Previous Page Next Page 

రాగోదయం పేజి 3


    "మా టొరస కన్నా బాబుగారూ! మీ రెందుకలా చేస్తారు?" వినయంగా అన్నాడు జానయ్య.
    "సర్లే! ఈ మాటలకేం గాని పద! పొలమెళ్లి కాడి అటు తిప్పుకుని రా! నువ్వు దున్నుతూ వుంటే నీ కొడుకు పారపని చేస్తాడు. ఇద్దరికీ మద్దినాల గంజినీళ్ళు పోస్తాం!"
    అంతలో సద్దిమూట కట్టుకుని బయటికి వచ్చింది చంద్రమ్మ. ముఖాన కాసంత కుంకుమ బొట్టు, ముక్కుకు ముక్కెర, ముంత కొప్పు. నలభై సంవత్సరాల వయస్సు వస్తున్న యింకా యిరవయిలో వున్నట్టుండే శరీరం గట్టితనం, తీరైన ముక్కు నవ్వితే తళతళలాడే పలువరస, మిల మిల మెరిసే చెక్కిళ్ళు, నల్లగావున్నా, లక్ష్మీదేవి మాలగూడెంలో మకాం పెట్టినట్టుగా వుంటుందీ చంద్రమ్మ.
    ఆమెని చూస్తే చౌదరికి ఒళ్ళూ కళ్ళూ నిలవ్వు.
    "ఇదోలయ్యా సద్ది!' అంది ఆమె.
    "ఆఁ...ఆఁ నీళ్ళు నమిలేడు జానయ్య.
    "ఆ....ఇంకేం సద్ది కూడా తెచ్చింది చంద్రమ్మ పద!" అన్నాడు చౌదరి.
    కనుబొమలు ముడేసింది చంద్రమ్మ.
    "బాబుగారి చేలోకిపనికి పోవాలంట! కాడి తిప్పుకుని రమ్మంటున్నాడు!" నసిగేడు జానయ్య.
    "ఇప్పుడెట్టా అవుద్ది" చికాగ్గా అంది చంద్రమ్మ.
    "సరే! సరే! రేపేరా" రాజీగా అన్నాడు చౌదరి.
    సద్ది అందించి లోపలికి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళగానే మైకం దిగింది చౌదరికి.
    "ఒరే జానయ్యా! ఇదేం బాగాలేదు. ఆడవాళ్ళతో వ్యవహారాలెందుకు నాకు? డబ్బు కోసం నువ్వొచ్చావా అప్పుడు? అదొచ్చిందా?
    "బాబ్బాబూ! ఈసారి కెళ్ళిపోనీండి. మళ్ళా మీరు రేపు రాకుండానే కాడిగట్టుకుని వస్తా!" ప్రాధేయ పడ్డాడు.
    అనవసరమైన ఘర్షణ ఎందుకని, అందువల్ల ఫలితమూ వుండదని మౌనంగా వెళ్ళిపోయాడు చౌదరి.
    ఆయనటు వెళ్ళగానే ..అమ్మయ్య!" అని నిట్టూర్చాడు జానయ్య.
    "కయ్!" మని వచ్చింది బయటికి చంద్రమ్మ.
    "ఏందయ్యా యిది? మనం యింకా ఎంతియ్యాల? పదేండ్లు దాటిపోయింది అప్పు తీసుకుని. ఏటా రాయిస్తా వున్నాం పత్రం, మనకి ఎళుతున్నాం. పంట ఏస్తున్నాం. ఎంత యిచ్చినామో, ఎంత మిగిలిందో ఎప్పుడైనా లెక్కా డొక్కా చూసుకున్నావా? అడిగితే సెపుతున్నాడా? నువ్వెప్పుడో కొంప ముంచుతావు!"
    జానయ్య సమాధానం యివ్వలేదు.
    "ఏం? ఇట్టా ఎన్నాళ్ళు దేకాలి వీళ్ళకి? ఇంకా చాలక కాడి కట్టు కెళ్ళిందాన్ని మల్చుకుని వీనికెళ్ళాలంటావా? కండ్లు గుట్టి సస్తన్నాడా? రేపు కాడి ఎల్లొద్దు.ఈయాల, మాపటాల వాడూ నువ్వూ వెళ్ళి లెక్కా డొక్కా తేల్చుకోండి!"
    విసుగ్గా చూశాడు జానయ్య.
    "ఏం, అట్టా చూస్తవు?"
    "నీకు తెలియదు నువ్వూరుకో. వెళ్ళు!" లేవబోయాడు జానయ్య.
    "ఇదిగో....నన్నిట్టా ఏమార్చలేవు! నేనూ వాడూ వెళ్ళి అడుగుతాం. అంతే! నువ్వు యిట్టాగే యింట్లో వుండు!"
    "గాజులు తొడుక్కుని కూర్చుంటాలే! ఇంకేం? కొడుకు పెద్దోడు అయినాడు. బిడ్డ చేతికంది వచ్చింది. నీకు మొగునితో పనేం వుంది. నేను వెళ్ళి సన్నాసుల్లో కలుస్తా. మీ యిష్టం వచ్చినట్టు చేసుకోండి.
    "మా లావు సన్నాసం? ఎట్టెల్తావో నే సూడమా? నేనూ వెంబడొస్తా నీ సన్నాసం గిన్నాసం ఏట్లో కలుస్తాది. అయినా నువ్వట్టా బయపడతావేంది?"
    "భయం కాదే ఎర్రిమొగమా? నీతి నిజాయితీకి బయపడతన్నా. మాటకు కట్టుబడతన్నా అంతే!"
    లేచి వెళుతోన్న భర్తని చూసి "హుఁ మనకి మిగలేది ఆకరికి యీ నీతీ నిజాయితీలే! అంతే! తినను తిండి వుండదు. కట్టుకోను బట్ట వుండదు. ఆఖరికి మన బతుకులు యిట్టా వెళ్ళిపోతాయి. వాళ్ళు హాయిగా మిద్దెలూ మేడలూ కట్టుకుంటారు. పొలం పుట్రా నగానట్రా పెంచుకుంటారు. మనం రేయి చస్తే దియ్యకుండదు. పగలు చస్తే కూటికి వుండదు!" అని అనుకుని భారమైన మనసుతో లోపలికి వెళ్ళి పోయింది.

 Previous Page Next Page