Previous Page Next Page 

ప్రియతమా! ఓ ప్రియతమా పేజి 3

 

    "అయ్యో! అది కాదు మమ్మీ " అంటూ అటు వైపు పరుగెత్తి , పాలు పితుకుతున్న అశ్వర్ధ పిలక పట్టి గుంజింది మంజీర.
    అనుకోని సంఘటనకి అతను "బేరు" మన్నాడు.
    మంజీర పడీ, పడీ నవ్వుతోంది.
    సుమిత్ర కి కూడా నవ్వొచ్చింది.
    ఈ గొడవకి, అరుంధతి, నారాయణమూర్తి బైటికి వచ్చారు.
    "డాడీ! ఏరియల్!" అంటూ అశ్వర్ధ పేలక మళ్ళీ పట్టుకోబోయింది మంజీర.
    అతను అందకుండా తప్పించుకున్నాడు ఈసారి.
    సుమిత్ర నవ్వుతోంది.
    "మంజూ తప్పు!" నారాయణమూర్తి కసిరాడు.
    అరుంధతి ఆశ్చర్యంగా చూస్తోంది. మంజీర వైపూ, సుమిత్ర వైపూ, పదహారేళ్ళ పిల్ల అని అనాలోచితంగా ప్రవర్తిస్తుంటే, తల్లి బుద్ది చెప్పడానికి బదులు అలా నవ్వుతుందెం?
    "గ్రానీ ఫీలింగ్ యాంగ్రీ" అంటూ , వచ్చి అరుంధతిని చుట్టుకుంది మంజీర.
    మంజీర చెప్పినది ఆమెకి అర్ధం కాలేదు అయినా, ఆ స్పర్శలో ఆప్యాయత తనివితీరా అనుభవించి ఆమె తల నిమిరి
    "స్నానం చేసిరా అమ్మా! నీళ్ళు కాగాయి" అంటూ తను బావికేసి నడవసాగింది అరుంధతి.
    నారాయణమూర్తికి తెలుసు! అరుంధతి మళ్ళీ తలారా స్నానం చేస్తుంది. మంజీర ఆమెని ముట్టుకుని మైల పరించింది తనకంటే ఈ పద్దతులు అలవాటే కాబట్టి, వస్తూనే అంగవస్త్రం చుట్టుకుని, బావి దగ్గర స్నానం చేసి మరీ వచ్చాడు.
    సుమిత్ర అందుకే దూరం నించే నమస్కారం పెట్టింది.
    ఇంతలో భయంకరమైన పొలికేక!
    అది మంజీర గొంతే! బాత్రూం లోంచి, ఆగకుండా వస్తోంది. అందరూ కంగారుగా అటు పరిగెత్తారు.
    సుమిత్ర తాడిక తోసుకుని లోపలికి ప్రవేశించి, ఆ దృశ్యం చూసి, తనూ ఒక్క అడుగు వెనక్కి వేసింది. మంజీర పాదాల దగ్గర పెద్ద పెద్ద గుడ్లతో , అంతకంటే పెద్ద శరీరంతో ఉన్న ఒక బోదురు కప్ప కనిపించింది.
    కప్పలంతా పెద్దవిగా కూడా ఉంటాయని సుమిత్రకి అప్పుడే తెలిసింది. ఇంతలో అది మరోసారి "బెకబెక' మంటూ గెంతడం మంజీర కెవ్వుమని అరవడం జరిగిపోయాయి. సుమిత్ర చప్పున కూతుర్ని పొదివి పట్టుకుని బయటికి తెచ్చేసింది.
    "ఏమైందీ?" నారాయణమూర్తి కంగారుగా వస్తూ అడిగాడు.
    "పెద్ద ఏనిమల్ డాడీ! నన్ను మింగేసేటట్లు చూస్తోంది " మంజీర కళ్ళల్లో ఇంకా బెదురు తగ్గలేదు.
    నారాయణ మూర్తి లోపలికి' తొంగి చూసి 'కప్పా' అన్నాడు  తేలిగ్గా.
    "మాములుగా కప్ప కాదు! రాక్షసి  కప్ప, అందుకే ఇలాంటి డర్టీ విలేజేస్ కి రానన్నది " తన అక్కసు అంతా చూపించండి సుమిత్ర.
    అరుంధతి కలగ చేసుకుని , "అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి బట్టలియ్యమ్మా!" అంది సుమిత్ర తో.
    నారాయణ మూర్తి అప్పుడు గమినించాడు, అర్ధ నగ్నంగా ఉన్న తన కూతుర్ని ఆమెనే నిలువు గుడ్లు వేసుకుని చూస్తున్న పందోమ్మోదేళ్ళ అశ్వర్ధ నీ.
    తల్లిని అనుకుని లోపలికి వెళ్తున్న మంజీర , వెళ్తూ , వెళ్తూ అశ్వర్ధ నడుం క్రింద గిల్లడం ఎవరూ గమనించ లేదు.
    అతను 'బే' అని అరిచాడు.
    అరుంధతీ , నారాయణ మూర్తి , సుమిత్ర అతని వైపు ఆశ్చర్యంగా చూసారు. ఎందుకు అరిచాడో అర్ధం కానట్లు.
    మంజీర వెనక్కి తిరిగి చూడలేదు.

        
                                                        *    *    *

    "నేను చాలా అందంగా ఉన్నాను కదూ!"
    మంజీర ప్రశ్నకి ఏం చెప్పాలో తెలియక, అశ్వర్ధ సిగ్గుతో తల వంచుకున్నాడు.
    "డోంట్ ఫీల్ షై , నన్ను చుస్తే నీకు ఏమనిపిస్తుందీ?"
    అశ్వర్ధ తల ఎత్తలేదు.
    "ముద్దు పెట్టుకోవాలని పిస్తోంది కదూ!" అతని దగ్గరగా జరుగుతూ అంది.
    ఆమె మాటలు అర్ధం అవగానే , అతని ముఖం భయంతో వివర్ణమయింది.
    తెల్లని స్లేవ్ లెస్ బ్లౌజు , ఆకుపచ్చ మిడ్డీ వేసుకుని, చిన్న జడ అల్లుకుని జపాను బొమ్మలా కనిపించింది మంజీర.
    "భయపడుతున్నావా?" అడిగింది మంజీర.
    అతనేమీ మాట్లాడలేదు. గడ్డి పరక తీసుకుని తుంపసాగాడు.
    "తప్పులేదు! అమెరికాలో, అమ్మాయిలూ, అబ్బాయిలూ కలవగానే "హలో చెప్పి ముద్దు పెట్టుకుంటారు"
    అతను ఆశ్చర్యంగా చూసాడు.
    "నాకు నువ్వు నచ్చావు. నీ పిలకంటే నాకు ప్రాణం" ప్రాణం అని వత్తి పలికింది.
    అతను కొంచెం నవ్వి, గర్వంగా చూసాడు.
    "నువ్వు ముద్దు పెడతావా/ లేక నన్నే పెట్టమంటావా?" రవ్వంత చిరాగ్గా అడిగింది.
    అశ్వర్ధ మరీ చిన్న పిల్లాడేమీ కాదు, ఇంటర్ మీడియట్ ఒక పార్టు పోయింది. టౌన్ కెళ్ళి వారం, వారం కొత్త సినిమా చూసోస్తాడు. మంజీరని చూడగానే సినిమా హీరోయిన్ లా ఉంది అనుకున్నాడు. అమెరికా నుండి వచ్చిందని తెలిసి, కాస్త బెరుకు అనిపించింది. ఒకవేళ ఇంగ్లీషులో మాట్లాడవలసి వస్తుందేమో నని మనసులో కొన్ని వాక్యాలు కూడబలుక్కుని సిద్దంగా ఉంచుకున్నాడు కూడా! కానీ ఇలా ఇంత త్వరగా ముద్దు పెట్టుకోమని అడిగేస్తుందని అనుకోలేదు. ఇలా అడిగేసింది అంటే .....అంటే .....ఒకవేళ తనని ప్రేమిస్తోందేమో! ఆ ఊహ రాగానే అతని గుండె ఝల్లు మంది.
    "ఏయ్ ఏం అలోచిస్తున్నావూ?"
    "ఈ సంగతి పెద్దవాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారో? మనసులో అనుకున్నాడు.
    "నేను టెన్ కౌంట్ చేసే లోపల నన్ను ముద్దు పెట్టుకోవాలి సరేనా?"
    "అరుంధతమ్మ గారు ఏమీ అనుకోరు, పైగా సంతోషిస్తారు కూడా, అ పనీ ఈ పనీ చేసి పెడతాననీ."
    "మొదలు పెడ్తున్న బీ రడీ?"
    "అమ్మకి ఇష్టం ఉండదేమో! చీర కట్టుకోకుండా, అదేమిటీ అలా చిన్న చిన్న బట్టలు ఛీ అంటుందేమో!' అనుకున్నాడు.
    "వన్" మంజీర లెక్క పెట్టడం మొదలెట్టేసింది.
    "మడి, ఆచారం బొత్తిగా తెలీని పిల్ల, మనకి వద్దు అంటారేమో నాన్నగారు"
    "టూ"
    "పిడకలు చేయడం వచ్చా! వడ్లు దంపుతావా? గుండ్రంగా అప్పడాలు వత్తగాలవా?" అని పెళ్ళి చూపుల్లో ప్రశ్నలు వేస్తారేమో అక్కలు.
    "త్రీ"
    "పేంటూ, చొక్కా వేసుకుని కాలవ నుండి నీళ్ళు తెస్తానంటుందేమో , అలా వద్దని చెప్పాలి"
    "ఫోర్"
    "బావగార్లు, వాళ్ళు వచ్చినప్పుడు ఎదురుగుండా కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కుర్చుని, పేపర్ చదువుకుంటుందేమో! చా, బావుండదు."
    "ఫైవ్"
    "మడి కట్టుకుని బ్రేక్ డ్యాన్స్ చేస్తుందేమో వంటింట్లో."
    "సిక్స్"
    "జుట్టు పెంచుకుని జడ వేసుకోమని చెప్పాలి"
    "సెవన్"
    "నన్ను, 'నువ్వు' అంటుందేమో అందరి ముందూ"

 Previous Page Next Page