Next Page 

డేంజర్ డేంజర్ పేజి 1

           
                               డేంజర్...డేంజర్   
                                                                    -కురుమద్దాలి విజయలక్ష్మి
                               
    
    కీర్తికి చటుక్కున మెలకువ వచ్చింది.    
    ఆ సమయంలో పుచ్చపువ్వుల్లా వెన్నెల కాస్తున్నది. చిన్న మొక్కల నుంచి మహావృక్షాలవరకు నిద్రపోతున్నాయా నిలుచునే అన్నట్లు ఏమాత్రం కదలిక లేకుండా వున్నాయి. గాలయితే లేదుగాని వాతావరణం చల్లగా వుంది, నిశ్శబ్ధంనలుమూలలా రాజ్యమేలుతున్నది.    
    కీర్తికి తలంతా నాదుగా వుంది. కళ్ళు తెరవంగానే చుట్టూకాన వచ్చిన దృశ్యం చూచి అయోమయంతో ఓసారి కళ్ళు మూసుకుని తెరిచింది, బలంగా తలా విదిలించింది.    
    మెడ నరాలుకలుక్కుమనటంతో "అబ్బా" అనుకుంది కీర్తి. అప్పుడే జరిగింది గుర్తుకొచ్చింది. "ఓ మైగాడ్" అనుకుంది.    
    కీర్తి ఇంటలిజెంట్ శాఖలో వ్యక్తి.        
    కీర్తి వయసు పాతిక.    
    వయసుని మించిన తెలివితేటలు అచంచల సాహసి. సూక్ష్మ బుద్ది, చతుర, కీర్తి పేరు ప్రతిష్టలు పెరగడానికిదోహదమయాయి.    
    చిన్న చిన్న పనులు చేయటం కీర్తికి అప్పగించదు ప్రభుత్వం.    
    చిన్న పనులు చేయటం కీర్తికి యిష్టం లేదు.    
    మన దేశ కీర్తి ప్రతిష్టలను నాశనం చేసే కొందరు దుండగులను వెన్నాడుతు ప్రభుత్వ ఆ దేశం మీద కీర్తి, మగవాడి వేషంతో తగిన పరికరాలు తీసుకుని బైలుదేరింది.    
    కీర్తితో పాటు మరొ నలుగురు బైలుదేరారు. ముగ్గురు పురుషులు, మరొకామె స్త్రీ.    
    దుండగులు మనదేశ సరిహద్దులు దాటారు.    
    కీర్తి భారతదేశం సరిహద్దు దాటింది.    
    విమానం దిగిన దుండగులు మరొ విమానం ఎక్కారు, అయితే అప్పుడే దుండగులు చీలికలుగా తలోమార్గంపట్టారు.    
    కీర్తి ఒకతన్ని వెంటాడుతూ విమానం ఎక్కింది.    
    విమానంలో ఎక్కింది పురుషుడు కావచ్చు లేక కీర్తి రాగా మగ వేషం ధరించిన ఆడది కావచ్చు. ఒకరు గాక ఇద్దరు వుండవచ్చు వాళ్ళు.    
    కీర్తికి ఈ విషయం అనుమానంవచ్చింది. అలాగే మరొ అనుమానం కూడావచ్చింది. తన్నివాళ్ళు మోసపుచ్చారా? తను రాంగ్ రూట్ లొ పయనిస్తున్నదా? అని...    
    ఆ అనుమానం ఎప్పుడొచ్చిందీ అంటే...    
    ఏ కారణం లేకుండా విమానానికి అక్కడక్కడమంటలు బైలుదేరాయి. అదిచూసి విమానంలో వున్నా ప్రయాణికులు హాహాకారాలు చేశారు.    
    నిప్పు, పొగ, పెట్రోలు వాసన ఏది లేకుండా అక్కడక్కడ ఉన్నట్లుండి మంటలు రావటం ప్రయాణికులకు ఆశ్చర్యం, భయాందోళనలు కలిగించాయి.    
    సైన్స్ డెవలప్ అయిన ఈ రోజుల్లో యాసిడ్స్, ద్రావకాలు, మంత్రాలు, విభూది అన్నింటి నుంచి కృత్రిమ శక్తులు వింతలు చూపిస్తున్న మహానుభావులుండగా వింతేముంది? విమానం మరో, గంటకి బైలుదేరుతుందనగా ఏపౌడరో విమానంమీద అన్ని చోట్ల చల్లితే పలానా టైంకి పౌడరు మంటగామారొచ్చు కదా! టైం బాంబ్ టైం ఫిక్స్ చేసి పెడితే కరెక్టు టైం కి బాంబ్ పేలినట్లు పౌడరుటైం బాంబ్ లోంచి మంటలువస్తూ వుండవచ్చు.    
    కీర్తి ఇలా వూహించుకుంది.    
    విమానం నడుపుతున్న పైలెట్ కి అర్ధంకాలేదు. టైం బాంబు అమరిస్తే విమానం పేలిపోయేది అలా గాక విమానంలో మంటలు సృష్టించింది ఎవరు? ఎందుకు?    
    ముందే ప్యారా చూట్లు మంటల కాహుతిఅయ్యాయి. ఓ ప్రయాణికురాలి సీటు లోంచి మంటలొస్తే మరో ప్రయాణికుడి కాళ్ళ వద్ద మంట బయలుదేరింది.    
    పైలెట్ విమానాన్ని వీలయినంతకిందికి దింపుతూవార్త పంపించాడు.    
    విమానంలో ఉన్నట్లుండి మంటలు బైలుదేరాయికారణం వూహించటానికి లేదు. విమానం వీలయినంత క్రిందికి దింపేస్తున్నాము. క్రిందంతా గుబురుగా చెట్లు కనపడుతున్నాయి. బహుశా ఈ ప్రదేశం....    
    అంతే పెద్ద చప్పుడుతో విమానం పేలిపోయింది.    
    ఆ పై ఏం జరిగింది కీర్తికి తెలియదు. కీర్తికి స్పృహ తప్పింది.    
    కీర్తికి స్పృహ వచ్చేటప్పటికి కొంతదూరంలో కాలిపోయిన విమాన భాగాలు, రెండు శవాలు, రూపంలేని కొన్ని అవయవాలు, చుట్టూ మహా వృక్షాలు!    
    కీర్తి తన రేడియం డయిల్ వాచ్ లో టైమ్ లో చూసుకుంది.    
    టైమ్ మూడున్నర తారీకు నాలుగు, రోజు ఆదివారం    
    తారీకు డేట్ గల ఆటోమేటిక్ వాచ్ అది.    
    తనకి పిచ్చి పట్టిందా? తన బుర్రపని చేయటం లేదా? తన కళ్ళే తన్ని మోసం చేస్తున్నాయా? అని కీర్తి ఆలోచిస్తూ వుండిపోయింది.

Next Page