Previous Page Next Page 

వైరం పేజి 2


    ఈ ఫ్లయిట్ లో ఒక ప్రివిలేజ్ డ్ ట్రావెలర్! స్పెషల్ గా తనకోసమే ఫస్ట్ క్లాస్ లో ప్రైమ్ సీటు ఒకటి రిజర్వు చేసి వుంచారు.
    మరి వాళ్ళ ఎంప్లాయీ మిస్ యూనివర్స్ గా సెలెక్ట్ అయిందంటే ఎయిర్ లైన్స్ కీ గొప్పేకదా!
    ఇంక పబ్లిసిటీనే పబ్లిసిటీ!
    ఈలోగా సరదాగా ఒక్కరోజు తన మాజీ కొలీగ్స్ తో గడపాలని ఈ ప్రయాణం పెట్టుకుంది తను.
    ఎయిర్ హోస్టెస్ లూ, పర్సర్ లూ, డ్రింక్స్ సర్వ్ చేస్తున్నారు.
    రొటీన్ గా అయితే ఫ్రూట్ జ్యూసెస్, సాఫ్ట్ డ్రింక్స్, విస్కీ, బ్రాందీ, బీర్, ఓడ్కా...
    కానీ -
    ఇవాళ్టి విషయం వేరు!
    'వాళ్ల' సునయన. మిస్ యూనివర్స్!
    సెలెబ్రేషన్స్ కి సింబాలిజంలాగా విమానంలో షాంపేన్ ప్రవహిస్తోంది!
    "షాంపేన్?" అంది ఓ ఎయిర్ హోస్టెస్ సూరజ్ తో ఆనందంగా.
    "జస్ట్ ప్లెయిన్ వాటర్ ప్లీజ్!" అన్నాడు సూరజ్. అతని గొంతు తడి ఆరిపోతున్నట్లుగా అయిపోతుంది.
    తను సిక్ అయిపోతున్నాడా?
    అరుణ ఆలోచనలతో!
    'మిస్ యూనివర్స్' సునయన వైపు అందరూ ఆరాధనా పూర్వకంగా చూస్తూ ఉంటే -
    అతను మాత్రం అన్యమనస్కంగా చూశాడు.
    చిత్రంగా, అతనికి విషాదం లాంటి భావన కలిగింది.
    ఈ చెక్క బొమ్మనా మిస్ యూనివర్స్ అంటే! అరుణ అందంతో పోలిస్తే ఈ అమ్మాయి ఆఫ్టరాల్ కదా!
    కానీ అతనికి తెలియదు.
    పెళ్ళిళ్ళ మార్కెట్ లో గనక అరుణని పెళ్ళిచూపులకి కూర్చోబెడితే, సగటు గుమాస్తా కూడా కట్నం కాస్త ఎక్స్ ట్రా కావాలని అడుగుతాడని!
    నిజానికి ఆమాట అరుణే చెప్పింది.
    ఏమాత్రం కరుణ లేకుండా!
    "నేను చాలా చాలా మామూలు ఆడపిల్లని సూరజ్! నువ్వు ఊహించుకుంటున్నంత గొప్పదానిని కానే కాను. ఇన్ ఫాచ్యుయేషన్ అంటే ఇదే! ఎవరో ఒక అమ్మాయి మీద ఇష్టం కలగగానే, ఇంక ఆమెలో లేని గొప్పతనాన్ని ఊహించుకుని ఆపాదించుకోవడం! నిజానికి నేను పెళ్ళి చూపులు మార్కెట్ లోకి గనక వెళితే, పదిమందిలో తొమ్మిదిమంది అబ్బాయిలు నాలో లేని లోపాలని వెదికి వెదికి వద్దనే వాళ్ళేమో! నువ్వేమో నాలో లేని స్పెషాలిటీ ఏదో చూస్తున్నావు. భ్రమలో నుంచి బయటికి రావడం మంచిది సూరజ్!"
    అదంతా గుర్తొచ్చి నిస్పృహగా నిట్టూర్చాడు సూరజ్.
    మిస్ యూనివర్స్ సునయన సూరజ్ పక్కనుంచే వెళ్తోంది.
    సునయనని తాకితే చాలు, ఆమె పీల్చి వదిలిన ఊపిరిని పీలిస్తే చాలు, తమ జన్మ ధన్యమైపోతుందన్నంత తమకంగా వున్నారు చాలామంది.
    "ఏంవెర్రి!' అనుకున్నాడు సూరజ్ అసహనంగా. ఆ వెనువెంటనే మళ్ళీ అరుణ ఆలోచనలలోకి జారిపోయాడు.
    అప్పుడు -
    భూమికి మూడు కిలోమీటర్ల ఎత్తున, దాదాపూ మూడువందల టన్నుల బరువుని మోసుకుంటూ, గంటకి వెయ్యి కిలోమీటర్ల వేగంతో ఆకాశ మార్గాన దూసుకుపోతున్న ఆ రెండు అంతస్తుల బ్రహ్మాండమైన బోయింగ్ జెట్ -
    దడదడలాడడం మొదలెట్టింది!
    కొద్ది క్షణాలపాటు, అది మామూలు ఎయిర్ టర్ బ్యులెన్స్ అనుకున్నారు రెగ్యులర్ పాసెంజర్స్.
    విమానం వెనుక వరస సీట్లలో కూర్చున్న సూరజ్ లాంటి వాళ్ళకి ఆ కుదుపులు మరీ ఎక్కువగా తెలుస్తున్నాయి.
    గతుకుల రోడ్డులో వెళ్తున్న బస్సు చివరివరసలో కూర్చున్నట్లే!
    కానీ - ఒక్కసారిగా విమానం ఆల్టిట్యూడ్ కోల్పోతూ, భూమి వైపు జారిపోవడం మొదలెట్టింది.
    గజగజలాడిపోతోంది విమానం.
    సడెన్ గా ఎడమపక్కకి ఒరిగిపోయింది.
    బాలెన్స్ తప్పి, సూరజ్ ఒళ్ళో పడింది సునయన.
    వేగంగా, అతివేగంగా, మరింత వేగంగా కిందికి కిందికి జారిపోతోంది విమానం!
    సన్నటి భయం కలిగింది సునయనకి.
    ఎయిర్ టర్బ్ లెన్స్ అంటే తనకి బాగా అనుభవమే!
    పెనుగాలులని తప్పించడానికి పైలట్లు విమానాన్ని పైకీ, కిందకీ తీసుకెళ్తారు. పక్కలకి పోనిస్తారు.
    కానీ- పడిపోవడం ఇంతసేపు అంటే...
    విమానం మరింతగా, మరింతగా ఎడమవైపు ఒరిగిపోతోంది.
    షాంపేన్ సర్వ్ చేస్తున్న ఎయిర్ హోస్టెస్ లూ, పర్సర్ లూ నిలబడడానికి పట్టు దొరకక, ఫ్లోర్ మీదికి జారిపోయారు.
    ట్రాలీలో నుంచి షాంపేన్ బాటిల్సు కిందపడిపోయి దొర్లుతున్నాయి.
    పిల్లల ఏడుపులు!
    ఒక పాసెంజర్ ప్రాణభయంతో విహ్వలంగా పెట్టిన పెను కేక! ఆ వెనువెంటనే మరిన్ని ఆర్తనాదాలు!
    ఇంకా పక్కకి ఒరిగింది విమానం.
    ఇంకా కిందికి జారుతోంది.
    హఠాత్తుగా అర్థం అయింది సునయనకి.
    దిస్ ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ గోయింగ్ ఇన్ టూ ఎ స్పిన్!
    అంటే, పట్టు తప్పి తన చుట్టూ తానే గిరికీలు కొట్టడం - సూత్రం కుదరని గాలిపటంలా.
    విమానం గనక ఒక్కసారి స్పిన్ లోకి వెళ్తే-
    ఈస్ దిస్ ద ఎండ్?
    అంత భయంలోనూ కూడా ఆమె ఒక విషయం గమనించింది!
    అట్లాంటి భయానకమైన పరిస్థితిలో కూడా, అక్కడ వున్న అంతమందిలోనూ-
    నిర్వికారంగా, నిశ్చలంగా కూర్చుని ఉన్నది అతనొక్కడే!
    ఒళ్ళో వున్నది మిస్ యూనివర్స్ అన్న స్పృహ లేదు.
    కనీసం, ఆడపిల్ల అన్న అవేర్ నెస్ కూడా లేదు.
    తమ అందరి జీవితాలకీ ఇదే చివరి అధ్యాయమేమోనన్న భీతి లేదు.
    తనని మాత్రం పింగాణీ బొమ్మని పట్టుకున్నట్టు భద్రంగా పొదువుకుని వున్నాడు.
    నథింగ్ లెస్! నథింగ్ మోర్!
    ఆ క్షణంలో -
    సూరజ్ ఆలోచనలన్నీ గిరికీలు కొడుతున్నది ఒక అమ్మాయి చుట్టూ.
    అరుణ!
    ఉల్కలాగా ఊహాతీతమైన వేగంతో భూమివైపు దూసుకు వచ్చేస్తోంది ఆ విమానం!
    కొద్ది నిమిషాల తర్వాత అది భూమిని తాకడం నిశ్చయమే!
    అంత బరువున్న ఆ ఎయిర్ క్రాఫ్ట్, అంత ఎత్తునుంచి, అంత వేగంగా వచ్చి భూమిని తాకిందంటే..
    ఎక్స్ ప్లోజన్! మంటలు! మృత్యువు!
    నిర్వేదంగా అనుకుంటున్నాడు సూరజ్.
    "ఇదేగనక నా జీవితపు చివరి అధ్యాయం అయితే, ఈ చివరిపేజీ, చివరి పంక్తిలోని చివరిమూడు అక్షరాలూ..."
    అ...రు...ణ. అవ్వాలి.
    ఇదే గనక తన లైఫ్ లోని లాస్ట్ సీన్ అయితే, తన మనోఫలకం మీద మెదిలే చివరి దృశ్యం అరుణ రూపమే అయితీరాలి.
    అరుణ...అరుణ...అరుణ.
    ఆ మూడు అక్షరాలే తనకి ఒక మంత్రమయినట్లుగా జపిస్తున్నాడు సూరజ్.
    అంతలోనే -
    ఆ విమానంలోని ఏ భాగాలు ఎలాంటి పనిష్ మెంటుకి గురయ్యాయో గానీ, విమానం కర్ణకఠోరంగా మూలిగినట్లుగా అనిపించింది.
    విమానం పడిపోతూ ఉండడంతో బాలెన్సు తప్పి సూరజ్ ఒళ్ళో పడిపోయి, అలాగే ఉండిపోయిన సునయన, సడన్ గా అలర్ట్ అయింది.
    ఏం జరుగుతోందీ!
    విమానం కిందికి జారిపోతున్న వేగం ఒక్కసారిగా తగ్గిపోయింది.
    అంతలో - గాల్లోనే గడ్డకట్టిపోయిందా అని భ్రాంతి కలిగించేలా -
    విమానం ఒక్కక్షణంసేపు నిశ్చలంగా ఉండిపోయినట్లుగా భ్రమ!

 Previous Page Next Page