Next Page 

వారధి  పేజి 1


                                          వారధి

                                              __ ద్వివేదుల విశాలాక్షి

 


   

                                         1


    గణగణ మంటూ  గంటలూ, మువ్వల సవ్వడితో ఎడ్లబండి వచ్చి గుమ్మం ముందు ఆగింది. శివయ్య ఆత్రంగా బయటికి వచ్చేడు. అప్పుడే మేత మేసిన  హుషారులో, ఎడ్లు, ఒయ్యారంగా తలలు ఊగించేయి. నల్లటి తోలు పటకాకి కట్టిన ఇత్తడిమువ్వలు లేత ఎండలో తళతళ మెరిసేయి.

    'అప్పన్నగారు ఎంచి మహమంచి  గిత్తల్ని కొన్నారు. ఈ బండి పట్నం రోడ్లంట నడుస్తుంటే కారులు, బస్సులు దారులు తప్పవలసిందే!' అనుకొన్నాడు బండిరాములు,ఆప్యాయంగా ఎడ్లను నిమురుతూ.

    "వచ్చేవా! నీమాటే అనుకొంటున్నాము. అప్పన్నగారు  ఉదయాన్నే బండి పట్నం పోతుందన్నారుకదా. ఇంకా రాలేదేమా అని చూస్తున్నాము" అన్నాడు శివయ్య.

    "మరేంలేదు, బాబూ! కొత్త గిత్తలు కదా! గడ్డీ, కుడితీ కడుపు నిండా పెడితే మచ్చికపడి, పొగరు చూపకుండా లాక్కుపోతాయని దగ్గిర ఉండి తినిపించేసరికి ఈ ఏలయింది. సామాన్లు ఏమన్నా ఉంటే ఆ బస్తాల మీదుగా పడెయ్యండి. రాజబాబు ఈ మొగల కూకుంటాడు. ఈ సరుకు కోమటింట  దింపి ఎండెక్కకుండా  తిరిగి రమ్మన్నారు అప్పన్నగారు."

    బండిరాములు  తొందరచేస్తుంటే, శివయ్య, "ఒరేయి రాజూ...రాజూ, మీనాక్షీ... వేగం తెమిలిరండి. బండి గుమ్మాన  కాచుకున్నాది" అంటూ  ఇంటిలోకి కేకపెట్టేడు.

    "ఇదిగో...వచ్చేస్తున్నా" అంటూ వరదరాజు చేతిలో చిన్న ట్రంకు పెట్టెతోనూ, మీనాక్షి వెలిసిపోయిన  పాత జంబుకానా  చుట్టిన పక్కచుట్టతోనూ వచ్చేరు.

    పెట్టే, పక్కచుట్టా  బండి వెనకభాగంలో  బస్తాలమీదుగా పెట్టి, వరదరాజు బండిచక్రంమీద  కాలుంచి పైకి ఎక్కి బండివాడిపక్కగా కూర్చున్నాడు.

    "భద్రం నాయనా, ఆ కర్రయినా పట్టుకో" అంది మీనాక్షి.

    "ఎప్పుడూ ఎడ్లబండి ఎక్కనివాడికి చెబుతున్నట్లు చెబుతున్నా వేమిటి మీనాక్షీ?" అన్నాడు శివయ్య.

    "అదికాదండి. కొత్తఎడ్లు  కదా, తిక్కతిరిగి ఎటులాగినా..."

    "మీ కే బెంగా  వద్దమ్మా! రాజుబాబుని కడుపులో సల్ల కదలకుండా ఆరి బడికాడ వదలి వత్తా" అన్నాడు రాములు.

    వరదరాజు అన్నావదినవైపు నీళ్లు నిండిన కళ్ళతో  చూస్తూ, "వెళ్లి వస్తాను వదినా! అన్నయ్యా, ఆదివారంనాడు తప్పకుండా  వస్తావుకదూ?" అన్నాడు.

    "అలాగే రాజూ! వీలు చూసుకొని వస్తాను. ఒకవేళ నేను రాలేకపోయినా నువ్వది మనసులో పెట్టుకోకూడదు. కంగారు పడకూడదు. పెద్దవాడివి అవుతున్నావు. ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. అక్కడ హాస్టల్లో ఎంతోమంది నీ ఈడు పెల్లలుంటారు. వాళ్లందరితోను స్నేహంగా ఉండడం నేర్చుకోవాలి."

    శివయ్య ఇంకా తమ్ముడికి సలహాలు చెప్పుతూండగానే  బండివాడు ఎడ్లను చేతిలోని కర్రతో అదిలించేడు. ఎడ్లు పరుగు లందుకొన్నాయి.

    "వెళ్ళివస్తాను వదినా! వస్తాను అన్నయ్యా!"

    "జాగ్రత్త, వరదం! పట్నంలో  మన ఊరివాళ్లు  కన్పిస్తూనే వుంటారు. ఏదైనా అవసరమైతే కబురుపెట్టు..."

    గంటలూ, మువ్వల గణగణలో  కలిసిపోయేయి  ఆ మాటలు.

    బండి గ్రామం దాటి పొలాలమధ్యకి వచ్చింది. తమ ఇల్లు కన్పిస్తూన్నంతసేపూ  మాటి మాటికీ  వెనుదిరిగి చూస్తూనే వున్నాడు వరదరాజు. ఇల్లు తన దృష్టినించి  తప్పిపోతూంటే  ముఖాన్ని ముడుకులమధ్య  దూర్చుకొని వెక్కి వెక్కి ఏడ్చేడు.

    "ఏంటి రాజుబాబూ! ఆడపిల్ల అత్తారింటికి పోతున్నట్లు అంతలా ఏడుస్తున్నావు? ఇంతకీ ఏపాటిదూరం పోతున్నావు కాబట్టి! అల్లదిగో _ ఆ కనిపిస్తున్న వంతెన దాటి పదంగలు ఏసేమంటే  పట్నంలో వుంటామాయె! రాజాలా పెద్ద సదువులు సదవపోతూ  సంటాడిలా  ఏడుస్తున్నావు!" రాజు పుట్టినదగ్గరనించి  ఎరిగిఉన్న  చనువుకొద్దీ కాస్త గట్టిగానే మందలించేడు  బండి రాములు.

    దుఃఖాన్ని దిగమింగి, లాల్చీకోసతో కళ్ళు  తుడుచుకొని, పొలాలవైపు చూపేడు రాజు. సెనగచేను పచ్చని తివాసీలాగ చుట్టూ పరుచుకొని ఉంది. ఆ చేలకు  వెనకగా అప్పన్నగారిది _ కొత్తగా వేసిన _ అంటు మామిడితోట ఉంది. లేతమామిడిమొక్కల  తలలమీదుగా ఎండలో తళతళ  మెరుస్తున్నాయి వంతెన స్తంభాలు.

    పొలాలమధ్యగా సన్నని కాలిబాటవెంట  పట్నంలోకి  కూరగాయలు మోసుకుపోతున్న  ఇద్దరు రైతులు కావిళ్లను ఆ భుజంమీది  నుంచి ఈ భుజం మీదికి మార్చుకొంటూ  బండి చప్పుడు విని వెనుదిరిగి చూసేరు.

    "పట్నం పోతున్నావా, రాములూ! అప్పన్నగారు  కొత్త గిత్తల్ని కొన్నారని ఇన్నాం. ఇయేనేటి? మాంచి పొడిమిగా ఉన్నాయి కాని, ఏపాటి వయసుంటాది? బండిలో ఉన్న సరుకేటి? ఏ సావుకారుకాడికి పోతున్నావు?" అంటూ ప్రశ్నించేరు.

    రాములు వాటికి తగు సమాధానాలు ఇస్తూనే బండి పోనిస్తున్నాడు. కాలిబాటకీ, బండిదారికీ మధ్యనున్న  దూరం ఎక్కువ అవుతున్నకొద్దీ వారి సంభాషణ తారస్థాయికి అందుకొంది. 'పొద్దువాలేసరికి అంతా రామభజన మండపంలో  కలియనే కలుస్తారు. అప్పుడు అడిగి తెలుసుకోకూడదా. ఇంతలా గొంతులు చించుకొని అరుచుకోకపోతే' అనుకొన్నాడు వరదరాజు. చివరకు ఎంత గట్టిగా అరచినా వినిపించనిస్థితికి వచ్చేక 'ఏదో సొద! ఏదో ఇనిపించి సావదు' అని విసుక్కొంటూ  రాములు "హేయ్... హి హేయ్...కుతికమొయ్యా తిని  పెళ్ళి నడకలు నడుత్తున్నావు. ఈ ఇదానైతే  ఎండ పడకుండా  గ్రామం చేరుకొన్నట్టే...నడు...నడు..." అంటూ ఎడ్లని అదిలించేడు.
 

Next Page