Previous Page Next Page 

మిస్టర్ 'యూ' పేజి 2

 

    అంత రష్ లో కూడా తనని ఎయిర్ పోర్ట్ దగ్గిర దింపడానికి 'ఎవర్ రెడీ' అంటూ వచ్చిన తన బెస్టు ఫ్రెండు నందూ వైపు ఎంతో అభిమానంగా చూస్తున్నాడు రాజు.
    క్రీగంట చూపులతో నందూనే చూస్తోంది యువ.
    నందూ ఎప్పుడూ అన్నని అంటిపెట్టుకుని ఉండేది తన కోసమని యువకి తెలుసు.
    తన బాయ్ ఫ్రెండు నందూ.
    త్రేతాయుగంలో పుట్టి ఉండవలసిన అపర శ్రీరామ చంద్రుడి లాంటి అన్న రాజుకి ఇట్లాంటి విషయాలన్నీ ఓ పట్టాన గమనానికి రావు ! అది కూడా యువకి తెలుసు.

    
                                           *    *    *

    ఆ రోజే 'మిస్టర్ యూనివర్స్' టైటిల్స్ కి ఫైనల్స్ .
    అతి తేలికగా ఫైనల్సు కి చేరుకోగలిగాడు రాజు.
    అతనితో బాటుగా ఒక అమెరికన్, ఒక రష్యన్ , ఒక నల్లజాతి వాడు కూడా పైనల్సు కి చేరుకున్నారు.
    కో స్పాన్సర్ చేస్తోంది ఓ అమెరికన్ బట్టల కంపెనీ.
    జడ్జీలు ముగ్గురు.
    వాళ్ళలో -- డిటర్జెంట్ కంపెనీ వాళ్ళ ఏజెంటు లాంటి జడ్జి ఒకడు.
    బట్టల కంపెనీ వాళ్ళు ఏం చెబితే అది చేసే మనిషి రెండో జడ్జి.
    మూడో జడ్జి గా ఒక నాన్ రెసిడెంట్ ఇండియన్ ఉన్నాడు.
    నిప్పులాంటి మనిషని పేరు. ఏ రకమైన వ్యసనాలు లేవు.
    పైనల్స్ కి కొద్ది సేపు ముందర -- ఒక పది నక్షత్రాల హోటలు లాబీలో కలుసుకున్నారు బట్టల కంపెనీ ఓనరు బ్రాడ్ మాన్, డిటర్జెంట్ కంపెనీ ఓనరు హారిసన్.
    "ఇప్పుడే తెలిసింది నాకు" అన్నాడు డిటర్జెంట్ కంపెనీ ఓనరు పదునుగా .
    ఒక్క క్షణం తెల్లబోయి, అంతలోనే తెప్పరిల్లుకుని, "అప్పుడే తెలిసిపోయిందా? సరేలే ఎప్పటికో ఒకప్పటికి తెలియకుండా పొదుగా!" అన్నాడు కులాసాగా.
    "వెన్నుపోటు అంటే ఇదే!" అన్నాడు డిటర్జెంట్ కంపెనీ యజమాని.
    "కాదు -- బతకనేర్చినతనం అనాలి " అన్నాడు బట్టల కంపెనీ యజమాని.
    'అసలు జన్మలో ఉతకనవసరం లేని రకం బట్ట ఒకటి తయారు చేసినట్లు మాతో చెప్పకపోవడం నమ్మకద్రోహం! అసలు అట్లాంటి బట్ట ఒకటి తయారుచేయడమే అన్యాయం!"
    "మరి బతికి బట్టకట్టాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా- పైగా , ఇందులో ఎంతో సోషల్ సర్వీసు వుంది. మేం తయారు చేసిన బట్ట ఎవర్ షైన్! ఎప్పుడూ మాయదు ! ఎందుకంటే -- ఈ బట్టకి దుమ్మూ, ధూళీ అతుకున్నా కూడా వెంటనే  గాలిలో ఉన్న తేమ సాయంతో దాన్ని అదే క్లీన్ చేసేసుకుంటూ ఉంటుంది. అందుకు కావాల్సిన కెమికల్స్ నేతలోనే కలుస్తాయి. అంటే, ఆ బట్టతో చేసిన డ్రస్సు వేసుకుంటే వేసుకున్నంత సేపూ అది తనని తను క్లీన్ చేసేసుకుంటూ వుంటుందన్నమాట . పిల్లి తనని తాను నాకుతూ ఒళ్ళంతా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేసుకుంటున్నట్లుగా! సోషల్ సర్వీస్ మైడియర్ సర్!"
    "నా మొహమేమీ కాదూ?" అన్నాడు డిటర్జెంట్ ఫ్యాక్టరీల యజమాని.
    "కట్టుకున్న బట్ట అసలు మాయకపోవడం అంటే ఉతకనవసరం లేదు గదా. మా డిటర్జెంట్ ఇండస్ట్రీ మూతబడుతుంది ."
    "టెక్నాలజీ అంటే మజాకానా మరి -- టెక్నాలజీ డెవలప్ అయిన కొద్దీ కొందరు బాగుపడతారు. మరి కొందరు మట్టి కొట్టుకు పోతారు -- మట్టి కొట్టుకు పోయే టర్న్ మనదయినంత మాత్రాన మనసు కష్ట పెట్టుకోకూడదు మైడియర్ సన్!"
    "నీ గేమ్ ప్లాన్ నాకు తెలుసు! మాపులేని బట్టలు అని మందికి అలవాటయ్యేదాకా ఇవి అమ్ముతావు. ఈ ధాటికి ప్రపంచంలోని మిగతా క్లాత్ మేకర్స్ అందరూ దివాలా ఎత్తేస్తారు. అప్పుడు నువ్వు మళ్ళీ ఈ వండర్ క్లాత్ ప్రొడక్షను ఆపేసి మామూలు బట్టలు తయారు చేస్తావు. మాయకుండా చిరగకుండా ఉండే బట్టల అమ్మకం ఎన్నాళ్ళు సాగించి లాభాలు చేసుకోగలవూ? ఆ తెచ్చిన ఒక మనిషి ఒక జత బట్టలు కొనుక్కుంటే జీవితం గడిచిపోతుంది గదా! నీకు మళ్ళీ సేల్సు వుండవు.
    ఇది గొప్ప టెక్నాలజీ కావచ్చును గానీ గొప్ప అమ్మకాలకి లాభాలు రావు. అంచేత నీ ప్రత్యర్ధులు దివాలా ఎత్తాక నువ్వు మూడు పూటల్లో మురికిపట్టి , మూడు నెలల్లో చెరిగిపోయే , మాములు బట్టలు భారీ ఎత్తున తయారు చేస్తావు. కూర్చున్న కొమ్మను నరుక్కునే వాడెవరన్నా ఉంటారా? ఆకలిని చంపేసే మందు కనిపెట్టినా దాని అమ్మకం ఎన్నాళ్ళూ? ఫార్మాన్యూటికల్ ఇండస్ట్రీ దివాలా ఎత్తదూ! అలాగే మాపులేని చిరుగు'పట్టని బట్టలు అంతే! అన్నాడు అక్కసుగా.
    కనిపెట్టేశావే ! అప్పుడు మళ్ళీ నువ్వు నీ డిటర్జెంట్ బిళ్ళలని అమ్ముకోవచ్చు " అన్నాడు బట్టల తయారీదారుడు అసహ్యంగా.
    రోషంగా చూశాడు డిటర్జెంట్ తయారీదారుడు.
    "నువ్వు ఆడించినట్టు అడడానికీ, నువ్వు కక్కిన కూడు తినడానికీ ఇక్కడెవ్వరూ కాచుక్కూచోలేదు " అన్నాడు అక్కసుగా.
    "సో?"
    "మనకి ఇన్నాళ్ళ నుంచీ ఉండిన అండర్ స్టాడింగ్ ఇవాళ్టితో కాన్సిల్! మిస్టర్ యూనివర్స్ పోటీలను మనం ఇద్దరం కలసి స్పాన్సర్ చేస్తున్నాం"
    "ఒక ఇండియన్ ని గెలిపించి , వాళ్ళకి కూడా మన కన్సూమర్ కల్చరు ఇంకా బాగా వంట]
బట్టించాలని చూస్తున్నాం. ఇండియాలో వేలంటైన్ డే పిచ్చి పట్టించి మన వాళ్ళు తమ తమ అమ్మకాలు పెంచుకోలేదూ -- అట్లాగే -- కానీ ఇవాళ్టితో నీకూ నాకూ రుణం తీరింది ."
    "నా కన్ను ఒకటి పోయినా సరే నీ రెండు కళ్ళూ పోతేగానీ నా కళ్ళు చల్లబడవు కాచుకో -- మొదటి దెబ్బ."
    "మన కామన్ కాండిడేట్ గా ఆరోజు అదే కుర్రాణ్ణి గెలిపిద్దామనుకున్నాం -- అది ఎట్టి పరిస్థితిలోనూ జగరనివ్వను " అన్నాడు డిటర్జెంట్ తయారీ దారుడు ఖండితంగా.
    "గుడ్డి కన్ను మూస్తే ఎంత? తెరిస్తే ఎంత? పో! పో! నాకోడీ, నా కుంపటీ లేకపోతే ఈ లోకంలో తెల్లారదనుకుందిట ఎవరో ముసల్ది . అట్లాగే ఉంది నీ బెదిరింపు ! నువ్వు లేకపోతే ఆ మూడో జడ్జి లేడూ- అతన్ని నా వైపుకి తిప్పుకుంటా " అన్నాడు బట్టల తయారీదారుడు ఆగ్రహంగా.
    'అతను ఏ ప్రలోభానికి లొంగడని అందరికీ తెలిసిందే కదా!" అన్నాడు డిటర్జెంట్ తయారీదారు.     
    "బలహీనత లేని మనిషి ఉండడని నా నమ్మకం. నా అనుభవం!" అన్నాడు బట్టల తయారీదారుడు, బ్రాడ్ మన్ దృడంగా.
    
                                          *    *    *
    ఇదంతా తెలియని ఫినలిస్టులు ఒక ఏసీ హాలులో కూర్చుని వున్నారు. ఒక రోబో చక్రాల మీద తిరుగుతూ ,  చేతుల్లో డ్రింక్స్ పట్టుకుని అందరికీ సర్వ్ చేస్తోంది.
    "మార్టినీ?" అంది అది రాజు దగ్గరికి వచ్చి మెటాలిక్ వాయిస్ తో.
    వద్దన్నట్లుగా తల ఊపి , "మజ్జిగ ఉందా?" అన్నాడు రాజు నవ్వుతూ.
    దానికి ప్రపంచంలో వున్న మేజర్ భాషలు అన్నీ వచ్చు -- ఒక్క తెలుగు తప్ప.
    దాన్ని డిజైన్ చేసిన వాడు తెలుగువాడే -- తెలుగువాళ్ళకి తెలుగు మీద ఉండే చులకన భావం ఆ రోబోని డిజైన్ చేయడంలోనే తెలుస్తోంది.
    రాజు చెబుతున్నదేమిటో అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఒక్క క్షణం ఆగి "సారా!" అని ముందుకు కదలబోయింది రోబో.

 Previous Page Next Page