Previous Page Next Page 

మధుపం పేజి 2


    "మీరెవరు, మీకెలా తెలుసు ఈ విషయం.....' అట్నించి కాసేపు మౌనం.
    "అదంతా అవసరమా. నే చెప్పిందానిలో నిజానిజాలు మీరే తెల్సుకోండి...." ఫోను పెట్టేసిన శబ్దం. అఖిల విసుగ్గా సెల్ పక్కన పడేసింది. .... ఓ అమ్మాయి మాట్లాడింది అంటే ఇందులో నిజం వుందేమో. అదే మొగగొంతుకయితే తనని ఏడిపించడానికో, పనిపాట లేకో సరదాగా చేసారేమో అనుకోవచ్చు..... అన్పించింది అఖిలకి. రెండు మూడు సార్లు ఆ సెల్ నెంబరుకి ఫోన్ చేశాక ఈరోజు మాట్లాడగల్గింది. మాట్లాడాక సమస్య తీరకపోగా మరింత ఆలోచనలో పడేసింది అఖిలని.

                                *    *    *    *
    
    రాత్రి డైనింగ్ టేబిల్ దగ్గర నల్గురు కూర్చుని భోజనం చేస్తుంటే ఆ మెసేజ్ లు గుర్తు వచ్చి కార్తీక్ మొహం పట్టిపట్టి చూసింది అఖిల. కార్తీక్ భోం చేస్తూ కొడుకు కూతురుతో సరదాగా మాట్లాడుతున్నాడు. "డాడీ, డాడీ నాకు ఓ స్కూటీ కొనాలి డాడీ. మా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళాలంటే ఆటోలో అంటే బోర్..... కొన్ని చోట్ల ఆటోలు దొరకడం లేదు. 'ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ముగ్ధ తండ్రి దగ్గర ముద్దులు గునుస్తుంది. "హైదరాబాదు లో .... యీ ట్రాఫిక్ లో స్కూటీనా..... నో వే. అది మాత్రం అడక్కు..... సేఫ్ కాదు. వద్దు నాన్నా" కార్తీక్ కూతురికి నచ్చజెప్పాడు.
    "డాడీ, ఐ.ఐ.టి ఎంట్రన్స్ డేట్ అనౌన్స్ చేశారు చూశారా. ఇంటర్ పరీక్షలయిన పది రోజులకే .... అసలు టైమివ్వలేదు.... ఎలా చదవాలి..... "టెన్షన్ ఫీలవుతూ అన్నాడు మానవ్. "ఎప్పుడూ అంతే గదా ..... ఎంట్రన్స్ లన్నీ ఒకదాని తర్వాత ఒకటి అవుతూనే ఉంటాయి. మరీ అందుకేగా ఇంటర్ ఫస్టియర్ నించి కోచింగ్ లో జాయిన్ అయింది. ఎలా వుంది ప్రిపరేషన్. కొడుకుతో మాట్లాడుతున్న కార్తీక్ ని చూస్తె ఎంత బాధ్యత గల తండ్రి.... ఓ భర్త, ఇంటి యజమాని. పెద్ద ఉద్యోగస్థుడు.నలబైనాలుగు ఏళ్ళు ఉండి యిలా చిల్లర మల్లరగా అమ్మాయిలతో అఫైర్ జరుపుతారా... మౌనంగా తింటూ అన్యమనస్కంగా ఉన్న అఖిలని చూసి "ఏమిటలా నిశబ్దంగా కూర్చున్నావు.... డల్ గా ఉన్నావు వంట్లో బాగాలేదా!" కార్తీక్ భార్యని చూస్తూ అడిగాడు . అఖిల తలెత్తి కార్తీక్ వేపు సూటిగా చూసింది. జవాబివ్వలేదు. ఆ చూపుకి కాస్త తడబడి ..... "ఏంటి, ఏమయింది." అడిగాడు.
    "ఏం లేదు చూస్తున్నాను మిమ్మల్ని. ఏదో కొత్తగా కన్పిస్తుంది మీ మొహం" అంది.
    కార్తీక్ ముందు కాస్త తడబడి సర్దుకుని , ఏమిటి..... "ఏమిటి కొత్తగా ఏం కొమ్ములు మొలిచాయా నా మోహంలో ' జోక్ గా అనేశాడు. "అదే కొమ్ములు ఈ వయసులో ఎందుకు మొలిచాయా అనే చూస్తున్నాను" సరదాగా అన్నట్టే అంది. కమాన్ మమ్మీ.... డాడీని ఎందుకలా ఏడిపిస్తున్నావ్" ముద్దుల కూతురు తండ్రి పక్షాన మాట్లాడింది.
    "ఏమిటో .... ముగ్దా , మీ నాన్న ఏమిటో ఎంగ్ గా, ఫ్రెష్ గా కనిపించడం లేదూ ఈమధ్య, ఏమిటో మార్పు అని చూస్తె ఇవాళ అర్ధమైంది."
    కార్తీక్ మోహంలో రంగు మారింది.
    "పో , మమ్మీ మా డాడీ ఏం మారారు. నాకేం కనపడలేదు."
    "నీకు తెలియదులే, చిన్న పిల్లవి.... మొగుడు కదా , నాకు తెల్సినట్లు నీకెలా తెలుస్తుంది ఆ మార్పు ' రెట్టించింది నవ్వుతూ.
    "ఏంటి డాడీ. మమ్మీ కొత్తగా మాట్లాడుతుంది?" "ఏమో మీ మమ్మీనే అడుగు' నవ్వుతూనే అన్నా ఆ కళ్ళలో బెరుకు స్పష్టంగా కనిపించింది అఖిలకి.

                                                    *    *    *    *
    "ఏం తల్లీ! ఇన్నాళ్ళకి గుర్తు వచ్చానా. ఏమయిపోయావు ఇన్నాళ్ళు, ఓ ఫోనన్నా లేదు. ఏమిటి మహీ, మనం బొత్తిగా మరమనుషుల్లా తయారవుతున్నాం. మానవ సంబందాలన్నవి లేకుండా పోతున్నాయి. ఒక ఊర్లో వుండి, నెలకోసారన్నా మాట్లాడుకోలేక పోతున్నాం. మూడు నాలుగు నెలలకోసారన్నా కలుసుకోలేక పోతున్నాం' అఖిల గబగబా అంది. 'ఏయ్ , అపు, ఏం అనకుండా ముందరి కాళ్ళకి బంధాలు వేయడం, ఏం తెలివే తల్లీ. ఫోను చెయ్యంది , కల్సుకోనిది నేనా నీవా." మహిమ దబాయింపుగా అంది.
    "సారీ ....సారీ...... నాదే తప్పు . ఏం పాడు ఉద్యోగాలే..... మనిషిలో శక్తి పీల్చేసి నిర్జీవంగా తయారుచేస్తున్నాయి. నీకేం తల్లి లెక్చరర్ ఉద్యోగం. బోలెడు తీరిక. కావలసినన్ని శలవులు. ఈ ఇంజనీరింగులు, ఎమ్మెస్ లు చేసి మేం ఇలా యిరుక్కుపోయాం."
    "సరే యీ గోల ఎప్పుడూ వుండేదేగా. నిన్ను చూడాలి. మనం ఎప్పుడు కలుద్దాం.
    రేపు ఆదివారం రాగలవా..... పోనీ ఇద్దరం సరదాగా ఐమాక్స్ సినిమాకి వెడదామా!
    "ఆ ...ఆ ...." చిన్న పిల్లలా సంబరంగా అంది.... "ఎన్నాళ్ళయిందే సినిమా చూసి పిల్లల్ని కూడా రమ్మందామా ...." వద్దు వద్దు మనిద్దరమే..... మనం మాట్లాడుకోవాలి .'
    'పోనీ సినిమాకి వద్దు. లుంబిని పార్కు కు రా....ఫ్రీగా మాట్లాడుకోవచ్చు."    
    "ఏమిటీ, ఎనీ ప్రాబ్లం....!" ఆరాటంగా అంది అఖిల.....' అదేం లేదు. రా. ఆరుగంటల కల్లా రావాలి!' ఫోను పెట్టేసింది.
    
                                 *    *    *    *
    "అయితే అన్నీ తెలిసి కూడా తెలీనట్లుండి పోతావా!" అప్పటికి అరగంట నించి ఇద్దరి స్నేహితురాళ్ళ మధ్య ఆ విషయమే మాటలు జరుగుతున్నాయి. "అతనికి. నీకీ విషయం తెల్సునన్న విషయమైనా తెలిస్తే కాస్త భయపడి పిచ్చి వేషాలు మానుతాడుగా..."
    "అబ్బ మహీ , చూడు నిజం చెప్పాలంటే నాకీ విషయం మాట్లాడాలంటే, తల్చుకోవాలంటే విసుగ్గా అసహ్యంగా వుంది. ఏదో ఏడవనీ అని వదిలేయాలనిపిస్తుంది. అవన్నీ అడిగితే అబద్దాలు, వాదాలు , మాటల యుద్దాలు, అరుపులు, కేకలు గొడవలతో మనశ్శాంతి పోగొట్టుకోవాలని లేదు. ఇంట్లో టీనేజ్ పిల్లలు, వాళ్ళ చదువులు , డిస్టర్బ్ అయి వాళ్ళు భయపడి, బాధపడి యిల్లంతా అశాంతి నింపుకోవాలని లేదు. సాక్ష్యాలు చూపి నిలదీస్తే, నా ఇష్టం అంటే నేనేం చెయ్యాలి. తెలిశాక నోరు మూసుకుని నిస్సహాయంగా సహించడం నా ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టడం కంటే, తెలీనట్టు ఉండిపోవడం నయం అన్పించింది."
    మహిమ ఆశ్చర్యంగా చూసింది. "నీలాంటి పెద్ద చడువున్న పెద్ద ఉద్యోగస్థురాలూ ఇలా ఆలోచిస్తే మామూలు ఆడదాని సంగతేమీటాని...."
    "మహీ, ప్రాక్టికల్ గా ఆలోచించు. ఈ విషయంలో మొగుడితో దెబ్బలాడి విడిపోమ్మంటావా, విడిపోయి ఈ వయసులో నే సాదించేదేముంది. ఇద్దరు టీనేజ్ పిల్లలు, వాళ్ళ పై చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు..... ఇవన్నీ ఒక్కచేతి మీద లాక్కురాగలవా. పిల్లలకి వాళ్ళ నాన్నతో ఎంత ఎటాచ్ మెంట్. తండ్రిని దూరం చేశానని నామీద కోపం, ద్వేషం పెంచుకోవచ్చు. ఇంట్లో ఈ టెన్షన్, అశాంతి , నా ఉద్యోగం మీద పడవచ్చు. ఇప్పటికే ఆఫీసులో టెన్షన్ భరించలేకపోతున్నాను. ఇంట్లో కూడా శాంతి లేకపోతే..... అందుకే ఏదో ఏడవనీ, ఈ మగాళ్ళకీ మోజులన్నీ నాల్గురోజుల ముచ్చటే! మగాళ్ళకి పెళ్ళయ్యాక 'సెవెన్ ఇయర్ ఇచ్' అని మొదలవుతుందట. పెళ్ళాం కాస్త పాతబడి, ఇద్దరు పిల్లలు పుట్టుకోచ్చాక కొత్త రుచుల కోసం ఆరాటపడ్తారట. మా ఆయనకి ఈ 'ఇచ్' కాస్త ఆలస్యంగా వచ్చింది కాబోలు. నలబై ఏళ్ళు దాటాక వాళ్ళలో ఇంకా అమ్మాయిలని ఆకర్షించే శక్తి వుందా. రొమాంటిక్ ఫీలింగ్స్ మిగిలాయా ..... టెస్ట్ చేసుకోవడం కోసం కొత్త రుచుల వైపు దృష్టి మళ్ళుతుందిట.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS