Next Page 

మిస్టర్ 'యూ' పేజి 1

 

                                       మిస్టర్ 'యూ'

                                                                మైనంపాటి భాస్కర్

                              

 

                                    అంతానికి ఆరంభం .........
                                    ఓ ఇరవై ఏళ్ళ తరువాత :
                                     01-01-2021.

                                           *    *    *

    "చాలా సీరియస్ విషయం -- మీతో చెప్పాలో వద్దో అర్ధం కాకుండా ఉంది " అన్నాడు తులసీ రావు.
    వింటున్న పరమేశ్వర్ ,, సంయిక్తల మొహాల్లో ఆదుర్దా కనబడింది. వాళ్ళ గురువుగారి వైపు ఆందోళనగా చూశారు.
    తల పక్కకు తిప్పుకుని , కిటికీ లో నుంచి బయటికి చూశాడు తులసీ రావు.
    బయట ఒక కారు ఆగి వుంది . చిన్న బుడగలాగా ఉంది ఆ కారు. పూర్తిగా ట్రాన్స్ పరెంట్ గా ఉంది. అది ప్రేట్రోలుతో నడిచే కారు కాదు. నీళ్ళతో నడుస్తుంది! నీళ్ళలో వుండే ఆక్సిజన్, హైడ్రోజన్ లను విడగొట్టి , హైడ్రోజన్ ని వుపయోగించుకుని నడిచే మెకానిజం!
    పెట్రోలు, డీసిల్ కి బదులు వాడకంలోకి వస్తున్న కొత్త ఇంధనం హైడ్రోజన్ ! "కారు ' చౌక . కాలుష్యం వుండదు.
    సూట్ కేసు తీసుకుని , చకచక కారు దగ్గరికి నడుస్తున్నాడు రాజు. అతని చెల్లెలు యువ అతని పక్కనే ఉత్సాహంగా ఏదో చెబుతూ నడుస్తోంది.
    డ్రయివింగ్ సీట్లో రాజు ఫ్రెండ్ కూర్చుని వున్నాడు. కారు ఆ ఫ్రెండుదే.
    "మన రాజుని ఎయిర్ పోర్టు దగ్గిర దించడానికి అతని ఫ్రెండు వచ్చినట్లున్నాడే!' అన్నాడు తులసీ రావు.
    చెప్పదలచుకున్న ముఖ్యమైన విషయం అంత త్వరగా చెప్పెయడానికి నోరురాక మాట మారుస్తున్న వైనం అర్ధమైపోతూనే ఉంది.
    "వాడికి సెండాఫ్ ఇవ్వడానికి ఊళ్ళో సగం మంది ఎయిర్ పోర్టుకి రారా!" అంది రాజు తల్లి సంయుక్త ఎంతో ఆపేక్షగా.
    చిన్నగా నవ్వాడు తులసీ రావు.
    "చిన్నప్పట్నుంచీ అంతే గదా! జన ముద్దు బిడ్డ! మనవాడు మిస్టర్ యూనివర్స్ పోటీకి వెళ్తున్నాడు . టైటిలు గెల్చుకొనడం ఖాయం! అది అతని జాతకంలోనే వుంది. కానీ ........"
    "కానీ .......?" అన్నాడు పరమేశ్వర్ అనుమానంగా.
    "కానీ .......రాజు తిరుగు ప్రయాణంలో విమానం యాక్సిడెంట్ అయి చనిపోతాడు. అది కూడా అతని జాతకంలో అంత ఖచ్చితంగా రాసిపెట్టి ఉంది ! పరమేశ్వర్! మనం మన రాజుని ఆ పోటీలకు వెళ్ళకుండా ఆపలేమా! ప్రయాణం మానితే ప్రమాదం తప్పవచ్చును " అన్నాడు తులసీ రావు అర్జెంటుగా.
    పండిపోయిన తమలపాకులా ఉన్నాడు అయన. పచ్చటి మనిషి . పూర్తిగా నెరిసిపోయిన కనుబొమలు, తీక్షణమైన చూపులు, టీ షర్టు, ప్యాంటూ కాకుండా నీరు కావి రంగు ధోవతి కట్టుకుని చొక్కా తొడుక్కుని, భుజం మీద కండువా గనక వేసుకుని వుంటే, చాలా పాతకాలపు కారెక్టరు లాగా కనబడేవాడు.
    "ఎలాగయినా సరే, ప్రయాణం ఆపించు పరమేశ్వర్ ! ప్రమాదం తప్పిపోవడానికి గ్రహశాంతులు , జపాలు చేయిద్దాం !" అన్నాడు తులసీరావు.
    పెద్దగా నవ్వు వినబడింది.
    అప్పటికే రాజు వచ్చి తులసీరావు వెనకే నిలబడి వున్నాడు.
    "భలే వారే గురువుగారూ ! నీళ్ళతో కార్లు నడిపించే టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో మంత్రాలకు చింతకాయలు రాలతాయా? మీరు మా వెల్ విషరు! నన్ను వెన్ను తట్టి పంపించండి గానీ పిరికి మందు పోయకండి " అన్నాడు మృదువుగా.
    "జాతకాలు అనేవి వుత్త హంబగ్! అంది యువ అన్నని సైడ్ చేస్తూ. ఆమె కళ్ళు నవ్వుతూ మెరుస్తున్నాయి."
    "అవును! జతకాలంటే నాకూ నమ్మకం లేదు. ఎందుకంటే నేను ధనుర్లగ్నంలో పుట్టిన వాణ్ణి గనుక! అన్నాడు రాజు నవ్వేస్తూ ."
    "గురువుగారు ఏం చెబితే అది జరిగి తీరుతుంది రాజు! అది మాకు ఎన్నోసార్లు అనుభవం! అంది తల్లి సంయిక్త దిగులుగా"
    "గురువుగారి మాట వినడం మంచిది రాజూ!' అన్నాడు తండ్రి పరమేశ్వర్ కూడా.
    తండ్రి వేపు అనునయంగా చూశాడు రాజు.
    "తిరుగుప్రయాణంలో విమాన ప్రమాదమా! నేను తిరిగి రావడానికి బుక్ చేసుకున్న ప్లయిట్ ఎట్లాంటిదో తెలుసా ! ఎఎఎ 111 ! మార్వేలాస్ ఎయిర్ క్రాప్ట్! మెయిడెన్ జర్నీ! అందులో పుష్పక విమానంలాగా మూడు వేల మంది పడతారు. అందులోనే అన్ని సౌకర్యాలునూ! వంద కంప్యూటర్లు . దాని ప్రతి కదలకనీ కనిపెట్టి కంట్రోలు చేస్తుంటాయి." అన్నాడు రాజు.
    "పుష్పక విమానమన్నా క్రాష్ కావచ్చు గానీ ఇది మాత్రం కాదంటావ్!" అంది యువ తేలిగ్గా నవ్వుతూ.
    "డాడ్! మీరు ఎయిర్ పోర్సు లో పనిచేశారు. ఎయిర్ క్రాప్ట్ గురించి మీకెంతో తెలుసు. త్రిబుల్ ఏ త్రిబుల్ వన్ ఎంత సేఫేస్ట్ ఎయిర్ క్రాప్ట్ కూడా మీకు తెలిసి వుండాలి " అన్నాడు రాజు.
    "యా! దటీజ్ ది ఫర్ ఫెక్ట్ అండ్ సేఫేస్ట్ ఎయిర్ క్రాప్ట్ !' అన్నాడు పరమేశ్వర్ చిన్నగా.
    "గాడ్ ఫర్ బీడ్ ......... సపోజ్ ......ఒకవేళ నిజంగానే క్రాష్ అయి నేను చనిపోవాల్సి వస్తుంది అనుకోండి ....చావుకి భయపడే మనుషులమా మనం డాడీ?" అన్నాడు రాజు సూటిగా.
    "న్నో! నెవర్!" అన్నాడు మేజర్ పరమేశ్వర్ వెంటనే పౌరుషంతో అతని ఛాతీ వుప్పోగింది.
    "దట్ సేటిల్స్ ఇట్!" అని, ఇంకా ఏదో అనబోతున్న తల్లిని వారించి ఆమె కాళ్ళకు దణ్ణం పెట్టాడు రాజు.
    "దీవించి పంపమ్మా!" అన్నాడు ఆర్ద్రంగా.
    "నాకు కాదు, నాన్నకీ, గురువు గారికీ దణ్ణం పెట్టు " అంది సంయుక్త .
    తండ్రికీ, తులసీ రావుకీ పాదాభివందనం చేశాడు రాజు.
    "రాజూ ........ ' అనబోయాడు తులసీరావు.
    కానీ అప్పటికే గుమ్మం దాటాడు రాజు.
    ఎయిర్ పోర్టు దాగా వెళ్ళి రాజుకి సెండాఫ్ ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా ఎంతో తహతహగా ఉంది.
    కానీ అమ్మో ....సిటీ రోడ్ల మీద వెళ్ళాలంటే పెద్ద అడ్వెంచర్ గదా!
    ట్రాఫిక్ ఎంతగా పెరిగిపోయిందంటే , రాజుకి సెండాఫ్ ఇచ్చి ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి తిరిగి వచ్చేలోగా అతను అమెరికా లోని న్యూ సిటీ చేరిపోతాడు !
    రోడ్డు మీద నడవాలంటే మనుషుల్ని నెట్టుకుంటూ పోవాల్సి వస్తోంది !


Next Page