Previous Page Next Page 

డేంజర్ డేంజర్ పేజి 2

   
    "లేదు నేను స్పృహ తప్పి ఈ రోజుకిమూడు రోజులయింది. ఇందులో పొరపాటు లేదు" అనుకుంది.    
    ముందు కర్తవ్యం గురించి ఆలోచిస్తూ వుండిపోయింది కీర్తి.
    
                                                             2
    
    పేలిపోయిన విమానం తాలూకు ఓ భాగం గాలిలో పల్టీలు కొట్టి ఆపై విసురుగా క్రిందపడింది.    
    సీటులో కూర్చున్నా నడుంకి బెల్టు వుండటం వల్ల ఆ సీటు అలాగే భూమిమీద వత్తుగా పచ్చిక వున్న చోటపడింది. కుర్చీ సీటు ఏటవాలుగా కాని పక్కకుగానీ నిలువుగా మామూలుగా కూర్చున్నట్టే పడటం వల్ల కీర్తికి దెబ్బలు తగలలేదు.    
    జరిగింది అవగాహన అయిం తరువాత కుర్చీకున్న బెల్టు విప్పుకుని లేవబోయింది కీర్తి.    
    ఒక్కసారిగా వరసగా డజను తుపాకి గుళ్ళు కాలి లోంచి దూసుకుపోయినట్లు అయి "అబ్బా" అనుకుంది.    
    కాలివేపు చూసుకుంది కీర్తి.    
    బూటుకాలిని కప్పేస్తూ మట్టి పేరుకుపోయింది. అలా గిలక పై భాగం రెండంగుళాల వరకూ వుంది. ఆ మట్టి చెదలు పురుగులు పెట్టే గూడులా వుంది.    
    కీటకాలు కదలకుండా వున్న తన కాలిచుట్టూ గూడు నిర్మించాయని, కాలిలో కొంతభాగం తినేసి వుండవచ్చని కీర్తి తెలుసుకుంది. వంగి చేత్తో మట్టి గూడుని తొలగించబోయింది.    
    రాయికన్నా గట్టిగా వుంది ఆ మట్టి.    
    కీర్తి వేసుకున్న షర్టుకి ఫాషన్ గా పిన్నులున్నాయి. అందరి షర్టులకి పిన్నులు ఫాషన్! కీర్తి షర్టుకి వదిన పిన్నులు అవసరానికి పనికివచ్చే పిన్నులు అంటే పదునైన బుల్లి కత్తుల లాంటివి. ఆ సంగతి కీర్తికి షర్టు తయారు చేసిన వారికి తప్ప ఎవరికీ తెలియదు.    
    కీర్తి షర్టునుంచి రెండు పిన్నులు లాగింది. కాలిమీద మట్టిపై దండయాత్ర సాగించింది.    
    నాలుగైదు పెళ్ళల మట్టి వూడింది.    
    జుయ్యిమనే పెద్ద సభ్ద్మతో పెద్ద పెద్ద అడవి కందిరీగలు బైటికొచ్చాయి! తమ మీద దండయాత్ర సాగించిన కీర్తిపై అవి దండయాత్ర సాగించాయి.    
    షర్టు, పాంటు వున్న భాగం తప్ప శరీరం కనపడ్డమేర కందిరీగలు కసిగా కుట్టటం మొదలుపెట్టాయి.    
    కందిరీగ కుట్టంగానే తేలుకుట్టినట్లు నొప్పేగాక రక్తం బొట్టు బొట్లుగా కారటం మొదలుపెట్టింది.    
    కందిరీగలన్నీ తమ గూట్లోంచి బైటకొచ్చి కీర్తి చుట్టూ మూగి జుయ్యిమని నాదం చేస్తూ కీర్తిపై దెబ్బతీస్తున్నాయి.    
    కాలు కదపలేక పోతున్నది కీర్తి.    
    చేతులతో తోలితే పోవటంలేదు కందిరీగలు.    
    కీర్తి మెదడులో చమక్ మని మెరుపు మెరిసింది.    
    మగవాడి వేషంలో వున్న కీర్తి జేబులో సిగరెట్ లైటర్ వుంచుకుంది. లైటర్ వుందోలేదో అని భయపడుతూ జేబులో చెయ్యి పెట్టింది.    
    సిగరెట్ పెట్టె, లైటర్ భద్రంగా వున్నాయి.    
    జేబులోంచి లైటర్ తో సహా చెయ్యి బయటికొచ్చింది చమక్ మంటూ లైటర్ వెలిగింది.    
    కీర్తి వెలుగుతున్న లైటర్ ని పట్టుకుని వేగంగా తన చుట్టూ తిప్పుతూ కందిరీగలను కాల్చటం మొదలు పెట్టింది.    
    చచ్చిన కందిరీగలు కాలిన దేహాలతో కొన్ని టపటప క్రిందపడ్డాయి.    
    చచ్చినవి చావగా మిగిలిన కందిరీగలు లైటర్ మంటకి భయపడి దూరంగా పోయాయి.    
    లైటర్ ని ఆర్పి "అమ్మయ్య" అనుకుంది కీర్తి.    
    కందిరీగలు కుట్టినచోటల్లాచురుక్ చురుక్ మనిమంటపుడుతున్నది. అయినా లెక్కచేయలేదు కీర్తి. అవి తన్నిడిచి పోవటం ఆనందం కలిగించింది.    
    కీర్తి ఏ మాత్రం ఆలోచించకుండా ముందు కాలిని కప్పేస్తూ కందిరీగలు కట్టుకున్న మట్టిగూటిని పిన్నుతో పొడుస్తూకూర్చుంది.    
    పదిహేను నిమిషాలకి మట్టిగూడు పడిపోయింది.    
    కీర్తి కాలు బైటపడింది.    
    మడమ వరకూ కాలు బాగానే వుంది. మడమకిబూటుకప్పేసి వుంది. బూతుని కొంతభాగం పైపైన కందిరీగలు కుట్టేశాయి. గిలక పై భాగం రెండంగుళాలు మేజోడుని తినేసి కాలి చర్మాన్ని కూడా తినేశాయి! కొన్ని చిన్ననరాలు కూడా కందిరీగలకు ఆహారమయిపోయాయి.    
    పైనుంచి పడ్డప్పుడు కుర్చీలో వుండబట్టి నేలమీద ఆనినకాలికే గూడు కట్టాయి కందిరీగలు. రెండో కాలికి కూడా గూడు కట్టేవే! ఆ కాలు ముడుచుకుని పైకి వుంది.    
    కీర్తి కుర్చీలోంచి లేవబోయింది. లేచి నుంచోటం అసాధ్యం అని వెంటనే గ్రహించింది. అలాగే కూర్చుంది మళ్ళీ.    
    మూడురోజుల నుంచిపై నుంచి పడినప్పుడు ఏ విధంగా వుందో అలానే కాళ్ళూ చేతులు కదిలించకుండా వుండటం వల్ల శరీరం తన అధీనంలో లేదని తెల్సుకుంది కొంత సేపు శ్రమ పడితే గాని కాళ్ళూ చేతులు పూర్తిగా రాకపోయినా కొద్దిగా నయినా అధీనంలోకి వస్తాయనిచిన్నగా వ్యాయామం చేస్తూ కూర్చుంది కీర్తి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS