Previous Page Next Page 

తృప్తి పేజి 3


    బస్ లో కూర్చుందన్నమాటే కానీ సింధు ఆలోచిస్తూనే వుంది. పెళ్ళి నిశ్చయమయ్యాక అరుణ్ మొదటిసారి తనింటికొచ్చినప్పుడు తను చామదుంపతో బజ్జీలు చేసింది. అవి తనే చేశానని చెప్పినప్పుడు అతను "నేనదృష్టవంతుడ్ని. నా మనసుకి దారి నీకు తెలుసు" అన్నాడు.
    తనకర్థమయినా కానట్టే "అంటే?" అనడిగింది.
    "భర్త మనసుకి దారి నోటిగుండా అని చాలామంది ఆడపిల్లలకి తెలియక వంట నేర్చుకోరు. నా శ్రీమతి వంట అద్భుతంగా చేస్తింది. నన్నభినందించు" అన్నాడు.
    ఆ మాటలకి తన మనసు రాగరంజితమైంది. అతనెళ్ళిపోయాక ఎన్నిసార్లో తలచుకుని మురిసిపోయింది.
    మరిప్పుడో!
    అతను వంట గురించి రెండుకంటే ఎక్కువ మాటలు మాట్లాడితే విసుగ్గా వుంటోంది. చెయ్యలేకా టైం లేకా తను చాలాసార్లు వంట తప్పించుకుంటుంది. బయట తిందామని ప్రపోజ్ చేస్తుంది. అరుణ్ కి అంతగా బయట తినడం ఇష్టముండదు. అలా అని ఇంట్లో తనకేం సహాయం చెయ్యడు. ఇప్పుడు కనీసం పిల్లల వస్తువులు సర్దిపెట్టడం, అప్పుడప్పుడూ పక్కలవీ సర్ది ఇల్లు నీట్ గా పెట్టడం, ఒక్కోసారి కాఫీ కలపడం లాంటివి చేస్తున్నాడు. కానీ అత్తగారు ఒక్కరోజుండి వెళ్ళిందంటే చాలు అన్నీ మొదటికొస్తాయి.
    'మగాడు పక్కలు మార్చకూడదురా. ఇంటికి దరిద్రం' అనో, "వంట కూడా నేర్పిందట్రా మీ ఆవిడ' అనో మాటలు విసుర్తుంటుంది.
    "ఇద్దరం కష్టపడి సంపాదించి ఇళ్ళనీ, వస్తువులనీ అమర్చుకుంటున్నప్పుడు, కలసి పనిచేసుకుంటే తప్పేమిటి?" అని సింధు అంటే అదో పెద్ద నేరం. సంపాదిస్తోందని గర్వం అంటారు మొహంమీదే.
    "ఏమిటంత ఆలోచన?" అంటూ మొహంమీద చిటికలేసి పిలిచింది కావేరి.
    ఉలిక్కిపడి, అంతలోనే సర్దుకుని "మీరా? ఈ మధ్య కనిపించటం లేదు. బస్ లో రావడం లేదా?" అడిగింది నవ్వుతూ సింధు.
    "లేదు. పెద్దాడికి జ్వరమొస్తే లీవ్ పెట్టాను. బస్ లో రాకపోతే ఇంకెలా వస్తాను? కనీసం లూనా కూడా కొనుక్కొనే స్థితిలో లేను. మీరు మాత్రం ఇంత ఇబ్బందిపడి ఈ బస్ లో రావడమెందుకండీ. ఓ కారు కొనుక్కోవచ్చు గదా?" నవ్వుతూ చనువుగా అంది కావేరి.
    "ఎంత చెట్టుకంతగాలి. అంటే ఎంత ఉద్యోగానికి అంత అప్పు అన్నమాట" అంటూ నవ్వింది సింధు.
    కావేరి కూడా జతకలిపింది. కావేరి ఓ మందుల ఫ్యాక్టరీలో సూపర్ వైజర్ గా చేస్తోంది. భర్త రైల్వేలో గుమస్తా. ఇంట్లో అత్తగారుంటుంది పిల్లల్ని చూసుకోవడానికి. అయినా పిల్లలకే జ్వరమో, విరేచనాలో అయితే కావేరి సెలవు పెట్టాల్సిందే.
    "బాగాలేని పిల్లాడ్ని ఆవిడమీద ఎలా వదిలి వస్తాను చెప్పండి" అంటుంది.
    బస్సులు దొరక్క ఆలస్యమైనరోజు తనేదో తప్పు చేసినట్లు బాధపడిపోతుంటుంది. "ఈపాటికావిడ వంట కూడా చేసేస్తుంటారు. పిల్లలకు అన్నాలు కూడా పెట్టేస్తుంటారు. ఛీ, ఛీ వెళ్ళి తిని పడుకోడం! ఏమనుకుంటారు? ఎంత అసహ్యంగా వుంటుంది?" అంటూ తెగ బాధపడిపోతుంటుంది.
    కావేరి మాటల్నిబట్టి చూస్తే వాళ్ళత్తగారు చాలామంచావిడ. దేనికీ ఏమీ అనుకోదు. కానీ కావేరికో తంటా వచ్చి పడింది. ఆమె ఆడపడుచువాళ్ళు అక్కడికి దగ్గర్లోనే ఇల్లు తీసుకుని ఉంటున్నారు. ఆమె భర్తకి వ్యాపారం బానే సంపాదిస్తాడు. వదినగారు ఉద్యోగం చేస్తోందని తనూ ఓ చిన్న స్కూల్లో చేరింది. పెద్దగా జీతమేం ఇవ్వరు. ఇచ్చినా అదీవిడ చీర్లకే సరిపోదు. అస్తమానం తల్లిమీదొచ్చి పడ్తుంది. "వాడి పిల్లల్ని చూస్తున్నావు. నా పిల్లల్నెందుకు చూడవు?" అని అవసరం లేకపోయినా పిల్లల్నిక్కడే వదిలేస్తుంది. సాయంత్రం పూట ఇక్కడేం వండినా, కూరల్తో సహా పట్టుకుపోతుంది. ఆదివారం కూడా పిల్లల్ని తల్లిమీద వదిలేసి భార్యా, భర్త సినిమాలకో, షికార్లకో వెళ్ళిపోతారు.
    "ఆవిడ అటూ ఇటూ చెయ్యలేక నలిగిపోతున్నారు. అప్పుడప్పుడు వెధవ ఉద్యోగం వదిలిపారేద్దామనిపిస్తుంది. కానీ ఇద్దరాడబిడ్డల పెళ్ళిళ్ళు చేశాము. ఆయన జీతం అటే పోతుంది. నా జీతంతో ఇల్లు నెట్టుకురావాలి. పిల్లలు రెండేళ్ళుపోతే కాస్త గడికడ్తారని ఓర్చుకుంటున్నాను" అని ఓసారి చెప్పింది కావేరి.
    వాళ్ళవాళ్ళ స్టేజీలొచ్చేంతవరకూ పిల్లల గురించీ, వాళ్ళ సమస్యల గురించీ పిచ్చాపాటీ మాట్లాడుకుంటూనే ఉంటారిద్దరూ.


                                         *    *    *    *


    చాటలో బియ్యంపోసి ఏరుతోంది తులశమ్మ. కళ్ళు సరిగ్గా ఆనటం లేదు. 'జోడు పాతదయిపోయింది. ఓసారి పరీక్ష చేయించుకోవాలి' అనుకుంది పైకి తోసుకుంటూ.
    "బామ్మా! ఆకలి" అంటూ వచ్చాడు గోపి.
    "అయిపోయింది నాన్నా. ఒక్క ఐదునిమిషాలు" అంటూ అతికష్టంమీద లేచి వంటింట్లోకి నడిచింది తులశమ్మ.
    "అన్నం పెట్టకపోతే బిస్కట్లన్నీ తినేస్తా"నని బెదిరించాడు వాడు బిస్కెట్ల డబ్బా పుచ్చుకొని.
    "ఒరేయ్ నాన్నా! తప్పమ్మా. అమ్మ తిడ్తుంది. రెండు తీసుకో మిగతావి పెట్టెయ్" అని ఆవిడ అరుస్తున్నా వినిపించుకోకుండా డబ్బాతో వీధిలోకి పరుగుపెట్టాడు.
    "ఒసేయ్ సీతా, వల్లీ చూడండే వాడ్ని, అమ్మొచ్చిందంటే అందర్నీ కలిపి తిడుతుంది" అంటూ కంగారుపడిపోయిందావిడ.
    ఆవిడ కంగారుకి అర్థం ఉంది. సీతా, వల్లీల తర్వాత చాలారోజులకి ఎన్నో పూజలూ, వ్రతాలు చేస్తే గోపీ పుట్టాడు నర్మదకి. వాడంటే తల్లికీ తండ్రికి కూడా గారం. వాడు చేసే ప్రతి అల్లరి పనికి తిట్లూ దెబ్బలూ ఆడపిల్లలకే తగుల్తుంటాయి.
    "మీరున్నదెందుకు? చూసుకోవచ్చుగా" అంటుంది నర్మద.

 Previous Page Next Page