Next Page 

కాలానికి నిలిచిన కథ పేజి 1


                                   కాలానికి నిలిచిన కథ

                                                         లల్లాదేవి

                                         

    రాహుల్జీని చదవడం ప్రారంభించాక నాలో ఏవో కొన్ని మార్పులు రావటం గమనించాను. తెలుగుదేశంలో మరో రాహుల్జీ పుట్టాడని నన్ను ప్రశంసించినప్పుడు సిగ్గు, భయమూ కలిగాయి.
    ఒక విధంగా చెప్పాలంటే ఆయన రచనలు చదవటం వల్ల నా పరిధి విస్తృతం కాకపోగా ఆలోచనలు సంకుచిత మయ్యాయని మొదట్లో భ్రమపడ్డాను. ఈనాడు విస్తృత ప్రచారంలోకి వస్తున్న సైన్సు ఖగోళశాస్త్రాలకు సంబంధించిన అంశాలు ఉపనిషత్తులలో చాలాచోట్ల ఉన్నాయి. అది చాలా విస్తృతమైన ఆలోచనా పరిధి! దానిలో నుండి కేవలం చారిత్రక అంశాలను వెతకటంలోకి దిగజారటం నాకు సుతరామూ ఇష్టం లేదు.
    "జయంతి విష్ణునర్లేకర్" వ్యాకోచ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి నోబెల్ బహుమతి సంపాదించాడు. అంత పెద్ద అంశాన్ని మహా నారాయణీయోపనిషత్తులో కేవలం ఒక్క వాక్యంలో విశదీకరించి ఉండటం చూచాక ఆశ్చర్యపోయాను. "సంకోచ వికాసాత్మకం సృష్టి!" అని ఉన్నది. దానినే నర్లేకర్ 'ఎనలైజ్' చేశారనుకుంటాను.
    అలాగే ఉపనిషత్తులలో చాలా విషయాల్ని నిక్షిప్తం చేశారు మన పూర్వులు. కనుక అది విశాలమైన ఆలోచనా పరిథి.
    చరిత్ర సంగతి లా కాకపోవటం తర్వాత రోజుల్లో నన్నాకర్షించింది. గతాన్ని త్రవ్వుకుంటూపోతే ఎన్నో నిక్షేపాలు తారసపడతాయి. వాటిలో ఉండే విలువైన రత్నాలవంటి జీవిత సత్యాలు మనల్ని దిగ్భంతుల్ని చేస్తాయి. ఆ రత్న రాసుల్ని అన్వేషించటం కష్టంతో కూడుకున్న పనే? కాని అది ఆనంద దాయకం కూడా!
    సనాతనమైన సంస్కృతీ చరిత్రలు కలిగిన జంబూద్వీపంలోని మన భరత ఖండంలో అడుగడుగునా అనంతమైన విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. కొండవీటి గిరిశిఖరాలను చూస్తున్నప్పుడు నాకు ఎల్లప్పుడూ ఈ విషయమే స్ఫురిస్తూ వుంటుంది. అది చరిత్రకు ఆలవాలమైనచోటు. ఒకనాడు ఉజ్జ్వలమైన చరిత్రకు అది నిలయం.
    కొండవీటి గిరి శిఖరాలను చూస్తున్నప్పుడు శ్రీనాధుడు మనసులో మెదిలే మొదటి మధురమూర్తి కుమారగిరిరెడ్డి కాటయవేముడూ, అనచితిప్పయసెట్టి, పెద్ది యజ్వా వీరంతా మనసంతా నిండిపోతారు. వారి కథలు గుండెలకు గాలమై లాగివేస్తాయి. శ్రీనాధ కవిరాజు పురాణ పఠనంతో ప్రతిధ్వనించిన ఆ కొండలు ఎంత పవిత్రమైనవోననిపిస్తుంది.
    వేమాంబ సోమదేవచోడుల ప్రణయగాధ, మనసును కలచివేస్తుంది. ముగ్ధమనోహరమూర్తులైన వారి మనసు విడిచిన నిట్టూర్పులు ఈ నాటికీ ఆ లోయలలో ప్రతిధ్వనిస్తున్నవేమోననిపించక మానదు.
    కొండవీటి గిరిశిఖరాలలో అన్నిటికన్నా సమున్నతమైన 'కుచ్చెలచోడు' ను చూచినప్పుడు సృష్టిలో గాంభీర్యమేమిటో మనకర్థమౌతుంది.
    ఇన్ని విషయాల మధ్య ప్రజల కోసం ప్రాణాలర్పించిన సవిరం ఎల్లయ్య మనసును కలచివేస్తాడు. అతడు మంచు మీద ప్రతిఫలించే రవికిరణం వంటివాడు. ఇప్పటికీ మూల గూరమ్మ దేవాలయానికి ఎదురుగా అతని పేరుమీద వేసిన 'వీరకల్లు' ఆ విషాదగాధ మనకు వివరిస్తూనే ఉంటుంది.
    ఈరోజు ఆదివారం కావటం చేత ఈ విషయాలన్నీ నెమరువేసుకుంటూ కూర్చున్నాను. రావలసిన స్నేహితులింకా రాలేదు. వారంతా వచ్చి చేరాక ఏదో ఒక విషయం మీద ఎలాగూ యుద్ధకాండ తప్పదు. ఈలోగా రవ్వంత విశ్రాంతి తీసుకుందామంటే ఈ ఆలోచనలు మనసు నిండా ముసురుకున్నాయి.
    ప్రేమకూ రాచరికపు సమస్యలకూ మధ్యనలిగి వాడిపోయిన శిరీషకుసుమకోమలి. ముగ్ధ అయిన వేమాంబ హృదయాన్ని పిండుతోంది. ఆమె సౌకుమార్యమూ, సంగీత నైపుణ్యం, వీణా వాదనలోని చాతుర్యమూ, అన్నిటిమించి ప్రేమించి, ప్రేమింప చేసుకో గలిగిన హృదయమూ అన్నీ కాలంలోనే కలిసిపోయాయా?
    ఈ కాలం ఎంత నిర్దయురాలు, దేనినీ లెక్కచేయక సాగిపోవటమే కదా దీనిపని. దేనికీ ఆగిపోనికాలం నా ఆలోచనలకు మాత్రం ఆగుతుందా? అప్పుడే రెండుగంటలైంది. పగటి నిద్ర ఆరోగ్యానికి మంచిదికాకపోయినా ఆటవిడుపు రోజు కనుక ఆదివారంనాడు ఫరవాలేదులెమ్మని పడుకున్నాను. కాని నిద్రపట్టదు. ఇంకా రమణమూర్తి కూడా రాలేదేమిటి? అనుకుంటూండగానే కాలింగ్ బెల్ మ్రోగింది. లేచి తలుపు తీశాను. ఎదురుగా రమణా మరో ఇద్దరూ. 


Next Page 

WRITERS
PUBLICATIONS