మెట్లు దిగసాగింది. వేయింగ్ మిషన్ మీద ఓ లావు పాటావిడ నిలబడి మిషన్ మీద కోపంగా గుద్దుతోంది__
    సావిత్రికి నవ్వు వచ్చింది.
    ఇది చాలా సాధారణ దృశ్యం తనకు.
    ఎప్పుడూ ఎవరొకరు ఆ మిషన్ ని అలా కొడుతూనే ఉంటారు. అది అలా నాణేలు మింగుతూనే వుంటుంది... టికెట్ ఇవ్వకుండా!
    మళ్ళీ బస్__అరగంటలో ఇంటిదగ్గర బస్ స్టాఫ్ లో దిగింది. త్రోవలో దృశ్యాలన్నీ కూడా మామూలే! శిధిలావస్థలో వున్న ఇంట్లో పదిమంది పిల్లలతో అవస్తపడే ముస్లిమ్ స్త్రీ, రోడ్డు పక్కనే రేపో మాపో రాలిపోడానికి సిద్ధంగా వున్న పండుటాకులాంటి ముసలాడు, పెద్దగా టేప్ రికార్డర్ లో పాతకాలంనాటి తెలుగు సినిమా పాటలు వినిపించే కిటికీ, కర్టెన్ వెనుకనుంచి వచ్చేపోయే వాళ్ళను గమనించే ఓ జత కళ్ళూ...
    కొడుకుతోనూ, కోడలితోనూ ఇరవయి నాలుగు గంటలూ పోట్లాడుతుండే ముసలామె.
    ఇల్లు చేరుకుందామె.
    మామయ్య తాగి గట్టిగా తిడుతున్నాడు.
    "నా సంగతి తెలీదు. నేను స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాను. లాఠీ దెబ్బలు తిన్నాను. నాకు ఇందిరాగాంధీ తెలుసు. లాల్ బహుదూర్ శాస్త్రి తెలుసు. విద్వాయ్ తెలుసు...అలాంటిది నిన్నగాక మొన్న వచ్చిన పార్టీవాళ్ళు నా ఉద్యోగం తీసేస్తారా? వీళ్ళ అంతు తేలుస్తాను. రాజీవ్ గాంధీతో మాట్లాడతాను."
    సావిత్రి లోపలి గదిలోకెళ్ళి బ్యాగ్ టేబుల్ మీద పడేసి బాటలు మార్చుకుంది. బాత్ రూమ్ లో ముఖం కడుక్కుంటూంటే సరోజ వచ్చింది.
    "వదినా! ఫైవ్ రూపీసుంటే యిస్తావా?"
    "ఎందుకు?"
    "సినిమాకెళ్తా వదినా. ముద్దుల కృష్ణయ్య! భలే బాగుందంట! అన్నీ డబల్ మీనింగ్ డైలాగులేనట__ సువర్చల చెప్పింది."
    సావిత్రి తన బ్యాగ్ లో నుంచి అయిదు నోటు తీసి ఆమెకిచ్చింది.
    ఎందుకో జాలి సరోజంటే... బహుశా పెళ్ళయి కూడా కాపురానికెళ్ళే భాగ్యానికి నోచుకోలేకపోవటం వల్లనేమో...
    ఆమె వెళ్ళగానే మోహన్రావ్ హుషారుగా విజిల్ వేసుకుంటూ వచ్చాడు.

 Previous Page Next Page