Previous Page Next Page 

ఆఖరి క్షణం పేజి 2


పార్వతి కాపురానికి వచ్చిన చాలా ఏళ్ళకి ఇహ యీ జన్మకి పిల్లలు పుట్టరు అని పూర్తి నిరాశ నిస్పృహలు చెందినా వాళ్ళ అనురాగం మాత్రం అణుమాత్రం తగ్గని సమయంలో ఏ చెట్టుకి చేమకి మొక్కకుండానే పార్వతి ఓ బిడ్డ తల్లయింది.

ఆ బిడ్డ తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టలేదు.

వెర్రి వెధవలు వెయ్యిమంది కన్నా ఏకో నారాయణుడు వక్కడున్నా చాలు.

 పిల్లవాడికి చంద్ర శేఖర్ ఆజాద్ అన్న పేరు శివరావు కోరి మరీ పెట్టుకున్నాడు.

చంద్ర శేఖర ఆజాద్ వీరుడు శూరుడు. అందగాడు. అరవీర భయంకరుడు, స్వాతంత్ర సమరంలో తన కొడుక్కి కావాలనే ఆ పేరు పెట్టుకున్నాడు శివరావు.

 చంద్రశేఖర్ ఆజాద్ అంత పేరు ప్రఖ్యాతులు ఈ చంద్రశేఖర్ ఆజాద్ కి ఏదోవక విషయంలో వస్తాయో లేవో గాని మొత్తానికి ఈ చంద్రశేఖర్ ఆజాద్ కూడా చూడ చక్కవాడు. బుద్ధిమంతనంగా పెరిగాడు. చదువులో ఫస్ట్.

 అంతవరకు బాగానే వుంది.

 శివరావు వాళ్ళు వున్నది మరీ పాతరకం పల్లెటూరులో ఇంగ్లీషు చదవటానికి లేదు. చంద్రానికి యిప్పుడు పద్ధానుగేళ్ళు శివరావుకి బాగా చదివించాలన్న కోరిక వుండటంతో చంద్రాన్ని పట్నంలోవుంచి చదివిస్తున్నాడు.

కొడుకుకి దూరంగా వుండటం పార్వతికి యిష్టం లేదు అలా అని వక్కగానొక్క కొడుకు భవిష్యత్తు పాడుచేయటమూ యిష్టం లేదు. తన యిష్టా అయిష్టాలు మనసులోనే వుంచుకుని చంద్రం పట్నంలో వుండి చదువుకోటానికి వప్పుకుంది.

 పట్నంలో.

చంద్రం మరో కుర్రాడితో కలసి చిన్న రూమ్ లో వుంటున్నాడు. హోటల్ తిండి. నెలకొకసారి అయినా శివరావు పట్నం వెళ్ళివస్తాడు. పచ్చళ్ళు పిండి వంటలు యిచ్చివస్తాడు.

ఈ తఫా శివరావు పట్నం వెళ్ళటం లేదు. సరీగ పంట చేతికి వచ్చిన సమయం పంట భూమి వదిలి వెళ్ళటానికి లేదు. పోనీ పార్వతి వక్కతీ కొడుకు దగ్గరకు వెళ్ళిరాగలదా అంటే అలా ఎప్పుడూ పార్వతి వంటరిగా ప్రయాణం చేసి ఎరుగదు.

 కోతల విషయం వీర రాఘవయ్య మీద భారం వేసి పట్నంలో వున్న కొడుకు దగ్గరకు యీ రోజు వెళ్ళి మర్నాడు వద్దామనుకుని పెళ్ళాంతో చెప్పాడు శివరావు.

 భర్త చెప్పిన క్షణం దగ్గర నుంచీ పార్వతికి అరక్షణం కూడా తీరుబడి లేకుండా పోయింది. పూర్తిగా వంట గదికే అంకితం అయిపోయింది.

 ఓ సీసా నిండుగా పులిహోర గోంగూర తయారుచేసింది. కొరివి కారంలో మెంతిపిండి కలిపి తిరగమోత పెట్టింది. చిన్న చిన్న మామిడి పిందెలు వస్తుంటే మామిడి ముక్కల పచ్చడి చేసింది. మూడు రకాల పచ్చళ్ళు చిన్నసైజు హార్లిక్స్ సీసాల్లో సర్దింది. కందిపొడి వెల్లుల్లిపాయ కారంపొడి తయారుచేసింది. అక్కడితో ఆ వంటకాలు పూర్తి అయ్యాయి.

అప్పటికి సమయం మధ్యాహ్నం అయింది.

పొలం నుంచి శివరావు భోజనానికి వచ్చాడు.

పార్వతి చేసిన వంటకాలు రుచిచూసి "అన్నీ బాగా కుదిరాయి. తిరగమోత ఘుమ ఘుమతో పాటు మళ్ళీ మళ్ళీ తినేలా రుచిగా వున్నాయి. ఇంతకీ నీ పుత్రరత్నానికి పిండివంటలు ఏం చేస్తున్నావ్! నవ్వుతూ అడిగాడు శివరావు పెరుగన్నంలో మామిడి ముక్కలు నంజుకుంటు.

"ఏం వాడు మీకు మాత్రం పుత్రుడు కాదా!" చిరునవ్వుతో అడిగింది పార్వతి.

"అదేం మాట. ఎంతైనా తల్లి తర్వాతనే తండ్రి కదా!"

 "మరే అంటూ ముచ్చటగా మూతి తిప్పింది పార్వతి.

 "ఈ తఫా పిండివంటలు ఏమిటోయ్?" శివరావు అడిగాడు.

 "చెగోడీలు వేరుశనగ పప్పు వుండలు గోధుమ హల్వా" అంటూ వివరించింది పార్వతి.

 "సాయంత్రం లోపల మూడూ చెయ్యటం కష్టమేమో?" శివరావు భోజనం ముగించి పీటమీద నుంచి లేస్తూ అన్నాడు.

 "భోం చేసిం తరువాత నేను చేసే ఘనకార్యం ఏముంది గనక! అన్నీ కొద్దికొద్దిగానే చేస్తాను" అంది పార్వతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS