Next Page 

మొగుడు ఇంకో పెళ్ళాం వజ్రాలు పేజి 1


                   మొగుడు _ ఇంకో పెళ్ళాం _ వజ్రాలు

                                 యర్రంశెట్టి శాయి

                        

    గోపాల్రావ్ కీ... ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కీ బొత్తిగా పడటం లేదు.
    ఇది గోపాల్రావ్ అభిప్రాయం.
    ఇది ఇవాళ్టి వ్యవహారం కాదు.
    మొదటినుంచీ ఇంతే.
    మాంచి ప్రిస్టేజియస్ రెసిడెన్షియల్ స్కూల్లో చదవాలనుకుంటే ఎందుకూ పనికిరాని పరమ నికృష్టమయిన గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది.
    అయినాగానీ గోపాల్రావ్ నిరుత్సాహపడక మిగతా అందరు స్టూడెంట్స్ లా కాపీలు కొట్టి పరీక్షలు పాసయిపోయాడు.
    ఆ తరువాత అడ్డమయిన కంప్యూటర్ కోర్స్ ల ప్రకటనలూ పేపర్లో చదివి మా కోర్స్ చదివితే మీ భవిష్యత్తు ఉజ్వలం అన్న స్లోగన్ కి పడిపోయి సంవత్సరంపాటు దేశంలోని అతి పెద్ద ఇన్ స్టిట్యూట్ అని భ్రమపడిన ఓ సంస్థలో చేరి పాతికవేలు ఫీజుకట్టి కోర్స్ పూర్తిచేసి ఎందుకూ పనికిరాని డిప్లొమా ఇచ్చిన ఇన్ స్టిట్యూట్ కెళ్లి మీ కంప్యూటర్ డిప్లొమా మీరు తీసుకుని నా పాతికవేల ఫీజు నాకిచ్చేయమన్నాడు.
    అదేమిటి అని వాళ్ళదిగితే, నాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని మీరంటేనే నేనీ కోర్స్ లో జాయినయ్యాను. ఏది ఆ ఉజ్వలమయిన భవిష్యత్తు? ఎక్కడ? సంవత్సరం నుంచీ మీరిచ్చిన పీ.జీ.డిప్లొమా తీసుకుని అడ్డమయిన ఉద్యోగానికీ తిరిగాను. ఈ కంప్యూటర్ డిప్లొమాలున్నవాళ్ళు వాళ్ళ ఆఫీసుల్లో ప్యూన్లుగా చేస్తున్నారని వాళ్ళన్నారు. కనుక ఇలాంటి బేవార్స్ డిప్లొమా నాకక్కర్లేదు. తీసుకుని నా డబ్బు నాకిచ్చేయండి. లేకపోతే యువతను మిస్ గైడ్ చేసే ప్రకటనలతో మోసం చేస్తున్నారని కంజూమర్ కోర్ట్ లో వేస్తాను అంటూ బెదిరించాడు.
    వాళ్ళతని మాటలు విని నవ్వుకున్నారు. తర్వాత పక్కకు తిరిగి నవ్వారు. ఆ తర్వాత మొహం మీదే పగలబడి నవ్వారు.
    పోనీ_ నాకు ఆ చెత్త ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకపోతే పోనీ_ అని మండిపడుతూన్న సమయంలో ప్రభుత్వం డిగ్రీ ఎనిమిదిసార్లు తప్పి రోడ్ల వెంబడి బేవార్సుగా తిరుగుతూ దాదాగిరీ చేస్తున్న రాములుకి మంచి ఉద్యోగం యిచ్చింది.
    "ఇంత మోసమా? సరే ఎప్పటికయినా నీ అంతు చూస్తా" అంటూ గోపాల్రావ్ చెత్త ప్రయివేట్ కంపెనీలో జాయినైపోయాడు.
    ఆ తర్వాత అతను చారెడేసి కళ్ళున్న అందమైన అమ్మాయి కోసం దేశమంతా తిరిగి చివరకు అలాంటి అమ్మాయి సీత అనే పేరుతో హైదరాబాద్ లోనే కర్నల్ కనకారావు ఇంట్లో పెరుగుతోందని తెలుసుకొని కర్నల్ కనకారావ్ సోమాజీగూడాలో నడుపుతోన్న కంపెనీలో అతి తక్కువ జీతానికి చేరి సీతతో ఫ్రెండ్ షిప్ చేసుకుని లవ్ లో పడేసుకున్నాడు. విషయం తెలిసి అప్పటికే ఇల్లరికం అల్లుడికోసం వెతుకుతోన్న కనకారావ్ గన్ పెట్టి అతనితో తన కూతురు మెడలో తాళి కట్టించాడు.
    సీత కాపురానికొచ్చిన మొదటిరోజు బెడ్ మీద కూర్చుని ఆమె అందమైన కళ్ళలోకి తన్మయత్వంతో చూస్తూ "అబ్బ! నీ కళ్ళు ఎంత అద్భుతంగా వున్నాయ్..." అంటూంటే కావాలని డైలాగ్ మధ్యలోనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ పవర్ కట్ చేసింది.
    అయినాగానీ తను డాబా ఎక్కి వెన్నెల్లో కబుర్లు చెప్పుకోబోతే, కార్పొరేషన్ వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి పెంచుతున్న హైబ్రీడ్ దోమలు ఇద్దరినీ చీల్చి_ చెండాడి ఇంట్లోకి తోసేసినయ్.
    ఈ గవర్నమెంట్ తో ఎప్పటికైనా తలనొప్పేనని సీతను తీసుకుని హనీమూన్ కి కర్ణాటక రాష్ట్రం వెళ్దామని రైల్లో బయల్దేరితే ఆ రోజు ఆ రైలుకి యాక్సిడెంట్ చేయించి బ్రతికున్న వారందరినీ బస్ లో మళ్ళీ హైద్రాబాద్ కి పంపించివేసింది.
    అయినాగానీ గోపాల్రావ్ పట్టువిడవలేదు.
    "సీతా! ఇవాళ మనం ఎగ్జిబిషన్ కెళ్దాం. మొత్తం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మనకెదురుతిరిగినా మనం వెళ్ళి తీరాల్సిందే. అక్కడ పవర్ కట్ లు చేస్తారు వాళ్ళు. అయినా మనం ఐస్ క్రీమ్ స్టాల్లో మళ్ళీ కరెంటు వచ్చేవరకూ ఐస్ క్రీమ్స్ తింటూ కూర్చుందాం.
    మిర్చి బజ్జీలు తింటూ జయింట్ వీల్ లో తిరుగుదాం. కూల్ డ్రింక్స్ తాగుతూ రోమన్ కాజిల్ చూద్దాం. కాశ్మీరీ షాల్ కొనుక్కుందాం, కొల్హాపురి చెప్పులు వేసుకుందాం...."
    సీత కిలకిల నవ్వేసింది.
    "మనకు విలన్స్ లేరు ఎవరూ లేరు. ఊరికే అలా ఇమేజినేషన్ లో కెళ్ళిపోకు" అంది సీత.
    ఇద్దరూ ఎగ్జిబిషన్ చేరుకున్నారు.
    అక్కడి వాతావరణం గోపాల్రావ్ కి మరింత ఉత్సాహం కలిగించింది.
    రంగురంగుల లైట్లు, అందమైన అమ్మాయిలూ, పక్కన బ్యూటీ క్వీన్!
    "నేనూ మా ఫ్రెండ్ భవానీశంకర్ గాడూ ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ లో భలే ఎంజాయ్ చేసేవాళ్ళం సీతా! అందమైన అమ్మాయిల వెంట పడేవాళ్ళం. కొద్దిసేపటికి వాళ్ళతో ఫ్రెండ్ షిప్, తర్వాత కలిసి మిర్చి బజ్జీలు తినటం, ఆ తర్వాత ఎవరిదారిన వాళ్ళు విడిపోవడం..." అతను ఇనేంతసేపలా మాట్లాడేవాడోగానీ పక్కన వినేవాళ్ళెవరూ లేని ఫీలింగ్ కలిగేసరికి అదిరిపడి సీతకోసం వెతికాడు.
    సీత వెనుకే నిలబడిపోయి వుంది.
    ఆమె మొహంలో కోపం!
    "సీతా! ఏమిటలా నిలబడిపోయావ్?" అడిగాడు ఆశ్చర్యంగా.
    "నాతో మాట్లాడకు. ఐ హేట్ యూ..." అందామె హఠాత్తుగా చేతుల్లో మొహం దాచుకొని ఏడ్చేస్తూ.
    గోపాల్రావ్ ఉక్కిరిబిక్కిరయిపోయాడు.
    "సీతా! ఏమిటిది? ఏం జరిగింది? నేనేం చేశాను...?" అన్నాడు భయంగా.
    "ఇంకా ఏం చేశానని అడుగుతున్నావా? సిగ్గుండఖ్ఖర్లేదూ? ఇప్పుడే డాడీకి ఫోన్ చేసి చెప్పేస్తా_ వచ్చి నన్ను తీసుకెళ్ళమని. ఇంక ఒక్క క్షణం కూడా నీ దగ్గరుండను" వెక్కి వెక్కి ఏడ్చేస్తూ, మధ్యలో ఏడుపు ఆపి విరుచుకుపడుతూంటే గోపాల్రావ్ నిశ్చేష్టుడై చూస్తూ వుండిపోయాడు.
    ఇంత అందమైన అమ్మాయి లోపల ఓ చిన్న సైజు కాళికావతారం వుండటం అతనికి మింగుడుపడటం లేదు.
    "ఏది ఫోన్ బూత్ ఎక్కడ? ముందు డాడీకి ఫోన్ చేయాలి" ఫోన్ బూత్ కోసం నాలుగువేపులా చూస్తోంది.
    "సీతా! ప్లీజ్... ఏం జరిగిందో చెప్పు. ఎందుకింత కోపం వచ్చింది నీకు? నేను పొరబాటున నిన్నేమైనా అన్నాననా?"
    "పొరబాటున కాదు_ అలవాటుతోనే అన్నావ్! అమ్మాయిల వెంటపడటం నీ అలవాటని ముందే తెలిసివుంటే అసలు నీతో పెళ్ళికే వప్పుకునేదాన్ని కాదు. ఛీ.. ఎంత చీప్ మనుషులు! ఏ అమ్మాయి కనబడితే ఆ అమ్మాయి వెంటపడిపోవటమేనా? నువ్వేం జంతువు కాదుగదా! మనిషి... అసలు_ ముందు మా డాడీతో మాట్లాడాలి."
    ఆమె కోపం చూసి అప్పటికప్పుడే కొన్ని వందలమంది ఉత్సాహవంతులైన యువతీ యువకులు వాళ్ళిద్దరి చుట్టూ మూగారు.
    "హలో సీతా! మై తుమ్హారా డాడీ బాత్ కర్ రహా హు! క్యా హువా బేటీ?" అంటూ అరిచాడొకడు వాళ్ళ మధ్యనుంచి.
    అంత ఘోల్లుమన్నారు.
    సీతకు మరింత వళ్ళుమండింది.

Next Page