Previous Page Next Page 

ఇంటింటి కధ పేజి 3


    ఆఖరివాడు శంకర్ యీ ఏడే కాలేజిలో చేరాడు. స్నేహితులు క్రికెట్టు, సినిమా తప్ప చదువు మీదే ధ్యాస లేదు. రోజు రోజుకి పెరిగి పోతున్న కంపీటేషన్  మధ్య యీ అత్తెసరు మార్కులతో ఏం చదువుతావురా, ఏ కాలేజీలో సీట్లు వస్తాయిరా కనీసం ఏ డిగ్రీ అయినా లేకపోతే ఎలారా అనే తండ్రి గోల శంకరు చెవికి ఎక్కదు.
    "ఆ, డిగ్రీలుండి అన్నయ్య చేస్తున్నదేమిటి. యీ పరీక్షలు పాసయినంత మాత్రాన ఉద్యోగాలు వచ్చేసాయా" తండ్రి దగ్గిర ఏమనక పోయినా తల్లి దగ్గర గుణుగుతుంటాడు. "ఏమోరా నాయనా --- అందరి కందరూ తలోలా తయారయ్యారు. అటు మీ నాన్నా, యిటు మీరిలా నన్ను కాల్చుకు తినండి....చదువు కాకపొతే ఏం చేస్తావురా , గాడిదలు కాస్తావా....'
    'ఆ.... చూస్తుంటే అదే నయంలా వుంది అమ్మా. యీ బి.ఏ. లకి ఉద్యోగాలు వచ్చే రోజులు పోయాయి. చదవడం జ్ఞానం కోసం అనువప్పుకుంటాను కాని అన్నం పెడతాయనుకొకు యీ డిగ్రీలు --" పదిహేడేళ్ళ శంకర్ అరిందలా మాట్లాడుతుంటే ఆవిడ యింకేం అనాలో తెలియక దేముడిదే భారం అన్నట్టు కనపడని దేముడికి దండం పెట్టి వూరుకుంటుంది. శంకర్ కి వయసుకి మించిన ఆలోచనలు - యీ చదువులు లాభం లేదు , ఏదో బిజినెస్ చెయ్యాలి. సంపాదించాలి , అంతేకాని ఏ బి.ఏ నో పేసయి గుమస్తాగా చేరి ....జీవితంలో ఏం సాధించేట్టు --- బిజినెస్ అంటే పెట్టుబడి వుండాలి .... పెట్టుబడేక్కడి నించి వస్తుంది ....పెట్టుబడి లేని బిజినెస్ ఏముంది! శంకర్ ఆలోచనలు ఆ ధోరణిలో సాగుతాయి ఎంత సేపటికి!
    తలోరకంగా , తలోదారిని పోదామనే అందరిని ఒక త్రాటిపై లాక్కు వస్తూ సంసారం రధం యీడుస్తున్నారు వెంకట్రావు, కాంతమ్మ గార్లు.
        
                                               *    *    *    *
    ---పాలు తీసుకొచ్చి విసురుగా తల్లి మంచం పక్కన పెట్టేసి పక్క చుట్టి లోపలి కెళ్ళి గదిలో కింద పడేసుకుని మళ్ళీ ముసుగు బిగించేసాడుప్రసాద్....రాత్రంతా దోమలు - తెల్లారి వెలుగు కాస్త వచ్చిం దగ్గిరనించి మొహాల మీద యీగలు ముసురుతాయి. కాసేపు పడుకుందామన్న ఆ యీగల బాధ భరించలేక -- పెరట్లో ఆరుబయట పక్కలే సుకున్న అందరూ లేచి పక్కలు చుట్టి లోపలికెళ్ళి పడుకున్నారు. తెల్లారి ఆరుగంటలు దాటాక వంటింట్లోంచి కాఫీ వాసన వచ్చి కాంతమ్మ మేలు కొలుపులు పాడితే గాని ఎవరూ లెవరూ మళ్ళీ.
    కాంతమ్మ కి కీళ్ళ వాతం. కాస్తంత చల్లగాలి తగిలినా ఉదయం లేచేసరికి నడుం పట్టి , కాళ్ళు కదలవు. ఉక్క భరించలేక బయట పడుకున్నా, ఎంత ఎండాకాలం అయినా లేచేసరికి ఆవిడ కాళ్ళు పట్టేస్తాయి. ముక్కుతూ మూలుగుతూ లేచి కుంపటి మీద కాసిని వేడినీళ్ళు పడేసి పోసుకున్నాక గాని ఆవిడ నడుం , కాళ్ళు స్వాధీనంలోకి రావు. రోజూ ఉదయం కాఫీ చెయ్యమని కూతుళ్ళ ని బతిమాలుతూ వుంటుంది ఆవిడ.
    ఆరోజు....పదిసార్లు లేపితే గాని లేవని వసంత తల్లి లేచేసరికి డికాషన్ పోసి, పాలు స్టవ్ మీద పెట్టి పళ్ళు తోమటం చూసిన కాంతమ్మ ఆశ్చర్యపోయింది.
    "ఏమిటి తల్లీ, ఏ పొద్దు పొడిచాడు సూర్యుడివాళ....." వింతగా చూస్తూ అడిగింది.
    'అక్కయ్యకివాళ యింటర్వ్యూ వుందమ్మా.....అదీ సంగతి." మాలతి పక్కమీద నించే అంది. వసంత ఎవరి మాట విననట్టు చకచక పనులన్నీ ఎవరో తరిమినట్టే చేసేసుకుంది. తలంటి పోసుకుని వదులుగా జడ అల్లుకుని, అరగంట అద్దం ముందు ముస్తాబయింది. 'అక్కయ్యా.... నీ ప్రింటెడ్ సిల్కు చీర యియ్యవే కట్టుకుంటానీవేళ ..." కమలని బతిమాలి నట్టడిగింది.
    "ఓ వసంతాదేవి గారూ , తమరు వెళ్ళేది ఆఫీసు ఇంటర్య్వూ కి గాని పెళ్ళి చూపులకు కాదు" ఉడికించాడు శంకర్.
    "నీవు నోర్ముయ్....ఏం అక్కయ్య కట్టుకోనా.....' ఆశగా చూసింది.
    "ఆ చీరెందుకు నా దరిద్రమంతా నీకు పట్టుకుంటుంది. శుభమా అని వెడుతూ నా చీర కట్టుకుంటానంటావేమిటే.....' కమల నిర్లిప్తంగా చూస్తూ అంది.
    "ఓహో తమరి చీరలకి కూడా తమరి దురదృష్టజాతకం అంటుకుందన్నమాట. అక్కయ్యా నీకెన్ని సార్లు చెప్పాలి, యిలాంటి అమ్మమ్మ మాటలు మాట్లాడవద్దని. లోకంలో యింకేవరికీ మొగుళ్ళు పోలేదా - పోయిన అందరూ భార్యల నష్టజాతకం వల్లె పోతారన్నమాట. పదిసార్లు నిన్ను నీవు కించపరచుకుంటూ కుమిలి కుమిలి ఏడ్వటం యిదంతా పెద్ద పాతివ్రత్యం అనుకుంటున్నావేమిటి? నిజమే, నీకు రాకూడని కష్టం కల్గింది అంతమాత్రాన నీవేదో పనికి మాలిన దానివి, నిన్ను చూస్తె అపశకునం నీ చీర కట్టుకుంటే అశుభం - ఏమిటీ మాటలు. ఛా...ఛా.... మన ఆడవాళ్ళు మనల్ని మనమే హీనపరచు కుంటూ మగాళ్ళు ఏదో చేశారని ఏడుస్తాం. నీవిలా మాట్లాడావంటే నాకు తిక్క రేగుతుంది.... ఏడు నెలలు అయింది ఎన్నాడు ఏడ్చిన బావ రాడు. నిన్ను నీవు కుదుట పరచుకుని చదువుకోవే అంటే వూరికే ఏడ్వడం తప్ప ఏం చెయ్యవు. పైగా ఏదన్నా ఎవరన్నా అంటే నాది దారిద్ర జాతకం, నా మొహం చూడకండి, నన్నిలా మూల పడి వుండనీండి ....ఛా! ఛా.... నీలాంటి వాళ్ళు యీ శతాబ్దంలోనూ ఉన్నారంటే స్త్రీ జాతి సిగ్గుపడల్సిందే....
    "ఏమిటే నీ ఉపన్యాసాలు- దాని దుఃఖంలో అది వుంటే నీ వాగుడేమిటి" కాంతమ్మ మందలించింది.
    'దుఃఖంలో వుంది ....కాదని ఎవరన్నారు....బావ ఏక్సిడెంట్ లో చచ్చిపోవడం దీని నేరంలా మాట్లాడుతుందేమిటి- ఆ దుఃఖాన్ని మళ్ళించుకోడానికి ఏదో చేయ్యాలీ గాని, తనని తాను తిట్టుకుంటే పోతుందా దుఃఖం.... యింటర్ కట్టవే, చదువుకుందువు గాని, ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు, అంటే నాకెందు కంటుందేమిటి మతిలేని మాటలు...'
    'దాని బరువు నీవీం మోయవు గాని దాని సంగతి నీకెందుకు గాని, నీవెళ్ళు తల్లీ..."
    'అమ్మా....అది ఎవరికి బరువు కాకూడదనే దాని మంచికోసమే చెపుతున్నాను. మీరు ఉన్నన్ని రోజులు జరుగుతుంది తరువాత దాన్ని ఎవరు చూస్తారు.....ముందు సంగతి ఆలోచించరేం.....మీ ఖర్మ , నాకేం పోయింది....అక్కయ్యా, ఆ చీరే కట్టుకు వెడతా , చూద్దాం శుభం జరుగుతుందో లేదో....' అక్క పెట్లోంచి చీర తీసి కట్టుకుంది తయారైంది వసంత.
    యింటర్వ్యూ పదిన్నర కంటే తోమ్మిదికే తయారైపోయింది . ఉదయం నించి ఒకటే గాభరాగా వుంది. ఈ ఉద్యోగం ఒక పెద్ద ట్రావెలింగ్ ఏజన్సీ మేనేజింగ్ డైరెక్టర్ కి లేడి స్టెనో పోస్టు. అప్లికేషన్ పెట్టిందగ్గిర నించి ఉద్యోగం వచ్చినట్టే కలలు కంటూ సంబరపడింది . ట్రావెలింగ్ ఏజన్సీ....మేనేజింగ్ డైరక్టర్ కి స్టెనో....స్మార్టుగా  వుండే వాళ్ళని సెలక్ట్ చేస్తారు. తను స్మార్టుగా వుంటుందని అందరూ అంటారు .... తనకీ ఉద్యోగం వస్తే ....ఉద్యోగం వస్తే ఏమేం కొనుక్కోవాలో , ఎలా డ్రస్ చేసుకోవాలో , బాస్ ని ఎలా యింప్రెస్ చెయ్యాలో....ఆలోచనలు అలా దొర్లిపోయాయి అప్లికేషన్ పెట్టిన దగ్గిరనించి.

 Previous Page Next Page