Previous Page Next Page 

మ్యూజింగ్స్ -2 పేజి 2


    "ఆ ఇది నమ్మను. నీవంటివాడికి ప్రత్యక్షం కాకపోదు"
    "నీవంటివాడికి" అనే మాట నువ్వు యే అర్ధంలో వుపయోగించావో గాని నాకేమనిపిస్తుందంటే స్త్రీలో అనేక సౌందర్యాలు చూడగలవాడికి, ఎప్పటికప్పుడు సౌందర్యాలను కల్పించుకోగల వాడికి_అని.
    అసలీ సౌందర్యం చూశాము అనుకుంటామే, అది మన మనసులు ఆ మాయను కల్పిస్తున్నాయి గావును. ఆ ఇంద్రజాలాన్ని కల్పించుకుని చూసే గుణం మనసుతోనే పుడుతుందిగావును! ఎవరికి వారు వారి ఆకర్షణలనూ, గుణాలనూ, రుచులనూ కల్పించుకుంటారు. అనుభవిస్తున్నామనే గుణాలనూ, రంగులనూ బాధలనూ, భయాలనూ, సౌఖ్యాలనూ, ప్రేమలనూ మనసే కల్పిస్తోంది.
    పురుగు మనసు పురుగుకి పురుగులోకాన్ని కల్పించి చూపుతుంది. పక్షి మనసు పక్షికి. రాజు మనసు రాజుకి. లోభి మనసు లోభికి. అసలు యీ పరుగులూ, పక్షులూ, రాజులూ, లోభులూ యెవరూ లేరేమో! వుత్త మనసులేనేమో! అసలు ఒక్క మనసే ఇన్ని మనసులుగా లోకాలు కల్పించుకుని క్రీడిస్తోందేమో! కాని సౌందర్యాన్ని కల్పించుకోగల శక్తే నాకు వస్తే, చి__ నీ సౌందర్యాన్ని ఇంకెవరిలోనూ కల్పించుకోలేనా? కాని నువ్వు ఆధారంగా లేనిది కల్పించుకోలేను. ఎవరూ నువ్వు కారు నాకు. కాని నేను నీలో చూసిన అందాలన్నీ, ఆకర్షణలన్నీ ఇంకెవరన్నా నీలో చూడగలరా? వీల్లేదు చూడలేరు. చూడ్డానికి వీలూ లేదు. ఒప్పుకోను - వారికా శక్తి వుంది అని. కాని నీలో అంత సౌందర్యం నిజంగా లేదా? వుంటే వారి అందరికీ కనపడదా? వుంది. కాని కనపడదు. అంటాను, నాకు వెర్రా! అహంభావమా?
    మన ఇంద్రియాల్ని ఒక్క రవ్వ doubt చేశామా Logic సులభంగా 'బర్క్ లే' వేదాంతానికీ, శంకరాచార్యుడి వొళ్ళోకీ లాక్కెళ్ళి వదులుతుంది మనని. ఆ మిధ్యా, వేదాంతం అన్ని ఉత్సాహాలకీ మృత్యువు. అన్ని అనుభవాలకీ ఆనందాలకీ శత్రువు. ఆ వేదాంతమే, యేదో మానసాతీతమైన ఆనందాన్నిస్తుందంటారు. నమ్మకమెట్లా? స్వర్గానికి పోదామని గంగానదిలో వురికినట్లవుతుంది.
    అవును. నావంటివాడు సౌందర్యాలను కల్పించుకోలేకుండా వుండలేడు. మనసులోని ఆ గుణం నిర్మూలమైతేనేగాని! కాని నిర్మూలం అవడం అవసరమా; అదే మనసులోని జీవశక్తి. దాన్ని చంపితే మనసుని చంపినట్టే! జడత్వానికి వెళ్ళినట్టే __ మనసుకి ఆ గుణం ఎట్లా వచ్చిందంటే Heridity అని కొందరూ, పూర్వ కర్మ అని కొందరూ అంటారు.
    ఇంకోటి తోస్తుంది. అవును ఇంతమందిలో ఇన్ని వస్తువుల్లో నిరంతరమూ శృంగారాన్ని చూస్తామా, యిందరు స్త్రీలను అమితంగా ప్రేమిస్తామా, ఇదంతా, యీ ప్రేమ అంతా__యితర స్త్రీలలో, ప్రదేశాలలో, నా ముందున్న యీ పద్మాలలో, దూరంగా వున్న పటంలోని బుద్ధుడి ముఖంలో __ నేను చూసిన యీ సౌందర్యానికంతా, సూత్రం ఒకటేనేమో!
    చి__ నీలోని నా ఆకర్షణ, నాలోని నీ ఆకర్షణ. అంతా ఒకటేనేమో! ఈ విశ్వ ఆకర్షణలోని కిరాణాలా?
    ఒకరిలో ఒకరికి తృప్తి కలిగితే యీ లోకంలో ప్రవహించే ఆకర్షణ శక్తి మనమధ్య ప్రవహించడం మానిందన్నమాట! అట్లాంటి స్థితికి రావొద్దు మనం.
    మనం కలుసుకున్న తరవాత యీ శరీరాలున్నంతవరకు మన ఆకర్షణను వ్యక్తపరుచుకునేందుకు ఒకటేమార్గం. మన హృదయాలు ఎంత ఆకాశాన విహరించినా, మన చేతులు మాత్రం తాం మామూలు స్థలాలనే విహరిస్తాయి. అందరిలో అంతకన్న నేను ఆశించలేదు. కాని నీతో ఎందుకో అంతటితో తృప్తిపడనంటోంది నా మనసు. అందువల్ల యీ దూరం, యీ కైదు, యీ కాలయాపన, నాకు ఉపకారిగా వచ్చిందా అనిపిస్తోంది. నీతోనైనా చివరికి ప్రేమకి పర్యవసానమంతేనా? అనిపిస్తుంది నాకు. ఎన్ని ఆలింగనాల్లోనించి కూడా నీ వొంటి మెరుగునైనా నా చేతితో తీసుకోలేనే, ఎంత చూసి కూడా నీకళ్ళ కాంతిని కొంచెం ఎరువు తెచ్చుకోలేనే, నీ గడ్డం వొంపుని నాది అనలేనే, ఇంక నిన్ను, నిన్ను, నా దాన్ని__ ఇంకా ఇద్దరం యింకోవిధంగా శరీరాలకన్న దగ్గిరగా వచ్చే మార్గమేదా అని వెతుకుతున్నాను. నీ పెదవుల్ని, కళ్ళని, చేతుల్ని నా వాటిని చేసుకోలేను, కావిలించుకోగలను, అంతే. కాని వాటి వెనకవున్న అందంలోని జీవాన్ని నాతో ఐక్యం చేసుకునే పద్ధతి ఆధ్యాత్మికలోకాల్లో వుందేమోనని నా అన్వేషణ. ఆ పద్ధతే నాకు అన్వయమైందా, నీ సౌందర్య లేశం అందుకోగలిగిన శక్తి కలిగిందా విశ్వసౌందర్యాన్ని మింగగలగనా? ఎందుకంటే నువ్వు నువ్వు కావు. చి__కావు. నా చి__అంతకన్న కావు. ఈ జగత్ర్పేయసి తన సౌందర్యాన్ని నా కళ్లు చూడవని దయదలిచి, నీ రూపాన నాకు ప్రత్యక్షమయింది, అందుకని.
    ఇంత వేదాంతం వ్రాసి చివరికి నేనడిగేది ఒక్క వుత్తరం వ్రాయకూడదా! అని.
    ఒక మిత్రుడు వ్రాశాడు. "చివరికి మీలో యీ వేదాంతం తప్ప యింక యేమీ మిగలదేమో!" అని పొరపాటు. చివరికి నాలో యీ తీరని వాంఛ తప్ప ఏమీ మిగలదేమో! ఇంత వేదాంతమూ వ్రాసి...కావలసిందల్లా చి__నించి ఒక్క వుత్తరమేగా, యీ వేదాంతాన్నంతా మరిపించడానికి! ఇంత వేదాంతానికి కారణమూ ఆమె మౌనమేగా! ఆమె పంజరమేగా!! లోకంలో గొప్ప వేదాంత గ్రంధాలన్నిటికీ యిట్లాంటి విషాద కారణాలే వుండి వుంటాయని నా నమ్మకం. అంతేకాదు, సమస్త శాశ్వత ఘనకార్యాలకూ, ప్రయత్నాలకూ, వాంగ్మయాలకూ వెనక వున్నది స్త్రీ శక్తి!
    "ఎప్పుడూ స్త్రీని గురించే కథలు వ్రాస్తావేం?"
    అంటే జవాబు_
    "ఎప్పుడూ స్త్రీని గురించే తలుచుకుంటావేం?"
    "తలుచుకోను." అంటే
    "ఎందుకు తలుచుకోవు నిర్భాగ్యుడా? అంతకన్న విలువ గలది నీకేం కనపడుతోంది?" అని ప్రశ్న!
    శక్తి అంతా స్త్రీ శక్తి. స్త్రీ శక్తిని అధిగమించిన శక్తి ఏదైనా (ఏమో) వుంటే అది దివ్యశక్తి. దివ్యశక్తి నెరగని నేను స్త్రీ శక్తినారాధించి కథలు వ్రాశాను.
    మొన్న యీ 'వీణ' లోనే గావును, ఎవరో నేను దుర్నీతినీ వ్యభిచారాన్నీ బోధిస్తున్నానని వ్రాశారని చెప్పింది సౌరీస్. ఒక పేరా చదివి వినిపించింది కూడాను.
    దుర్నీతి, వ్యభిచారమూ అనే మాటల అర్ధాన్ని గురించి ఒక గంట నిశ్చలంగా యోచన చేయకూడదా, ఆ వ్యాసం వ్రాయక ముందు? అనుకున్నాను. ఒక గంట తరవాత కూడా వాటిలో విశాలార్ధం గోచరించదా!
    May God help you-next birth!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS