Next Page 

ది ఇన్వెస్టిగేటర్ పేజి 1


                                ది ఇన్వెస్టిగేటర్

                                                                       _చందు హర్షవర్ధన్

  


    ఆవేశం అలజడి సృష్టిస్తే....
    ఆ అలజడి విప్లవానికి నాంది పలకవచ్చు, లేదా వినాశానికి దారితీయనూవచ్చు.
    ఆ అలజడి మనిషి మనసులో ప్రారంభమయితే... దాని పర్యవసానం ఏమిటో?
    ప్రతి మనిషికీ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట ఆలోచనల అలజడి తప్పదేమో!
    ఆవేశంగా రెండడుగులు ముందుకువేసి తూలి పడబోయి నిలదొక్కుకుందామె.    
    ఎదుర్రాయి ప్రతాపానికి ఆమె కాలి బొటన వెలికి గాయమై, రక్తం సర్రున చిమ్మింది. ఆమె ముఖం క్షణం ఎర్రబారింది.
    అది కొత్త ఊరు కాదు, కొత్త ప్రదేశమూ కాదు. కాని, ఇవాళ అన్నీ కొత్తగానే కనిపిస్తున్నాయి!
    తన వెంట ఎవరో నీడలా కదులుతున్నట్టు అనిపించి క్షణం వెనుదిరిగి చూసిందామె. మరుక్షణమే ఆమె శరీరం జలదరించింది.    
    ఊహించని రీతిలో....ఒక వ్యక్తి ఆమెను వెంబడిస్తున్నాడు!
    అతను ఏ నిమిషాన ఏం చేస్తాడోనన్న భయంతో ఆమె గొంతు తడారిపోయింది. గుండె లయ తప్పినట్టయింది. ముచ్చెమటలు పోశాయి.
    చీర కుచ్చిళ్ళను పైకి పట్టుకుని పరుగులాంటి నడకతో వెళ్ళి ఒక ఇంటిముందు ఆగి తలుపు తట్టింది.
    ఆ ఇంటి తలుపులు తెరుచుకోగానే ఆమె స్పృహ తప్పి లోనికి కుప్పలా కూలిపోయింది.         ఆమె అనూష.


                                   *    *    *    *


    అనూష షాక్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కనురెప్పలను భారంగా తెరిచింది.
    "ఇప్పుడెలా వుంది?" మంచినీళ్ళ గ్లాసును చేతికి అందిస్తూ అడిగాడు ఆనంద్.
    వాళ్ళిద్దరూ యూనివర్శిటీలో పోస్టు గ్రాడ్యుయేట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.
    అనూష వెంటనే ఏమీ మాట్లాడలేకపోయింది. భారంగా కళ్ళు మూసుకుంది.
    "డాక్టర్ ను తీసుకురానా?" అతను ఆత్రుతగా అడిగాడు.
    "వద్దొద్దు! నా ఒంట్లో బాగానే వుంది" అంది తత్తరపాటుగా అనూష.
    సరిగ్గా అదే సమయానికి ఆ వ్యక్తి వచ్చి ఆనంద్ ముందు చేతులు కట్టుకుని నిలిచాడు!
    అనూష అతన్నే కళ్ళార్పకుండా చూసింది.
    "ఉదయాన్నే ఇచ్చానుగా, మళ్ళీ వచ్చావేం?" ఆనంద్ విసుక్కున్నాడు.
    అతను మారాం చేస్తున్నట్టు తల, చేతులు ఆడించాడు.
    "వెధవాయ్!" అని ఆనంద్ అతని నెత్తిమీద ఓ మొట్టికాయ మొట్టి, జేబులో నుంచి రూపాయి తీసి అతని చేతిలో పెట్టాడు.
    అతను హుషారుగా ఈల వేశాడు. తరువాత తనదారిన తను వెళ్ళిపోయాడు!
    అనూష ఇదేమీ అర్థంకానట్లు ఆనంద్ కేసి అయోమయంగా చూసింది.
    "ఈ వీథి వాడే! పిచ్చివాడు!" విశేషం ఏమీ లేదన్నట్టు అన్నాడు ఆనంద్ ఆమె చూపును గమనిస్తూ.
    అసలు విషయం తెలుసుకున్న అనూష తెల్లబోయింది.
    'ఒంటరిగా వెళుతున్న ఆడదాని వెంట మగాడు పడ్డాడని తను భయపడినట్టా లేక, అతనొక వీథి రౌడీ అని, లేక గజదొంగ అని అనుమానపడినట్టా? ఈ దేశంలో ఆడది అంటే తండ్రిచాతుపిల్ల, భర్తచాటు భార్యే కాని, ఒక స్వతంత్ర శక్తిగా రూపొందేదెప్పుడో?' అనుకున్నది.
    ఆనంద్ కు ఆమె ఆంతర్యం బోధపడలేదు. ఆమె ఇల్లు వదిలి సరాసరి తన దగ్గరకు వచ్చిందని ఆమె చేతిలో ఉన్న సూట్ కేసునుబట్టి, ఆమె వున్న తీరునుబట్టి చూచాయగా అర్థమైంది.
    అయితే, ఆమె ఏం ఆశించి ఇక్కడకు వచ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదతనికి.
    "ఆనంద్ !"
    ఆమె పిలుపుతో ఉలిక్కిపడ్డాడతను.
    పక్కమీద లేచి కూర్చుందామె. ఆమె శరీరానికి అలసట కలిగినట్టు లేదు. ఆమె మానసిక సంఘర్షణకు గురయిందనిపించింది.       


Next Page 

WRITERS
PUBLICATIONS