Next Page 

కార్నర్ సీట్ పేజి 1


                              కార్నర్ సీట్

                                                 యర్రంశెట్టి శాయి

                   

    సావిత్రి గడియారం వంక చూసింది.
    అయిదున్నర అవడానికి ఇంకో అయిదు నిమిషాలుంది. తన టేబుల్ మీదున్న కాగితాలన్నీ సర్ది, ఫైళ్ళన్నీ అల్మరాలో ఉంచింది. తన బ్యాగ్ తీసుకుని టాయిలెట్ వైపు నడిచింది. అప్పటికే జయసుధ, సంధ్య అద్దం ముందు నిలబడి మొఖానికి పౌడర్ అద్దుకుంటున్నారు.
    తను వాష్ బేసిన్ లో మొఖం కడుక్కుని కర్చీఫ్ తో తుడుచుకోసాగింది సావిత్రి.
    సంధ్య...ఏదో విషయం మధ్యలో నుంచి అందుకుని జయసుధకు చెప్తోంది.
    "...నేనూ అంతా నిజమేననుకున్నా! మా అమ్మా నాన్నలతో మాట్లాడమన్నాడు. దాన్దేముంది...ఒక్కరోజులో అంతా సెటిల్ చేసేస్తానన్నాడు. కిందటి వారం సడెన్ గా ఫోన్ చేసి సరదాగా మైసూర్ కి టూర్ వెళ్ళివద్దాం రమ్మన్నాడు. నేను రానన్నాను. ఈలోగా మావాళ్ళు అతనిని కలుసుకుని పెళ్ళి విషయం కదిపితే యాభయ్ వేలు కట్నం కావాలన్నాడట."
    "చూశావా! క్రాక్ లాగున్నాడు."
    "లాగున్నాడేమిటి? కట్నం ఇస్తే ఈ దేభి మొఖాన్ని ఎందుకు? మార్కెట్లో మంచి పశువులే దొరుకుతాయిగా."
    సావిత్రికి ఆమె మాటలకు నవ్వొచ్చింది.
    సంధ్య ఆఫీస్ లో కెళ్ళిపోయింది.
    "రేపేమిటి ప్రోగ్రాం?" జయసుధ నడిగింది సావిత్రి.
    జయసుధ కొంచెంగా సిగ్గుపడింది.
    "మామూలే... శ్యామ్ పొద్దున్నే వస్తానన్నాడు... బహుశా నాగార్జునసాగర్ లో ఉంటామేమో ఈ రెండు రోజులూ__"
    సావిత్రికి తెలుసు...
    ప్రతి శని, అదివారాలూ జయసుధ చాలా బిజీగా ఉంటుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ శ్యామ్ తో సినిమాలూ, హోటళ్ళూ, షికార్లూ...
    అవన్నీ తనకు తెలిసినా ప్రతి శుక్రవారం సాయంత్రం ఆమెను ప్రోగ్రాం అడగటం అలవాటయిపోయింది... అదో సరదా!
    తనూ పౌడర్ అద్దుకుని ఆఫీస్ లోకి నడిచిందామె. అప్పటికే మిగతా స్టాఫ్ అందరూ ఒక్కొక్కరే ఇళ్ళకు వెళ్ళిపోతున్నారు.
    శారద తన టేబుల్ ముందునుంచి వెళుతూ నవ్వింది.
    "హలో సావిత్రీ..."
    "హలో..." ఆమెను చూసి ఆశ్చర్యపోయింది సావిత్రి. నెలరోజుల తర్వాత చూస్తుందామెని.
    అదివరక్కూ ఇప్పటికీ పోలికే లేదు.
    "ఏమైపోయావిన్నిరోజులూ?"
    "అన్ వెల్..."
    "ఓ! అందుకే అలా చిక్కిపోయారు."
    "అవును..."
    ఆమె వెళ్ళిపోయింది. టైపిస్ట్ సుమిత్ర చప్పున కల్పించుకుని మాట్లాడింది సావిత్రితో.
    "అసలు సంగతది కాదు...భర్త వదిలేశాడట!"
    సావిత్రి ఉలిక్కిపడింది.
    "వదిలేశాడా?"
    "ఊఁ...! విక్టోరియా చెప్పింది...వాళ్ళిద్దరిళ్ళూ దగ్గర దగ్గరే కదా...?"
    "ఎందుకని?"
    "అదే...అదివరకు ఈమె వినోద్ తో షికార్లు చేసేది కదా...ఆ విషయం తెలిసిందట..."
    "మైగాడ్..."
    "అయినా ఇలాంటివి ఎంతకాలం దాగుతాయ్?"
    సావిత్రి మాట్లాడలేదు.
    "అందులో తప్పేముంది?" అని అడగాలనుంది ఆమెకి. కానీ ఆ ప్రశ్న సుమిత్రను వేస్తే లాభంలేదు. సుమిత్రది వింత మనస్తత్వం. అందరి గురించి అందరికీ ఏదో ఒకటి చిలువలు పలువలుగా చేసి చెవుతుంటుంది. ఆమె అలా ఎందుకు ప్రవర్తిస్తుందా అని చాలాసార్లు ఆలోచించింది తను.
    సైకలాజికల్ ఇంపల్స్! అంతే! అంతకు మించి వేరే కారణం కనిపించటం లేదు.
    తనకు దక్కనిది ఇతరులు అనుభవిస్తుంటే ఓర్వలేని తనం!
    ఆమెకు 35 సంవత్సరాలొచ్చినా వివాహం కాలేదు. ఎందుక్కాలేదో ఎవరికీ తెలీదు. ఎవరితోనూ క్లోజ్ గా వుండదామె.
    సుమిత్ర వెళ్ళిపోయింది.
    సావిత్రి లేచి ఆఫీస్ బయటకొచ్చింది.
    గేటు దగ్గర శ్యామ్ స్కూటర్ మీద కూర్చుని జయసుధ కోసం ఎదురుచూస్తున్నాడు.
    వాళ్ళిద్దరికీ పరిచయమయి అయిదారు నెలలవుతోంది. ఈ కొద్ది రోజుల్లోనే చాలా దూరం ప్రయాణించేశారు. మరికొద్దిరోజుల్లో పెళ్ళిచేసుకోబోతున్నారు.
    సావిత్రికి నవ్వొచ్చింది.

Next Page