Previous Page Next Page 

పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 3

 

    "మిమ్మల్నేనండీ! నన్ను గుర్తుపట్టినట్లు లేరు--"
    "ఎవరు మీరు?"
    "ఇంకా గుర్తుపట్టలేదన్నమాట! సరే! రెండు రోజులు టైమిస్తున్నాను ---- ఈలోగా అలోచించి గుర్తు తెచ్చుకోగలరేమో ప్రయత్నించండి ! ఎందుకంటే మనం కలుసుకుని చాలా కాలం అయింది."
    ఆమె ఆలోచనలో పడింది.
    "ఎక్కడ కలుసుకున్నాం?"
    "నేను చెప్పను కాక చెప్పను౧ మీరే గుర్తుకి తెచ్చుకోవాలి! నన్ను మర్చిపోయినందుకు మీకది పనిష్మెంట్!"
    ఆమె కూడా నవ్వేసింది.
    బస్ వచ్చేసింది.
    "ఓకే! ట్రై చేయండి! విష్ యూ బెస్టా ఫ్ లక్."
    బస్ ఎక్కేశాడు ?"
    మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ ,మీది కుక్కల్ని వేసుకెళ్ళే ఎద్దుబండి లాగుతుంది బస్సు.
    "టికెట్ ప్లీజ్"
    ఆడగొంతు విని అదిరిపడి పక్కకు తిరిగాడు సురేష్.
    "లేడీ కండక్టర్!
    కొత్త కాబోలు! లేదీలాగా బెదురుచూపులు చూస్తోంది.
    సురేష్ నవ్వాడు ట్రిక్ నెంబర్ వన్.
    "హలో -- మిమ్మల్ని చూసి బస్సెక్కాను. ఓ నిమిషం మాట్లాడ వచ్చని -----"
    చూపులో బెదురు ఆశ్చర్యంగా మారింది!
    "నేను నెంబర్ నైన్ లో వెళ్ళాలసలు." ఆమె మాట్లాడక ముందే ప్రశ్నలు గుప్పించేయటం మంచిది.
    "ఎలా వుంది జాబ్?" మళ్ళీ తనే అడిగాడు.
    "బాగానే వుంది ....." మీరెవరు అని అడిగే ప్రయత్నంలో ఉండగానే కట్ చేసేశాడు.
    "మీకు ఆరోజే చెప్పాను. ఆ కాకీ డ్రస్ మీకు చాలా అన్యాయం చేస్తొందని! మీ అందాలను తొంభయ్ శాతం సప్రేడ్ చేసేస్తోంది. మీలాంటి గ్లామరస్ గాళ్ వేసుకోదగ్గ డ్రస్ కాదది. నన్ను నమ్మండి"
    ఆమె సిగ్గుపడి ఆమాట లేవరయినా విన్నారేమోనని అటూ ఇటూ చూసింది.
    ఓ ముసాలాడి నోటి నుంచి అప్పుడే చొంగ తాలుకూ ఓ చుక్క కిందకు రాలింది.
    "నాలుక లోపల పెట్టవయ్యా! డీసెన్సీ లేదు పబ్లిక్ కి" తనే కొప్పాడ్డాడు.
    ముసలాడు చటుక్కున నాలుకను లోపలకు లాగి నోరు మూసేసుకున్నాడు. ఆమె కృతజ్ఞత తో చూసింది.
    సురేష్ కి ధైర్యం వచ్చింది.
    ఇంక తనను టిక్కెట్టడగదు.
    రెండ్రూపాయల నలబై పైసలు సేవింగ్.
    "ఇది టేపంరరీయే లెండి. వచ్చే వారం నుంచీ కౌంటర్ లో "కొంచెం సెక్సీగా నవ్వింది.
    అయితే ఈసారి మన ఎన్ కౌంటర్ కౌంటర్ దగ్గరన్న మాట"
    "అవును' మళ్ళీ నవ్వేస్తూ అంది.
    స్టాప్ లో మళ్ళీ జనం ఎక్కేసరికి ముందుకి నడిచింది.
    "నేను చెప్పిన విషయం గుర్తుంచుకోండి. డ్రస్ మార్చండి. వాళ్ళు వీల్లేదంటే ఉద్యోగం మార్చండి. అంతేగానీ మాకు అన్యాయం చేయవద్దు ."
    వెనుకనుంచి అన్నాడు.
    ఆమెలో మరిన్ని అందాలు విచ్చుకున్నట్లు తెలుస్తూనే వుంది.
    ఇప్పుడే కాదు - ఇంక జన్మలో తనను టిక్కెట్టడగదు.
    బస్ దిగి వెళుతుంటే కిటికీలోంచి చూసి చేయి ఊపుతోంది.
    అడ - మగ!
    "మధ్యన మొత్తం మాధమేటిక్స్"
    కెమిస్ట్రీ , మాధమేటిక్స్
    మాయా అపార్ట్ మెంట్స్ భవనం చాలా అందంగా కనబడుతోంది దూరం నుంచీ.
    అందులో అన్నీ మధ్యతరగతి కుటుంబాలే.
    కొంతమంది , ఓనర్స్, కొంతమంది టేనేంట్స్  ఆరంతస్తుల పైన -
    టెర్రేస్ మీద శ్రీదేవి నిలబడి తల దువ్వుకుంటోంది.
    సురేష్ కొంచెం నిరుత్సాహపడ్డాడు.
    ఆమె ఆ అపార్ట్ మెంట్స్ లోని రెసిడెన్స్ అసోసియేషన్స్ కి సెక్రటరీ!
    అంటే ప్లాట్స్ లో వాళ్ళందరూ ఆమె పెట్టె రూల్స్ ని శిరసా వహించాల్సిందే!
    ఆమె చూస్తుండగా తను లిప్ట్ లో పై కెళ్ళడానికి వీలులేదు.
    మెట్లెక్కి వెళ్ళాలి.
    పొద్దున్నుంచీ తిరిగి తిరిగి ఇల్లు చేరుకున్నాక మళ్ళీ అరంతస్థులు మెట్లేక్కాలంటే ప్రాణం మీద కొస్తుంది.
    లిప్ట్ ముందు నిలబడి ఓ క్షణం ఆలోచించాడు సురేష్.
    మెట్లేక్కడం తన వల్ల కాదు. ఏదొక ట్రిక్ ప్లేచేసి లిఫ్టులో నే వెళ్ళాలి.
    ఆరో అంతస్తుపైన టెర్రేస్ మీద లిప్ట్ డోర్ తెరుచుకునేసరికి తల దువ్వుకుంటూ తనవేపే చూస్తోంది కోపంగా.
    "నువ్ లిప్ట్ వాడటానికి వీల్లేదని ఎన్నిసార్లు చెప్పాలి?" మండి పడుతూ అడిగింది.
    ఆ నిప్పు మీద నీళ్ళు జల్లాలిప్పుడు . పైగా ఆ నీళ్ళు టూ ఇన్ వన్ అయుండాలి. అంటే కోపం పోగొట్టడం -- ఎదురు కాఫీ సంపాదించుకోవటం --
    "మీతో అర్జంటుగా ఓ విషయం మాట్లాడాలని లిఫ్టులో వచ్చానండీ! నా దగ్గరేం 'చావ' లేదనుకున్నారా? కొండేలెక్కి దిగగలను! మీ మెట్లే మూలకు?"
    మాధమేటిక్స్ బ్రాహ్మండంగా పనిచేసింది.
    "ఏమిటది?" కుతూహలం.
    పొడుగాటి జుట్టును దువ్వటం ఆపేసింది. కళ్ళల్లో అనుమానం.
    "ఇంకేముందిలెండి! అదే!"
    పూర్తిగా ట్రాప్ లో కొచ్చేసింది. ఇంక తనకేం ప్రాబ్లం లేదు.
    "మాట్లాడవేం? చెప్పు ?"
    దూరంగా కుముదిని ఆ ఫ్లాట్స్ వాళ్ళ చీరలు అరేస్తోంది. కుముదిని మహా డేంజరస్ అన్న విషయం తనకు తెలుసు.
    చాలాసార్లు తనమీద శ్రీదేవికి కంప్లయింట్ చ్చింది.
    ఆ కంప్లయింట్ల నుంచి బయట పడటానికి తల ప్రాణం తోకకి వచ్చింది.
    తమ మాటలు విననట్లే నటిస్తుంది గానీ మొత్తం అన్ని అక్షరాలూ వింటుంది.
    కుముదిని వేపు చూసి ' వింటుంది' అన్నట్లు సైగ చేశాడు అతను.
    శ్రీదేవి కుముదిని వేపు చిరాకుగా చూసింది.
    "ఇంట్లో మాట్లాడదాం పద" అంటూ లిప్ట్ లోనికి నడిచింది.
    తనూ లిప్ట్ లోకి నడిచాడు సురేష్.
    లిప్టు దిగుతోంటే శ్రీదేవి రెండు చేతులూ పైకెత్తి జుట్టు ,ముడేసుకొబోయింది గానీ తన చూపులకు భయపడి చేతులు దింపేసింది మళ్ళీ.

 Previous Page Next Page